ఉదయం నుంచి కార్యాలయంలో ఉండి సాయంకాలానికి ఇంటికి వచ్చేటప్పటికి మాఇంటికి బిగించిన ఇనుప చువ్వల చట్రం పైన ఇంతకుముందు జూలై మాసంలో గూడు కట్టుకోవడానికి ప్రయత్నించి వదిలేసిన పక్షి గూడు ఈదురుగాలికి కొంత అటూ ఇటూ కదిలి కొన్ని ఎండిన ఆకులు చిందర వందరగా రాలిపడి ఉన్నాయి. పాపం ఎంత శ్రమకోర్చి సేకరిస్తుందో కదా.. ఇంత కష్టపడి గూడు కట్టి ఎందుకు వదిలేసిందో…తనుకోరుకున్న భద్రత ఇక్కడ దొరకేలేదేమో .. లేకపోతే ఈ మధ్యే మా ఇంటి ముందు ఉన్న జామ చెట్టు తీసివేసినందువల్లనో. జామ చెట్టు ఉన్నంతవరకు చాలా రకాల పక్షులు మా ఇంటికి వచ్చేవి. తీసేసాక వారం పది రోజులు అలవాటు ప్రకారం వచ్చి తిరిగి తిరిగి వెళ్ళిపోయాయి. ఒక వేళ జామ చెట్టు ఉంటె గుడ్లు పెట్టేదేమో తెలియదు.
నేనైతే అంతే అనుకుంటున్నాను. ఒక వేళ జామచెట్టు ఉంటె దాని మీద దొరికే పురుగులతో తన పిల్లలకు తక్కువ శ్రమతో ఆహారం సమకూరేది. ఇప్పుడు చెట్టు లేదు కనుక గూడుకీ , ఆహారం సేకరించే స్థలానికి దూరం ఎక్కువ అయితే తన పిల్లలకు రక్షణ లేదని అనుకుందేమో. ఏదైతేనేం అది వెళ్ళిపోయింది. అది కాకుండా మరొక రెండు మూడు చోట్ల కూడా ఈసారి గూళ్ళు కట్టలేదు. పాతబడ్డ గూళ్ళను మేము తీసివేయకపోవడం వల్ల అవి అలా ఉండిపోయాయి కానీ అవి పక్షులకు పనికిరావు. చాలా పక్షులు ఒకసారి వాడిన గూడును మల్లె వాడవు. ప్రతి యేడూ కొత్తగా కట్టవల్సిందే.
ఈ రోజు రాత్రికి నేను రాయవలిసిన విషయాలేవీ రాసే తీర్పాటు లేదు. నవంబెర్ మాసపు చలి , చిక్కటి రాత్రి ..అలసట.
నెల రోజుల క్రితం అనుకుంటాను కర్ణాటక రాష్ట్రంలోని బందీపూర్ అడవిలో ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగిన దావానలం గురించి నాటి స్నేహితులతో చర్చ జరిగింది.ఒక్క బందీపూరే కాదు విశ్వవ్యాప్తంగా అగ్నికీలలకు ఆహుతవుతున్న అడవుల గురించి కొంత మాట్లాడుకున్నాం. బందీపూర్ ను నేను ఇంతకు ముందే చూసి ఉన్నాను. చాలా పెద్ద అడవి. ఏనుగుల సంరక్షణ అక్కడి ప్రత్యేకత. అది ఒక జాతీయ వనం కూడా. పదిహేనేళ్ళ క్రితం అక్కడ అడవిలో ఒక రాత్రి రోడ్డుకు అవతల కూర్చున పెద్ద జింకల గుంపును చూసాము. మాకెవరికీ ఆ రాత్రి వేళ అక్కడ కూర్చున్నవన్నీ జింకలని తెలియదు. ఆ వనంలో ఉన్న దారి మీద అర్థ రాత్రి మా చేతిలో ఉన్న టార్చ్‌లైట్ వెలుగులో మెరుస్తున్న గోలీల వంటి కన్నులను ఆ మసక వెలుతురులో గుర్తుపట్టాము. చాలా పెద్ద గుంపు అది. నింపాదిగా రోడ్డు పక్కన కూర్చున్నాయి. అంత పెద్ద గుంపును అదీ అభయారణ్యంలో చూడడం అదే మొదటిదీ చివరిదీ. అభయారణ్యాలలో రాత్రి వేళ వాహనాల రవాణా మీద నియంత్రణ ఉంటుంది. అందువల్ల నిబ్బరంగా కూర్చుని ఉంటాయి. అక్కడ చాలా మంచి వన్య సంపద ఉంది.ఈ పదిహేనేళ్లలో అటవీశాఖ ఇంకా అనేక సంరక్షణ చర్యలు , అభివుద్ధి పనులు చేసి ఉంటుంది. ఒక్క మంటతో అన్నీ భస్మమైపోయాయి. ఏంచేస్తాం. కారణమేదైనా మృత్యువంటే ఒక తిరిగిరానితనమే కదా.. అవును అవేవీ మళ్ళీ తిరిగి రావు. వాటిని రక్షించే ప్రకృతే వాటిని ఆవాహం చేసుకునే దురదృష్ట సందర్బం.
నేను దీని గురించే రాయాలని అనుకున్నాను. అడవిలో చెలరేగే మంటల గురించి. అడవిలో మంటల గురించి రాయడం ఒక పెద్ద పనే. మంటలు, రకాలు, మంటల వల్ల మంచీ చెడూ, అటవీ శాఖ విడబి విధానాలు ఇంకా ఎన్నెన్నో. కాకపోతే నేను రాయడానికి ముందు చూసుకునే చిత్తుప్రతుల నుంచి నాకు ఈ మధ్యే తెలిసిన విషయం మాత్రం పేజీలు తిప్పగానే ఎదురుపడింది. నేను 18 వ శతాబ్దపు ఇంగ్లండు కవి, టెన్నిసన్ గురించి నక్షత్రపు గుర్తు పెట్టుకున్నాను. కాలేజీ రోజుల్లో విషయానికి సంభందించని అంశాలు రాసుకునేటప్పుడు నక్షత్రపు గుర్తు పెట్టి రాసుకుంటాం కదా అలేగే నా చిత్తుప్రతిలో అదే నక్షత్రం గుర్తు ఉన్న ఒక ముచ్చట.
“వలపన్నది ఎరగకున్న వలచి విలపించుట మేలు” అని ఒక ఆంగ్లకవి అన్నాడని ఎప్పుడో ఒక సమీక్షావ్యాసంలో చదివినట్టు గుర్తు. నాకు గుర్తు ఉన్నంతవరకు అది ఇరవైయేళ్ళ నాటి సంగతి. ఆ వ్యాసం ఎవరు రాసారో, దేని గురించి రాసారో నాకు గుర్తు లేదు. ఈ వాక్యం మాత్రం అలా గుర్తుండిపోయింది. ఎప్పుడైనా ఈ వాక్యం గుర్తుకు వస్తే ఆ ఆంగ్ల కవి ఎవరో… ఆ సందర్భం ఏమిటో అని అనిపించేది. ఎలా కనుక్కోవడం …ఈ ఒక్క వాక్యం తప్ప మరింకేమీ నాకు గుర్తులేదు. అయితే ఆశ్చర్యం…ఒక గమ్మత్తైన విస్మయం…చిత్తుప్రతిలో రాసుకునేటప్పటికి నాకు ఆ కవిత దొరికింది. ఎప్పుడో పారేసుకున్న చిన్ని బహుమతి మరెప్పుడో యే వెతుకులాటలోనో దొరికితే కలిగే చిన్ని సంతోషం నాకప్పుడు కలిగింది. అది In Memoriam AHH అన్న సంకలనంలో “The Way of the soul” శీర్షికతో అల్ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్ (1809-1892) రాసిన కవిత..తన ప్రియ మిత్రుడు ఆర్థర్ హెన్రీ హలాం (AHH) జ్ఞాపకార్థం వెలువరించిన సంకలనం లోనిది.
దర్పంగా బంధించబడిన శూన్యాన్నియే సందర్భంలోనూ నేను ద్వేషించనుపంజరంలోనే జన్మించిన పిచ్చుకకువసంతకాలపు దారువుల సంగతి ఎన్నటికీ తెలియదు అంటూ మొదలై
ఇక ఏదైనా జరగనీఅది సత్యమనే నేను భావిస్తున్నానుఅత్యంత విషాదం నేను పొందుతున్నా సరేఅసలు ప్రేమంటే తెలియకుండా జీవించడం కన్నాప్రేమించి పోగొట్టుకోవడమైనా మంచిదే
అంటూ ముగుస్తుంది.
టెన్నీసన్ ఈ కవితను తన ప్రియమైన AHH కోసం రాశారు. టెన్నిసన్ కవిత మొదటి పాదంలో రాసినట్టు వసంతం తెలియని బందీ అయిన రాజసపు పక్షికూతల మీద తనకు ఎటువంటి ఆశ్చర్యమూ లేదని చెప్పాడు. కవితను ముగిస్తూ ప్రేమంటే తెలియకుండా జీవించడం కన్నా / ప్రేమించి పోగొట్టుకోవడమైనా మంచిదే అని వ్యక్తం చేసాడు. అలా రాయడం వెనక హృదయస్పందన కోల్పోయినతనాన్ని, ప్రేమ యొక్క మాధుర్యం తెలియనితనంపై తనకున్న విచారాన్ని వ్యక్తం చేశాడు. టెన్నిసన్ని అంతగా ప్రభావితం చేసిన బాంధవ్య వియోగం విచారగ్రస్తున్ని చేస్తే, ఆ వియోగాన్ని తట్టుకునే శక్తి అతను విహరించిన ప్రకృతి ఇచ్చి ఉంటుందని అతని జీవితాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.
టెన్నీసన్ 18వ శతాబ్దాపు కాలంనాటి వాడు, కవి. తరుచుగా అతను Isle of wight అనే బ్రిటన్ కు చెందిన ఒకానొక ద్వీపంలో విడిది చేసేవాడు. ప్రపంచంలో మొట్టమొదటి వాణిజ్యపరమైన వైర్ లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థ మొదలైంది ఈ ద్వీపం నుంచే. ఆనాటి బ్రిటిష్ ప్రముఖులంతా ఈ ద్వీపానికి విడిది కోసం వచ్చేవారు. చాలా మందికి అక్కడ విడిది గృహాలు ఉండేవి. బ్రిటన్ మహారాణి విక్టోరియ, చార్లెస్ డికెన్స్, స్విన్ బర్న్ లతో సహా ఎంతో మంది ఆ ద్వీపానికి అతిథులు. ఎన్నో అందమైన పక్షులతోనూ అపూర్వ వన్య సంపదతోనూ అలరారిన ఈ ద్వీపం రసాస్వాదులని ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంటుంది. అందువల్ల ఎంతో మంది కవులు, రచయితలు, చిత్రకారులు తరచుగా సందర్శించే స్థలమయ్యింది. పలుకుబడి కలిగిన వారు, స్తోమత కలిగిన వారు విడిది గృహాలు ఏర్పాటు చేసుకునేవారు. కళాకారుల మనసు కళల మీద తమకున్న కలల మీద మనసు లగ్నం అవుతుంది. మరి మిగిలిన వారికి వ్యాపకం …?
ఒక్కొక్కసారి అంతేనేమో ఎక్కడో ఒక చోట మొదలైన అన్వేషణ మరొక విదంగా ముగుస్తుంది. ఇది కూడా అలాంటిదేనేమో. ఈ మధ్య కాలంలో అటు అస్త్రేలియలోనూ ఇటు అమెరికాలోనూ దావానలం వ్యాపించి లక్షలాది అడవులు భస్మరాశులవడం అదీగాక విశ్వశ్వాసకోశాలని పేరుపడ్డ అమెజాన్ అడవులలోనూ అగ్నికీలలు చెలరేగి జీవరాశి నశించినట్టు తెలిసుకొని నిమ్మళంగా ఉండలేక మూలాలను అన్వేషిస్తూ చేస్తున్న ప్రయాణంలో నాకు ఆ మధ్య ఎప్పుడో చదివిన Sixth Extension అన్నపుస్తకం గుర్తుకువచ్చి దానిలోని కొన్ని అంశాలను తదుపరి సమాచారం కొరకు రాసుకున్నాను.
Isle of wight దీవి గురించి నాకు Sixth Extension వల్లనే తెలిసింది. ఎలిజబెత్ కొల్బెర్ట్ ( Elizabeth Kolbert ) అనే అమెరికన్ జర్నలిస్ట్ Sixth Extension అన్నపుస్తకం రాసారు. ఆమె తన ఈ పుస్తకంలో జీవుల అంతర్దానం ఇప్పటివరకు అయిదుసార్లు జరిగిందని ఇప్పుడు ఆరో అంతర్దానం అయ్యే దశలో ఉన్నామని సహేతుకంగా రాశారు. ఆమె రాసిన ఈ పుస్తకం మానవాళి తమను తాము ఆత్మపరిశీలన చేసుకొమ్మని హెచ్చరిస్తుంది. పుస్తకం నిండా ఎంతో విలువైన , సమంజసమైన వివరణలతో భూమండలానికి మానవుడు చేస్తున్న విఘాతం ఎలా ప్రభావితం చేయనున్నదో రాసారు. అమెజాన్ అడవుల విధ్వంసం గురించిన ప్రస్తావన దాని వెనుక ఉన్న వ్యవహారం ఈనాడు బ్రెజిల్ రాజకీయ పరిస్థుతులు మన కళ్ళకు కట్టి ఆవేదన చెందుతాం. అయితే ప్రపంచ విఖ్యాతమైన ఈ పుస్తకంలో నాకు ఒక ఆసక్తికరమైన విషయం దొరికింది. బహుశా నేను తరచూ ఆ విషయం మీద అలోచిస్తూ ఉంటాను కనుక నన్ను అది ఆకర్షించి ఉండవచ్చు.
అదేమంటే Alfred Newton, John walley అనే ఇద్దరు శాస్త్రవేత్తలు Iceland Eldey అనే ద్వీపాన్ని సందర్శించి ఆ ద్వీపంలో అంతకుముందు గ్రేట్ ఆక్ అనే పక్షి విస్తారంగా ఉండేదని ఇప్పుడు లేదని ఆ జాతి యొక్క మిగిలిన ఒకే ఒక గుడ్డు వేటగాళ్ళ చేతిలో నశించిందని తెలుసుకుంటారు. ఇక ఆ జాతి పక్షులు అంతరించిపోయాయని నిర్దారించి పక్షుల పట్ల జరుగుతున్న అన్యాయానికి చింతించి ఇంకా ఎక్కడెక్కడ అటువంటి పరిస్థితులు ఎదురవ్వనున్నాయో గమనించినప్పుడు ఇందాక చెప్పుకున్న Isle of wight ద్వీపంలో కూడా పక్షి జాతులకు ప్రమాదం ఏర్పడనున్నదని, విలాసం కొరకు చేసే వేట వలన జాతులు అంతరిచి పోయే ప్రమాదం ఉన్నదని పేర్కొని ఆనాటి బ్రిటన్ ప్రభుత్వంలో Sea Birds Preservation Act 1869 చట్టం చేయడానికి చొరవ చూపుతాడు. అలా ఆయా దీవులను, జీవులను వెతుకుతూ నేను చేసిన ప్రయాణంలో నాకు టెన్నీసన్ దొరికాడు .. ఆయన కవితా దొరికింది. చిత్తుప్రతి రాసుకోవడం, అందులోనుంచి ఒక కవిని దొరకబట్టుకోవడం, అతని కవిత్వాన్ని దొరకబట్టుకోవడం…అది నేను ఎన్నాళ్ళనుంచో తెలుసుకోవాలని అనుకున్నది కావడం యాదృశ్చికం కాకపోవచ్చు. అల్కెమిస్ట్ లో పాలోకోయిలో అన్నట్టు నిజాయితీ గల ప్రయత్నానికి ప్రకృతి సహకరిస్తుందని నిరూపణ అవడం కావచ్చు.
Sea Birds Preservation Act, 1869 అది బ్రిటన్‌లో పక్షుల సంరక్షణ కొరకు చేయబడిన మొదటి చట్టం..ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటంటే పక్షుల ప్రత్యుత్పత్తి కాలంలో ఆయా పక్షులను వేటాడటంకానీ , గుడ్లను సేకరించడంకానీ చేయరాదు..అని. ఇది కొంతవరకు సత్ఫలితాల్నిచ్చినా సమగ్రమైనది కాదు. తదుపరి చట్టపరమైన సంరక్షణ చర్యలు అటుంచితే బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశం, ప్రపంచ విజేతగా , ఆధిపత్య దేశంగా చెలామణి అయిన దేశం, ఎన్నో దేశాల్లో ప్రకృతి విధ్వంసానికి పాల్పడిన దేశం మొట్టమొదటిసారి సంరక్షణ చర్యలు చేపట్టి జాతులను సంరక్షించవల్సిన బాధ్యతను తీసుకుంది. సముద్ర దీవులలో వేటను నియంత్రించే ప్రయత్నం చేసింది.
గుర్తించదగిన విషయం ఏమిటంటే ఒక జాతిని అది ప్రత్యుత్పత్తి జరిపే సమయంలో సంరక్షించాలి అని..!
నాకు రామాయణంలో ఒక కథ తెలుసు. సీతమ్మ వారు ఒకనాడు చెలికత్తెలతో వాహ్యాళికి వెళ్ళినప్పుడు అక్కడ అందమైన చిలుక ఒకటి కనిపిస్తుంది. ముచ్చట పడిన సీతమ్మ ఆ చిలుకను పంజరంలో ఉంచి తన అంతఃపురానికి తీసుకెళ్తుంది. అయితే చిలుక పరిస్థితి వేరు.అప్పుడు అది కడుపుతో ఉంటుంది. గుడ్లు పెట్టి పొదిగే సమయం..తన భాగస్వామి కోసం, బంధించబడిన ఆడ చిలుక ఎంతో వ్యథాగ్ర అయి శోకంతో సీతను నావలె నీవు దుఖించెదవు గాక అని శపించి మరణిస్తుంది. మరోవైపు మగ చిలుక తన భాగస్వామి కోసం వెతికి వెతికి చింతాగ్రస్తుడై మరణిస్తుంది. ఇలా రెండు చిలుకలు సీత చేసిన పని వలన విడిపోయి మరణిస్తాయి. సీతకు ఈ విషయాలేమీ తెలియవు. ఆమెకు చిలుకను తెచ్చుకోవడం వలన తను పొందిన ఆనందం మాత్రమే తెలుసు. చిలుక పడే వేదన గురించి తెలియదు.వాటి జీవనగమ్యం తెలియదు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం మాత్రం దక్కుతుంది కదా. అందువల్లనే అన్ని రాజ భోగాలు అనుభవించే సీతమ్మ తను గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రం అలవికాని దుఖాన్ని అనుభవించింది. దీనికి చిలుక శాపం కారణమా అని అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ ఆచార్య ఆత్రేయ సమాధానం ఇస్తూ చెప్పిన మాట ఇది. మన ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని కార్య కారణ సిద్ధాంతాన్ని అన్వయిస్తూ చేసిన ప్రక్షిప్తం అని భావించవచ్చు.
చట్టం చేయడం అంటే వ్యక్తులను భౌతికంగా నియంత్రించడం. నైతికత అనేది మనసికంగా నియంత్రించడం. అందుకు తగిన నేపథ్యాన్ని ఎంచుకొని సమస్త విచక్షణను మేల్కొలపటం.అప్పుడు చట్టంతో పని లేదు. వ్యక్తులు, సమాజం స్వయంచాలకంగా ఉండి భౌతికంగానూ,మనసికంగానూ సమస్థితిలో ఉండే విదంగా పౌరుల వ్యక్తిత్వం తీర్చబడుతుంది.మరీ అవసరం అయితే తప్ప చట్టాన్ని వినియోగించ వలసిన అవసరం రాదు. భారతీయ సాహిత్యంలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఇకపోతే పక్షులను వేటాడం, బంధించడం అదీ విలాసం కోసం ఎంత వేదనో కదా.అదికూడా అంతరించిపోతాయనే విచక్షణ లేకుండా. చిన్నప్పుడు మా ఊరికి సాయంత్రం పూట పక్షుల జతలు అమ్మకానికి వచ్చేవి.చాలా సార్లు తిన్నాను కూడా. నాకప్పుడు వాటి గురించి తెలియదు. పిట్టలు అమ్మవచ్చేవనే తెలుసు. వెదురు బుట్టలో కాళ్ళు కట్టేసిన జత పక్షులు పెట్టుకొని వచ్చేవారు. కొన్ని రోజులు తర్వాత అలాంటివి మళ్ళీ చూడలేదు. కానీ రాత్రి పూటనే ఎందుకు అమ్మవచ్చేవో .. ఇప్పుడు అర్థమైంది. మనదేశంలో కూడా వన్యప్రాణి చట్టం 1972లో వచ్చింది. అందులో అనేక రకాల పక్షులను వేటాడటం, బాధించడం , బందించడం నేరంగా పరిగణించారు. ఈనాటికి వన్యప్రాణుల వేటను దాదాపు నియంత్రించగలిగినా ఇంకా కొనసాగుతుందని ఒప్పుకోవలసి వస్తుంది.
అయితే వేటాడంకన్నా ఎక్కువ నష్టం ఆవాసాల ధ్వంసం వలన కలుగుతున్నది. అంటే అది తినే మొక్కా , గూడు కట్టుకునే చెట్టూ , తలదాచుకునే వసతి పోగొట్టుకోవడం. గత్యంతరం లేకనే అవి మానవ ఆవాసాలలో గూళ్ళు కట్టుకుంటున్నాయి. అలా కట్టుకోలేకపోయిన జాతులు అంతరించిపోతున్నాయి. ఇప్పుడైతే ఆఖరికి ఊర పిచ్చుక కూడా కనబడడం లేదు. అవి ఎక్కడికి వెళ్ళగలవు ఇప్పుడు ఖాళీ అడవుల్లో..గూడు పెట్టుకునే కొమ్మ లేదు కట్టుకునేందుకు కావలసిన దళాలు లేవు ఒక కంటి కన్నీరు మరో కన్ను చూడలేని ముఖంతో కడుపులోంచి జారే గుడ్లతో యే మనిషి కాళ్ళు మొక్కగలదు, పగిలిన గుండెలతో ఆ జంట చిన్ని పాపలను యే గంగకు వదలగలదు ?
ఆవాసాల ద్వంసం నెమ్మదిగా జరిగే పక్రియ,జరిగిన నష్టం అర్థం చేసుకునేటప్పటికే మానవులకు కొన్నితరాలు పట్టవచ్చు. కానీ అది పునఃస్తాపన చేయలేనంతగా విధ్వంసం చెందినప్పుడు ఇక జాతుల అంతర్దానంతోనే ముగుస్తుంది. చాలా సందర్భాలలో ప్రకృతే ఆవరణ వ్యవస్థను నియంత్రించి వివిధ జీవుల సంఘటనం ఏర్పరచి ఒక సమతుల్యాన్ని సాధిస్తుంది. ఆవాసాలక్షయం కొన్ని సార్లు అభివృద్ది కొరకు జరిగితే , కొన్ని సార్లు దావానలాలు, కరువులు , వరదలు వంటి విపత్తుల వల్ల జరిగింది. కానీ చాలా సార్లు మనం గమనించకుండానే మన విలాసాల వల్ల జరిగింది, అవివేకం వల్ల జరిగింది. విలాసపు వేట వల్ల పులులు, ఆహారపు వేట వల్ల పక్షులు, అనాలోచిత వినియోగం వల్ల రాబందులు, ఉన్ని, తోలు , ఈకలు , దంతాలు , చర్మాలు , ఆభరణాలు అంతెందుకు మన మూర్ఖపు పనుల వల్ల కూడా జరిగింది. Elizabeth Kolbert అదే విషయాన్నీ తన పుస్తకం ద్వారా స్పష్టం చేసింది. మొదటి ఐదు అంతర్దానాల వెనుక ప్రకృతి మాత్రమే ఉన్నదని, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంలో కేవలం మానవుడు మాత్రమే ఉన్నాడనీ.ఒకటేమిటి జీవాల చరిత్ర నిండా మానవుడు చేసిన అగాధాలే. అన్నీ సర్ది చెప్పుకోలేనంత పెద్ద పెద్ద తప్పులు. యూదుల జాతిని అంతం చేయడానికి జర్మనీలో జరిగిన పాశవికమైన హననం గురించి అందరికీ తెలుసు. కానీ పక్షులను కూడా అంతే ద్వేషించి ఒక జాతిని అంతం చేయాలనుకున్న కథ మనకు తెలియకపోవచ్చు, పిచ్చుకల హననం అని ఎప్పుడూ మనలో ఎవరూ విని ఉండకపోవచ్చు.ఈ ఒక్క సంఘటన చాలు మానవుని అవివేకాన్ని తూకం వేయడానికి. పక్షిని కూడా కీటకం కింద జమ కట్టి తమ వ్యవసాయ ఉత్పత్తి తగ్గడానికి కారణమని భావించి సమూల నిర్మూలన కార్యక్రమం నిర్వహించింది చైనా.
చైనాలో అధికార మార్పిడి కొరకు అంతర్యుద్దం జరిగి మావో నేతృత్వంలో కమ్యునిస్టు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాతి కాలంలో జరిగింది ఆ దురదృష్టకర సంఘటన. 1927 నుంచి చైనాలో జరిగిన అంతర్యుద్ధం వల్ల అక్కడ పేదరికం రోగాలు వ్యాప్తి చెందాయి. చైనా ప్రజానీకం వెనుకబడి ఉండడానికి అపరిశుభ్ర పరిస్థితులు, అనారోగ్యం కారణమని భావించి అందుకు దోమలు, ఈగలు, ఎలుకలు కారణమని భావించారు. అదీగాక ఆహారం సరిపడినంత లేక ప్రజలు కరువుకాటకాలతో అల్లాడిపోయారు. అప్పుడే ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన చైనా వ్యవసాయ రంగంలో దిగుబడి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నది. అప్పుడు ఉన్న కొద్దిమంది శాస్త్రవేత్తల అభిప్రాయంలో ప్రతీ పిచ్చుక నాలుగున్నర కిలోలు ఆహారం తినివేస్తుందని అంచనా వేశారు. అందువలన ఎక్కువ మొత్తంలో ఆహారధాన్యాలు వృధా అవుతున్నాయని తలపోశారు. వారి సూచన మేరకు పిచ్చుకల నిర్మూలనం చేసినట్లయితే పంటల దిగుబడి నేరుగా ప్రజలకు చేరుతుందని ఆ విధంగా ఆకలిని నియంత్రించవచ్చని భావించారు. వీటన్నింటినీ చర్చించిన మావో దోమలు, ఈగలు ,ఎలుకలతో పాటు పిచ్చుకను కూడా కలిపి ఈ నాలుగింటిని నిర్మూలించడమే లక్ష్యంగా Four Pest Campaign (1958) ప్రకటించాడు. దీనినే ది గ్రేట్ స్పారో క్యాంపెయన్ గా కూడా పిలిచారు. మావో పిలుపు మేరకు దేశంలోఈ నాలుగు జాతుల నుండి నిర్మూలించేందుకు ప్రతి పౌరుడు దీనిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆదేశించాడు.అలా పిచ్చుకలు అరవై మూడు కోట్ల ప్రజల శత్రువులయ్యాయి.
మావో పిలుపునందుకుని దేశ ప్రజలందరూ చిన్న పెద్దా కలిపి ఈ నాలుగు జీవుల వెనుకబడ్డారు.దోమలు, ఈగలు, ఎలుకలను పరిశుభ్రత పాటించడం ద్వారా నివారించవచ్చు. అయితే పిచ్చుకల విషయంలో మాత్రం అలా కాదు.ఎక్కడో అడవిలోనూ పంటపొలాలలోనూ పురుగులు తినే పిచ్చుకలు , గాలిలో ఎగిరే పిచ్చుకలను ఎలా నిర్మూలించడం?
అందుకు వేల సంఖ్యలో చైనీయులు రోడ్డుమీదకు వచ్చి డప్పులు ఇతర వాయిద్యాలతో వీధుల వెంట, పొలాల పెద్ద పెద్ద శబ్దాలు చేసి పిచ్చుకలను చెట్ల మీద వాలకుండా చేశారు. ఆ చిన్న పిచ్చుకలు అలసిపోయెంతవరకు ఆకాశంలో తిరిగి తిరిగి సొమ్మసిల్లి పడి పోయిలా చేసారు. అలసిపోయి కింద పడిన వాటిని చంపేశారు. చనిపోయిన పిచ్చుకలను ట్రక్కులలో వేసుకొని తరలించారు అంటే ఎంత వినాశనం జరిగిందో అర్థం చేసుకోవచ్చు.
అది ఊర పిచ్చుకల పాలిటి దురదృష్టకరమైన కాలం. చైనా ఆ సమయంలో కోట్లాది పిచ్చుకలను చంపేసింది.గూళ్ళను పడగొట్టింది. గుడ్లను పగలగొట్టించింది. అలా నాలుగేళ్ళు కొనసాగింది. అయితే ప్రభుత్వం ఆశించినట్టు దిగుబడులు పెరగలేదు. ముందటికన్నా తక్కువ దిగుబడి వచ్చింది. కారణం.. పక్షులు లేనందువలన పంటను ఆశించే చీడలు ఇంకా ఎక్కువ నష్టం కలిగించాయి. ఈ లోగా మరొక శాస్త్రవేత్తల బృందం చనిపోయిన పిచ్చుకల శరీరాన్ని పోస్ట్ మార్టం చేసి పరిశీలించింది. వాటి పొట్టనిండా పురుగులు , కొన్నిగింజలు ఉన్నాయి. ఇంత కాలం తమ క్షేత్రాలను పురుగుల నుంచి రక్షించిన పిచ్చుకలకు తాము చేసిన అపకారం, తమకు తాము చేసుకున్న అపకారం వారి కళ్లు తెరిపించింది. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. కోట్లాది పిచ్చుకలు , వాటితో పాటుగా పిచ్చుకల గుడ్లను కూడా నాశనం చేయడం వలన తిరిగి పెద్ద మొత్తంలో పిచ్చుకల పెరుగుదల జరగలేదు.
ఇప్పటికీ ఆ జాతి అక్కడ అంతంత మాత్రమే. ఇది మానవ జాతి మొత్తం మీద ప్రకృతికి చేసిన క్రూరమైన అపకారం. నిజానికి మావో తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కథ ఏమిటంటే కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రకారం సమిష్టి వ్యవసాయ క్షేత్రాలలో దిగుబడులు మొదటి యేడు కన్నా ఆ తర్వాత సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే కమ్యూనిస్టు నాయకులు సిద్ధాంత వ్యూహంపై నిందపడకుండా దిగుబడిలో నష్టాన్ని పిచ్చుకల మీద మోపారు. వారి మోసానికి పిచ్చుకలు బలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విమర్శలను చవిచూసిన చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తర్వాత నాలుగు పురుగుల నివారణ కార్యక్రమంలో పిచ్చుకల బదులు బొద్దింకలు చేర్చబడ్డాయి.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనదేశంలో మాత్రం పక్షులపట్ల వేట ఉంది. కానీ విధ్వంసకరమైన వేట మాత్రం వలసపాలనలో మొదలైంది. మనదేశంలోని యే అభయారణ్యానికైనా వెళ్ళండి. అక్కడి చరిత్ర చూడండి, అక్కడ వేలాడదీసిన చాయా చిత్రాలలో వలసపాలకులు వేటాడిన పక్షులో , జంతువులో ఉంటాయి. భారతీయులు వేటాడి ఉండలేదా అని అనుమాన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే సకల జీవులకు అనుకూలమైన జీవన విదానాన్ని రూపొందించుకొని పౌరులు దానిని పాటించే విదంగా సమాజాన్ని నియంత్రించడంలో భారతీయులు ఘనవిజయం సాధించారు. ఇదే మాటని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే భారతీయ వ్యవసాయాన్ని చూడాలి. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలలో పసరిక అన్న పాత్ర ద్వారా స్పష్ట పరిచిన అంశం అదే. ఒకప్పుడు ప్రతీ రైతు తనకు ఉన్న భూమిలో కొంత పొలాన్ని , కొంత మెట్టగా సాగుచేసేవాడు. పొలంలో ధాన్యం పండించేవాడు. మెట్టలో పప్పు ధాన్యాలో , కూరగాయలో సాగు చేసేవాడు. పొలంలో పక్షులు, పాములు మనలేవు.
కనుక మెట్ట పంట వేస్తే పక్షులు వస్తాయి. పాములు వస్తాయి. పరస్పరం జీవ నియంత్రణ జరుగుతుంది, జీవుల మనుగడా జరుగుతుంది. యే పాకృతిక నష్టమూ కలుగజేయకుండానే రైతు దిగుబడి సాధిస్తాడు. ఇప్పడు ఆ పరిస్థితి లేదనీ , రైతులు మెట్ట వేయడం తగ్గించి పొలాలను మాత్రమే సాగుచేయడం వల్ల పక్షులు, పాములు ఆవాసం, ఆహారం కోల్పోయి నశిస్తున్నాయని ఎంతో గొప్పగా రాసారు విశ్వనాథవారు. అందుకు పర్యవసానంగానే వారి నవలలోని పసరిక పాత్ర విషాదంగా ముగుస్తుంది. భారతీయ జీవన సంస్కృతిని మింగేస్తున్న ఆవాసాల విధ్వంసం అనేది కూడా వారి సూచించిన వేయి పడగలలో ఒక పడగ. అది పూర్తిగా మన మింగేయకముందే మేల్కొనాలి. విశ్వనాథ వారు స్వతంత్ర్య భారతదేశంలో వ్యవసాయ సంభంద శాస్త్రీయ విభాగాలు ఊపిరిపోసుకునే కాలంనాటికే తమ పరిశీలనా శక్తితో ఉద్భోధ చేసారు. నేటికి అర్థ శతాబ్దం గడిచి పోయింది.
పరిస్థితులు మరింత దిగజారాయేగానీ ఎవరూ ఈ పరిణామాల్ని గుర్తిస్తున్నట్టు లేరు. లేకపోతే ఎక్కడో అడవిలో ఉండవలసిన పక్షులు ఊరిలో ఉండడానికి అలవాటు పడిపోయాయి. గూడు కట్టుకోవడం కోసం ఇల్లిల్లూ తిరుగుతున్నాయి. కరంటు స్తంభాలు, పాడుబడిన బంగళాలు, ఆఖరికి యే స్థలమైనా అనే స్థితికి వచ్చేసాయి. నా లాంటి పౌరులు పిచ్చుకలు కూడా దూరని ఇనుప చట్రాలు ఇంటి చుట్టూ బిగించుకుంటే ఇంకెక్కడికి వెళతాయో తెలియదు. ఎప్పటికీ రాకుండా వెళ్ళిపోతే మాత్రం అప్పటికి జరిగిన పరిణామాన్ని నమోదు చేయడానికి మానవులెవరూ ఉండరు.ప్రకృతి చేత మానవుడు కూడా పసరిక పాత్రలాగే ముగించబడతాడు.
-దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~