పరివర్తన (కథ ) – శివలీల కె

“మే ఐ కమిన్ సర్…”

“రండి. మీకోసమే చూస్తున్నాను. ఎందుకు రిజైన్ చేస్తున్నారు.”

“పని వత్తిడి ఎక్కువగా ఉందండీ. చేయలేకపోతున్నాను.”

“నిజం చెప్పండి. కారణమేంటి.”

“ప్రత్యేకంగా ఏ కారణాలూ లేవండీ.”

“లాస్య…?”

“……”

“విసిగిస్తోందా.? అమ్మాయితో నేను మాట్లాడనా?”

“లేదండీ. సమస్య ఆ అమ్మాయి కాదు.”

“పర్లేదు చెప్పండి. మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేస్తోందని విన్నాను. మీరు చెప్పిన తర్వాతే యాక్షన్ తీసుకుందామని ఆగాను.”

“లాస్య వల్ల ఏ ఇబ్బందీ లేదండీ. కొంచెం మార్పు కావాలనుకుంటున్నాను అంతే!”

టంగ్…టంగ్…టంగ్ 

గోడగడియారం చెవులు చిల్లులు పడేట్లుగా పదిసార్లు మోగింది.

ఆవిడ వెళ్లిపోయారు. 

ఆయన చూస్తుండిపోయారు. 

***

సరిగ్గా అదే సమయంలో…

ఏదో పీడకల వచ్చినట్టుగా ఉలిక్కిపడి నిద్రలేచింది లాస్య. రూంలోని బెడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. వాటిపై బెడ్షీట్లు, దువ్వెనలు, మేకప్ సామానులు అస్తవ్యస్తంగా పడున్నాయి. హడావుడిగా ఫ్లిప్ ప్లాప్స్ లో కాళ్లు దూర్చింది. షెల్పువైపు కదిలింది. ముదురు రాగిరంగులో మెరుస్తూ భుజాలపై పడుతున్న జుట్టును నిర్లక్ష్యంగా ఎగరేస్తూ ఖాళీ టిఫిను బాక్సులు చేతిలోకి తీసుకుంది. వేగంగా మెట్లుదిగింది.

“ఏంటే తెల్లారిందా. ఇంకొంచెంసేపు పడుకోలేకపోయావా?” వెటకారంగా అంది హాస్టల్‌మేట్.

“నా ఇష్టం” అన్నట్టుగా చూపులతోనే బదులిచ్చింది లాస్య.

“పొగరు చూడు. కళ్లు నెత్తిన ఉంటాయ్ దీనికి”

రెండు పెదవుల్నీ ఒకేసారి ఓకేవైపు చిత్రంగా సాగదీసి, పట్టించుకోకుండా కుడివైపుకు కదిలింది. 

చక్కతో చేసిన డైనింగ్ టేబులు పై అక్కడక్కడా ఎంగిలిమెతుకులు, ఎండిపోయిన సాంబారు మరకలు. పెద్ద గిన్నెల్లో అడుగున ఆహారపదార్ధాలు. వాటి పక్కనే స్టీలుబక్కెటులో కొద్దిగా సాంబారు.

“అందరు పొద్దుటే బాక్సుల్గట్కపోతరు గద బిడ్డా. జరంతపొద్దునె లెవకపోతివా. అర్థరాత్రిదాకా సదువబడితివి. నిద్రసరిపోవద్దా. గిప్పుడొస్తే ఎట్లమ్మా. తిండి సక్కగలేకపోతే సదువెక్కుడు కష్టం గదరా” జాలిగా అంది వంటావిడ.

ఏమీ మాట్లాడకుండా అన్నం రెండుకూరలు టిఫిను బాక్సుల్లో పెట్టుకుని, అల్పాహారంగా చేసిన సేమ్యా ఉప్మాను మరో బాక్సులో నింపుకుని పైకెక్కింది.

***

తీరిగ్గా రెడీ అయింది. అద్దంలో ముఖం చూసుకుంది. అంతవరకూ గుర్తురాని సమయం అప్పుడే గుర్తొచ్చింది. చకచకా నాలుగు స్పూన్ల ఉప్మా నోట్లో వేసుకున్నాననిపించింది. లంచ్ బాక్సు హేండ్ బ్యాగులో పెట్టుకుని హాస్టల్నుంచి బయటపడింది. ఆటో పట్టుకుని ఆఫీసు చేరుకుంది. 

అప్పుడు సమయం 12 గంటలు…

గంటన్నర లేటు. ఫీల్డువర్కు చేసే పనికూడా ఉండడంతో డెస్కులో లేటు వచ్చినా ఎవ్వరూ ఏమీ అనరు. కానీ ఏమూలో తప్పుచేసిన భావన. డెస్కువైపు నడిచింది. స్టాఫ్ కొందరు లాస్యను గమనించి మరో క్షణం స్క్రీన్లలో మునిగిపోయారు. మెల్లగా లోపలికి నడిచి సీట్లో కూర్చుంది లాస్య.

ఇరవైయ్యేళ్ల లాస్య ఫీచర్స్ డెస్కులో సబెడిటర్. రత్న పైస్థాయిలో ఉంటారు.

“కొత్తల్లో తొమ్మిదిగంటలకే వచ్చేవాళ్లు ఈ మధ్య బాగా తెగించేస్తున్నారు.” వెటకారంగా అంది రంజన.

“మరే. అప్పుడంటే కొత్తబిచ్చగాడు…” వంతపాడింది పక్కసీటు రాజీ.

పకపకా నవ్వారిద్దరూ. 

అలవాటే. వినీవిననట్టుగా పనిమొదలెట్టింది లాస్య.

గట్టిగా గొంతు సవరించిన శబ్ధం వెనుకనుంచి వినిపించింది. చిరపరిచితమైన ఆ గొంతువిని వెనక్కు తిరిగింది లాస్య.

“రత్నగారు మానేసారు. ఇవాల్టినుంచీ మీ ఇన్చార్జీ రంజన.” నవ్వుతూ చెప్పారు ఫీచర్స్ హెడ్. అందరూ చప్పట్లు కొడుతూ రంజనవైపు చూస్తున్నారు.

బాంబు పడ్డట్టుగా అదిపడింది లాస్య. భయంగా రంజనవైపు చూసింది. ఆవిడ మొహంలో విజయగర్వం. లాస్యవైపే చూస్తూ  చిరునవ్వు నవ్వింది. ఎగతాళి, హేళన కలగలిపిన నవ్వది.

విలవిలలాడింది లాస్య. మనసులో తీవ్ర సంఘర్షణ. అంజన సాధింపులు భరించలేక చేస్తున్న పని ఆపి మధ్యలోనే లేచి వెళ్లిపోయిన కమల గుర్తొచ్చింది. కమల స్థానంలో మరో కొత్తమ్మాయి వచ్చింది.

ఒకే పనిని రిపీటెడ్‌గా చేపించడం, ఫోటోషాప్ డిజైన్, పేజీ లే ఔట్ లను చివరినిముషంలో  ఇష్టమొచ్చినట్టుగా మార్చేయడం రంజనకు అలవాటు. దాంతో ఐదుగంటలకు వెళ్లాల్సిన అమ్మాయిలు ఎనిమిదయ్యేవరకూ ఆఫీసులోనే ఉండిపోయేవారు.

నెలతిరక్కుండానే కొత్తమ్మాయికూడా రిజైన్ చేసింది. 

లాస్యకు పనిచేయాలన్న ఆసక్తి పోయింది. విపరీతమైన ఆందోళన, ఆలోచనలతో ఒళ్లు కొద్దిగా వేడెక్కింది. రెండు గంటలకల్లా అది జ్వరంలా మారిపోయింది.

“రంజనకి చెప్పి వెళ్లిపో. జ్వరంకదా. కంపోజ్ చేసేదుంటే చెప్పు నేను కొట్టిపెడతా” కొలీగ్ కళ.

“అమ్మో వద్దే. చంపేస్తుంది. ఇక్కడే ఉంటాను ఆరయ్యేవరకూ.” లాస్య.

“ఏయ్ పో. ఏంగాదు. ఆవిడకూడా మనిషి కదే. అట్ల భయపడతావ్”

రంజన కాబిన్ దగ్గర నిలబడింది లాస్య.గంభీరంగా డెస్కు ముందు కూర్చుని ఫ్రూఫ్ రీడింగు చేస్తోంది.

“నేను వెళ్తున్నానండీ. జ్వరంగా ఉంది.”

తలెత్తి పైకి చూసింది. ఒకలా నవ్విందో, పెదవులనే అలా సాగదీసిందో గానీ సోడాబుడ్డీ అద్దాల్లోంచి ఉబ్బెత్తుగా కనిపిస్తున్న కళ్లలో ఒకలాంటి క్రూరత్వం. 

క్షణంలో పెదాలపై నవ్వుమాయమైంది. కళ్లల్లోని క్రూరత్వం మొహమంతా అలుముకుంది.

“అవునా. నువ్వు చేసిన పని ఏదైనా ఉంటే ప్రింటుతీసి టేబులు మీద పెట్టివెళ్లు.”

“ఫీవర్ గా ఉంది. ఏమీ చేయలేదు. రేపటినుంచీ మీరు చెప్పినట్టు చేస్తాను.”

“పర్లేదు ఎంతవరకు చేస్తే అంతే పెట్టి వెళ్లు” నవ్వులో వెటకారం

“రేపు మొత్తం సబ్మిట్ చేస్తానండీ”

“ఇంతకు ముందు చెప్పింది వినిపించింది కదా” స్వరంలో స్థిరత్వం.

వదిలేలాలేదు. ఇకలాభంలేదు. ఈవిడ దగ్గర పనిచేయడం సాధ్యంకాదు.

“మీరు కనీసం ముందైనా చెప్పలేదు. కరెక్టుగా వెళ్లేముందే అడుగుతున్నారు. నాకు చాలా జ్వరంగా ఉంది. వెళ్తున్నాను.”

వచ్చేసింది లాస్య. అన్నీ వదిలి ఆఫీసు బయటికి అడుగుపెట్టింది. ఇక ఉద్యోగంపై ఆశ వదులుకోవాల్సిందే. ఎక్కడైనా వెతుక్కోవాలి. తప్పదు.

ఎందుకో రత్న లీలగా కళ్లముందు కదిలారు. మరుక్షణం ఏవో ఆలోచనలు మస్తిష్కాన్ని ఆక్రమించినా లాస్యకు తెలీదు తన పాత ఇన్చార్జీ మొహం, ఆవిడ నిష్కల్మషమైన చూపులు తనను ఎప్పటికీ వెంటాడతాయనీ వెన్నంటే ఉంటాయనీ.

ఓ నెలరోజుల తర్వాత…

“టాలెంట్ అంటే నీది నెల తిరక్కుండానే మంచి ఉద్యోగం సంపాదించావ్. అదీ ఎలక్ట్రానిక్ మీడియాలో నెంబర్ వన్ ఛానెల్లో” స్నేహితులు ఆకాశానికెత్తేస్తున్నారు.

గాల్లోతేలినట్టుంది లాస్యకు. 

రోజులు గడుస్తున్నాయి. మెల్లిగా కొత్త ఆఫీసులో పరిచయాలు పెరుగుతున్నాయి.

“సాయంత్రం ఫైవ్ కి రెడీగా ఉండు. పానీ పూరీ తీనొద్దాం.” లంచవర్లోనే టైం ఫిక్స్ చేసింది మిక్కీ.

“రాముగారేమంటారో. అసలే నాది ట్రైనీ పొజిషన్!” సందేహంగా అంది లాస్య.

“ఏంటే అనేది. అంత అమాయకత్వం పనికిరాదు.”

“అది కాదే పనుంటుంది కదా…”

“పని నీ ఒక్కదానికే ఉంటుందా? లంచ్ బ్రేక్ వాళ్లు గంటన్నర తీసుకుంటారు. మరి నువ్వో పదినిముషాల్లో ముగించి పరిగెడతావు. టీ బ్రేకు వాళ్లెన్ని సార్లు తీసుకుంటారు. ఈవినింగ్ స్నాక్స్ కోసం వెళ్లి ఎంత సేపటి తర్వాత వస్తారో చూసావా. ఏమీ కాదు. నువ్వు ఇలా ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావ్.” హితబోధ చేసింది. మిగిలినవాళ్లంతా మిక్కీ చెప్పింది సరైనదే అన్నట్టు తలాడించారు.

అయిష్టంగానే సరే అన్నా లాస్యకు భయంగానే ఉంది తన ఇన్చార్జీ ఏమంటారో అని. 

ఐదైంది. గంటకొట్టినట్టుగా లాస్య దగ్గరకొచ్చింది మిక్కీ.

“రాముగారు బ్రేక్ టైం కదా. లాస్యానేనూ కిందకివెళ్లొస్తాం.” సూటిగా అడిగింది మిక్కీ.

ముఖం మాత్రం నిలువుగా ఊపాడు. కళ్లు మానిటర్‌ను చూస్తున్నాయి ఏ భావమూలేకుండా.

హేండ్‌బాగ్ పట్టుకుని బయటపడింది లాస్య.

“ఏంటి బావా. డెస్కుకు అతికిపెట్టినట్టు ఉండేది. ఈ రోజేంటి కొత్తగా. కంట్రోల్ చెయ్. లేకపోతే ఇంతేసంగతులు…”పక్కడెస్కు వీరు మెల్లగా అన్నాడు రాముకి మాత్రమే వినిపించేలా.

“కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టిందట” రాము మనసులోని అక్కసునంతా మాటల్లో చూపించాడు.

“వదిలేస్తే ఎలా? మేసేగాడిద మనగాట్లోది. దాన్ని మనమే మానిటర్ చేసుకోవాలి.”

ఆలోచిస్తూ ఉండిపోయాడు రాము.

సరిగ్గా పదిహేను నిముషాలకు వచ్చింది లాస్య. 

“అయిపోయిందా లాస్యా…” ముఖంలో కాఠిన్యం. “డెస్కు చూసుకో నేను ఇప్పుడే వస్తాను.” రెండుచేతులను కుర్చీ హేండిల్స్ మీద ఉంచి విసురుగా లేచాడు.

“పదబావా” స్పోర్టు డెస్క్ వీరును కలుపుని వెళ్లాడు.

అతను ఏమీ అనకపోయే సరికి తృప్తిగా నిట్టూర్చింది లాస్య.

న్యూస్ ఫోల్డర్ చూసింది. బులెటిన్కోసం ప్యాకేజీలు లేవు. కావాలనే రెడీ చేయలేదా.  చకచకా న్యూస్ కంపోజ్ చేస్తోంది. 30…40…50… నిముషాలు భారంగా దొర్లుతున్నాయ్. బ్రేక్ కోసం వెళ్లినవాడు వస్తాడన్న సూచనే లేదు. బులెటిన్‌లో ఏదైనా తప్పు జరిగితే ట్రైనీలపై వేటు వేయడం ఖాయం. బయటికెళ్లినందుకు అతనిచ్చే శిక్షా!

రత్న మదిలో మెదిలింది. 

ఎంత లేటుగా వెళ్లినా… ఎప్పుడూ పల్లెత్తు మాట అనేవారు కాదు. ఒంట్లో బాగోలేనప్పుడు తన పనికూడా ఒక్కోసారి ఆవిడే చేసేవారు. ‘నేను చేస్తానండీ’ అన్నాకూడా ‘వద్దులేమ్మా’ అనే ఆ మాటల్లో ప్రేమ తప్ప మరో అర్థం మాత్రం కనపడేదే కాదు. 

కళ్లలో సన్నటి నీటిపొర.

అర్థంకాని భావాలనీ, ఆలోచనలనీ బలవంతంగా పక్కకు నెట్టి బులెటిన్‌కి వార్తలు సిద్దం చేస్తోంది. షిప్టు ఇన్‌చార్జీకి స్క్రిప్టు గురించి వివరించి తిరిగి తన డెస్కులో కూర్చుంది. వత్తిడి ఉన్నా ‘సకాలం’లో పని పూర్తిచేయగలిగానన్న ఆనందం లాస్య కళ్లలో తొంగిచూసింది.

రాము తీరిగ్గా వచ్చాడు. ముఖంలో గర్వం. ఏదో జయించిన ఫీలింగ్. నువ్వు నన్నేం చేయలేవు అన్న ధీమా. 

“హేయ్…ఇచ్చేసావా న్యూస్” అన్నాడు చాలా ఉత్సాహంగా. 

మౌనంగా ఉండిపోయింది లాస్య.

***

మరుసటిరోజు,

“రేపటినుంచీ నీది మార్నింగుషిఫ్టు” కృష్ణ లాస్యవైపే అదోలా చూసాడు.

“జనరల్ షిఫ్టులో వస్తున్నాను. వారం రోజుల తర్వాత మారుస్తారట. ఇంత త్వరగా ఎందుకు మార్చేసారు.”

మౌనంగా ఉండిపోయాడు కృష్ణ. “సరేలెండి. వచ్చే వారం మళ్లీ ఛేంజ్ చేస్తారు కదా.” కన్విన్స్ అవుతున్నట్టుగా అంది లాస్య.

“వారం అంటూ ఏంలేదు. ఎప్పటికీ మార్నింగే. రాము, నేను మధ్యాహ్నం వస్తాం. కిరణ్ జనరల్ షిఫ్టు” చకచకా చెప్పాడు.

ఇద్దరు సీనియర్లు మధ్యాహ్నం ఒకే షిఫ్టులో ఎందుకొస్తున్నారో అర్థంకాలేదు లాస్యకు. తన జనరల్ షిఫ్టు కిరణ్కిచ్చేశారు.

“రోజూ మార్నింగ్ షిఫ్టంటే కష్టం అండీ. పొద్దున ఐదున్నరకు రోడ్లపై ఎవ్వరూ ఉండరండీ. సెక్యూరిటీ ప్రోబ్లెం ఉంటుంది” తన పరిస్థితిని వివరించింది.

“అదంతా నాకు తెలీదు. రాము ఎలాట్ చేశాడు. నేనేం చేయలేను” తప్పించుకున్నాడు కృష్ణ.

ఒక్కరోజు బ్రేక్ తీసుకున్నందుకు ఇకపై ఆ అవకాశమే లేకుండా చేసినట్టున్నాడు రాము. 

లాస్య ఒక్కటే మార్నింగ్ షిఫ్టులో పనిచేసేది. జనరల్ షిఫ్టు కిరణ్ కూడా మధ్యాహ్నమే వచ్చేవాడు. ఎవరూ వాళ్లను ఏమీ అనేవాళ్లుకూడా కాదు. చేసేదేంలేక లాస్య మొత్తం పని చేసుకుపోతోంది.

తర్వాత…

“డెస్కులో ఎవరూ లేరా? ట్రైనీ ఉందేంటి.” కంచు కంఠంతో అన్నాడు ఔట్పుట్ ఎడిటర్.

అందరూ మౌనంగా ఉన్నారు

“ఇదిగో ఇలా రా. ఎన్కౌంటర్ జరిగింది. ఆరుగురు చనిపోయారు.” విసురుగా లాస్యను పిలిచాడు.

“సర్ ఏడుగురని వస్తోంది”

“ఆరుగురే”

“నేషనల్ ఛానెల్స్‌లో…” మాటింకా పూర్తవనేలేదు.

“నోర్ముయ్. చెప్పింది చెయ్” హిస్టీరియా వచ్చినట్టుగా అరిచాడు.

అదిరిపోయింది. అప్పటివరకూ ఎవ్వరితోనూ తిట్లుతిన్న అనుభవం లేకపోవడం వల్ల మసకబారిన కళ్లతో డెస్కువైపు నడిచింది.

మిగిలిన వారు నవ్వుకున్నారో ఎగతాళి చేసారో చూసుకునే సమయమే లేదు ఆ క్షణంలో. యాంత్రికంగా బ్రేకింగ్ న్యూస్ కంపోజ్ చేస్తోంది.

రత్న రూపం కళ్లముందు మెదిలింది.

“హాపీ హోలీ… కళా”

“హాపీ హోలీనే మొద్దూ”

“రత్నగారూ హాపీ హోళీ అండీ”

“రంగుపూసెయ్యండి లాస్యకు. ఎలా పూయాలో చెప్పనా ఇలా మీసాలు పెట్టేయండి బలే ఉంటుంది.” జోగ్గా అంటున్నారు  రత్నగారు.

“ఎందుకండీ అలా అంటారు సాడిస్టులా” నోరు జారుతున్నా అన్న స్పృహ లేదు లాస్యకు.

అక్కడనుంచి గబగబా నడిచివెళ్లిపోయింది రత్న.

“అరే ఆవిడ ఫీలైనట్టుందే  సారీ చెప్పు. అలా అనొచ్చా పెద్దావిడను” మందలింపుగా అంది కళ.

‘నిజంగా ఫీలయ్యారా నేనన్నమాటకు’ స్వగతంలో అనుకుంటూ రత్న దగ్గరికి వెళ్లింది. “సారీ అండీ’ దగ్గరగా వెళ్లి చెప్పింది. స్టోరీని కంపోజ్ చేస్తున్న ఆ రెండు కళ్లలో కనీకనిపించని తడి.

అపరాధభావం వెంటాడుతుండగా బయటికొచ్చేసింది లాస్య. తను మాటతూలినా ఆవిడ ఏమీ మాట్లాడకపోవడం వింతగా అనిపించింది. 

***

గబగబా కన్నీళ్లు తుడుచుకుని సాఫ్ట్కాఫీ షిప్టు ఇన్‌చార్జీకి ఇచ్చేసింది. బ్రేకింగ్ న్యూస్ హేండిల్ చేసింది తొలిసారిగా.

రోజులు భారంగా గడుస్తున్నాయి.

“చూడూ. ఇది సరోగేట్ బేబీ గురించి. ప్యాకేజ్ రాయాలి.” ఏదో నములుతూ అంటున్నాడు శ్రవణ్. ఎర్రగా గారపట్టిన అతని పళ్లవైపు అయోమయంగా చూస్తుండిపోయింది లాస్య.

షిప్టులో ఒక్కటే ఉంది. మిగిలి ముగ్గురూ ఎడ్రస్సు లేరు. ఏం చేయాలో పాలుపోలేదు. అతని పళ్లమీంచి బలవంతంగా దృష్టి మరల్చుకుని ‘సరే’ అన్నట్టుగా తల కదిపింది. బులెటిన్ ఇవ్వాలి. లంచ్ కూడా షిప్టయ్యాక మధ్యాహ్నం రెండున్నరకు చేస్తోంది. మెడతిప్పుకోలేనంత పని. ఎప్పుడు రాయాలో ఏంటో… అనుకుంటూనే మళ్లీ చేతివేళ్లను కీబోర్డుపై టకటకలాడించింది. 

సరొగేట్ ప్యాకేజీని మర్చిపోయింది. వాళ్లందరికీ కావాల్సిందికూడా అదే!

మూడురోజులు గడిచాయి.

“హేయ్ లాస్యా నువ్వు భలే హేండిల్ చేస్తున్నావ్ తెలుసా. ఆ చిటపటగాడు కూడా నీకు ఫ్యాన్ అయిపోయాడు. ఏం మాయచేశావ్.” అన్నాడు రాము.

“ఎవ్వరూ రావట్లేదు. రెండునెలలనుంచీ మార్నింగ్ షిఫ్టులో నేనొక్కదాన్నే. షిఫ్టు ఛేంజ్ చేయరా ప్లీజ్”

“అవునా జనరల్ షిఫ్టులో కిరణ్ ఉన్నాడే. రావట్లేదా” ఏమీ తెలీనట్టుగా అడిగాడు భాను.

“లేదండీ” అంది లాస్య.

“వాడికి ఒంట్లో బాగాలేదేమో కనుక్కుంటాలే” కళ్లు స్క్రీన్‌కి అప్పజెప్పాడు.

పట్టుదలతో పనినేర్చుకుంటోంది లాస్య. విపరీతమైన ఒత్తిడి. తన కష్టం ఎవరితో చెప్పుకోగలదు.

కీబోర్డు కింద స్కృిప్టు చూశాడు రాము. మళ్లీ అలాగే పెట్టాడు తెలీనట్టుగా. అది గమనించింది లాస్య. సాధారణంగా అనువదించాల్సినవన్నీ అక్కడుంచుతారు వాళ్లు. సరోగేట్ స్టోరీ రాయాలని చెప్దామనుకుంది. చూశాడు కదాని మళ్లీ దానిగురించి ప్రత్యేకంగా అతడితో చెప్పలేదు. అదే తనుచేసిన పొరబాటని తెలీదు ఆ అమ్మాయికి.

మరుసటిరోజు…

ఎప్పటిలాగే ఆఫీసుకెల్లింది. సమయం పదకొండు గంటలు.  మిగిలిన ముగ్గురిలో ఒక్కరూ రాలేదు.

అవలవాటైన వ్యవహారమే గనుక లాస్య ఓపికతో పని చేయడం అలవాటు చేసుకుంది. 

“లాస్యా ఎడిటర్ గారు పిలుస్తున్నారు.” శ్రవణ్ మెహంలో ఏదో వెకిలి నవ్వు.

మెల్లగా నడిచింది లాస్య. ఎడిటర్ పక్కన మరో ముగ్గురు.

“సరోగేట్ స్క్రిప్టు ప్యాకేజీ చేయలేదు ఎందుకని? అది ఎంత ముఖ్యమైన స్టోరీ. చెప్పిన పని చేయడం రాదూనీకు. నువ్వు చేయకపోతే పక్కనవాళ్లకు చెప్పాలనికూడా తెలీదా. అసలు ఏం చేస్తున్నావ్ నువ్వు.”

“సర్… నేను..” 

“గెట్ లాస్ట్”  కయ్ మని అరిచాడు ఎడిటర్. లాస్య ఏం చెబుతుందో వినాలన్న ధ్యాసకూడా లేదు.

అప్పటికే మానసికంగా చితికిపోయి మొత్తం పని చేసుకుపోతున్న లాస్యకు ఎడిటర్ మాటలు తూటాల్లా తగిలాయి. కళ్లల్లో జలపాతాలు ఆపినా ఆగేప్రసక్తే లేదంటున్నాయి.

***

“లాస్యా నాకు పని వత్తిడి పెరుగుతోంది. నువ్వు ఏడు పేజీలు చేస్తున్నావు కదా. మరో రెండు తీసుకోగలవా.” లాస్య అంగీకారం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేనేలేదు రత్నకి. వయసులో చిన్నది, తనకింద పనిచేసే అమ్మాయిని అభ్యర్థనగా అడగటం ఆవిడ మంచితనం. 

లాస్య ఆ మంచితనాన్ని ఎడాపెడా వాడేసుకుంటుంది అప్పుడప్పుడూ.

“బాబోయ్ నాకు కుదరదండీ… ఎప్పటిలానే ఏడు పేజీలు ఇస్తాను. అంతకన్నా ఎక్కువ ఇవ్వడం నా వల్లకాదు.” విసురుగా అక్కడినుంచి వెళ్లిపోయింది లాస్య

మళ్లీ స్క్రీన్ పైకి దృష్టిమరల్చింది రత్న.

“మీరెందుకడిగారు ఆ అమ్మాయిని. ఇన్ని చేయాల్సిందే అని చెప్పాల్సింది. సరిపోయేది. మీరు స్వేచ్ఛ ఇచ్చే కొద్ది ఆవిడ నెత్తినెక్కేస్తుంది. బాగా రాస్తుందని పొగరు.” అంది పక్క డెస్కు రాణి. 

“చిన్నపిల్ల కదా. మెల్లగా అర్థం అవుతుంది. పిల్లలు వ్యక్తులుగా ఎదగడానికి స్వేచ్ఛ ఊపిరిలాంటిది. మంచితనాన్ని వారికి పరిచయం చేస్తేనే అది సాధ్యమవుతుంది కదా.” స్థిరంగా అంది రత్న.

****

తీక్షణంగా చూస్తున్న ఎడిటర్ మొహం కళ్లముందే కనిపిస్తోంది లాస్యకు. ఇంత చాకిరీ చేస్తున్నా… పైనుంచి చీవాట్లు. మెల్లగా వచ్చి సిస్టం ముందు కూర్చుంది. పక్కనే ఎవరో కూర్చున్నట్టుగా అనిపించి అటు చూసింది. శ్రవణ్. అతని కళ్లలో కనీకనిపించని నవ్వు.

అలాగే లాస్యవైపు చూసాడు.

“నేను కావాలని చేయలేదు సర్. అసలు నాకు తెలీదు. చాలారోజులుగా నేనే మార్నింగు షిప్టును హేండిల్ చేస్తున్నాను” అతనికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ అతనుకూడా తనపై కక్ష సాధించే బృందంతో చేతులు కలిపాడనీ తెలీదు లాస్యకు. ఇరవై ఒక్క వసంతాలు నిండిన లాస్యకు ఇంకా లోకజ్ఞానం రాలేదు మరి. 

‘గెట్ లాస్ట్’ అన్న మాటే పదేపదే గుర్తొస్తోంది లాస్యకు. ఏదో బాధ మనసంతా నిండి పోయింది. హాస్టల్లో ఆ రాత్రి సరిగా నిద్రపోలేకపోయింది లాస్య. ఉదయమే అమ్మనుంచి ఫోన్.

కడుపులో ఉన్న బాధంతా చెప్పేసింది.

“ఇక చాలు లాస్యా. నువ్వేమీ సంపాదించి ఉద్దరించాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లవు. ఆ రాక్షసుల మధ్య ఎలా నెగ్గుకురాగలవు. వదిలేసి వచ్చెయ్. మంచి సంబంధం వచ్చింది. వదులుకోవాల్సిన కారణం ఒక్కటికూడా లేదు.”

రిజైన్ చేయటానిక మనసొప్పక సెలవు పెట్టి వచ్చేసింది లాస్య. తనకి చాలా ఇష్టమైన ఫీల్డది.

నెలలోపే లాస్యకు పెళ్లయింది. ఉద్యోగం చేయడం భర్తకు ఇష్టం లేదు. కొలీగ్స్ చేసిన నిర్వాకంతో లాస్యకు ఉద్యోగం చేయాలన్న ఆసక్తే చచ్చిపోయింది.

పదిహేనేళ్ల తర్వాత…

“అమ్మా… ఆ ఐశుకున్నంత పొగరు ఎవ్వరికీ ఉండదమ్మా. ఊరికేనే కొట్లాటకు దిగుతది. మీరుగావట్టి చేపిచ్చుకుంటారు. లేకపోతే ఏడ పనిదొరకదు ఆ పోరికి” ఆవేశంగా అంది సంధ్య

“ఐశు చిన్నది సంధ్యా. పంతొమ్మిదేళ్లుంటాయంతే. ఏం తెలుస్తుందా వయసులో. మాటలు కటువు. మంచిపిల్ల. లోకంపోకడ తెలీదు. మెల్లగా నేర్చుకుంటుందిలే” శాంతంగా అంది లాస్య.

“అమ్మా అసొంటి పిల్లను నెత్తికెత్తుకుంటుండ్రు. ఆమె వల్ల మీకు చెడ్డపేరొస్తందమ్మా.” ఎలా అయినా ఐశును పనినుంచి తప్పించాలన్న తాపత్రయం సంధ్యది.

నవ్వింది లాస్య. 

ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉన్నవాడిని మార్చాలంటే ఓర్పు చాలా అవసరం.!

“మీరు పెట్టుకున్నారుగానీ మరొకరైతే ఈ పాటికి పనిలోంచి ఎల్లగొట్టేవారు. ఎన్ని కప్పులు, గ్లాసులు పగలగొట్టింది. నిన్న బాబు కారును స్పీడుగ తోసి నిలువుటద్దం కూడా పగలగొట్టింది. భయంపెట్టండమ్మా” రెట్టించింది.

ఎందుకో ఐశును చూస్తే లాస్యకు తను ఇరవైయ్యేళ్ల వయసే గుర్తొస్తుంది. ఆలోచనలేకపోవడం. మాటతూలడం. మంచీచెడులను గుర్తించలేకపోవడం. మంచితనాన్ని అలుసుగా తీసుకోవడం… చెడును మౌనంగా భరించడం… యవ్వనంలోకి అడుగుపెట్టిన పోని పసితనం ఛాయలు. కళ్లముందు తిరుగాడతాయి! 

“గాజుసామాన్లు! వాటిపై ఉన్న మమకారం మనసులపై ఉండదెందుకో. అవి పగిలితే కొత్తవికొనుక్కోవచ్చు. మనసుకూడా అద్దంలాంటిదే కదా. అది పగిలితే అతుక్కుంటుందా. పోనీ అలా మనసును ముక్కలుచేసిన వారిని మర్చిపోగలమా? మంచితనాన్ని పెంచడానికి సహనం, ఓర్పు, దయ అవసరమౌతాయి. మంచితనం అంటువ్యాధి లాంటిది సంధ్యా. మన్లో ఉంటే మెల్లగా మిగిలిన వాళ్లకు వ్యాపిస్తుంది. నువ్వూనేనూ మనందరమూ ఒకప్పుడు అలాంటి సందిగ్థ వయసునుంచి బయటపడ్డవాళ్లమే కదా. ఆ వయసులో వారికి కావాల్సింది వాళ్లను శిక్షించో, భయపెట్టో బలవంతంగా మార్చగలగడం కాదు. మంచీచెడు విచక్షణ వారికి కలిగేలా చేయడం.” స్థిరంగా చెప్తున్న యజమానురాలినే ఆశ్చర్యంగా చూస్తోంది సంధ్య. 

లాస్య చూపు సంధ్యపైనుంచి కార్పెంటర్ అమర్చుతున్న నిలువుటద్దం పై పడింది. అప్రయత్నంగా అద్దంలోని తనపై నిలిచిపోయింది. తన ప్రతిబింబం పూర్తిగా మారిపోయి రత్నలా కనిపించిందామెకు. లాస్య కళ్లలో పశ్చాత్తాపం, ఆరాధనతో కూడిన సన్నటినీటిపొర. చిన్నవయసులో తనలోని మంచితనాన్ని స్పృశించిన ఆవిడ పెద్దమనసుకు మనసులోనే నమస్కరించింది లాస్య. ఆవిడ అలా లేకపోతే తనిలా ఉండేది కాదేమో!.

-శివలీల కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink

Comments are closed.