జనపదం జానపదం- 8 – జానపదులో చేట్లపై ఉన్న భావనలు – వైద్య విధానం- భోజన్న తాటికాయల


జానపదులు మొక్కలు, చెట్లను పవిత్ర భావంతో చూస్తారు. కాబట్టే చేట్లను దేవత రూపాలుగా కొలువడం మనకు కనిపిస్తుంది. ఉదా : సమ్మక్క, సారక్క, ఎల్లమ్మ, పోచమ్మ మొదలైన రూపాలుగా కొలుస్తారు. ప్రముఖ ఆశు కవి అందేశ్రీ రాసిన ఈ పాటను ‘‘కొమ్మ చెక్కతే బొమ్మరా కొలిచి మొక్కుతే అమ్మరా’’ స్ఫరించుకోవాల్సిందే. చెట్లను దేవుళ్ళుగా తలచి ఎదురించి మొక్కులు తీర్చుకుంటారు. అనగా దేవాలయం ఉన్నచోటుకు వెళ్ళకుండా ఈ విధంగా జానపదులు తమ భక్తిని చాటుకుంటారు. మరియు చెట్లకు వివాహం జరిపించి తమకుగల పర్యవరణ ప్రేమను వెల్లడిస్తారు.

ప్రాచీనకాలంలో అనేక దేవత విగ్రహాలు కర్రతో చేసినవే కనిపిస్తాయి. అంతేకాకుండా గుత్తికోయలలో బెండపండు పండుగ, గొంగూర పండగలను కల్లు, కోడి మాంసంతో ఆనందంగా జరుపుకుంటారు.(వట్టం లక్ష్మి, 42 సం,,రాలు, మొట్టుగూడెం, పస్ర) అనగా వీరికి కూరగాయల చెట్లుసైతం దేవతరూపాలతో సమానమని చెప్పవచ్చు. గ్రామాలలో, తండాలలో, గూడాలలో ఇంటి ముందు దిష్టిపోవడానికి దిష్టి గుమ్మడికాలను, జమ్మడి చెట్టును కడతారు. ఈ ఆచారం అతి ప్రాచీనకాలం నుండి ప్రజలలో కొనసాగుతుంది.

వీరి వైద్యంలో నేరుగా మూళికలను వాడుకోవడమే కాకుండా మొక్కలను అందుబాటులో పెట్టుకుని కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. మానవ సృష్టిలో వైద్యం ఒక అద్భుతాంశమే. పుట్టిన ప్రతి జీవి తప్పక మరణిస్తుంది. ఈ భూమిపై ఏ జీవి ఎంతకాలం జీవించి ఉంటుందో అనేది సమాధానం లేని ప్రశ్న. వయస్సు మళ్ళి మరణించే జీవులకంటే రకరకాల వ్యాధుల బారినపడి మరణించేవే ఎక్కువ అని చెప్పాలి. జానపదులు ఏ వ్యాధులు వచ్చినా త్వరగా స్పందించే స్పృహ కలిగి ఉంటారు. మానవ పరిణామక్రమంలో మనిషి చెట్ల రసాలతో వ్యాధులను ఎదుర్కోనే దశకు చేరుకున్నాడు. రానురాను వ్యాధి రాకమునుపే వైద్యం చేసుకునే విపరీత దశలో కొనసాగుతున్నాడు. కాని జానపదులను గమనిస్తే వ్యాధి సంక్రమించిన తరువాత దాని లక్షణాలను పరీక్షించి వైద్యం చేయడం కనిపిస్తుంది. ఈ వైద్య విధానం ఎక్కువ కాలాన్ని తీసుకున్ననూ రోగికి మరేవిధంగా హాని చేయదు. నేటి వైద్య విధనంలో ఎక్కువ మోతాదులో మందులను వాడడం మనకు కనిపిస్తుంది.

తేలు కరిస్తే చింత గింజ రసం, కుక్క కరిస్తే కారం పసుపు, కడుపు నొప్పికి ఉత్తరేని ఆకు, పిప్పళ్ళుకు పింపేంటాకు, జిల్లాడ వేరు పిప్పి, వేడి చేస్తే తుంగ గడ్డ, రాళ్ళకు పిండి కూర, దమ్ముకు రెడ్డివారి నాన్ పాలచెట్టు మరియు ఏడు మిరియాలు, మునిగె చెట్టు బెరడు, రాసపుండుకు, దురద, తామరకు తుత్తుర్ బెండ, మందు తగిలితే పత్తిలో ఒక రకం చెట్టు రసాన్ని వాడతారు.

ఉత్తరేణి చెట్టును ఆదివారం తాంత్రిక పూజలకు వాడతారు. నడిచే చెట్లను చూశామని కొందరు జానపదులు నేటికి చెప్పుతుంటారు. వైద్య మూలికలను వెతుకుతూ వెళ్ళినవారు ఉరివేసుకొని చనిపోయరని, చెట్ల రసంతో రాళ్ళు సైతం పోట్లాడుకుంటాయని రకరకాలుగా చెప్పుకోవడం కనిపిస్తుంది.

 

– భోజన్న తాటికాయల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కాలమ్స్Permalink

Comments are closed.