*నా శరీరం*(కవిత )-శీను జి

నాకిప్పుడు అర్ధమైంది నా శరీరం
నడవడానికి కాళ్లు ఉంటే సరిపోదని
కళ్ళు ఉండాలని
కదలడానికి చూపు వుంటే సరిపోదు
ముందుచూపు ఉండాలని

నిలబడడానికి నేల కంటే ఎక్కువ
మాట సహకరిస్తుందని
నాలుక కంటే
చేతలు ఎక్కువ విషయాలు చెబుతాయని
చూపించే వేళ్ళ కంటే,
కలిసే చేతులు ఎక్కువ అవసరమని

కడుపుకంటే
మెదడుకి ఎక్కువ తిండి పెట్టాలని
భుజం బలం
స్నేహితుడు చెయ్యి వేస్తే రెట్టింపు అవుతుందని
ఆలోచనలు
కాంతి కంటే వేగంగా ప్రయనిస్తాయని
పెద్ద బ్రతుకు
చిన్న ఆశ అనే కాళ్ళ మీద నిలబడుతుందని

ప్రేయసి ముద్దుల్లో
వెయ్యి వోల్టుల విద్యుత్తు ఉంటుందని
మనస్పర్థలు
గోడలకంటే గట్టివని
మెదడు ఆకలికి
అన్నం పెట్టువాళ్ళు తక్కువుంటారని
కసి
కార్చిచ్చుకంటే పెద్ద మంటలు పెడుతుందని

మనకు ఇష్టమైన పనులు
చెయ్యడం కొన్నిసార్లు చాలా కష్టమని
జీవితంలో
మనకు అతిపెద్ద శరీరభాగం కాలమని
మన ఆలోచనల బరువు
శరీరానికంటే చాలా ఎక్కువ ఉంటుందని
ఎంత వ్రాసిన అది ఆగదని ఆగదని…

-శీను జి
ఆస్ట్రేలియా.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments