
*పద్దక్కా ఎప్పుడు వచ్చారు ఎలా ఉన్నారు నువ్వు బావ వచ్చారా?మన లక్ష్మమ్మ రాలేదా?” అంటున్న మా రంగుల సాయిబు గొంతు విని నేను.
సాయిబు నేను వచ్చాను ఇదిగో ఇక్కడ ఉన్నా అన్నా”అమ్మమ్మా వాళ్ళ ఇంట్లో పెరట్లో వేపచెట్టు కింద మామయ్య వాళ్ళ పిల్లలతో బారకట్ట ఆడుకుంటూ,అమ్మను, మా రంగుల సాయిబుకు తిరిగి సమాధానం చెప్పనివ్వకుండానే..
ఓ లక్ష్మమ్మతల్లి ఇక్కడ ఉన్నావా ఎలా ఉన్నావు తల్లి
బాగున్నాను, సాయిబునువ్వు ఎలా వున్నావు.
‘నేను బాగున్నాను తల్లి’
సరే కానీ సాయిబు గుర్తుందానేను అడిగింది.”
ఆ, గుర్తుంది తల్లి.
ఇదిగో సాయిబు, ఈసారి నువ్వు ఇవ్వకుంటే ఇక ఎప్పుడూ నీతో మాట్లాడను ఈ ఊరికే రాను చూడు.
అయ్యో బంగారు తల్లి,అంతమాటెందుకు తల్లి ఈ సాయిబు కచ్చితంగా మాట నిలబెట్టుకుంటాడులే.”
సరే మరి గుర్తుపెట్టుకో’…
‘అలాగే అలాగే తల్లి’.. అంటూ అందరూ రండర్రా అంగట్లో మీకు ఏమి కావాలో అవి కొనుక్కుందురు అనగానే, ఇక అప్పటికి ఆ విషయం వదిలేసి సంబరంగా అందరమూ అంగడికి పరిగెత్తాము, మా రంగుల సాయిబు వెంట.
మా రంగుల సాయిబు మా అమ్మమ్మగారి ఊరిలో వుంటాడు.ఇల్లకు సున్నాలు, రంగులువేసే పెయింటర్’అందుకే, ఆయనను ఊరిలో అందరూ రంగుల సాయిబు అనే పిలుస్తారు.అలాగే మాకు సాయిబు అని పిలవడం అలవాటు. మా రంగుల సాయిబు, మా పెద్దమామయ్య ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.’
మా రంగుల సాయిబుకు మా అమ్మమ్మ కుటుంబంతో మంచి అనుబంధం వుండేది. ఆయనకు మా అందరిపై ఎంతో అభిమానం.” మాకు కూడా మా రంగుల సాయిబు అంటే ఎంతో అభిమానం. మమ్మల్ని అందరినీ చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించినవాడు. అందుకే ఆయన దగ్గర మాకు చనువు ఎక్కువ.
బక్రీదు,రంజాన్ పండుగలువస్తే మాకు పెట్టందే ఆయన నోటిలోకి ముద్ద వెళ్ళేది కాదు.ఆయన వంటి నిండా ఎన్ని రంగులు అంటుకున్నా, ఆయన మనసు మాత్రం ‘మల్లెలా స్వచ్ఛమైన మానవత్వపు పరిమళం’ ఆయనకు ఎవరికైనా పెట్టడమే తెలుసు, ఆశించటం తెలీని ఒక అమాయకపు పసివాడు.
పనిలేని వేళల్లో తెల్లటి బట్టల్లో అత్తరు పరిమళంతో మెరిసిపోతుంటాడు మా చాంద్ మామ.
****
“మా చిన్నప్పుడు మా ఇల్లకు సున్నాలు, రంగులు వేయాలంటే మా రంగుల సాయిబే వేయాలి. ఇక ఎవరు వేసినా మాకు నచ్చేది కాదు ఆయన ఒప్పుకునేవాడు కాదు.”
“ఆ ఆనవాయితీ ప్రకారం మా వూరికి వచ్చి మా యింటికి రంగులు వేసి, మూడు రోజులు జరిగే తిరునాళ చూసి వెళ్ళేవాడు. అప్పుడు కూడా మా రంగుల సాయిబుతో గొడవ పడేదాన్ని, నేను. అడిగింది ఇవ్వలేదని. నేను ఎన్నిసార్లు అడిగినా అదే మాట.మా రంగుల సాయిబు నోటఇస్తానులే తల్లి అంటూ మాటలతో మాయచేస్తూ, తిరునాళలో ఎన్నో బొమ్మలు కొనిచ్చేవాడు.నేను ఆ బొమ్మల మోజులో ఆ విషయాన్ని అప్పటికి మరచిపోయేదాన్ని.”
ఇల్లకు సున్నాలు వేయడానికని నిచ్చెన ఎక్కి చెమటలో తడిసి, ఎన్నో రంగులు అంటిన ఆ మురికి బట్టల్లో మా రంగుల సాయిబును చూస్తే ఎంతో బాధనిపించేది నాకు.
తను అంత కష్టపడి సంపాదించిన ఆ డబ్బులను మమ్మల్ని సంతోషపెట్టేందు ఖర్చుచేశేవాడు మాకు ఇష్టమైన తినుబండారాలు కొనిపెడుతూ.. నాకు కాస్త అవగాహన వచ్చాక తను మాకోసం డబ్బులు ఖర్చుచేయడం బాధనిపించేది.
మా తాతయ్య (అమ్మ వాళ్ళ నాన్న), మా జేజినాన్న(నాన్నవాళ్ల నాన్న)కంటే మా రంగుల సాయిబు ఎంతో మంచివాడనిపించేది.
ఎందుకంటే..అన్ని డబ్బులువున్న మా తాతయ్య, మా జేజినాన్న అంత ప్రేమ చూపలేదు. మా తాతయ్య వాళ్ళ మనవళ్లకు(కొడుకుల పిల్లలు) పావులా ఇచ్చి, మాకేమో ఐదుపైసలు పదిపైసలు ఇచ్చేవాడు. అలా తాతయ్య తేడా చూపడం బాధనిపించేది. అప్పుడు తిరిగి అడిగే ధైర్యం కానీ అలవాటు కానీ లేదు.ఇక జేజినాన్న విషయానికి వస్తే, ఆయనకు ఆడపిల్లలంటే చిన్న చూపు ఆడపిల్లలంటే ‘మంది ఇల్లల్లో దీపాలు పెట్టేవని తిట్టేవాడు. అమ్మ భోజనం పెట్టే అప్పుడు కూడా అమ్మను కోపపడేవాడు, ఎందుకు ఆడపిల్లలకు అంత తిండి పెట్టి పెంచుతున్నావని. అలా తాతయ్య, జేజినాన్న ప్రేమలో తేడా చాలా బాధ కలిగించేది.కానీ మా రంగుల సాయిబు మేము పరాయి పిల్లలమైనా ఎంతో ప్రేమను పంచేవాడు. అందుకే ఆయన దగ్గర మాకు అంత చనువు.
***
నాకు పెళ్ళయ్యాక కొత్త పెళ్ళి కూతురుగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. మామయ్యా వాళ్ళు నాకు చీర, సారే పెట్టను పిలుచుకొని వెళ్ళారు.
వయసు పెరిగిఆరోగ్యం సహరించక, నా పెళ్ళికి రాలేదు మా రంగుల సాయిబు.ఇప్పుడు నేను వచ్చానని తెలిసి, నన్ను చూడాలని ఎంతో సంబరంతో వచ్చాడు మా రంగుల సాయిబు అమ్మమ్మ ఇంటికి.
నేను,మా రంగుల సాయిబును చూసి లోలోపల సంతోషపడుతూ పైకి బుంగమూతి పెట్టి, తల దించుకున్నా అలిగి,నా పెళ్ళికి రాలేదని, అలాగే ఎప్పటినుంచో అడుగుతున్నది ఇవ్వలేదని.
నన్ను అలా చూసి మా రంగుల సాయిబునా దగ్గరకు వచ్చి తలపై చెయ్యివుంచి లక్ష్మమ్మ తల్లి ఇందులో ఏముందో చూడు అంటూ ముసిముసిగా నవ్వుతూనా చేతిలోఒక కవరు పెట్టాడు.
నేను ఆ కవర్ లో ఏముందో అని ఆత్రంగా తీసి చూశాను. పూలు, పండ్లుచీర,గాజులు స్వీట్స్ ఇంకా మక్మల్ క్లాత్ తో కట్టింది చిన్న మూట. ఆ మూటలో ఏముందో అన్న కుతూహలంతో మూట విప్పాను.అందులో ‘అత్తరు సీసా’ గుబాళిస్తూ..అది చూడగానే ఎగిరి గెంతేశాను చిన్నపిల్లలా..
నాకు,ఊహ తెలివేసినప్పటినుంచి మా రంగుల సాయిబును ఇవ్వమని అడుగుతున్న ‘అత్తరు సీసా’..
ఒక అపురూపం దొరికినట్టు సంతోషంతో నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
చిరకాలంగా మా రంగుల సాయిబు చుట్టూ తిప్పిన ‘అత్తరు సీసా’..నా సంతోషాన్ని చూసి మా రంగుల సాయిబు కళ్ళల్లో కోటి కాంతులు.”
***
“మా రంగుల సాయిబు ఎప్పుడూ తెల్ల బట్టలు వేసుకొని, అత్తరు చల్లుకునేవాడు ఆ అత్తరు సీసాను అంగి పక్క జోబిలో వుంచుకునేవాడు.
నాకు ఆ అత్తరు సీసా అన్నా, ఆ వాసనన్నా చాలా ఇష్టం వుండేది.
ఆ ఇష్టంతోనే ఆ అత్తరు సీసా కావాలని మా రంగుల సాయిబును అడిగేదాన్ని.
ఎప్పుడూ ఎవరినీ ఏదీ అడిగినదాన్ని కాదు.. చివరికి అమ్మా నాన్నను కూడా.. కానీ మా రంగుల సాయిబును మాత్రం ఆ అత్తరు సీసా కావాలని అడిగేదాన్ని.. ఏ జన్మ అనుబంధమో మరి.. అది..
ఇప్పుడు మా రంగుల సాయిబు లేడు.
కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం మాతోనే ఉన్నాయి.. ఆ అత్తరు సీసా సాక్షిగా…
నిజంగా ఒకచోట దొరకని ప్రేమ ఇంకోచోట ఇలా జీవితాన్ని వెలిగిస్తుంది అనుకుంటాను.
-లక్ష్మి కందిమళ్ళ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
[…] చాందుమామ -లక్ష్మి కందిమళ్ళ […]