గౌరవ సంపాదకీయం – ఏమైంది నా మాతృభూమికి ?- మహెజబీన్

జల్లు గానే కురిసింది వర్షం. కురుస్తూనే ఉంది. నా నగరం తడిసి కల్మషాన్ని పోగొట్టుకుని పరిశుద్ధంగా నిలబడింది ఈరోజు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానజల్లు ఎంత ఆనందాన్నిచ్చిందో చెప్పలేను. కానీ ఎక్కడో వెలితి, నా మనసులో నా ఆలోచనల్లో చోటు చేసుకుంది. పంకజ్ ఉధాస్ గజల్ అద్భుతంగా వినిపిస్తోంది, ‘ ఆయిమే బారిషో కా మోసమ్ హై! ఇన్ దినో ఆషికోకా మోసమ్ హై! ‘ (రండి ఇది వర్షాకాలం, ప్రేమికుల కాలం) వర్షం! వర్షం బానే ఉంది ఎప్పటిలా, ఇంకా చెప్పాలంటే నిన్నటి వర్షం కంటే ఈ రోజు వర్షం మరింత బాగుంది. ఋతువుల్ని, ప్రకృతిని, వర్షాన్ని ఎంజాయ్ చేయాలంటే మనసులో కొంత స్పేస్ కావాలి. కేవలం కళ్లు మాత్రమే సరిపోవు. మనసంతా సామాజిక అవ్యవస్థలు ఆక్రమించుకుని ఉంటే, మెదడులో యుద్ధం జరుగుతుంటే, కళ్ళు మాత్రం వర్షాన్ని చూస్తాయా? ఎంజాయ్ చేస్తాయా?
సమాజం అల్లకల్లోలంగా ఉంది. అసలే పేద ఆర్థిక వ్యవస్థ మనది. దాన్ని కోవిడ్-19 మరింత చిన్నాభిన్నం చేసింది. దినసరి కూలీలు రోడ్డున పడ్డారు. పేదల బతుకులు దయనీయ స్థితికి నెట్టబడ్డాయి. అసంఘటిత కార్మిక రంగం నిస్సహాయ స్థితిలో ఉంది. వలస కార్మికులు ఎలా వేల మైళ్ల దూరం నడిచి వెళ్లారో మనం చూశాం. వాళ్ల పగిలిన కాళ్లు బీటలు వారిన జీవితాల్ని చూశాం. వాళ్ల వేదనని విన్నాం. చేతనైన సహాయం చేశాం. కానీ రాజ్యం మాత్రం ఏమీ చేయలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. ఆడవాళ్లు చిన్న పిల్లలు ఎండలో అలా నడుస్తుంటే, ఆ నొప్పి ఎలా ఉంటుందో స్టేట్ కు తెలియదా? కరోనా సందర్భంలో రాజ్యం చిన్న చూపు చూస్తే, వాళ్ళలా నడిచి వెళ్ళిపోయారు. రాజ్యం మీద ధిక్కారంతో చేసిన నిరసన యాత్ర అది. లాంగ్ మార్చ్ అది.

కరోనా సందర్భంలో పబ్లిక్ హెల్త్ చర్చకు వచ్చింది. సరైన సమయంలో మందులు అందక, కొనడానికి డబ్బులు లేక ఎంత మంది పేదవాళ్ళు చనిపోయారో చూసిన కళ్ళకు తెలుసు ఆ లెక్క. ఇన్నాళ్ళు నేను నా మాతృభూమి పేదది అని అనుకున్నాను. కానీ ఈ నేల సంపన్నులకు మాత్రమే అని నిరూపించింది కరోనా సందర్భం.

Right to live with dignity దారుణంగా నేలపాలు అయ్యింది! నేను ఆలోచిస్తున్నాను, ఏమైంది నా మాతృభూమి కి? జవాబు రెడీ గా లేని ప్రశ్న ఇది.

ఆగస్ట్ లో మనం 74 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్నాము. 74 సంవత్సరాల కాలం చిన్నదేమీ కాదు. ఎంతో అభివృద్ధి జరిగి ఉండాలి, కానీ జరగలేదు. అభివృద్ధి పేరుమీద మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. పేదల, కార్మికుల, రైతుల, స్త్రీల శ్రమ దోపిడీ జరిగింది. కార్పొరేట్ రంగం విస్తరించింది. దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. గొప్పవాళ్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన కోట్ల రూపాయల డబ్బు పేద వాళ్లది. అది వాళ్ల శ్రమ వాళ్ళ రెక్కల కష్టం. కార్మికుల శ్రమ పునాదుల మీద కార్పొరేట్ రంగం, సంపన్న వర్గాలు నిలబడి ఉన్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా labour law అమలు జరపకుండా అణచివేతకు పాల్పడితే ఆకాశ హర్మ్యాలు నిలవవు.

అసలే పేదరికంలో ఉన్న మనకు, కరోనా దేశ ఆర్ధిక మూలాల మీద దెబ్బ కొట్టడంతో ఇండియా మరింత పేదరికంలోకి నెట్టబడింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా దేశ ఆర్థిక పునాదుల్ని సుస్థిరం చేసుకోవాల్సింది పోయి, construction లో నిమగ్నమైంది నా ఇండియా, నా రాష్ట్రం కూడా. దేవుడి పేరు మీద కట్టడాలు తీరిగ్గా ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అలాగే కొత్త సెక్రటేరియట్ భవంతులు మరెప్పుడైనా నిర్మించుకోవచ్చు. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది ఏ పాఠశాల కోసమో ఏ వైద్యశాల కోసమో అయితే ప్రజలు సంతోషిస్తారు. కోట్ల రూపాయల ఖర్చుతో ఆయుధాలు యుద్ధ విమానాలు మనకు అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇరుగు పొరుగు దేశాలతో మన సంబంధాలు మన foreign policy మీద మన diplomatic relations మీద ఆధారపడి ఉంటాయి. Economy meltdown period ఇది. ఆచితూచి ప్రభుత్వాలు అడుగు వేయాల్సిన సమయం ఇది. స్త్రీల మీద మరింత భారం పడుతుంది ఇలాంటి సందర్భంలో. అయినా స్త్రీలకు అలవాటే సంక్షోభాన్ని దాటుకు రావడం. స్త్రీల కోసం స్త్రీలు నడుపుతున్న పత్రికలు కూడా ఎన్నో ఆటుపోట్లను దాటి జండాలాగా రెపరెపలాడుతూ నిలబడ్డాయి. అలా ధైర్యంగా నిలబడే స్త్రీలకు, వాళ్ల ఉద్యమాలకు, వాళ్ల అంతర్జాల పత్రికలకు సలాం. స్వేచ్ఛా విహంగాలై స్త్రీలు ఎప్పుడూ అలా సాగిపోవాలని ఆకాంక్ష.

– మహెజబీన్
మానవ హక్కుల న్యాయవాది, స్త్రీవాద రచయిత్రి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
4 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
buchireddy
buchireddy
2 months ago

nijam madam === u r right
======================
buchi reddy gangula

సంవేద్య
సంవేద్య
2 months ago

మహె జబీన్ గారూ
నమస్తే.

మీ సంపాదక రచన వాస్తవాన్ని బాగా తెలియజేసింది.
మీ కవిత కూడా బాల్యం లోని అమాయకతను ఆసరా గా జరుగుతున్న అత్యాచారాలు, అలాంటి పిల్లకు మీరిచ్చిన భరోసా గ్రేట్. 🙏🙏🙏🙏

Kanakadurga
Kanakadurga
2 months ago

మహెజబీన్ మీరు రాసిన గౌరవ సంపాదకీయం చాలా బావుంది. ప్రపంచం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో వుంది, అలాగే మనదేశం కూడా.
చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేయడంలో నిమగ్నమయి వున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

కనకదుర్గ.

C.Suseela
C.Suseela
2 months ago

మహెజబీన్! సంపాదకీయం నేటి పరిస్థితులకు ప్రతిబింబం! ఆర్థికపరిస్థితులు, పేదరికం, దానికి తోడు కరోనా , అది సృష్టించిన సమస్యలు, మరీ రోజుకూలీల దీనపరిస్థితులు! Poor people are beloning poster Rice are beloning Ticket!!