లెండి కదలండి*(కవిత )-వెంకటేశ్వరరావు కట్టూరి

 

 

 

 

రోషం లేని దళితులరా
చావరెందుకురా!
ఇత్తడి చెంబుతో మొదలైన మారణకాండ
నేటికీ రగులుతూనే ఉంది
కోటేశ్ ను గొడ్డును కొట్టినట్టు
కొట్టి చంపేసినా
అడవిదున్నను వేటాడినట్లు
కటిక చీకట్లో కారంచేడులో
కుత్తుకలు తెగ్గోసినా
రక్తపుటేరులు పారించినా
కళ్ళుతెరవరాయే
చుండూరులో నిశిరాత్రిలో
అడవిలో జొరబడిన వేటగాళ్లలా
వాడ మీద మంది పడి
జంతువులను వెంటాడి వెంటాడి
బరిసెలతో గుండెల్ని చీల్చినట్లు
మన సోదరులను
భూమిలో సజీవంగా పాతిపెట్టారే
అయినా మనకు సిగ్గురాకపోయే
అడ్డొచ్చిన ఆడబిడ్డల జుట్లు పట్టుకు
ఈడ్చి ఈడ్చి కొట్టినా
బురదలో తొక్కినా
కుక్కినపేనులా ఉండిపోయారాయే
ఐనా న్యాయం జరగపోయే
బూడిద పొయ్యి లో పడుకున్న
కుక్క దులపరించుకుపోయినట్లు
మరిచిపోయారే
లక్ష్మీపేటలో ఐదుగుర్ని పొట్టనపెట్టుకున్నా
గరగపర్రులో వెలివేసి గేలిచేసినా
చలనం లేకపోయే
రెండు ఆమ్ర ఫలాలు ఏరి తెచ్చాడని
ఉరివేసి చంపేసినా
మనలో రోషంలేదాయే
అక్రమాలను ప్రశ్నిస్తే అధికార మదంతో
ఠాణా లోనే గుండు గీయించినా
గొర్రెల్లా మౌనంగా ఉన్నారేరా
మధమెక్కిన ఏనుగుల్లా
మన ఆడబిడ్డను చెరిచి
నడివీధిలో వదిలేసినా
అడిగే దిక్కే లేకపోయే
నేడు పనికెళ్లలేదని ఇంటికి పిలిచి
శిరోమండనం చేపించినా
గొర్రెల్లా తలవొంచుకు పోతారేరా
హైనాల గుంపు చుట్టుముట్టి
కండలూడబెరికినా
ప్రాణాలను కాపాడుకోవడానికి
చిన్నజీవి చేసే ప్రయత్నాలు చూడండిరా
రండి కదలండి
పౌరుషం అరువైనా తెచ్చుకోండి
పోరాటపటిమని చూపండి
పామును చుట్టు ముట్టిన
చీమల్ని చూసైనా నేర్చుకోండి
మనపైన జరిగే దాడుల్ని
ఎదుర్కోండి
ఖద్దరునేసిన దళితజనోద్ధరాకుల్లారా నాయకుల్లారా
మీకెందుకు పదవులు
స్వజనాంగాన్ని రక్షించుకోలేనప్పుడు
భారతదేశ మూలనివాసుల్లారా
ఆదిజాంబవంతుని పుత్రుల్లారా
కన్నమదాసు వారసుల్లారా
లెండి కదలండి న్యాయంకోసం
అన్యాయాన్ని ఎదురించడంకోసం

-వెంకటేశ్వరరావు కట్టూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Kanakadurga
Kanakadurga
2 months ago

కట్టూరి వెంకటేశ్వరరావు గారు,

మీరు రాసిన కవిత ’లెండి కదలండి,’ వాస్తవాన్ని కళ్ళకి కట్టినట్టుగానూ, స్ఫూర్తిదాయకంగానూ వుంది. రోజు దళితుల శిరోముండనాల గురించి వార్తల్లో వింటుంటే చాలా బాధగాను, ఈ అన్యాయాన్ని ఆపలేని సో కాల్డ్ ప్రజా నాయకులపై ఆవేశం కల్గుతుంది. ఈ కవితలో దళితులపై జరుగుతున్న అన్యాయాల పై మీ ఆవేదన,
అవి ఆగాలంటే ప్రజల్లో చైతన్యం వచ్చి పోరాటం చేయడానికి ’లెండి కదలండి,’ అని మీరిచ్చిన పిలుపు స్ఫూర్తినిచ్చేలా వుంది.

కనకదుర్గ.