కోష్టా( పట్టు కాయ ) (కథ )- రమేష్ కార్తిక్ నాయక్


                                                               1.

నాలుగో అంతస్తులోని తన గది కిటికీ నుండి కిందికి చూడడానికి ప్రయత్నించాడు సక్రు, వీలుకాలేదు.కిటికీ ఊచలకు తల ఆనించి ఆకాశంలో పడవల్లా కదులుతున్న మేఘాల్ని చూసి వర్షం పడుతుందేమో అనుకున్నాడు.

బయటకు వచ్చి వరండాలో నిలబడి చల్లగా వీస్తున్న గాలిని కొంచెం కొంచెంగా పీలుస్తూ వాతావరణంలో, ఆకాశంలో మార్పుల్ని గమనించాడు.

తను నిల్చున్న చోటు నుండి కిందికి చూసాడు, వీధి కుక్కోకటి ఎటు వెళ్ళాలో తెలీక తికమక పడుతుంది,పాల కోసం దాని వెనకే పరుగులు తీస్తున్న కుక్క పిల్లలు.

తను తప్పించి వాతావరణాన్ని ఎవరు పట్టించుకోవట్లేదని అతనికి అర్థమైంది.

గాలికి ఊగిపోతున్న తన జుట్టును చేతి వేళ్ళతో దువ్వుతూ, కళ్లలో పడిన దుమ్మును నులుముకుంటూ ఆకాశంలోకి చూశాడు,ఆకాశం నల్లని రంగుల్ని చల్లుతున్నట్లూ, నల్లని పక్షులు తమ రెక్కలు విప్పుకుని తోచిన దిక్కులకు ఎగిరిపోతున్నాయి.అచ్చం ఓ సుడి గాలిలా ఉంది చూడడానికి.

తనకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ వాళ్ళందరూ ఇంట్లో బిజీగా ఉన్నారు.

బాల్కనీ గడో మీద ఆరేసిన తన డ్రాయేర్, బనీను కోసం చూసాడు కింద పడ్డాయేమో అని,ఎడమ వేపు కిందికి దిగే మెట్ల పై చూసాడు ఎం కనిపించలేదు,కుడి వైపు మూలలో గాలికి కొట్టుకుపోయి తట్టుకున్నాయి కాబోలు, కనిపించాయి,వీస్తున్న గాలికి కొట్టుకుపోతాను అనుకుని అటుగా నెమ్మదిగా నడిచి వెళ్లి,వాటిని చేతిలోకి తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు.

తలుపు దగ్గరికి వేసి చేతిలోని బనీను డ్రాయేర్ని ఒళ్ళో పెట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు,కిటికి అద్దాలు మూయకపోవడంతో బయటి గాలి,మసగ్గా ఉన్న వెలుతురు గదిలోకి వస్తా ఉన్నాయి. ఆ వెల్తురులో తన చిల్లులు పడ్డ డ్రాయేర్ను గమనించాడు పైకి లేపి డ్రాయేర్ రంద్రంలోంచి ఎదురుగా చూసాడు, బ్లాక్ అండ్ వైట్ రంగులు కనిపిస్తున్నాయి.

పవర్ కట్ అవుతుందేమో అని మొదట సెల్లులో చార్జింగ్ పెట్టేసుకొని, లైట్ స్విచ్ వత్తాడు,బల్బు లోపల ఫిలమెంట్ కాలిపోయింది. ఆ కాలిన చప్పుడు అతని తండాలో ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డ పిడుగుని గుర్తుకు చేసింది.

గదిలో చుట్టూ చూసాడు, చీకటి, ఒంటరితనం ప్రశాంతంగా నిల్చున్నట్లు అనిపించాయి. అయినా ఇప్పుడు బల్బుతో పనేం ఉంది ?,రెండు మూడు ఎర్ర టమాటాలు తిని పడుకొక అవసరమా ? అనుకుంటూనే,బల్బు కొనడానికి అల్మారా లోంచి తన పుర్సు తీశాడు,నెల ఆకరు కావడంతో డబ్బులు ఏమి మిగల్లేవు, పర్సులో ట్రైన్ టికెట్, తన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. తను ఎప్పుడు ఇష్టంగా చదుకునే సాహిత్య పుస్తకాల్ని దులిపాడు , ఎక్కడ ఏమి దొరకలేదు. అల్మరాల్లో చూసాడు చిల్లర అక్కడ రూపాయి ఇక్కడ రూపాయి దొరికాయి మొత్తం లెక్కపెట్టాడు , ఆరు రూపాయలు జమ అయ్యాయి, వాటిని తీసుకుని షాప్‌కు వెళ్ళాడు.

ఆ షాప్ చూడడానికి ఓ చిన్న గదిలా ఉంది. దాని ముందు రెండు కుక్కలు పడుకుని ఉన్నాయి. డిస్ప్లేలో ఉన్న డబ్బాలు నిండుగా ఉన్నాయి, బహుశా అప్పుడే వాటిని నింపి ఉంటాడు. ఓ డబ్బా మీద ఓ గ్లాసులో లోపల దీపం వెలుగుతోంది.

సక్రు కంటే ముందు వచ్చి నిల్చున్న వారిని పోనిచ్చినాక డిస్ప్లే దగ్గరికి నడిచి రెండు రూపాయిల మూడు క్యాండిల్లు కొనుక్కుని తిరిగి వస్తుండగా గాలి దుమ్ము పైకి లేచాయి, చినుకులు అక్కడొక్కటి ఇక్కడొక్కటి పడడం మొదలయ్యాయి. వడివడిగా అడుగులువేస్తూ మూడు మెట్లను ఒక్క అడుగుతో దాటుతూ నాలుగో అంతస్తూ చేరుకున్నాడు,బాల్కనీలో పక్క రూమ్ వాళ్ళ బట్టలు గాలికి కిందపడి ఉన్నాయి, చాలా సార్లు తలుపు కొట్టాడు,అటూ నుండి ఏ మాట లేదు,గాలి విస్తున్నా కొద్ది ఇంకా ఆ బట్టలు కుడి వైపు జరుగుతా ఉన్నాయి, విసుగెత్తి, చూసీచూడనట్లు గదిలోపలికి వెళ్లిపోయాడు.

                                                                     2.

వంట గదిలోకి వేల్లి ఆగ్గిపెట్టను తీసుకుని వచ్చి క్యాండిల్లను, అగ్గిపెట్టను పక్కనే పెట్టుకుని కూర్చున్నాడు. నొప్పిగా ఉన్న తన కాళ్ళను వత్తుకున్నాడు. వర్షం మొదలైంది. గది కిటికీ గట్టిగా వేసి ఉందో లేదో చూసుకున్నాడు, లేచి కిటికీని మళ్లీ తీసి వేసి, గది తలుపు పైన ఉన్న రంద్రంలోంచీ వస్తున్న చిన్న వెలుతురును చూసి,క్యాండిల్‌తో ఇప్పుడే పనిలేదు అనుకున్నాడు. సగం చీకటి నిండిన గదిలో అతని బాల్యం కాస్త గుర్తుకొచ్చి ఎండిన ఆకులను పడవలుగా చేసి వాటిలో పురుగులను వేసి ఆడుకున్న జ్ఞాపకాలు కళ్ళముందు కదిలాయి. అతడి కంటి అంచులు వర్షం నీళ్ళతో నిండిపోయినట్లూ అనిపించాయి.

గదినిండా నిశ్శబ్దం అవరించింది.ఓ మూలనున్న పుస్తకాలన్నీ నిశ్శబ్దంగా మూలుగుతున్నట్లూ అనిపించాయి సక్రుకి.

మనసంతా గందరగోళంగా ఉంది అమ్మ గురించి, ఆమె పొలంలో ఉందో, ఇంట్లో ఉందో తెలుసుకునేందుకు ఫోను చేయబోయి పిడుగురాళ్లకు భయపడి ఫోన్ చెయ్యడం మానుకున్నాడు. తోటలో ఉన్నప్పుడు వర్షం పడితే చెట్టుకింద నిల్చుని దూరంగ కనిపిస్తున్న దృశ్యాల్ని చూడడం గుర్తుచేసుకున్నాడు.

ఏడుపొచ్చేసిందది… ఏడ్చాడు వర్షంతో పాటు కాలపు దుఃఖాన్ని కరిగించుకోవడానికి, ఆ పిడుగులు తన తండ్రిని ఎలా కాల్చి చంపాయో గుర్తొచ్చింది, కాళ్ళు చేతుల్లో వణుకు మొదలైంది. కాలిన దేహపు వాసన అతని చుట్టూ నిండిపోయింది.

మనసులో ఎక్కడో పిట్టలా అరుస్తున్న ఆనందం విషాద గీతంగా మారిపోయింది,దిగులు, భయం , ముఖం నిండా వేడి. మెదడులోని ప్రశ్న

“ఎప్పుడు వర్షం ఆగిపోతుందో?”

చీకటిలో చీకటిగా కూర్చుండిపోయాడు సక్రూ. తను హైదరాబాదుకు వచ్చి రెండు సంవత్సరాలౌతుంది.

“ఏం సాధించాను ఎంత సాధించాను” అనుకుంటూ చెమ్మగిల్లిన కళ్ళతో తనకు ఎవరో స్టేజి మీద కప్పిన శాల్వాను చూశాడు. శాల్వామీద ఉన్న మెరుపులు వంకరటింకరగా కనిపించాయి, కళ్ళను తన మోకాలికి రుద్దుకుని మళ్లీ చూసాడు, స్టేజి ముందు ప్రేక్షకులు కొట్టిన చప్పట్లు ఆకాశంలో ఉరుముల్లా అనిపించాయి.ఆలోచనలో పడ్డాడు, చుట్టూ ఒక మాదిరిగా కదులుతున్న అలలు అతడిలో ఓ భావనను రేకెత్తించాయి.తన గదిని ఎవరో ఎత్తుకెళ్లి సముద్రంలో పడేసినట్లూ అనిపించింది అతనికి.

నల్లని అద్దాలున్న కిటికి వైపు చూస్తూ వర్షం ఆగాకా తెల్లని ఆకాశాన్ని చూసి అనందిచాలనుకున్నాడు. కానీ కాలిపోయిన తన తండ్రి దేహం తను చూస్తున్న వైపళ్ళ కనిపిస్తుంది.

ఏడ్పొస్తుంది…. ఏడుస్తున్నాడు. “అమ్మ కూడా నాన్నలాగే పిడుగుల వల్ల చనిపోతే…” ముసురుకున్న ఆలోచనల నుండి ఎలా బయిట పడాలో అర్ధం కావట్లేదు.

ఏడుస్తూ ఏడుస్తూ….. రెప్కి గురై మరణించిన తన సోదరి గుర్తుకొచ్చింది.

సారా తాగనికీ తండాకు వచ్చే పోలీస్‌కి చెప్తే పట్టించుకున్నదే లేదు పైగా సక్రు తల్లిదండ్రులే చంపి నాటకాలు ఆడుతున్నారని అన్న ఆ మాటలు సక్రు చెవుల్లో వినబడుతున్నాయి. ఈ లంబడోల్లు అంతా దొంగలు అబద్ధాలు ఆడడమే పని అంటూ తన తోటి ఆఫీసర్ తో అన్న మాటలు ఇంకా సక్రు మర్చిపోనే లేదు.

చెవి దగ్గర గుయ్ మంటున్న దోమని కొట్టి ముక్కు తుడ్చుకున్నాడు. ముందులా జోరేమి లేదు వానలో ఆగిపోయి ఉంటుందనుకున్నాడు .

                                                                              3.

తన పక్కనే ఉన్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని తెరిచి వాసన చూసాడు.ఊపిరి అందట్లేదన్నట్లు గట్టి గట్టిగా గాలి పీల్చాడు.

ధడ్ ధడ్…..

తలుపు మీద ఎవరో కొడుతున్న శబ్దం, ఆ శబ్దానికి ఒకేసారి ఉలిక్కిపడ్డాడు సక్రు , ఎవరై ఉంటారా అని ఆలోచించాడు క్షణంపాటు, పక్క రూం పిల్లలేమో అనుకుంటూ మెల్లిగా లేచి వెలుతురు కోసం కిటికి కొంచం తీసి బైటికి చూడకుండానే తలుపు తీశాడు.

తన గది ముందు నిల్చున్న ఆ వ్యక్తిని చూసి సక్రు నమ్మలేకపోయాడు , తను ఎప్పుడూ పుస్తకంలో చదివే ఒక వ్యక్తిని తను అలా ఎదురుగా చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు.

ఆ వ్యక్తికి ఓ అరవై ఏళ్ళు ఉంటాయి.పైనుండి కిందవరకు తీగలతో అల్లిన వస్త్రం వేసుకున్నాడు ,తల పైన ఎర్రగా ఉన్న వెంట్రుకలు గడ్డి పోచల్లా నిలబడ్డాయి,అవి లెక్కపెట్టడానికి వీలుగా ఉన్నాయి.అతడి రెక్కలు కింద ఆనుతూ ఉన్నాయి.రెక్కల నిండా అన్ని పక్షుల ఈకలు ఉన్నాయి. అతడి మెడ మీద ఎవరో చీలినట్లూ ఉంది. సక్రుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, ఎందుకు వచ్చాడో అర్ధం కాలేదు.లోపలికి రావచ్చా ? అన్నట్లూ సక్రు కళ్ళలోకి చూసాడు ఆ రెక్కల మనిషి.లోపలికి రమ్మంటూ పిలిచాడు. లోపలికి వెళ్ళగానే నిలబడిపోయి ఆ పుస్తకాల వైపు చూసాడు. పక్క గది వారు ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో వెంటనే కిటికీతో పాటు తలుపు వేసి ఓ క్యాండిల్ వెలిగించాడు.వచ్చిన వ్యక్తి క్యాండిల్ నీ చూస్తున్నాడు, క్యాండిల్ గుండా కారుతున్న ఒక్కొక్క చినుకుని లెక్క వేస్తున్నాడనుకున్నాడు సక్రు, కుర్చీలో కూర్చోబెట్టాడు ఆ వ్యక్తిని,ఏం మాట్లాడతాడో దేని గురించి మాట్లాడుతాడో అన్న ఆతృత సక్రు మనుసులో ఎక్కువైపోయింది. ఆ వ్యక్తి తనతో ఏం మాట్లాడ లేదు, సక్రు పక్కన ఉన్న పుస్తకాల్ని చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి అవతారాన్ని చూస్తూ సక్రు అలాగే ఉండిపోయాడు. క్యాండిల్ మంట అటూ ఇటూ కదులుతూ ఉంది, అంతలోనే సక్రు ఫోన్ మోగింది.

“సక్రు రేపు రాత్రి ఎనిమిది గంటలకు హైటెక్ సిటీ ఎన్ కన్వెన్షన్ లో కాట్రింగ్ ఉంది అన్ని కట్టింగ్స్ పోను 270 రూపాలు”
అంటూ అటునుండి ఫోనులో ఓ వ్యక్తి.

“సరే, సమీర్ నేను వస్తాను వేరే ఎవరికైనా చెప్పకు” అంటూ సక్రు ఫోన్ పెట్టేశాడు.

ఆ వ్యక్తి తనకు కావలసింది దొరికినట్లు సక్రు పక్కనే ఉన్న గాబ్రియల్ గార్షియ మార్క్వెజ్ కథల పుస్తకాన్ని చేతికందుకుని,పుస్తక ముఖచిత్రం మీద ఉన్న రెక్కల మనిషిని తడిమితడిమి చూసాడు.

సక్రు మిణుకు మిణుకు మంటున్న సెల్ లైట్‌తో అతడిని గమనిస్తూనే అనుమానంగా చూసాడు. అతడు పూర్తిగా తన కథనీ తను చదువుకోవడంలో మునిగిపోయాడు. మౌనంగా కూర్చున్నాడు సక్రు .

గదిలో సన్నగిల్లిన వెలుతుర్ని చూసి ఆ రెక్కల వ్యక్తి ఇంకో క్యాండిల్ వెలిగించు అన్నట్లు సైగ చేశాడు.సక్రు వెంటనే క్యాండిల్ వెలిగించాడు. ఈసారి అతగాడు తన చేతిలోని పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకుని క్యాండిల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు, కూర్చుని క్యాండిల్ మైనపు చినుకుల్ని లెక్కలు వేసుకుంటున్నాడు.

అర్ధ గంట అయింది అర్ధగంటలో మళ్లీ బయట వర్షం మొదలైంది. వర్షం చప్పుడు గమనిస్తూ ఇద్దరం ఒకరి గురించి ఒకరు మర్చిపోయారు, ఫోన్లో చూస్తే 7:00 అవుతుంది. వర్షం తగ్గింది, ఫోన్ టార్చ్ వెలిగించాడు సక్రు. ఆ వ్యక్తి ఈసారి కూర్చున్న చోటు నుండి కాస్త పక్కకి జరిగి కూర్చుని పుస్తకాల అట్టల పైన ఉన్న బొమ్మల్ని అదే పనిగా చూస్తున్నాడు.సక్రు అతని కళ్లనే గమనిస్తున్నాడు.

ఏం ఆలోచిస్తున్నాడో ?

అతడి మనసులో ఏముందో ?

అతడి ఊహలో ఏ దృశ్యం కదలాడుతుందో ?.

ఈ ప్రశ్నలన్నీ సక్రు మనసులో మెదులుతున్నాయి. పూర్వం ఓ రోజు అతగాడు మకాండో సముద్రతీరాన పెకోలా వాళ్ళ ఇంటిదగ్గర సముద్రపు నీటి బురదలో టపటపమంటూ రెక్కలతో కొట్టుకుంటున్న దృశ్యం సక్రు కళ్ళముందు కదిలింది. ఆ ఊహను తను ఆపకుంటే ఆ తీరం నుండి పీతలు తన గదిలోకి ఈ రెక్కల మనిషి వచ్చినట్లు వచ్చేస్తాయి అనుకున్నాడు. ఆలోచనలకు స్వస్తి చెప్పి తన గదిలోని కథపై దృష్టి సారించాడు.

వాతావరణం చల్లగా ఉండడంతో ఆకలి అనిపించలేదు సక్రుకి,
“Do you want to eat something” అని అడిగాడు, అతడికి ఆకలి వేయట్లేదు అన్నట్లు తలూపాడు, ఈరోజుకి గ్యాస్ మిగిలిందని నిట్టూర్చాడు సక్రు.

ఆ వ్యక్తి ఏదైనా మాట్లాడితే సక్రు మాట్లాడదామని ముచ్చట్లు పెడదామని తనకి తెలిసిన కథలు అడుగుదామని ఎంతో ఆతృతగా చూశాడు, కానీ అతడు ఎంతసేపటికి నోరు లేని జీవిలా కూర్చొని ఉండడం విసుగు తెప్పించింది సక్రుకి, కరెంట్ పోయింది, ప్లగ్ బాక్స్ లైట్ ఆరిపోయింది.

బయట వర్షం కురుస్తూనే ఉంది. ఇంకా అసలు ఆగే ప్రసక్తి లేదని అర్థమైంది, చూస్తూ చూస్తూ చాలా సమయం గడిచిపోయింది. రాత్రి పది అవుతుంది.

వచ్చిన వ్యక్తి ఎందుకు వచ్చాడో ?

ఏం చెప్పాలని వచ్చాడో ?

ఎందుకని మౌనంగా కూర్చున్నాడో ?

ఏమీ అర్థం కావట్లేదు. కూర్చున్న చోటే నిద్ర తన్నుకొస్తుంది కళ్ళు మండుతున్నాయి, సక్రుకి నిద్ర వస్తుంది, నువ్వు కూడా నిద్రపో అంటూ చేతులతో సైగ చేస్తూ అతనికి తన పక్కనే ఓ సాప వేసి సాప పై సక్రు ఒరిగాడు. ఆ వృద్దుడు అక్కడికి వచ్చి సాప పై కూర్చున్నాడు. సక్రు కళ్లు మూసుకుని నిద్రలోకి జారిపోయాను అనుకున్నాడు,కానీ అతని నిద్రమబ్బు కొంచం కొంచంగా మాయమైపోయింది. ఉక్కపోత, వర్షం వల్ల కరెంటు లేకపోవడంతో బయట అంతా చీకటి నిండిపోయింది, వాతావరణం చూస్తే సక్రుకు నిద్ర వచ్చే అవకాశం లేదు, బలవంతంగా ఓ వైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు, చెవుల దగ్గర దోమలు గుయి గుయి మంటూ శబ్దాలు చేస్తూ ఎగురుతున్నాయి.

బయట స్తంభం పైన మంట మెరిసినట్లుంది, సాప పై ఒరిగివున్న
సక్రు లేచి కూర్చున్నాడు, ఆకాశంలో ఇంకా ఉరుములు ఉరుముతునే ఉన్నాయి, స్పష్టంగా వినబడుతున్నాయి, పక్కన ఉండాల్సిన వ్యక్తి కనిపించలేదు,సక్రు తన రెండు చేతులతో సాపనీ వత్తి చూశాడు. సెల్ టార్చ్ లైట్ వేశాడు. గది నిండా వెలుగు, కుర్చీకి పక్కన ముత్యపు చిప్పలా గోడకానుకొని ఏదో ఉంది,దాని పై భాగం ఈకలతో ఉన్నాయి, వృద్దుడు తన రెక్కలు రెండింటిని మూసి లోపల ముడుచుకొని పడుకున్నాడని అర్థమైంది సక్రుకి.

సెల్ లైట్ ఆఫ్ చేసేముందు ఒక్కసారి లోపల ఏం వినపడుతుందా? అని చూశాడు

లోపలి నుంచి ఏ చప్పుడు లేదు.

బహుసా అతగాడికి గుండె లేదేమో

లేక అతగాడి రెక్కల వల్ల చప్పుడు బయటకు వినపడట్లేదేమో అనుకున్నాడు,ఆశ్చర్యపోయాడు, తనకు అలా ఉంటే బాగుండని ఆశపడ్డాడు, లైట్ ఆఫ్ చేసి నిద్రపోవడానికి కిందికి ఒరిగి కళ్లు మూసాడు, మళ్లీ ఏదో గుర్తొచ్చినట్లు లేచి కూర్చున్నాడు. ఉన్న ఒక్క క్యాండిల్ వెలిగించి అది కరిగిపోయేలోపు ఆ వ్యక్తి గురించి ఓ కథ రాయాలని నిశ్చయించుకుని , కథ మొదలెట్టాడు

                                                                                   4.

అతిధి  పెలయో ఇంటి నుండి విముక్తి పరుచుకున్నాక , మేఘాల గుండా విహరిస్తూ అడ్డు వచ్చిన మోఘాల్ని చీలుస్తూ ఏడాది పాటు రాత్రి పగలు విహరిస్తూనే ఉన్నాడు, చాలా వరకు ఆకాశంలో పక్షులు అవి ఎగరకుండా ఆ వృద్ధుడి పొడవాటి రెక్కల పై వాలి అనందపడేవి. తన శక్తి మేర కనిపించిన అడవులన్నింటిని సందర్శిస్తూ తన కోసం ఓ అడవిని వెతుక్కున్నాడు. ఆ అన్వేషణలో ఎన్నో ఆదివాసీ తెగల్ని కలిశాడు. అది బ్రెజిల్ అమెజాన్ అడవి , ఆకాశం నిండా విస్తరించిన కొమ్మలు, తల కిందులుగా వేలాడుతున్న గబ్బిలాలు.గాలి నిండా పచ్చివాసన,కొంత దూరంలో వినబడుతున్న తేనెటీగల శబ్దాలు,పెద్ద చెట్టు ,చెట్టు అడుగు భాగంలో రంధ్రం, చూడడానికి అదో గుహల ఉంది.అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు.

కొన్ని రోజులు ఆ ప్రదేశం పై నిఘా పెట్టీ చుట్టూ వాతావరణాన్ని గమనించాడు. అదే తనకు అనువైన ప్రదేశమనుకుని ఆ చెట్టు రంధ్రంలో జీవించడం మొదలెట్టాడు.

చాలా ఏళ్ళు గడిచిపోయాయి, ఆ చెట్టు చుట్టూ ఎన్నో మొక్కలు పెరిగి ఆ రంద్రానికి అడ్డుగా నిలబడ్డాయి.

ఓ రోజు ఆదివాసీ పిల్లలు అడవి పంది పిల్లల్ని వేటాడుతూ వేటాడుతూ ఆ వ్యక్తి ఉన్న చెట్టు దాకా చేరుకున్నారు.పంది పిల్ల ఎటు పోయిందో తెలీక తలా ఓ చోట వెతుకుదామని వెతకడం ఆరంభించారు.

చెట్టుకు దగ్గరలో బయట కుప్పలు కుప్పలుగా రాలి ఉన్న ఈకల్ని చూసి ఎవరికి వారు వారికి నచ్చిన, మెచ్చిన రంగుల ఈకల్ని ఎరుకున్నారు, ఓ పిల్లాడు గుబురుగా పెరిగిన పాకురు వంటి గడ్డికి కింద ఏదో కదిలినట్లు అనిపించి ,దానిని జరిపి చూశాడు పొడుగ్గా ఉన్న రెక్కలు .ఒకరి తర్వాత ఒకరు అందరూ ఎగబడి చూశారు.

“దయ్యం దయ్యం,రెక్కల దయ్యం” అంటూ వారి పెద్ద వారిదగ్గరికి పరిగెత్తారు. పిల్లలతో పాటూ పెద్దవాళ్ళు కట్టెల్ని, ఇటల్ని తీసుకుని అక్కడికి చేరుకున్నారు.

పిల్లల అల్లరికి ఆ వ్యక్తి మేలుకుని కూర్చున్నాడు.
వచ్చిన వారంతా ఆ వ్యక్తికి చుట్టూ నిలబడ్డారు, తను వారిని చూస్తూ కూర్చున్నాడు. మందలోంచి ఓ పెద్ద వయస్కుడు ముందుకొచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి చూసాడు , రెక్కల వృద్ధుడి చుట్టూ రెండుసార్లు తిరిగి గమనించి, ఓ విషయం తన తెగ ప్రజలకు చెప్పడానికి సిద్దమయ్యాడు.

అందరూ శ్రద్ధగా వినండి.ఇతడు మనకు బాగా తెలిసిన వ్యక్తి ఇకారస్ ( ప్రాచీన గ్రీక్ పురాణగాథల్లోని ఓ పాత్ర – ఇకారస్ తండ్రి డేడలుస్ మంచి శిల్పి తన కొడుకుకి మైనం తో రెండు రెక్కలు చేసిస్తాడు) మన కోసం ఇక్కడికి తన తండ్రిచే పంపబడ్డాడు . ఇతడు మన దేవుడు మరియు అతిథి కూడా, అతడిని గౌరవించుకోవాలని అని ప్రకటించాడు.

అందరూ నేల పై మోకరిల్లి అతడికి నమస్కారాలు తెలిపారు. “అందరూ గుడానికి వెళ్ళండి,నేను ఇయనను తీసుకొస్తాను” అని ఆ తెగలోని పెద్ద వ్యక్తి అనగానే ఎవరి గుడిసెలకు వారు వెళ్లిపోయారు.

తెగ పెద్ద అతడిని లేపి నిల్చోపెట్టాడు.రెక్కల మనిషి అలాగే నిలబడిపోయాడు,అతడి రెక్కలకు గుబురు గుబురుగా పెరిగి ఊడి వేలాడుతున్న ఈకల్ని దులిపి తమ ప్రాంతీయ భాషలోనే రండి అంటూ ఆహ్వానించాడు.

తెగ పెద్ద గుడిసెలో అతడిని ఉండవలసినదిగా కోరి తినడానికి ఆహారాన్ని అతడి ముందు పెట్టారు, అదంతా చూస్తుంటే అతనికి చిత్రంగా అనిపిస్తుంది, ఇదంతా ఓ పన్నాగం అనుకున్నాడు.సరే ఏదైతే అదైంది అంటూ తినడం మొదలెట్టాడు, పిల్లలందరూ ప్రవేశ ద్వారాల దగ్గర నిల్చుని చూస్తున్నారు.తినడం అయిపోగానే , తెగపెద్ద అతడిని పడుకొమ్మని చెప్పి బయిటికి వచ్చేశాడు.

       

సాయంత్రం ఆ ఆదివాసీల గూడెం అంతా పండగ వాతావరణాన్ని తలపించింది. కొందరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తాము ఉండే గుడిసెలకు పిలుచుకొచ్చారు. నేలకు తగులుతున్న తన రెక్కలతో ఎవరు ఎటు తీసుకెళ్తే అటూ పోతున్నాడు.

స్త్రీ,పురుషులు మరియు పిల్లలు అందరూ దేహాలకు రంగులు పూసుకుని నల్లని గీతలతో పచ్చబొట్లు గీసుకుని,తల చుట్టూ ఓ పట్టి చుట్టుకుని, ఈకల్ని దోపుకొని వేచి చూస్తున్నారు.

తెగ పెద్ద ఆ వ్యక్తిని , ఓ రాయి పై కూర్చోబెట్టి అతిధి మర్యాదలు చేసి సాంప్రదాయ రీతిలో ఆట పాట మొదలుపెట్టారు.అడవి నిండా ఆనందం పక్షులు,నక్కలు అన్ని అన్ని ఆ గొంతుకలకు ఉతం అయ్యాయి.

ఆ వ్యక్తికి ఇదంతా ఓ కలగానే అనిపిస్తుంది, ఆ ఆనందంలో రెండు రెక్కలని గట్టిగా ఊపి పైకి రింగులు రింగులుగా తిరిగి ఆకాశమంత చుట్టేయ్యాలని ఉంది.పిల్లలు అతడి వెనక నిలబడి రంగు రంగుల ఈకల్ని పీకుతున్నారు.అతడు పొందుతున్న ఆనందం ముందు ఆ నొప్పి అతడికెం అనిపించలేదు. కళ్లు తిరుగుతున్నాయి.చుట్టూ వెలుగుతున్న మంటలు అతడి పై ఏదో మాయ చేస్తున్నట్టు అనిపించింది.

తెగ పెద్ద అతడిని మంచం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు, ఆ వ్యక్తి తన రెండు రెక్కలని మంచం పై పరిచి దానిమీద పడుకున్నాడు. చికటైపోయింది. రెక్కల్లో నొప్పి మేలుకునే శక్తి లేకున్నా మేలుకుని కూర్చున్నాడు.చుట్టూ ఏర్పాటు చేసిన మంటలు అరాడానికి సిద్దంగా ఉన్నట్లు ఎర్రని బోగ్గుల నుండి పొగలు పైకి లేస్తున్నాయి.

ఏం అనిపించిందో ఏంటో. అక్కడ వారితో ఉండకూడదనుకొని ఎగిరిపోయాడు. చీకటి కరిగిపోతూ ఉంది కళ్లకు అంతా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈసారి ఆ అడవి అంచుకి చేరుకున్నాడు . చెట్ల కొమ్మలన్ని ఒకదాని పక్కన ఒకటి అంటుకుని ఉన్నాయి, అక్కడే చెట్టు పైనే తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నిద్రపోయాడు దశాబ్దాలు మెలుకొలేదు.అతడి చుట్టూ తీగలు తిరిగాయి, ఆ తీగల చుట్టూ సాలెపురుగుల ఇల్లు వెలిశాయి. అలా తను కాల నిర్బంధంలో వెళ్ళిపోయాడు.

ఓ రోజు ఆ వ్యక్తి ఉన్న చెట్టుకంత మంటలంటుకున్నాయి . తన చుట్టూ ఏర్పడిన ఆ నిర్భంద గూడు కాలిపోయింది.తప్పించుకోవడం కోసం కొమ్మ నుండి కొమ్మ దాటుతున్నాడు, మంటలంటుకున్నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎగరడానికి ప్రయత్నిస్తున్న పక్షుల్ని చూసి భయపడిపోయాడు,తృటిలో తప్పించుకునీ ఆకాశంలోకి ఎగిరాడు, అడివంతా అంటుకుంది, తన రెండు రెక్కల అంచులు కొంత కాలిపోయాయి, ఆ వాసన అతడి ముక్కుని పదేపదే తగులుతుంటే అది అతడికి కొంచం ఇబ్బంది కలిగింది , తన దారిలో కనిపించిన ఓ దీవి రాళ్ళలో ఒక దాని పై వాలి చుట్టూ కాలిపోయిన ఈకల్ని పీకేశాడు. అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు.అంతలోనే గాలి వాన రావడంతో నేను ఉంటున్న వీధిలోని ఓ బిల్డింగ్ పై వాలాడు, నేను పోగు చేసుకున్న పుస్తకాల్లో నెమలి ఈకల్ని దాచిపెట్టాను. ఆ ఈకల పిలుపు విని అతడు నా గది దాకా వచ్చి తలుపు కొట్టాడు.

క్యాండిల్. పూర్తిగా కరిగపోయింది.చిన్న వెలుతురు అటూ ఇటూ కదులుతూ ఉంది. ఉన్న ఆ దారాన్ని మండనిచ్చి పడుకున్నాడు
సక్రు. తను రాసిన ఆ కథను పక్కన పెట్టీ నిద్రపోయాడు.

                                                                        5.

ఆ వ్యక్తి సక్రు కంటే ముందే నిద్ర లేచి తల మాత్రం బయటకు తీసి కూర్చున్నాడు. దేహంమంతా లోపలే ఉంది. అ వెనకటి రోజుకి ఆ రోజుకి అతగాడి కళ్ళలో రంగు ఏదో మారినట్టు గమనించాడు సక్రు.

అతడితో ఏం మాట్లాడకుండానే వెళ్ళి తలుపు తీసి బయట చూసాడు వర్షం రాత్రే ఆగిపోయినట్టుంది.మళ్లీ తలుపు కొంచం దగ్గరికీ జరిపి, ఫోన్ చూసాడు, అప్పటికే టైం 6:30 అవుతుంది. సెల్ ఛార్జింగ్ పెట్టీ, సక్రు హడావిడిగా తయారయ్యాడు, సక్రు వచ్చే దాకా అ వ్యక్తి అలానే కూర్చుని ఉన్నాడు బొమ్మలా.

వంట కోసం సిలిండర్ బుడ్డిని వెలిగించడానికి అగ్గిపుల్ల వెలిగించాడు.సిలిండర్ పక్కనుండే మిసాల్ని కదిలిస్తూ నడుస్తున్న బొద్దింకను చూసి అగ్గిపెట్టని పక్కన పెట్టేసాడు.

సిలిండర్ ఉన్న కొంత దూరంలో పడిఉన్న ఉల్లిగడ్డల పైన మొలిచిన ఉల్లిపొరలు. ఆలుగడ్డల పైన పచ్చని మొలకలను చుస్తూ టమాటాలను పట్టి చూసాడు,రెండు టమాటాలు పాడైపోయాయి.వాటిని తీసి ఓ ప్లాస్టిక్ కవర్లో వేసి , ఆలుగడ్డల పైన మొలకలను వేరుచేస్తూ నిల్చున్నాడు.

సక్రుకి ఆకలేస్తుంది, కడుపులో గిలకలు వినబడుతున్నాయి,తను నిల్చున్న చోటుకు ఎదురుగా గోడమీద తిరుగుతున్న బొద్దింకల్ను చూస్తే వంట చేయాలనిపించట్లేదు.

ఆ రెక్కల వృద్దుడు తన రెక్కల్ని పళ్ళిపొట్టులా విప్పి నిలబడ్డాడు. “షాల్ వి గో అవుట్ ఇన్ ది స్కై” అన్నాడు ఆ వ్యక్తి సక్రు పనిలో ఉండి సరిగ్గా వినిపించుకోలేదు, వృద్దుడ్ని చూసి ఎంటి అన్నట్లు సైగ చేశాడు.
వృద్దుడు “షాల్ వి గో అవుట్ ఇన్ ది స్కై” అంటూ అస్పష్టంగా అన్నాడు.

సక్రు అది విని “యా సూర్” అన్నాడు.

తొందరగా వంట చేయడానికి వీలుగా ఏమున్నాయో చూసాడు సక్రు, మొలకలు ఒలిచిన అలుగడ్డలు కనిపించాయి, వాటిని ఉడకపెట్టి, ఇద్దరు రెండు రెండు తిని ప్రయాణం మొదలెట్టబోతూ ఉంటే,సక్రు ఇదే మంచి అవకాశమని, ఆ వృద్ధుడితో మా ఊరికి వెళ్దామని అడగ్గానే ఆ వ్యక్తి వెంటనే ఒప్పుకున్నాడు. సక్రు తల్లిదండ్రులు ఎప్పుడూ సక్రునీ ఒంటరిగా వాళ్ళ తండా వెనకాల ఉన్న అడివిని చూడడానికి, ఆ ప్రాంతాల్లో తిరగడానికి పంపించ లేదు, ఇలా తన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు, లోలోపల సంబరపడ్డాడు.

                                                                         ———

సక్రునీ తన రెండు చేతులతో గట్టిగ పట్టుకుని పైకి ఎగిరాడు ఆ వ్యక్తి ఆకాశంలోకి. మేఘాలు వారి తాకిడికి అదృశ్యమౌతుంటే,సక్రు పత్తి పంటను చూసాడు కానీ ఆ పత్తిని ఎప్పుడు ముట్టుకోలేదు ఆ బాధ తీరిపోయింది, ఆనందం , భయం రెండు అతనిలో, గుండె గట్టిగా కొట్టుకుంటుంది, గుండె కింద ఎవరో ఐసు గడ్డ పెట్టినట్టు అనిపిస్తుంది, దూసుకొస్తున్న గాలి అతడి కళ్లను దాడి చేస్తుంటే ఆనందంతో కన్నీళ్లు కంటి అంచుల నుండి ముఖం పై సరిహద్దుల్ని గిస్తున్నాయి.

లేలేత ఎండ ,అప్పుడే మబ్బు పడుతుంది,అప్పుడే ఎండ వస్తుంది.

ఎట్టకేలకి సక్రు వాళ్ల అడివి చేరుకున్నారు. పెద్ద పెద్ద రాళ్లు, చుట్టూ దట్టమైన పచ్చని చెట్లు, అక్కడక్కడ శూన్యాన్ని నింపుకున్న బీడు భూములు. ఇద్దరు ఓ రాయి పై కూర్చుని చుట్టూ తిరిగి చూసుకున్నారు, సక్రు దూరంగా వేలుతో అదిగో అంటూ తమ భూమిని చూపించాడు. సూర్యుడి కాంతితో సక్రు చేతి వేళ్ళు మెరుస్తున్నాయి. అది గమనించిన అతడు వెంటనే లేచి రెక్కల్ని పొడవుగా చాచి నాలుగుసార్లు టపటపమన్నాడు, వీస్తున్న గాలిని బట్టి సక్రు వాళ్ల ఊరిలో వర్షం పడలేదు అన్న సంగతి అతనికి అర్థమైంది, అతడు రెక్కలు ఊపినప్పుడు సూర్యుడి కాంతి అతడి రెక్కల నిండా కిరణాల్లా జారిపోతున్నాయి.

” Here,it won’t rain? ” అంటూ అతడడిగాడు

సమాధానంగా సక్రు “s, but in timeless time “

దూరంగా ఓ ఇంటి నుండి పైకి లేస్తున్న పొగని చూస్తూ…. “Y,smokes raising from that house” అడిగాడు.

“It is a factory,burns medical wastes and orphan corpses all the time”

“ఆహ్… అంటూ ప్రస్నార్ధకంగా, ఆశ్చర్యంగా ముఖాన్ని పెట్టాడు”

సక్రు చిన్నగా నవ్వి అది నేను పుట్టకముందునుండే ఉంది.నేనెప్పుడూ అక్కడికి వెళ్ళలేదు నువ్వు చూడాలనుకుంటే చెప్పు ఇద్దరమేళ్దాం అన్నాడు.

ఏమైందో ఏంటో… ఒక్కసారిగా అతడి ముఖంలో కాంతి తగ్గిపోయింది, రెక్కలు పల్చబడి నేలనంటాయి.

మళ్ళీ ఏమైందో లేచి నిల్చుని తన రెండు రెక్కల్ని గట్టిగా ఊపాడు .

ఆకాశంలోకి చూస్తూ సన్నగా నవ్వాడు. అతగాడు గాలిని అతిగా పిలుస్తున్నట్లు అతడి ఉబ్బి తగ్గుతున్న ఛాతీ చెబుతుంది.ఏదో పక్షుల జంట పైన ఆ పొగని దాటుకొని పోతుంది. వాటిని చూస్తూ పైకి ఎగిరాడు. పొగలు కక్కుతున్న రింగుల చుట్టూ గిరికీలు కొట్టి సక్రు వైపు దూసుకొస్తు ఓ చెట్టు కొమ్మకి తన రెక్కల్ని ఆనించి మెల్లిగా సక్రు ముందు వాలాడు.ఒకరికొకరు ఏమి అర్ధం కానట్లు ఉండిపోయారు, అసలు అతడి ప్రవర్తనకి కారణం ఎంటో ? అనుకున్నాడు సక్రు

దూరంగా ఎవరో రావడాన్ని గమనించి అటుగా చూసారు, సైకిల్ బెల్ చప్పుడు వారికి దగ్గరైన కొద్దీ గట్టిగా వినబడుతోంది.

సైకిల్ పైన వ్యక్తి సక్రుకు బాగా తెలిసిన వాడే. సక్రునీ చూసి గుర్తుపట్టి మాట్లాడించాడు.

“కాయి బాపు కాయి కర్రోచి – ఎం బాపు ఎం చేస్తున్నావు “

“అపన్ గట్లామా షూటింగ్ కర్రెకాయి? -మన అడవుల్లో షూటింగ్ చేస్తున్నారా? “

కన్నా ఆయే? -ఎప్పుడొచ్చారు? “

తనపాటికి తను ప్రశ్నలు అడుగుతున్నాడు , అతడి ముఖాన్నే గమనిస్తున్నాడు రెక్కల వ్యక్తి.

దాదా హబ్బాల ఆయే -తాతయ్య ఇప్పుడే వచ్చాము. తను బయట దేశస్తుడు నాకు బాగా తెలిసిన వ్యక్తి మన ప్రాంతం చూపిద్దామని తీసుకొచ్చాను.

వెంటనే అతడు ఓహ్…అని
“తో ఈ పంకార్ వేస్ కాడేనిక – ఐతే ఈ రెక్కల వేశాన్ని ఇంకా అతను తియ్యడా? “

“హ దాదా ఊ కాడేని కన్నాయి హనుజ్ రచ్ – హ దాదా అతను ఎప్పుడు అలాగే ఉంటాడు ఆ రెక్కల్ని తియ్యడు. “

“ఉహ్ బెట మ లకడిన జారోచు – సరే బేటా నేను కట్టెలకు పోతున్న” రెక్కల మనిషి వారి సంభాషణలు వింటున్నాడు

జాగర్త మొన్న మీ బాబాయికి సింహం పిల్లలు కనిపించాయట నువ్వు ఎక్కువ పట్నంలోనే ఉంటు ఉంటావ్ ఇక్కడి విషయాలు నీకు తెలిసి ఉండవు ” సరేనా నేను వెళ్లి వస్తాను.

అతడు వెళ్ళిపోయాడు. రెక్కల మనిషి ఈసారి మాట్లాడాడు .

అతడి గురించి అడిగాడు. తన ప్రశ్నలన్నిటికీ జవాబులు ఇచ్చాడు సక్రు.

వచ్చిన వారు వచ్చినట్లే వెళ్ళిపోదాం అనుకున్నారు కానీ తండా వాసి కళ్ళలో చిక్కుకున్నారు ,సాయంత్రం తండా నిండా సక్రు గురించి చర్చ ఉంటుంది , ఆ మధ్య ఏదో న్యూస్ పేపర్ లో తను నటించిన షార్ట్ ఫిల్మ్ గురించి ప్రచురించబడింది, చిన్నగా సక్రు ఫోటో కూడా ఇచ్చారు అంతే అప్పటి నుండి తండాలో అందరూ సక్రు గురించి గొప్పలు మాట్లాడుకోవడం మొదలెట్టారు.

రెక్కల మనిషిని ఒప్పించి ఇంటి వేపు నడిపించాడు సక్రు. తండాలో గాని ఇంకెక్కడైనా పొరపాటున ఎగిరావనుకో నిన్ను దయ్యం అని రాళ్లతో కొట్టి చంపుతారు,నన్ను తాండా నుండి వెళ్ళగొడతారు. ఇప్పటికే సినిమాలో అవకాశాలు దొరకక షార్ట్ ఫిల్మ్‌లు చేస్తున్నాను, తండాలో మంచి పేరు ఉంది. జాగర్త అంటూ ముందు జాగర్తలు చెప్పి ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ల వెనక గాలి రింగులు రింగులుగా తిరుగుతుంది, సక్రు వెనక్కి తిరగలేదు దాన్ని చూడలేదు ఆ రెక్కల మనిషి చెయ్యి గట్టిగా పట్టుకుని నడిచాడు, ఓ సారి ఇలాగే ఆ గాలి వచ్చి మా ఊరిలో ఒక అతను గాల్లో ఎటో వెళ్లిపోయాడు? అందుకే ఇలా హడావిడిగా నడుస్తున్నాను అంటూ నడిచాడు, దారి పక్కనే కనిపించిన తోటలో ఉన్న జామ చెట్టు పైన కనిపించిన దిష్టిబొమ్మకు ఉన్న బట్టలు తీసి, ఆ రెక్కల మనిషిని వేసుకోమన్నాడు. రెక్కలు పట్టట్లేవు అంగి వెనక రెండు చీలికలు చేశాడు సక్రు. బట్టలు వేసుకున్నాక ఆ వ్యక్తి ఓ సారి తన రెక్కల్ని ఆడించాడు, ఎగరడానికి వీలుగా ఉంది. ఇద్దరు ఇంటి వైపు నడిచారు.

ఇంట్లో చేరుకున్నారు, సక్రునీ చూసి వాళ్ల నానమ్మ పరిగెత్తుకు వెళ్లి కౌగిలించుకుంది,మనవడి వెనక ఇంకో వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. సక్రు అతనెవరు అని వాళ్ల దాది అడిగింది, తను పెద్ద సినిమా డైరెక్టర్ మన గట్లా (అడవి) లో సినిమా తీయాలనుకుంటున్నాడు, నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చాడు, అందుకే ఇటూ పిలుచుకుని వచ్చాను అంటూ చెప్పాడు.

తండాలో ఎప్పుడు సక్రు గురించి గొప్పగా మాట్లాడుకోవడం వింటుంటారు,అందుకే అతడిని ఎం అనలేదు వాళ్ల నానమ్మ, ఇంట్లో వాళ్ల నానమ్మ ఎంత చెప్తే అంత కాబట్టి ఆమె అతడిని ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకుంది.

ఇంట్లో దూలానికి వేలాడుతున్న బుట్టలో ఎండి ఉన్న రొట్టెల్ని తీసి నీళ్లలో నానబెట్టి ఇద్దరికీ పచ్చి వెల్లుల్లి కారం తో వడ్డించింది, సక్రు తింటున్నాడు, ఆ వ్యక్తి ఇంటి గోడల్ని గమనిస్తున్నాడు, ఆ మట్టి గోడలకు పురుగులు,ఎలుకలు చేసిన రంద్రాల్ని గమనిస్తూ పైన ఉన్న దులాల పైకి అతడి దృష్టి మళ్ళింది. ఒక్కో దూలానికి ఒక పంట ఉంది,ఒక దానికి అల్లిన వెల్లుల్లి తెల్లగా అక్కడక్కడ ఉదా రంగుతో మెరుస్తూ ఉంది,ఇంకో దూలం మీద అల్లిన ఉల్లిగడ్డ ఉంది,దాని చుట్టూ తెల్లని పొట్టు కలువ రేకుల్లా కనిపిస్తున్నాయి,వేరే దూలాలకు ఎక్కువగా ఒలిచిన మక్కలు వేలాడుతున్నాయి. ఇలాంటి వాతావరణాన్ని ఎక్కడో చూసినట్లు గుర్తుకు వచ్చింది. తినడం అయిపోయింది.ఇంటి ముందు ఉన్న చెట్టు కింద చింత గింజలు కొడుతున్న పిన్ని, అమ్మ , నానమ్మ దగ్గర ఓ మంచం వేసుకుని ఇద్దరు కూర్చున్నారు. ఆడవాళ్ళు ఆ వృద్ధుడిని చూసి తమ అద్దాల ముసుగును ముఖం కనిపించకుండా ముందుకు జరిపారు.

చుట్టు ఉన్న చెట్లు వాటి పైకి ఎక్కిన సొరకాయ తీగలు ,వాటి పై నుండి ఎగురుతున్న నల్లని పురుగులు,వీటిని గమనిస్తున్నాడు ఆ వ్యక్తి అంతలో పిల్లి ఓ కోడిని నోట కరచుకుని పరుగెత్తడం చూసాడు సక్రు,నానమ్మ “ఇందా తినండి” అంటూ ఇద్దరికీ గింజలున్న చింతకాయలు ఇచ్చింది, ఇద్దరు వాటిని తింటూ ముచ్చట్లు మొదలు పెట్టారు. ఆకాశంలో సూర్యుడు కదిలాడు, తండా మహిళలు పీరు, సోందా ఇద్దరు సక్రు వాళ్ళు కూర్చున్న చోటుకు వచ్చి సాయంత్రం వదాయి (పుట్టు వెంట్రుకలు సమర్పించెప్పుడు చేసే పండగ) కడుతున్నాం. అందరూ రావాలని చెప్పి, సక్రుతో ఉన్న వ్యక్తిని చూస్తూ ఒకరితో ఒకరు గుసగుసలాడుతూ వెళ్ళిపోయారు.

సక్రు వాళ్ళు ఏమన్నారో అతనికి వివరించాడు. అప్పూడతను

“What is vadaayi ?” అని అడిగాడు

“It is a traditional festival that we celebrate for cutting the birth hair of a child to goddess kalika by offering a calfs blood to her”

రెక్కల వ్యక్తి ఆలోచనలో పడ్డాడు, సక్రు వాళ్ల యాడి,పిన్ని సక్రు మాటలు వింటూ అతడ్నే ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు.

రెక్కల వృద్ధుడికి వేరే తెగల పద్దతులు మనసులో కదిలాయి.

తండాలో అంతా కోతులు, ఎక్కడ బడితే అక్కడ కోతులే ఉన్నాయి.వాటిని అప్పటిదాకా గమనించలేదు ఆ రెక్కల మనిషి,తన దృష్టిలో పడ్డాక వాటిని మర్చిపోలేకపోయాడు.

———–

6.

పక్షులు తిరుగు ప్రయాణం అయ్యే సమయానికి అందరి గుడిసెల, ఇళ్ళ ముందు బల్బులు వెలిగాయి.కోళ్లు గంపల కిందకి వెళ్లాలా వద్దా ఆలోచిస్తూ గంపల దగ్గర నిలబడ్డాయి. గొర్రెల, మేకల మందా దుమ్ములేపుతు కొట్టం చేరుకున్నాయి.

తండాలో డబడా * (డప్పు) మోగింది. సక్రు ఆ వృద్దుడు ఇద్దరు పీరు వాళ్ల ఇల్లు చేరుకున్నారు.

పిల్లలందరూ వాళ్ళని చూసి ఏవోవో మాట్లాడుకుంటున్నారు.తండా వాసులందరూ వచ్చేశారు.

పీరు వాళ్ల ఇంటి ముందు కాలిక దేవి ప్రతిమా, దుర్గా దేవి ప్రతిమా పెట్టీ వాటి చుట్టూ గవ్వలతో, పూసలతో అడవిలో దొరికే ఫలాలతో అలంకరించారు.

ఆ పక్కనే రెండు మంటలు వెలుగుతున్నాయి,వాటి చుట్టూ మూడు మూడు రాళ్ళను పెరుస్తున్నరు.

సక్రు ఆ వృద్దుడితో అన్ని చూపిస్తూ వివరిస్తున్నాడు.

పీరు భర్త లక్యా ఇంటి గుమ్మానికి కొంచం దూరంలో ఓ గిన్నెలా తవ్వాడు.

దాదాపు తండా అంతా అక్కడికి చేరుకుంది. రాత్రి దిపాల్లో ఆ రంగురంగల బట్టలు దగదగమంటున్నాయి. చూసే వారి కళ్ళు చమక్కు మంటున్నాయి.

ఓ వ్యక్తి కాలిక దేవి ప్రతిమాకి ఎదురుగా ఓ పాడ్గా(దూడ) తెచ్చి నిలబెట్టాడు.

సందడి సందడిగా ఉన్న వాతావరణం మౌనం వహించింది. అందరూ ఆ దూడ వైపే చూస్తున్నారు.

వృద్దుడు ఉస్తాహంతో చూస్తున్నాడు.

దేవి ప్రతిమకు ఎదురుగా కొందరు పురుషులు తల పాగ,తెల్లని బట్టలు, భుజం మీదుగా నడుము దాకా సాగి ఉండే బెల్ట్ వంటి బట్ట దానిపైన సంప్రదాయ పద్ధతిలో కుట్టబడిన అద్దాలు,పూసలు , గవ్వలు ఉన్నాయి, సంప్రదాయ వేషధారణలో నిలబడి మూడు నిముషాల ప్రార్థన తర్వాత ,కిందికి వంగి నేలకు నమస్కరించి దూడను బలి ఇచ్చారు,దాని రక్తంతో దేవి ముందు ఓ గీత గీసి మళ్లీ నమస్కరించారు. పీరు భర్త ఆ దూడ తలను ఇంటి ముందు తవ్విన గుంటలో పెట్టీ మట్టి కప్పేసి మొక్కుకున్నాడు.

ఇంకా ఆ దూడ దేహం గిలగిల కొట్టుకుంటూనే ఉంది.భూమి పైన పారుతున్న రక్తం అందరి కళ్ళలో మెరుస్తోంది. అందరూ ఆ రక్తం ఎంత దూరం పారుతుందో చూస్తున్నారు. దూడ తల పాతి పెట్టిన వరకు ఆ రక్తం పారింది.

“ఇంకా ఇప్పుడు తండాలో ఉన్నా మిగిలిపోయిన దయ్యాలు ఆత్మలు ఎం ఉన్నా విముక్తి పొందుతాయి,తండా వదిలిపోతాయి” అని సక్రు వృద్దుడితో అన్నాడు.

తండా వ్యక్తులు ఇద్దరు వచ్చి ఆ దూడను ఎత్తుకుని ఎడ్ల బండిపై పెట్టీ అడవికి తీసుకెళ్లారు.

మళ్లీ దుర్గా దేవికి గొర్రెను బలి ఇచ్చి వంటలు మొదలుపెట్టారు.

స్త్రీలు పురుషులు కలసి బంజారా నృత్యం చేస్తుంటే. ఒక వైపు పిల్లలు సినిమా డాన్సులు చేస్తున్నారు ఆ రెక్కల వ్యక్తి ముందు,అతడు చూడాలని ఎగిరెగిరి దూకుతూ డాన్సులు చేస్తున్నారు.

అడవికి వెళ్ళిన వారు దూడ దేహాన్ని అడవికి సమర్పించి వచ్చేశారు.వంటలు సిద్ధమయ్యాయి.పండగ వాతావరణంలో మునిగి తేలుతున్నారు. దూరం దూరం నుండి నక్కి నక్కి చూస్తున్నారు ఆ రెక్కల మనిషిని.

రెండు గంటల తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వెళ్దామన్నాడు, సరే అంటూ ఇల్లు చేరుకున్నారు. తండాకు వచ్చినప్పటి నుండి సక్రుతో ఏదో అడగాలనుకుంటున్నాడు. ఇల్లు చేరుకోగానే

“Are you a migrant” అనుమానంగా అడిగాడు ఆ వ్యక్తి

సక్రు “haa…. s but not Iam but my ancestors, but why you got that doubt” అన్నాడు సక్రు.

“నీకు మాయన్ తెగ గురించి తెలుసా ?” అడిగాడు సక్రునీ
లేదు తెలీదు , “నీకు తెలుసా ?” అంటూ ఉల్టా ఆ వ్యక్తిని అడిగాడు సక్రు.

“అవును, నాకు వారు బాగా తెలుసు ,వారు , మీరు అచ్చం ఒకేలాగా ఉన్నారు, బట్టల విషయంలో మార్పులున్నాయి, వాళ్ళు మొక్కజొన్ననే నమ్ముకుని బతుకుతున్నారు, ప్రకృతిని ఆరాధిస్తూ వారు ఇటూ మీ దేశం నుండి అటూ వలస వచ్చిన వారని విన్నాను”

సక్రుకి ఏదో తెలుసు అన్నట్లు ” ఆ…. అయ్యుండొచ్చు మూడు వేల ఐదు వందల సంవ్సరాల క్రితం రాజస్థాన్,ఆఫ్గనిస్తాన్‌ల నుండి ఎక్కువగా వలసలు మొదలయ్యాయి అలా కొందరు అటూ ఇంకొందరు ఇటూ వచ్చి ఉండొచ్చు ” అన్నాడు ఆ వ్యక్తితో

అప్పటికే తొమ్మిది అయిపోయింది. ఇంకా బంజారా పాటలు, డప్పు చప్పుళ్ళు వినబడుతూనే ఉన్నాయి.

ఇంట్లో వాళ్ళందరూ పీరు వాళ్ల ఇంటి దగ్గరే ఉన్నారు, రాత్రంతా పాటలు పాడుతూ అక్కడే గడుపుతారు,ఎప్పుడు ఇంటికి వస్తారో తెలీదు.

ఇద్దరూ ఓ సాప వేసి పడుకున్నారు. ఇద్దరికీ కలలు వచ్చాయి.

——————

7.

వృద్ధుడి కల

సక్రు భవిష్యత్తులో ఓ గొప్ప వక్త అవుతాడు. మెల్లిమెల్లిగా తన లాంటి తెగల గురించి తెలుసుకోవడం మొదలుపెడతాడు. హక్కుల కోసం , అడవుల కోసం ,మట్టి కోసం పోరాటం చేయాలని భావిస్తాడు.

పుస్తకాలు చదువుతాడు, ఏవో ఏవో రాసుకుంటాడు, తండాలు తిరుగుతాడు. ఈ విశ్వం పై అర్హత ఎవరికుందో వివరిస్తు తిరుగుతాడు.

తన ప్రయాణంలో మూడు వందలకు పైగా తెగలను కలుస్తాడు. వారి జీవితాలను వారి సామాజిక పరిస్థితిని గమనిస్తాడు.అందరి జీవితాలు ఒకేలా ఉన్నాయి.

ఆలోచనలో పడ్డాడు కులము మతము లేని ఈ ఆదివాసీ గిరిజనుల జీవితాలు ,ఇప్పుడు కులమతాలతో మలినమైపోయాయి.అవి ఎంత నాటుకుపోయాయంటే వారు ఫలానా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇతర మతాలు అన్ని వారివే అన్నంతగా ఆ మాయలో పడిపోయారు. ఎలా వీళ్ళను మార్చేది అనుకున్నాడు.

ఈ ఆదివాసీ , గిరిజన తెగలు ఎంత ప్రత్యేకమే వివరించి పూర్వ వైభవం తీసుకురావాలని అనుకున్నాడు.

వాటికి సంబంధించి ఎన్నో రకాల ఆర్టికల్స్ రాస్తాడు, వీడియోలు తీయించి ప్రతి తెగను కలిసి ఆ వీడియోను ప్రదర్శిస్తాడు.

అంతా బానే ఉంది అని అనుకునే సమయంలో ఆ సక్రు కుటుంబీకులు అతడిని చంపడానికి సిద్ధమై ప్రయత్నిస్తారు, సక్రు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో తనను చంపడానికి ప్రయత్నించిన వారిలో ఒకరు గాయపడతారు.

భయంభయంగా పరిగెత్తుకు అడివి చేరుకుంటాడు. “ఎలా ఉండేవారం ఏమైపోయాం” అనుకుంటూ ఏడుస్తూ కూర్చున్నాడు.

ఇప్ప పూలను తిని మత్తులో మునిగి తేలుతున్న ఓ ఎలుగుబంటి సక్రు పై దాడి చేస్తుంది.ఇంటి వారి నుండి తప్పించుకున్న సక్రు అక్కడ ఓ ఎలుగు బంటి చేత మరణిస్తాడు.

నిండుగా వెలిగిపోతున్న చంద్రుడు కిందికి దిగి ఆ రక్తన్నంత తనలో
నింపుకుని ఆకాశంలోకి ప్రవేశిస్తాడు.నక్షత్రాలు అతని ప్రేవేశాన్ని అడ్డుకుంటాయి.

———

8.

సక్రు కల

అడవిలో పడేసి వచ్చిన దూడ దేహం కోసం అడవి జంతువులు అన్ని సమావేశమవుతాయి.

శాకాహార జీవాలు కూడా ఆ దూడ మాంసం కోసం అక్కడ ఉంటాయి.

అడవిలో రాళ్ళు పెద్ద పెద్ద చెట్లు మాత్రమే మిగిలిపోయాయి.ఏమి తినడానికి లేకుండాపోయాయి.

జంతువులన్నీ రెండు భాగాలుగా గుంపు చేరాయి.రెండింటి మధ్య గొడవ మొదలౌతుంది.అది కొన్ని వారాలు జరుగుతుంది. ఆ దేహం కుళ్లిపోయి ఎముకలు తేలుతాయి.

అది గమనించి ఓ కుందేలు చెప్పగానే ఇంకా అన్ని ఏకమై మనుషుల పై దాడి చేయడానికి సిద్ధమవుతాయి. తండా మీద పడి అందరినీ చంపి తమ వాట తాము విభజించుకుంటాయి.

తండా నిండా దేహాలు,రక్తం నిండి పారుతూ ఉంటే వాటిలో ఇదులాడుతున్న చేపలు, హంసలు.

————

ఇదంతా నిజమౌతుందేమో అని భయంతో నిద్రలోనే వణికిపోతున్నాడు సక్రు.

————
9.

తెల్లారింది, వారు పడుకున్న చోటుకు పైన దూలానికి వేలాడుతున్న వెల్లుల్లి గుత్తిలో పిచ్చుక గూడు కట్టుకున్నట్లు ఉంది, రెండు పిచ్చుకలు ఎగురుతూ వెళ్ళాయి,మట్టి దుమ్ము వారి ముఖం పై పడి మెలుకున్నారు. ఇల్లు ఖాళీగా ఉంది. అందరూ వారివారి పనులకు వెళ్లిపోయారు

సక్రు ఇంటి దగ్గర స్నానం చేసుకున్నాడు, ఆ వ్యక్తి చెరువు దగ్గరికి వెళ్దామన్నాడు, ఇద్దరు సరదాగా తిరుగుతూ చెరువు దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి స్నానం చేసుకున్నాడు, సక్రు కొన్ని చేపలు పట్టాడు. ఆ పట్టిన చేపలు లెక్క పెట్టాడు, పదకొండు చిన్న చేపలు, వాటన్నింటినీ శుభ్రం చేసి ఇసుకలో దొరికిన చెకుముకి రాళ్ళతో తుమ్మ కట్టెలు ఏరుకొచ్చి మంట వెలిగించి చేపలన్ని కాల్చాడు. ఇద్దరు అక్కడే కూర్చుని తిన్నారు.

తిరిగి ఇంటికి వెళ్లి దళ్యా * ( గట్కా)తిని తోటకి వెళ్లారు, చెట్లు ఎక్కి సేరో కొమ్మలపై పడుకుని ఆకాశంలోకి చూస్తూ , ఋతువుల్లో ఆకాశాల రంగులు గురించి మాట్లాడుకుని,సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు.

నానమ్మ, అమ్మ ఇద్దరు పోళ్హి బాటి *(పోళెలు) చేశారు.అందరూ కలిసి తిన్నారు, సక్రు వాళ్ల దాదా ఆ రోజు ఇంటికి రాలేదు, ఎవరికి వారు వాళ్ల స్థలాల్లో నిద్రపోయారు.

చీకటి ప్రతీ కదలికలను స్పష్టంగా వినబడేట్లు చేస్తుంది. సక్రు ఎండిపోయిన గొంతుతో మేలుకుని నీళ్ళు తాగి పడుకొబోయాడు, పక్కన పడుకుని ఉండాల్సిన వ్యక్తి లేకపోవడంతో లేచి సగం తెరిచి ఉన్న తలుపుని తెరిచి బయటికి వెళ్ళాడు ,ఇంటి ముందు ఉన్న రాయిపై కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు ఆ వృద్దుడు. సక్రు వెళ్లి పలకరించాడు.

మొదటి సారి ఆ వ్యక్తి నోటిలోంచి సక్రు అన్న పేరు విని ఆశ్చర్యపోయాడు, బంజారా లోనే పలకరించాడు.

“నేను వెళ్ళాలి , నా నుండి నీకు ఇదో బహుమతి” అని తన రెక్కల్ని ఇచ్చి తను కూర్చున్న రాయి మీద దూకాడు, పెద్ద లోయలోకి జారిపోయినట్లు అనిపించింది సక్రుకు, తన తలలో ఎన్నో రహస్య సొరంగాలు ఉన్నాయి, వాటి గుండా ఆ వ్యక్తి పరిగెత్తుకు వెళ్తున్నట్టు అనిపించింది, ఒక సొరంగానికి చివర ఉన్న రాళ్ళ గోడను కూల్చడానికి ప్రయత్నిస్తున్నాడు, గుద్దుతున్నాడు, గాలిని గట్టిగా పిలుస్తున్నాడు, ఆ గోడ కూలింది. సక్రు కళ్లు తెరిచాడు అదో కల . కానీ నిజంగానే ఆ వ్యక్తి పక్కన లేడు, తనకు రెక్కలున్నాయి. పక్కనే ఉన్న సెల్లో టైం చూసాడు ఐదు అవుతుంది. క్షణం పాటూ ఆలోచించాడు, తెల్లారితే తన పరిస్తితి ఏంటని ?

సక్రు తల్లికి నమ్మకాలు ఎక్కువ,తనని అలా రెక్కలతో చూస్తే ఎవరో చేతబడి చేశారు, దయ్యం పట్టుకుంది అని గోల చేసి రెండు రెక్కల్ని నరికిస్తది,తండా వాళ్లైతే రాళ్ళతో కొట్టి చంపుతారేమో ? ఆ మధ్య ఏదో న్యూస్ పేపర్ లో ఎవరో చేతబడి చేశారని మర్రి చెట్టుకి కట్టి సజీవదహనం చేశారని చదివిన సంగతి గుర్తొచ్చింది సక్రుకి.

ఆ వచ్చిన వ్యక్తి సక్రు కుటుంబంపై చేతబడి చేయించాడని పుకార్లు లేస్తాయి.ఇంకా ఇంకా ఎన్నో ప్రశ్నలు అతడి మనసుని మెదడుని తొలిచేస్తుంటే ఇంకా ఆలోచించి ప్రయోజనం లేదని తెల్లారక ముందే ఎగిరిపోయాడు. తనుండే ప్రాంతం నుండి అడవుల జాబితా అంతా సక్రుకి బాగా తెలుసు,

తరవాత ఎంటి ?
ఎలా జీవించాలి ? అన్న వాటి గురించి ఆలోచించకుండా చెట్టు చెట్టుకు ఎగిరి ఒక్క రోజైనా పక్షిలా జీవించాలి అనుకున్నాడు.

సందర్శించిన ప్రతి చెట్టు నుండి ఓ కొత్త అందాన్ని కనుక్కుంటూ పిచ్చుకల గెంతుతున్నాడు కొమ్మ నుండి కొమ్మకు ,తన రెక్కలకు ఏదో గిరుకుపోయినట్లు అనిపించింది, పట్టించుకోలేదు, ఈక ఈకకి మధ్య ఏదో ఇరుక్కున్నట్లు,రెక్కల్ని ఎవరో గట్టిగా కట్టినట్లు అనిపించింది,

“సర్లే ఏం కాదులే ఏదైనా అయితే మౌనంగా ఉండడానికి నేనేమైన పక్షినా ?” అనుకున్నాడు,
దొరికినవి దొరికినట్లు తిని సాయంత్రం దాకా విహరిస్తూనే ఉన్నాడు, ఓ కొమ్మపై కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడిని చూసి అది రాలడానికి సిద్దంగా ఉన్న రక్తపు చినుకుగా ఊహించాడు.

రెక్కలు కదలటం లేదు , మనసేమో ఇంకా కాసేపు ఎగురు పైకి ఎగురు అంటూ అరుస్తుంది.ఆనందం కోసం చీకటిని లెక్కచెయ్యకుండా అన్ని చెట్లను దాటుకుని గాలి పటంలా రింగులు రింగులుగా తిరిగాడు ఆకాశంలో. చుట్టు ఏదో వలయం ఏర్పడి తన బలాన్నంతా పీల్చేశినట్లు, రెక్కల్ని సాగదీసి వాటి చుట్టూ ఏదో చుట్టేసినట్లు అనిపించింది, ఓ చెట్టు పై వాలాడు ,తల తిరిగింది ,కిందికి జారాడు, కొమ్మల పైనుండి జారుతూ జారుతూ ఏదో తట్టుకుంది, తల కిందులుగా వేలాడుతున్నాడు, స్పృహ లోనే ఉన్నాడు చుట్టూ చూసాడు, తను ఎప్పుడూ చూడని పక్షులన్నీ తనతో పాటు తల కిందులుగా వేలాడుతున్నాయి. తన దేహం నుండి రక్తం కారుతున్నట్లు అర్థమైంది సక్రుకి ,కుడి భుజం నొప్పి అతడ్ని చంపేస్తుంది,తన తలకు కింద రాలిన ఈకల్ని చూస్తున్నాడు ,కనిపించటం లేదు కళ్లు మబ్బుగా ఉన్నాయి,ఆకాశం వైపు చూసాడు ,ఆకాశం అసలు లేనట్లు అనిపించింది,చుట్టూ కీచురాళ్ళ అరుపులు,దూరం నుండి వినబడుతున్న నెమలి అరుపులు.

అనుకున్నదేంటి ? తను సాదించిందెంటి ? ఖాళీ సమయాల్లో ఆకాశాన్ని చూస్తూ జీవితానికి రంగులు వేసుకునే తను తన అస్తిత్వాన్ని కోల్పోయి సృష్టి మొదలైన చోట తన జీవితం ముగిసిపోబోతుందనీ, అర్థమై కళ్ళ నుండి వెచ్చని కన్నీళ్లు జారడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

పోనీ పోతే పోయాను,ఎలాగూ రెక్కలున్నాయి కాబట్టి,పట్టు పురుగు తన చుట్టూ అల్లుకునే గూడులా కాలం తన దేహం చుట్టూ గూడును అల్లి తనను ఓ కోష్ఠాగా మార్చేస్తే బాగుండు, సీతాకోక చిలుకలా మారి ఎగిరిపోతాను అనుకున్నాడు

– రమేష్ కార్తిక్ నాయక్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
బి.అజయ్ ప్రసాద్
బి.అజయ్ ప్రసాద్
2 months ago

ఆసక్తికరం. గొప్ప ప్రయత్నం.