బ్లాటింగు పేపరు మీద పోసిన
ఇంకు చుక్కల్లా..
నా కనుపాపను దాటనైనా దాటకుండా
ఇంకిపోయిన కోటానుకోట్ల కన్నీటి చుక్కల సాక్షిగా…
మండువేసవిన మండుటెండలో
ఆరుబైట ఆరేసిన పిండి వడియాల్లా
అర జీవితానికే అర్ధాంతరంగా
నిర్ఘాంతపోయి
ఎండిపోయిన ఆత్మధ్వని సాక్షిగా….
నేనాగిపోయాను !!
నేలకేసి విసురుగా విసిరిన
గాజు సీసాలా…ముక్కలు చెక్కలుగా
విరిగిన, విసిగిన మనసే సాక్ష్యం…
చెక్కుచెదరదు అనుకున్న
నమ్మకపు చెక్కబొమ్మ చెదలు పట్టి
చిందర వందరగా
చల్లాచెదరవ్వడమే సాక్ష్యం….
నా ఓటమికి !!
భూగర్భ లోతుల్లోని భూకంపంలా
దద్దరిల్లుతున్న గుండె చప్పుళ్ళనీ…
గిరిశిఖర అంచుల్లోని లావాలా
రగులుతున్న ఊపిరి ఉప్పెనల్నీ….
అడిగతే చెబుతాయి
నా ఆరాటమెంత పోరాడిందో….
అయినా నిరాశెంత నిలదొక్కుకుందో !!
కాలం లో కలిసిపోయిన కలలు…
ఆకాశమంత విశాలమైన కల్లలూ…
మదిసముద్రమధనం చేసినా
జవాబుల్లేని సవాళ్ళూ …
తలగడని తడిపేసిన కన్నీళ్ళూ…
అన్నీ అడుగుతున్నాయి, ,
ఇంకా ఇంకా పోరాడమని !!
ఇన్నేళ్ళూ పడిన శ్రమని వృధా చేయకని !!
చిగురించిన కొమ్మలకి నీ దన్ను కావాలని !!
ఓడిపోయినా పర్లేదు,
నడవమని !!
ఓటమి గెలుపుకి తొలి మెట్టనీ,
ఓడిన మనసు మరింత బలమనీ,
ఒదిగుండి కర్తవ్య నిర్వహణ
కొనసాగించమనీ
గెలుపు ఓటమిలు
ఒకదాని పక్కన ఒకటి ఉంటాయనీ
ఒకదాని విలువ మరొకటి పెంచుతాయనీ
ఏ అడుగు వెనకాలైనా గెలుపు దాగుండొచ్చనీ
నా వెన్ను తట్టి నెట్టాయి
మరలా ఈ సుదీర్ఘ ప్రయాణం లోకి
ఈ స్వార్ధ ప్రపంచంలోకి
ఈ స్పర్ధల సంసారంలోకి !!
సరేనని తలూపి,
అలవాటేగా..!! అంగీకరించి,
తెరలు తీసి, వాస్తవాన్ని చూసి,
మరుపు కుప్పల్లో
మరోమారు మార్పును విసిరేసి,
మరోసారి ఆశల ఆవిరి పీల్చి,
మనోబలం కవచం కట్టి,
నడుం విరిగిన నమ్మకానికి
కొత్త కోర్కెల పట్టీ కట్టి,
అలుపెరగని యుద్ధ సైనికుడిలా,
మళ్ళీ నిశ్శబ్దంగా తన పక్కన
పరుగు కొనసాగించాను,
అచ్చం జయం పక్కనే ఉండే అపజయంలా…
అచ్చం గెలుపు విలువని పెంచే,
నిలువ నీడ లేని ఓటమిలా…
ఏనాటికైనా దాని అహం కన్నా ఒక్క
అడుగైనా ముందుకు వేయకపోతనా
అన్న ధీమాతో ,
ముందడుగు వేయాలనే ధైర్యంతో !!
— కుందుర్తి కవిత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`