ఆనంద వర్ణాలు (కవిత )-వెగ్గలం ఉషఃశ్రీ

నీలం రంగుపై ఆకాశానిదే ఆధిపత్యం
సంద్రానికీ కొంచెం పంచినట్లుంది!

హరిత వర్ణముపై ప్రకృతిదే పై చేయి
ఆకులన్నింటా జీవం నింపేస్తూ…!

పండుటాకులు కొన్ని
కోమల కుసుమాంగనలు కొన్ని
తమ తనువంతా పసుపు రంగునద్దేసుకున్నాయి!

ఒక్కొక్క వస్తువూ…
ఒక్కొక్క జీవీ….
తమకంటూ ఓ రంగును సొంతం చేసుకుని
ఆ రంగంటే తామని, తామంటే ఆ రంగేనని
శాశ్వత ముద్రను వేసేసుకుని దర్పమొలుకుతుంటే…

వాన వెలయగానే
అప్పుడప్పుడూ గగన తలాన విచ్చుకునే సింగిడి మాత్రం
నన్ను చూడు… నాలోని వన్నెలు
చూడమనంటూ కవ్విస్తుంది!

సింగిడి కంటే సింగారంగా
ప్రతి ఎదలోనూ విరిసే ఆనందం మాత్రం
తన వర్ణమిదేనని ఇదమిత్థంగా తేల్చేయకపోయినా…
అన్ని రంగులనూ తనలో మిళితం చేసేసుకుని
తెల్లని నవ్వులై…
సెలయేటి గలగలలై
జగమంతా విస్తరిస్తుంది!

వెగ్గలం ఉషఃశ్రీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments