” నేను నా చావును చూసాను! “-చంద్రశేఖర్ భోగాపురం

‘ రేప్పొద్దున ఆరు గంటలకే ట్ర్రెన్ ఎక్కాలి, ఇప్పటికే సర్దాల్సినవి చాలా వున్నాయి, ఏంటి అంత నిదానంగా వున్నావు… వెళ్ళాలని లేదా ఏంటి? ‘ అని అమ్మ అడిగింది, వంటగదిలో నాకు ఇష్టమైన బంగాళా దుంప కూర వుండుతూ.

‘అదేం లేదు అమ్మ, ఇప్పుడు సర్దుతాను ‘ అని అన్నాను నేను… నాకు ఇష్టమైన స్టాలిన్ మూవీ చూస్తూ.
స్పీడ్ గా అన్నీ సర్దేసి… హమ్మయ్య! ఇక సినిమాను ప్రశాంతంగా చూడోచ్చు అని అనుకున్నాను. ‘ఏంటో… రిమోట్ కోసం తమ్ముడుతో ఈరోజు పోట్లాట జరగలేదు, అడక్కుండానే నాన్న తన గతం గురించి చెప్పాడు… ఎన్నిసార్లు విన్నా కొత్తగా, గొప్పగానే వుంటుంది నాన్న గతం, అందుకే ఆయన మా నాన్న అనే గర్వంతో పాటు, ఆయన మీద గౌరవం కూడా పెరుగుతూనే వచ్చింది విన్న ప్రతీసారి… ‘ఇంటికి దూరంగా వెళ్ళే ముందు అన్నీ ఇష్టమైనవే జరుగుతున్నాయి’ అని అనుకుంటూ భోజనం చేసి, నాలుగున్నరకి అలారం పెట్టి నిద్రపోవడానికి సిద్ధమయ్యాను. కాని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు. దానికి కారణం గతంలో నా జీవితంలో జరిగిన సంఘటనలు… ‘మనకు ఇష్టమైన వాళ్ళ జ్ఙాపకాలు కొన్ని రాత్రులకు నిద్ర లేకుండా చేస్తాయి…’ అని అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను.

ఏవో కొన్ని ఏడుపులు వినిపించి మేలుకువ వచ్చింది…బాగా తెల్లారినట్లుంది. ఏం జరగిందా అని ఆలోచించుకుంటూ…టీవీ న్యూస్ లో ఎవరిదో తెలిసిన ముఖం మసకగా కనిపిస్తుంటే… కళ్ళు రుద్దుకుంటూ లేచాను. అది చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను ఎందుకంటే అది నా ముఖమే! క్రింద స్క్రోలింగ్ లో ‘ఇక సెలవు’ అని నేను చనిపోయినట్టు రాసి వుంది. ఇది ఏదో భ్రమలా వుంది అని అనుకుంటూ ఇంటి బయటకు వచ్చాను. చాలా మంది జనం ఇంటి ముందు వున్నారు… మధ్యలో ఎవరో పడుకుని వున్నారు.. అక్కడికి దగ్గరగా వెళ్తుంటే అమ్మ ఏడుస్తూ కనిపించింది… అక్కడ పడుకున్నది ఎవరో కాదు నేనే, కాదు కాదు అక్కడ చచ్చిపడున్నది నేనే! నిజమే, ఇది భ్రమ కాదు… నేను నిజంగానే చనిపోయాను. ఒకేసారి వందరెట్ల ప్రసవ వేదనను అనుభవిస్తున్నట్టు ఉంది అమ్మ రోదన! ఆ ఏడుపు నిజంగా నేను బ్రతికున్నప్పుడు చూసింటే ఖచ్చితంగా చచ్చిపోయేవాడ్ని!

అయినా నేను ఆల్రేడి చనిపోయాను కదా అని అనుకుంటున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఎవరు నిజంగా ఏడుస్తున్నారో, ఎవరు నటిస్తున్నారో తెలుసుకోవాలనిపించింది. నాకు ముఖపరిచయం లేనివాళ్లు కూడా వాళ్ళ జీవితంలో ఏదో విలువైంది కోల్పోయినట్టు ఏడుస్తున్నారు! నాకు తెలియని వాళ్ళు కూడా నా చావు పట్ల ఇంత దిగ్భ్రాంతికి గురి అవుతున్నారంటే ,ఇంతకన్నా గొప్ప విజయమేముంది’ అని అనుకున్నాను. అంతమందిలో నాన్నా, తమ్ముడూ ఎక్కడున్నారని చూస్తే, వాళ్ళ గుండెను రాయి చేసుకుని నా శవాన్ని శ్మశానానికి తరలించడానికి సన్నాహలు చేస్తున్నారు. ఎందుకో నాన్న కంట్లో నాకు ఒక్క కన్నీటి చుక్క కూడా కనపడలేదు… బహుశా భరించలేని బాధను కన్నీళ్ళతో బయటకి పంపలేము అనుకుంటా! తమ్ముడు మధ్య మధ్యలో అమ్మను ఓదారస్తూ, నాన్నకు బాధ్యత తగ్గిస్తూ…బయట వాళ్ళకి ఏమో కానీ నాకు మాత్రం చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాడు, ఒకవేళ వాడికీ ఏడవాలని వుందేమో… అమ్మ, నాన్నకి ధైర్యం ఎవరు చేబుతారని ఏడవట్లేదనుకుంటా!

ఇంతలో ఎవరో నన్ను పిలిచినట్లు అనిపించింది.. పిలుపు వినిపించిన దిక్కుగా చూస్తే… వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్… నాని గాడు! ‘అదేంటి వాడు చనిపోయి పదిరోజులు అవుతుందిగా… అయినా వీడు నాకు కనపడుతున్నాడేంటి? కొంపదీసి దెయ్యం గట్ట కాదు కదా’ అని భయపడ్డాను. చచ్చినోడు కావాల్సినోడు అయినా కనపడితే భయపడతాం కదా! ‘అయినా నేను చచ్చిపోయాను కదా, వాడు దెయ్యమైతే ఏంటి, మనిషి అయితే ఏంటి?’ అని అనుకుంటూ ధైర్యంగా వాడి దగ్గరకు వెళ్ళాను!

‘నువ్వు వస్తావని నాకు తెలుసు రా!’ అని నవ్వుతూ అన్నాడు.
‘ నేను వస్తానని నీకు ఎలా తెలుసు?’ అని అన్నా అమాయకంగా.
‘నువ్వు మరిన్ను… ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ జీవి ఏదో ఒకరోజు చావాల్సిందే కదా! నిన్న నేను, నేడు నువ్వు, రెేపు వీళ్ళలో ఎవరో?! ‘ అని నా శవాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళ వైపు వేలు చూపిస్తూ అన్నాడు.
‘నాకో డౌటూ.. నువ్వు ఇంకా భూమ్మిదే వున్నావేంటి? స్వర్గం, నరకం అంటారు కదా, నువ్వు దేనికి వెళ్ళలేదు ఏంటి?’ అని ఆశ్చర్యంగా అడిగాను .
దానికి వాడు.. ‘మన కర్మ కాండ జరిగే పది రోజుల వరకు ఇలానే ఉంటామని ఎక్కడో చదివా’ అని అన్నాడు… ‘అలా అయితే నీది ఈరోజుతో పది రోజులు అయిపోతుంది కదా’ అని నేనంటు ఉండగా…

సడన్ గా ఏదో వింత వెలుగు మా ముందు ప్రత్యక్షమయ్యింది. అదో స్పేస్ షిప్ లా వుంది.. రకరకాల రంగులతో వింతగా వుంది. దానిలో నుండి పెద్ద వెలుగుతో రెండు వింత ఆకారాలు బయటకు వచ్చాయి… పది అడుగుల పొడవు, భారీ కాయం, వంటి నిండా వివిధ రకాల ఆభరణాలతో మా వైపు నడచుకుంటూ వస్తున్నారు… వాళ్ళ నడక గానీ, వారి ముఖ తేజస్సు గానీ చూస్తే ఎవరైనా దేవుళ్ళు అంటే ఇలానే ఉంటారేమోనని అనుకుంటారు. వాడు నా వైపు చూస్తూ నాకు పిలుపు వచ్చింది… ‘ఇక సెలవు’ అన్నట్టుగా కళ్ళతో సైగ చేసి ఆ దేవదూతల వైపు నడుస్తున్నాడు.

ఇంతలో వాడి చెయ్యిని ఎవరో వెనుక నుంచి పట్టుకున్నారు. వాడు వెనక్కి తిరిగి చూసాడు, నేను కొంచెం సేపు తీక్షణంగా చూసాక తెలిసింది… అది వాళ్ళ ‘నాన్న’ అని!. ‘నాని గాడు చనిపోయాక ఆ దుఃఖం తట్టుకోలేక వాళ్ళ నాన్న కూడా చనిపోయివుంటాడని లేకపోతే, నాని గాడిని తను ఎలా చూడగలడని…?’ నేను అనుకున్నాను. నానిగాడి కళ్ళలో నీళ్ళు తిరిగుతున్నాయి కానీ విచిత్రం ఏంటంటే ఒక్క కన్నీటి చుక్క కూడా కంటి నుండి బయటకు రావట్లేదు. అప్పుడు అనిపించింది… ‘సంతృప్తిగా ఏడవాలన్నా బ్రతికున్నప్పుడే సాధ్యమని!’. వాళ్ళ నాన్న వాడిని హత్తుకుని ఏడుస్తున్నాడు… అది చూసి ఆ దేవదూతలు నాలాగే నిశ్శబ్దంగా నిల్చుండిపోయారు, ప్రేమ చావుకు అతీతం అన్నట్టుగా!, ఆ నిశ్శబ్ధం మరో ప్రపంచాన్ని తలపిస్తుంది! అప్పటి వరకు కళ్శతో, కౌగిళ్ళతో మాట్లడుకున్న వాళ్ళు… మౌనంపై మాటలతో యుద్ధం చెయ్యడం మొదలుపెట్టారు. వాళ్ళ నాన్న నాని గాడితో, ‘ నేను చచ్చాక నువ్వు తలకొరివి పెడతావని నేననుకుంటే, నీకు తలకొరివి పెట్టి నేను చచ్చాను నాన్నా…’అని గుండెలు బద్దలయ్యేలా ఏడ్చాడు.. అది చూసి నాకూ ఏడుపోచ్చేసింది.

ఆ తరువాత ఆ ఇద్దరు దేవదూతలు, ‘సమయం ఆసన్నం అయ్యింది, మనం వెళ్ళాలి’ అని అంటూ నాని గాడి చెయ్యి పట్చుకుని స్పేస్ షిప్ లోకి తీసుకెళ్ళారు. నాని గాడు… వాళ్ళ నాన్నని, వాళ్ళ నాన్న…నాని గాడిని చూసి ఒకేసారి ఇద్దరూ నవ్వారు… అది చూసి నేనూ వాడికి చిరునవ్వుతోనే వీడ్కోలు ఇచ్చాను! నిజమే కదా, ‘బ్రతికున్నప్పుడే కాదు చచ్చాక కూడా.. చిరునవ్వుతో వీడ్కోలు ఇవ్వడం చాలా సంతృప్తికరంగా వుంటుంది కదా’ అని అనిపించింది.

అది చూసి మా కుటుంబాన్ని చూడాలనిపించింది, మా ఇంటికి వెళ్ళాను… ఎందుకో చిరాకుగా అనిపించింది, వాళ్ల ఏడుపులు చూసి.
దానికి రెండు కారణాలు వున్నాయి…
ఒకటి, వాళ్ళు ఏడవడం నాకు నచ్చలేదు…
రెండోది, నాకు కూడా చిరునవ్వుతో వీడ్కోలు కావాలన్నా ఆశ. చచ్చాక కూడా ఆశలుంటాయని అప్పుడే తెలిసింది. నాకు చాలా ఉక్కపోతగా వుంది, అద్భుతాలని చూడటంలో పడి ఉక్కపోతగా వుందని గమనించలేదు. ‘నా శవం చుట్టూ చాలా మంది వుండటం, దానికి గాలి తగలకపోవడమే కారణం అయ్యుండవచ్చు లేకపోతే నేను అలా ఊహించుకుంటున్నానో తెలియదు. మాములుగానే ఫ్యాన్ లేకపోతే చెమటతో స్నానం చేసేస్తాను. ఇంతలో ఆ చెమట వల్ల నా టీ-షర్ట్ మొత్తం తడిచిపోయింది!’ అని నేను అనుకున్నాను,

కానీ నిజానికి అది చెమట కాదు నా కన్నీటి చెమ్మ! దానివల్ల నాకు ఒక్కసారిగా మెలుకువ వచ్చింది. ఆ సన్నీవేశాలను కలలో నేను చూడటం వల్ల నాకే తెలియకుండా నిద్రలో నేను ఏడ్చేసాను. దాని వల్ల నా టీ-షర్ట్ తడిచిపోవడం, నాకు మేలుకువ రావడం జరిగింది…”అయినా కనులకు కనులు తెరవకుండా కలలు చూడటం ఎవరు నేర్పారో కదా!”

అది నిజంగానే కలే.. అంటే నేను కలలో చనిపోయానన్నమాట.. కానీ ఎందుకో నేను మళ్ళీ పుట్టాననిపించింది. ఒక్క నిమషం ఏం అర్థంకాలేదు. టైమ్ చూస్తే.. ఉదయం మూడున్నర అయ్యింది.. ఆ సంఘటన నుండి తేరుకోవడానికి కొన్ని నిముషాలు పట్టింది. ఆ తరువాత మంచం దిగి అమ్మ నాన్న కాళ్ళకి మెుక్కాను, దేవుడికి థాంక్స్ చెప్పాను.

నాలుగున్నరకి అలారం మోగింది.. అమ్మ నిద్ర లేచింది.. నేనూ కూడా అప్పుడే లేచినట్టు నటించి, నా మరో మాములు రోజుకి రెడీ అయ్యాను. ఆరోజు వీడ్కోలు అందరికి చిరునవ్వుతో ఇచ్చాను, ఇక ముందు అలానే ఇస్తాను…

ఎందుకంటే, “మనం ఒకరికి చెప్పే వీడ్కోలే, మనం వాళ్ళని చూసే చివరి చూపు కూడా అయ్యుండవచ్చు, దానిని వాళ్ళు చిరునవ్వుతోనే గుర్తుంచుకోవాలి, వాళ్ళకి అది గుర్తురాగానే వాళ్ళ ముఖంలో చిరునవ్వు ఉదయించాలి!”

– చంద్రశేఖర్ భోగాపురం (CSB)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink

Comments are closed.