హేమ వల్లరి(కవిత )- ఎండ్లూరి సుధాకర్

ఈ సృష్టిలో
ఎంతమంది భార్యలు పోలేదు
మరెంతమంది భర్తలు
కాలం చెయ్యలేదు
ముత్తాటి పండ్లు తిన్న
ముసలి దంపతులు కూడా
ఏడుకట్ల సవారీ ఎక్కాల్సిందే
ఏడేడు లోకాలకు ఎల్లిపోవాల్సిందే
చితిమీద దేహం
చింత నిప్పుల కర్రల మీద బూడిదవుతుంది
చింత మాత్రం
జీవితాంతం వెంటాడుతుందని
మా కాటి కాపరి తాత
కథలు కథలుగా చెప్పే వాడు
వయసులో పిల్ల వెనక పడ్డట్టు
ఏదో ఒక రోజు
మృత్యువు వెనకాల పడకతప్పదు
వెదురుబద్ద వేణువవుతుంది
వెంటాడే ప్రాణమవుతుంది
ఆ వృద్ధ దంపతులు
ఒకరిని విడిచి
మరొకరు వుండలేక
ప్రాయోపవేశం చేశారు
పార్ధివ దేహాలకు
పరమార్థం కల్పించుకున్నారు
ఈ దాంపత్య ధర్మoలో
పండుటాకుల్లా రాలిపోవాలని
పక్షుల్లా నేలకు కూలిపోవాలని
అమాయకులైన
ఆలు మగలు అనుకుంటారు
ఏ చుక్క ఎప్పుడు అదృశ్యమవుతుందో
ఏ ఆకాశం చెప్పదు
ఏ చిలుకా నోరు విప్పదు

వల్లరి:తీగ-లత
(దివంగత సహచరి హేమలత ఆలోచనల్లో అల్లుకున్న కవిత)

– ఎండ్లూరి సుధాకర్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

8 Responses to హేమ వల్లరి(కవిత )- ఎండ్లూరి సుధాకర్