సమాంతరాలు – ఆత్మగౌరవం -యం .యస్ .హనుమంతరాయుడు


మా ఊరు ఆర్డీటీ పాఠశాలనాకు,నాలాంటి వందలాదిమందికి మొట్టమొదట అక్షరాలు దిద్దించిన పాఠశాల. ఒక్క చదువే కాదు విద్యార్థులు అన్ని రంగాలలో ముందుకుపోవడానికి తోడ్పాటును అందించింది. ఎంతోమంది కళాకారులను, చిత్రకారులను, క్రీడాకారులను తయారుచేసిన పాఠశాల ఇది.
అటువంటి ఆర్డీటీ పాఠశాలలో ఒకరోజు సాయంత్రం పూట బడి జరుగుతూ ఉంది.కృష్ణారెడ్డి సార్ రెండవ తరగతి పిల్లలను అందరిని తన చుట్టూ కూర్చోపెట్టుకున్నాడు.రేయ్ ఎవరెవరికి ఏమేమి కళలు వచ్చో ఇప్పుడు ఇక్కడ మీరు చేసి చూపించాలి అని ఒక్కొక్కరిని అడుగుతున్నారు.ఒకరు పాటలు పాడారు. మరొకరు డ్యాన్స్ చేశారు.ఇంకొకరు మిమిక్రీ చేశారు. ఇలా ఎవరికి వచ్చింది వాళ్ళు చేసి చూపిస్తున్నారు.
నా వంతు వచ్చింది రే నువ్వు ఏం చేసి చూపిస్తావు. పాట పాడుతావా, డ్యాన్స్ చేస్తావా, మిమిక్రీ చేస్తావా అని సార్ నన్ను అడిగారు. నేను పాట పాడుతాను సార్ అని ఉత్సాహంగా చెప్పాను. సరే పాడరా అని సార్ అనగానే నేను పాట అందుకున్నాను.

“జీవితమే ఒక ఆట సాహసమే పూబాటనాలో ఊపిరి ఉన్నన్నాళ్లు ఉండవు మీకు కన్నీళ్లుఅనాథలైనా అభాగ్యులైన అంతా నావాళ్లేఎదురే నాకు లేదు నన్నెవరూ ఆపలేరూ…”

ఆపలేరు అంటూ పాట అక్కడికి ఆపేసాను, అందరూ చాలా బాగా పాడావు అని మెచ్చుకుంటూ గట్టిగా చప్పట్టు కొట్టారు. మా సార్ కూడా రేయ్ నీ గొంతు బాగుందిరా ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా పాడలేదు కదరా అని సున్నితంగా దండించాడు. అక్కడికి అక్కడే ఆఫీస్ రూమ్ నుండి ఒక డజన్ తెల్లపేపర్లు తెప్పించి నాకు బహుమతిగా ఇచ్చారు.నాకు గుర్తున్నంతవరకు నేను పాడిన మొదటి పాట ఇది.ఇక్కడి నుండి పాటతో నా అనుబంధం మొదలయ్యింది.

ప్రతి సంవత్సరం మా ఆర్డీటీ స్కూల్ లో పాఠశాల వార్షికోత్సవం జరిపేవారు. వార్షికోత్సవం సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలిచిన వారికి చక్కటి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించేవారు. ఈ విధంగా గెలిచిన వాళ్లకు ప్రత్యేకంగా సోలో సాంగ్, గ్రూప్ సాంగ్,గ్రూప్ డ్యాన్స్, ఏకపాత్రాభినయం, ఒక సాంఘిక నాటికి నేర్పించి వార్షికోత్సవం రోజు రాత్రికి పిల్లలు, తల్లిదండ్రులు అందరి సమక్షంలో ప్రదర్శన ఇప్పించేవారు. ఇది చాలా సంతోషకరమైన వాతావరణంలో అద్బుతంగా జరిగేది.

నేను మూడవ తరగతికి వచ్చినప్పుడు నాతో మొదటి ప్రదర్శన ఇప్పించారు. సాధారణంగా సోలో సాంగ్ అవకాశం ఇచ్చారంటే వారికి మంచి ప్రాధాన్యత ఇచ్చినట్టే లెక్క. నాకు చాలా తొందరగా ఆ అవకాశం దక్కింది. నాకు అప్పుడు నేర్పించిన పాట

“ఉదయం ఇది నవోదయంబానిస చీకటి బద్దలు చేసినభారతీయ జన నవోదయం”
చిన్న పిల్లవాడు అయిన చాలా అద్భుతంగా పాడాడు అనే ప్రశంసలు కూడా పొందాను.మా సార్ అయితే

“పిట్ట కొంచెం కూత ఘనం” అని వేదిక మీదే మెచ్చుకున్నాడు.

ఆర్డీటీ సంస్థ వారు  విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఇలా అనేక అంశాలపై ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించడానికి రాత్రి పూట పల్లెపల్లెకు వెళ్లి అక్కడ జనాలను పోగుచేసి పాటలు పాడేవారు,ఆటలు ఆడేవారు, నాటకాలు ప్రదర్శించేవారు.

మా కల్చరల్ ఆర్గనైజర్ సాంసన్ సార్ ఇతర బృందంతో పాటు నేను కూడా వెళ్లి పాటలు పాడేవాన్ని, నాటక ప్రదర్శనలు ఇచ్చేవాన్ని.నాకు 10-12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి మొత్తం మా మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ విధమైన ప్రదర్శనలకు వెళ్ళాను. నాకు గుర్తున్నంతవరకు నేను పాటలు పాడని ఊరు మా మండలంలో ఒక్కటి కూడా లేదేమో.

ఈ విధంగా ప్రతి చిన్న కార్యక్రమం నుండి పెద్దకార్యక్రమం వరకు ఆర్డీటీ స్కూల్లో గానీగవర్నమెంట్ స్కూల్లో గానీ,ఊర్లో ఏవైనాసమావేశాల్లో గానీ ఎక్కడ ఏ కార్యక్రమంజరిగినా అక్కడ నా పాట ఖచ్చితంగాఉండేది. దీంతో స్కూల్లోనూ, స్కూలుబయట కూడా పాటలు బాగా పాడతాడుఅనే పేరు నాకు తొందరగా వచ్చింది.

నేను అప్పుడు బహుశా ఆరు లేదా ఏడవ తరగతి చదువుతూ ఉంటాను. అప్పుడే కొత్తగా మా ఊరికి అయ్యప్ప స్వామి పరిచయం అయ్యాడు. నల్లబట్టలు ధరించి నలభై రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని శబరిమలై కు పోయి మకరజ్యోతిని చూసి దీక్ష విరమించి రావడం అనేది మొదలయ్యింది.అయ్యప్పస్వామి మాలదారులు భజనలు చేసేసారి మైక్ సెట్ లో ప్లే చేస్తున్న అయ్యప్ప స్వామి పాటలు విని నేను కూడా కొన్ని పాటలు నేర్చుకున్నాను.

“సత్యము జ్యోతి వెలుగునయానిత్యము దానిని చూడుమయాపరుగున మీరు రారండిశబరి గిరికి పోదాము”
“నేను నిజమైతే నా స్వామి నిజమౌనురానా ఆత్మ నిజమైతేపరమాత్మ నిజమౌనురా” ఇవి ఆ పాటలు.
ఒకసారి ఏం జరిగిందంటే,నేను అయ్యప్పస్వామి పాటలు కూడా బాగా పాడతాను అని తెలియడంతో అయ్యప్ప మాల వేసిన అన్నలు కొంతమంది ఒకరోజు నన్ను వారున్న విడిది రూమ్ లోకి  ఆహ్వానించి నాకు వచ్చే పాటలు అన్నీ పాడించుకున్నారు.పాటలు విన్నారు, చాలా సంతోషపడ్డారు బాగా పాడావు అని మెచ్చుకున్నారు. రేపు సాయంత్రం గుడి దగ్గర భజన ఉంటుంది నువ్వు తప్పకుండా రావాలి అక్కడ కూడా పాడాలి అని అడిగారు. నాకు అది  మరింత సంతోషాన్ని కలిగించింది.

అయ్యప్పస్వామి మాల వేసినవారు అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు కావడం వలన, ఏమీ తెలియని పసితనపు అమాయకత్వం వలన,వీటన్నింటి కంటే పాడాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉండటం వల్ల, వారు అడిగినదానికి కాదు లేదు అనడానికి నాకు కారణం కనబడలేదు.దాంతో ఖచ్చితంగా వస్తాను, పాట పాడుతాను అని ఒప్పుకున్నాను. 

తర్వాత రోజు సాయంత్రం  గుడి దగ్గరకు వెళుతున్నాను కదా అని శుభ్రంగా స్నానము చేసి,ఉన్నవాటిలోనే మంచి బట్టలు వేసుకుని,ఎప్పుడు లేనిది ఆరోజు ముఖానికి పౌడర్ వేసుకుని,చక్కగా తయారయ్యి ఉత్సాహంగా గుడి దగ్గరకు వెళ్ళాను.స్వాములు అంతా నన్ను సాదరంగా ఆహ్వానించారు,వాళ్ళ ఆదరణకు,నామీద చూపుతున్న అభిమానానికి నేను చాలా సంతోషించాను. 
అంతా బాగుంది గానీ ఎంతసేపైనా కూడా లోపలికి పోకుండా బయటే ఉన్నారు. టైమ్ గడచిపోతున్నది.అక్కడక్కడే తిరుగుతున్నారు కానీ భజన మొదలుపెట్టడం లేదు. చీకటి పడుతున్నది దాని జతకు నాకు విసుగొస్తున్నది.తీరాచూస్తే మైక్/మౌత్ పీస్ గుడి ముందు ఉన్న కట్ట మీదకు తీసుకువచ్చి బయట ఇక్కడే కూర్చుని పాట పాడమన్నారు. 

ఒక్కసారిగా నా మొహంలో రంగులు మారిపోయాయి, కళ్ళలో సంతోషం మాయమయ్యింది.నాకు  ఏదో తెలియని ఒకరకమైన వేదన,మనస్సులో బాధ ఒక్కసారిగా వచ్చాయి. నన్ను గుడి లోపలికి పిలుచుకోనప్పుడు నేనెందుకు అక్కడ పాట పాడాలి అని నా మనసుకు అనిపించింది, అక్కడ పాడకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను.నేను పాడను పో  అని చెప్పి చివాలున లేచి, అందరూ ఎంత బంగపోయి,బతిమలాడుతూ పిలుస్తున్నా వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేశాను.
నాకు అప్పటికి నిరసన, ఆత్మగౌరవం అనే మాటలకు అర్ధం కూడా తెలియవు.కానీ నాకు గౌరవం ఇవ్వని చోట నేను ఉండకూడదని అవమానాన్ని ఎదురించి బయటకు వచ్చేసాను. అప్పుడు నా వయస్సు జస్ట్ 12/13 ఏళ్ళు ఉంటుంది.ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా ఆత్మగౌరవంను నిలబెట్టుకున్నాను అని.

-యం.యస్.హనుమంత రాయుడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments