అరణ్యం 12 – తరుఘోష-దేవనపల్లి వీణావాణి

పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్నాం. అయినా అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నర్సంపేట నుంచి నేరుగా పరకాల వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి చీకటి పడుతోంది. భోజనాల వేళయింది. ఈ రోజుకి మా వద్ద తినడానికి ఏమీ లేవు. నగరాల్లో అయితే ఏ రాత్రి అయినా యేదో ఒకటి అందుబాటులో ఉంటుంది, చిన్న చిన్న గ్రామాలలో, చిన్న పట్టణాల్లో ఆ వెసులుబాటు ఉండదు. కాకపోతే పట్టణ కార్యాలయాల్లోనో , ఆసుపత్రుల్లోనో ఇంకేదైనా పనిపడే వాళ్లకోసమే అన్నట్లుగా ఇళ్ల వద్దనే వంటచేసి పెట్టె బాబాయి హోటళ్లుమాత్రం ఉంటాయి. గృహస్థు భోజనంలాంటి ఏర్పాట్లు అందుబాటు ధరల్లో ఉండడం ఒక చక్కని వెసులుబాటు. పరకాలలో కూడా అంతే.

పరకాల చాలా పాత ఊరు. ఇప్పుడు కాదు నిజామ్ కాలం నుంచే ఉన్న ఊరు. అప్పుడు ఉన్న వరంగల్ జిల్లాలో ఇప్పటి కరీంనగర్, ఖమ్మం , నల్గొండ జిల్లాల్లో కొంత భాగం ఉండేది. తర్వాత తర్వాత అన్ని విడిపోయి ఇప్పుడు ఉన్నటువంటి పరకాల, వరంగల్ గ్రామీణ జిల్లాలో చేర్చబడింది. పరకాల చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మంచి అటవీ ప్రాంతాలను చేరుకునే దారులు కలిగి ఉంటుంది.
పరకాల వెళ్ళేటప్పటికే రాత్రి ఎనిమిది గంటలైంది. ముందే చెప్పినట్టు ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరగా ఉన్న సందులో రెండు మూడు చిన్న హోటళ్లు ఉంటాయి. హోటళ్లు అని అంటే పెద్ద ఆర్భాటంతో ఉండవు. ఇంటిలోనే ముందు గదులను కొంచం మార్పు చేసి పది మంది కూర్చుని భోజనం చేసేలా ఏర్పాటు చేసిన గదులు. పూర్తిగా గృహస్థు భోజనం లభిస్తుంది. మేమంతా అక్కడికే వెళ్లి భోజనం చేయాలని అనుకున్నాం. మేం వెళ్లే హోటల్ అతనికి మా బృంద సభ్యులు పరిచయమే. వాళ్ళు ఇదివరకే ఈ ప్రాంతంలో పనిచేసి ఉన్నందువల్ల వాళ్లకి ఈ పరిచయం ఏర్పడింది. భోజనం చేసి మేము అనుకున్న చోటుకు వెళ్లాలి. చేతులు కడుక్కొని భోజనానికి కూర్చున్నాం. యజమాని , అతని కుటుంబ సభ్యులు మరొకరిద్దరు సహాయకులు మాత్రమే ఉన్నారు. వెనుక బెంచీ లో ఎవరో ఇద్దరు ఉన్నట్టు ఉన్నారు. మాకు భోజనం రావాల్సి ఉంది.

ఈ రోజు కార్తీక చతుర్దశి, రేపు కార్తీకపౌర్ణమి. వెన్నెల ఎక్కడికక్కడ చెట్ల నీడలని ఏర్పరుస్తున్నది. తెల్లని వెన్నెలలో నేను కూర్చున్న చోటుకి ఎదురుగా ఒక పిట్ట గోడ మీద వరసలుగా నడుస్తున్న మనుషులు తన చేతుల్లో దొరికిన ఆయుధాన్ని పట్టుకొని వెళ్లుతున్నట్టుగా కనిపిస్తున్నది. గబుక్కున చూస్తే వాళ్లంతా నిజంగానే వెళ్తున్నట్టుగా ఉంది. కానీ కాదు వాళ్లు కదలడం లేదు. ఈ మనుషుల వరుసలకు లోపల ఒక గుమ్మటం మీద భయంకరంగా పడిఉన్న కొన్ని మనుషుల శరీరాలు వాటి నీడలు మరకలు మరకలుగా కనిపిస్తుంది. బహుశా ఏదైనా పార్కు కావచ్చు. చిన్న ప్రాంగణమే అయినా చూడగానే ఒక విషాదం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. మనుషుల బొమ్మలతో ఒక ప్రహరీ లోపల గుమ్మటం , పైన చెదురుమదురుగా శవాల వలె ఉన్న బొమ్మలు , గుమ్మటం కింద తాళం వేసి ఉన్న గది కనిపిస్తున్నది. అది ఏమిటి అని అడిగాను. పరకాల అమరవీరుల పార్కు అని చెప్పారు. నేనకున్నది నిజమే. అయితే ఇప్పటి వరకు ఇటువంటి స్మృతివనం చూడలేదు. ఈలోగా అన్నం వడ్డించారు. భోజనం కానిచ్చి పార్కు చూడాలని అనుకున్నాను.

అనుకున్నట్టే తొందరగా తినేసి పార్కు వైపు వెళ్ళాను. గేట్ మూసివేసి ఉంది. రాత్రి కదా, అందుకే మూసివేసి ఉంటారు. గుమ్మటం మీద ఉన్న మనుషుల బొమ్మలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటి శరీరాల నుంచి కారిన రక్తం రంగు, వెన్నెల వెలుగులో నల్లగా కనిపిస్తున్నది.

ఒక నిట్టూర్పు విడిచి మేము వెళ్ళవలసిన చోటకి బయలు దేరాం. నేను చూసిన మనుషుల బొమ్మలు కూడా నాతో పాటు బయలుదేరినట్టు అనిపిస్తోంది. మేము ఇక పరకాల నుంచి లోపలికి వెళ్తున్నాం. దారులన్నీ నిర్మానుష్యం అవుతున్నాయి. రవాణా చేసే లారీలు మాత్రం తిరుగుతున్నాయి. ఆ దారులు కూడా దాటుకొని చిన్న ఊరి బాట పట్టాం. ఒక గోడౌన్ పక్కన మా జీప్ ఆపుకొని మాకు వచ్చిన సమాచారం వివరాలు చూసుకోవడం లో నిమగ్నమైనాం.

చాలా సమయం వేచి చూడాలి. కనీసం మరో రెండు మూడు గంటలు పడుతుండవచ్చు. వేచి చూడడం అలవాటే కదా.. వెన్నెల నిండుగా చల్లగా ఉంది. చల్లని వాతావరణం, వేడివేడి భోజనం, అలసట. కానీ చలి. చలితో పాటు దోమలు. మేం వచ్చిన పని…సరిపోయింది. దోమలబారినుంచి తప్పించుకోవాలంటే నడవడమే సరియైనది. ఇంకేం నడవడం మొదలు పెట్టాను. ఎవరికివారు గోడౌన్ పక్కన ఉన్న సంది లాంటి దారిలో నిలబడి అటూ ఇటూ నడుస్తున్నారు. దోమలు శరీరాన్ని క్షతం చేస్తే ఇందాక చూసిన శరీరాల బొమ్మలు ఆలోచనను క్షతం చేస్తున్నాయి.

ఇందాక భోజనం చేస్తూ చేస్తూ మాటల్లో తెలుసుకున్నది ఏమిటంటే ఆ పార్కు పేరు అమరధామం అని. గతంలో ఒకసారి నేను విన్నాను. కానీ చూడడం ఇదే మొదటిసారి. నేను తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకున్నాను. అవును దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటంలో అనుకుంటాను దీని గురించి చదివాను. అది పరకాల ఘటన అని.. జాతీయ జెండా ఎగురవేసి నందుకుగాను ఆనాటి నిజామ్ ప్రభుత్వం, నిజాం ప్రైవేట్ సైన్యం రజాకర్లు గ్రామస్థులను భయబాంత్రులకు గురిచేసే విధంగా జెండా ఎగరేసిన యువకులను చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపేశారు. మరింకెవ్వరూ తిరగబడకూడదని గ్రామస్తులను గాయపరిచారు. గ్రామాన్ని తగులబెట్టారు. అదొక దారుణ సంధర్భం. ఏళ్ళ తరబడి అణిచిపెట్టుకున్న పరాధీనత పురికొలిపిన స్వాతంత్ర్య కాంక్ష ఓ వైపు, ఎలాగైన తమ చేతుల్లోంచి జారిపోతున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న రాజ్యం తలంపు ఒకవైపు.. కలిపి తెలంగాణ అంతటా భయానక వాతావరణం నెలకొన్న సందర్భం అది.

భారత దేశంలో స్వాతంత్ర్య పోరాటపు ఛాయలు తెలంగాణ గ్రామాలకు చేరకుండా రాజ్యం చెయ్యడ్డు పెట్టింది. ఆనాటి ఆర్య సమాజం , గ్రంధాలయ ఉద్యమం , కమ్యూనిస్టు నేపథ్యంలో ఆంధ్ర జన సంఘం , తదుపరి ఆంద్ర మహాసభ కార్యాక్రమాల వల్ల నూతన ఉత్సాహం పొందిన తెలంగాణ యువత తమ సామాజిక స్థితిని అంతదర్శనం చేసుకునేలా చేసింది. కొత్త రక్తం కొత్తగా వినిపిస్తున్న స్వేచ్చా మంజీరాలను ఆలపించింది. పర్యవసానంగా కొన్ని గాయాలు ..పరకాల ఘటన కూడా అటువంటిదే. ఆ గాయపు గుర్తుకు ఇప్పుడు అమరధామం అని పేరు పెట్టారు. అది జరిగింది 1947 సెప్టెంబర్ రెండవ తేదీన. సరిగా మరో యాడాదికి గానీ తెలంగాణ ప్రజ వెలుగు మొఖం చూడలేదు.అయితే ఈ అమరధామం 2003 లో కట్టారట. అప్పటి హోమ్ మంత్రి LK అద్వానీ చేతుల మీదుగా ఆవిష్కరించారట. అంటే దాదాపు అర్థ శతాబ్దానికి పైగా ఈ అమరుల స్మృతిపథం కొత్త తరానికి అందలేదన్నమాట.

భారత స్వతంత్ర సంగ్రామంలో తెలంగాణ భాగస్వామి కావడానికి చాలా ఆలస్యమైనప్పటికీ జాగరూకత చెందినటువంటి తెలంగాణ సమాజం స్వతంత్ర ఫలాలను కోరుకుని జరిపిన సాయుధ పోరాటం ప్రపంచ రైతాంగ ఉద్యమాలలోనే ఒక గొప్ప చారిత్రక సందర్భాన్ని నమోదు చేస్తుంది. అప్పటి నిజాం నవాబుల, జమీందారీ వ్యవస్థల దయాదాక్ష్యన్యాల మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామీణ ప్రజానీకం అధికార వర్గానికి వ్యతిరేకంగా రైతులంతా ఒక్కటై సాగించిన పోరాటం ఆధ్యంతం సాహసోపేతం. ఈ అంశాలనే వరంగల్ వాస్తవ్యులు అంపశయ్య నవీన్ కాల రేఖలు నవలగా కళ్ళకు కట్టినట్టు రాసారు.

తెలంగాణ భారత ప్రభుత్వంలో విలీనమయ్యాక మలుపు తిరిగిన సాయుధ పోరాటం లక్ష్యం తెలంగాణ ప్రజానీకాన్ని మరొక కొత్త సంఘర్షణలోకి నెట్టింది. ఈ రెండు సందర్భాలలోనూ అంతగా విశ్లేషించబడని అంశం అడవులు ఎలా ప్రభావితం అయ్యాయనే. ఎందుకంటే సాయుధ పోరాటంలో ప్రత్యేక్షంగా పేర్కొన్న అంశం అధికార బదలాయింపు అయితే పరోక్షంగా అది సామాన్యులు భూముల యాజమాన్య హక్కులు పొందడం..ఒక్క తెలంగాణాలోనే కాదు దేశం అంతా అదే పరిస్థితి. ఈ రెండిటి మధ్య ప్రభావితం అయినది అడవులు.. వన్యప్రాణులు. రాజకీయకోణాలని సంభంధం లేకుండా అడవులు వన్యప్రాణులు కూడా ఈ పోరాటంలోకి నెట్టివేయబడ్డాయి, గాయపడ్డాయి, అమరులయ్యాయి.

స్వాతంత్రానంతరం ప్రభుత్వం మేలుకొని కాపాడకపోతే ఈనాటి అడవులేవీ ఉండేవి కావనడం అతిశయోక్తి కాదు. ఎలాగంటే బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశాన్ని ఆక్రమించుకొని పెత్తనం చేయడం మొదలు పెట్టాక అప్పటివరకు రాజ్య పరిపాలన చేసిన వాళ్ళను రాజ్య భత్యం చెల్లించి పక్కన పెట్టి, ఆనాటి ప్రధాన ఆదాయవనరులైన పంటలపై శిస్తు వసూలు అధికారం పొందింది. అప్పటివరకు కథ బాగానే ఉంటుంది.
వలసవాదులకు ముందున్న రాజ్యాల్లో శిస్తు వసూలు చేసుకునేటప్పుడు భూమిహక్కులు ఆయా సాగుదారుకే ఉండేది. అడవులపై అధికారం అందరిదీనూ, ఎప్పుడూ అడవులను ఉపయోగించుకోవడంలో రాజ్యం జోక్యం చేసుకున్న దాఖలాలు పెద్దగా కనపడవు. ప్రజలుకానీ , రాజ్యం కానీ విచక్షణా రహితంగా అడవులను ధ్వంసం చేసిన దాఖలాలు లేవు. అయితే సంప్రదాయ వినియోగాన్ని అడ్డుకోలేదు. వన్యప్రాణులకు వచ్చిన నష్టమూ లేదు. చారిత్రక పరిపాలన గ్రంధం కౌటిల్యుని అర్థ శాస్త్రంలోనే అటవీ, వన్యప్రాణుల నిర్వహణ, నియంత్రణ మీద నియమాలను కలిగి ఉన్నాం. కౌటిల్యుడు స్పష్టంగా రాసాడు, ఉదాహరణకు ఎవరైనా ఏనుగును చంపితే మరణ శిక్షను విధించాలని , సహజ మరణం పొందిన ఏనుగు నుంచి మాత్రమే దంతాలను సేకరించాలని , కలపను, ఇతరాలను అడవి నుంచి సేకరించేటప్పుడు వాటిని సంరక్షిస్తూ వినియోగించుకోవాలని రాసాడు.

ఇంకా లోతుగా అన్వేషిస్తే రామాయణ కాలం నాటికే మనకు అటవీ నిర్వహణ తెలుసు. సుందరాకాండ 13వ సర్గ 62 వ శ్లోకంలో అడవిలో కలుపుతీయడం గురించి, 63వ శ్లోకంలో వనపాలకుని ప్రస్తావన వస్తుంది. అంతెందుకు లంకలో సీతమ్మను ఉంచిన అశోకవనం ఒక మానవ నిర్మత వనం అని సుందరాకాండ చదివితే యిట్టె అర్థం అవుతుంది అంటే అప్పటికే ఉన్న అడవులతోపాటు రాజ్యాధినేతలు కూడా అడవులను పెంచడానికి, నిర్వహించడానికి కృషి చేసారన్నమాట. అయితే చరిత్రను అధ్యయనం చేసినప్పుడు భారత సాంస్కృతిక చరిత్ర మసకబారినట్టే సంప్రదాయ నిర్వహణా వ్యవస్థలు కూడా మసకబారినట్టు గుర్తించడం పెద్ద కష్టం కాదు. కాకపోతే సామాజిక మార్పులు అధ్యయనం చేసినంత లోతుగా ప్రాకృతిక వనరుల నిర్వహణా మార్పును అధ్యయనం చేయలేకపోవడం ఒక పూరించలేని అగాదంగా మిగిలిపోయింది. ఇలా అనుకున్నప్పుడు నేనెప్పుడైనా ఈ అగాధాన్ని పూరించగలగడానికి కృషి చేయగలనా అని ఆలోచిస్తుంటాను,అందుకు అన్వేషిస్తుంటాను , ఇలా రాసుకుంటాను, నేను మాట్లాడలేని వాటి చరిత్ర చెప్పాలని అనుకుంటాను , మరికాకపోతే నోరులేని వాటి వేదన ఎలా తెలుస్తుంది?

అంతకంతకు చలిపెరుగుతున్నది. నాతో పాటు ఇతర సభ్యులు ఇద్దరు కూడా ఒకరికి సరాసరిగా పాతికేళ్ళుగా మరొకరు ముప్పైయేళ్ళుగా అటవీశాఖలో పనిచేస్తున్నారు. పున్నమి చంద్రుని దాటుకొని వెళ్ళే మబ్బులు తెల్లగా మెరిసిపోతున్నాయి. ఏవేవో కీటకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. కనిపించడం లేదు. అంతతసేపు కూర్చోలేక కాసేపు అటూ ఇటూ తిరుగుతున్నారు. గోడౌన్ పక్కన బస్తాలను లోపలికి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసిన రాంప్ మీద కూర్చొని పలకరించడం మొదలు పెట్టాను. అనుభవజ్ఞుల నుంచి నేర్చుకోవడం ఆ అనుబవాన్ని సంపాదించడానికి పట్టిన కాలాన్ని పొదుపు చేసుకోవడం అని నేను భావిస్తాను. నాకలా అడిగి తెలుసుకోవడం చాలా ఇష్టం. మా బృంద సభ్యులను గతంలో అడవుల నరికివేత , అక్రమ కలప రవణా ఎలా జరిగేది అని అడిగినప్పుడు వారు అడవుల గురించి చెప్పడం మొదలుపెట్టారు.

అడవి ఎంతో బాగుండేదట. ఎటుచూసినా విస్తారమమైన పెద్ద పెద్ద చెట్లతో ఎంతో గంభీరంగా చక్కగా ఉండేదట అప్పట్లో. చాలా అడవులు ఉన్న కాలంలో అడవులను నరికి ఎడ్లబండ్లతో రవాణా చేసినప్పుడు ఎంతో సాహసంతో పట్టుకోవాల్సి వచ్చేదట. అక్రమార్కులను పట్టుకోవడానికి ఎటువంటి సౌకర్యం గాని మరో విధమైనటువంటి సమాచార వ్యవస్థ లేని కాలంలో బృందాలు బృందాలుగా విడిపోయి వెళ్లేవారట. దట్టమైన అడవులు, అంతగా విస్తరించని రహదారులు,ఎత్తుపల్లాల భూ స్వరూపం బలిష్టమైన ఎడ్లబండ్లలో బరువైన కలప దుంగలు, ఎంత కష్టమో కదా..అయితే కలప దుంగలను రవాణా చేయడం సులభమైన పనేమీ కాదు, పెద్ద పెద్ద దుంగలు బండ్లలోకి ఎత్తడం, దింపడం, ఎత్తుపల్లాల అడవి దారుల్లో రవాణా చేయడం పెద్ద సవాలే ..అది కూడా ఎవరికీ తెలియకుండా దొరకకుండా చేయాలి. ఈ పనికి మనుషులూ , ఎడ్లూ ప్రత్యేకంగా శిక్షణ పొందుతారని అంటే మీరు నమ్మాలి. కలప సేకరించే అడవికి ముందే వెళ్లి యే చెట్లు నరకాలో గుర్తించి , దారులు మర్చిపోకుండా కొమ్మలను విరివడమో గొడ్డలి గాటు పెట్టడమో చేస్తారట.

కలప రవాణాకోసం ఉపయోగించే ఎడ్లను బాగా తిండి పెట్టి మేపేవారట. ఎడ్లు అలసట లేకుండా నడవడానికి వాటికి సారా తాగిస్తారట. ఒక వెదురు బొంగును పశువు నోట్లో ఉంచి సారా తాగిస్తారట. సారాయి మత్తులో ఎడ్లూ అంతంత దుంగలను సునాయాసంగా మోసేవట. బరువు మోసి ఎడ్ల మెడలు వాసిపోతే ఈ కాలానికే పూతకు వచ్చే బండి గురవింద ఆకు నూరి వాటి మెడ మీద కట్టు వేస్తారట. ఈ కలప రవాణా చేసే పశువులు కూడా నిష్ణాతులు అనే చెప్పాలి. ఈ పశువులు ఎంత అందంగా ఉంటాయో తెలుసా, మీరు ఎప్పుడైనా చూసారా, వీటికీ గంభీరమైన సౌందర్యం ఉంటుందంటే నమ్ముతారా, నిజమే అవి ఎంతో అందంగా ఉంటాయి, కండ పట్టిన శరీరం, బలిష్టమైనటువంటి కాళ్ళు.. దర్పమైన నడక. ఇటువంటి పశువులను నేను ఇప్పటివరకు నాలుగైదు సందర్భాల్లో మాత్రమే చూశాను. ఇప్పుడు గ్రామాల్లో ఇటువంటి పశువులు లేవు, ఆ పశువుల పెంపకాన్ని చేపట్టే వారు కూడా లేరు. ఇప్పుడు అడవి లేదు అటువంటి అవసరమూ లేదు.

ఇటువంటి పనులు అంత సులభమైనవి , కావు అయినప్పటికీ కలపను సేకరించడం, ఒక చోట చేర్చడం, రవాణా చేయడం , వ్యాపారం చేయడం వాళ్ళు మాత్రమే చేయగలిగే వాళ్ళు. వేరే వాళ్ళకి అమలు చేయడం సాధ్యం కాదు కూడా. వీరంతా ఒక సమూహంగా ఏర్పడి ఇటువంటి పనులు చేస్తారు. ఒక్కొక్క సమూహంలో దాదాపు పది పదిహేను మంది ఉంటారు.ఒక్కో బండికి ఇద్దరు వ్యక్తులు కాపలాగా ఉండి బండి తోలుతారు. మా బృంద సభ్యులు వారి గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా చెప్పుకుపోతున్నారు. ఎడ్ల బండ్లు వెళ్ళిన ఆనవాళ్లు గుర్తించడం కోసం పశువుల పెండ ఆనవాళ్ళు , మూత్రం ఆనవాళ్ళు , బండి చక్రం ఆనవాళ్ళు పట్టి గుర్తించేవారట. పశువుల మూత్రం కనిపించిన చోట చెప్పులు విడిచి కాలితో తాకితే మూత్రం వేడిని బట్టి ఎంతసేపటి క్రితం బండి దారి దాటిందో గుర్తు పట్టేవారట. వాళ్ళు తక్కువేమీ కాదు , ఎడ్ల బండి చివరన చెట్ల కొమ్మలతో చీపురులా కట్టి ఈడ్చుకు వెళ్ళే వారట. అలా చేయడం వల్ల ఎడ్ల కాలి గుర్తులు , బండి గీరల గుర్తులు చెదిరిపోయేవట.

ఇలాంటి ఒక సంఘటన గుర్తు చేసుకుంటూ ఒకసారి ఇలాంటి పని మీదే వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్లంతా అటవీ సిబ్బంది బృందం పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారట. అలా పట్టుకున్నప్పుడు అడవి దారులనుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. వాళ్ళకి దొరికితే ఇక అంతే సంగతులు. ఎంతో పకడ్బందీగా చేసే ఈ అక్రమ కలప రవాణాలో , ఇలాంటి ఎడ్లబండ్లను , వాటి యజమానులను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం తలకు మించిన భారం. ఇదంతా చేసి అటవీ అధికారులకు దొరికిపోతే వాళ్ళు ఊరుకుంటారా అందుకే నిరాయుధులైన అటవీ సిబ్బంది పై దాడికి తెగబడతారు. ఇటు అటవీ అధికారులకూ ఇది సవాలే. అటువంటి కలపను స్వాదీనం చేసుకోవడం, అక్రమార్కులను పట్టుకోవడం , ఎడ్లబండను స్వాదీనం చేసుకోవడం ..ఇంకా ఇతరత్రా అసౌకర్యాలు ఎలాగూ ఉండనే ఉంటాయి. పట్టుకున్న చోట నుంచి కలపను తీసుకుని వచ్చి ప్రభుత్వ కలప డిపోలో జమ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. దుంగలు అందరూ ఎత్తలేరు. దానికి ప్రత్యేక శిక్షణ ఉన్నటువంటి శ్రామికులు మాత్రమే పని చేయగలరు, దాని పరిమాణాన్ని బట్టి ఒడుపుగా ఎత్తవలసి వస్తుంది, తాళ్ళు కట్టి లాగడం అవతల వేయడం ఇవన్నీ శ్రామిక నైపుణ్యాన్ని బయటపెట్టే పనులు. అయితే అన్ని వేళలా ఇటువంటి శ్రామికులు అందుబాటులో ఉండరు. చాలా సందర్భాల్లో అటవీ అధికారులు తాము పట్టుకున్న కలపను అడవిలో నుంచి బయటకు తీసుకు వచ్చే పని సాధ్యం అయ్యేది కాదు. ఈ సందర్భాల్లో వారితో ఘర్షణ జరిగేదట. తర్వాత కాలంలో లారీలు వచ్చాక అక్రమ కలప పట్టుకునే విషయం మరింత జటిల సమస్య అయి కూర్చుందని వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాను.

చాలా సందర్బాలలో దుండగులు సిబ్బంది పై దాడులు చేసినప్పుడు తప్పించుకోవడానికి పరిగెత్తే వారట. అటవీ శాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు లేవు. అంటే మొదటినుంచి లేవని కాదు. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత జరిగిన సామాజిక స్థితులలో అతివాద ఉద్యమకారులు తరచుగా ఆయుధాలకొరకు పోలీసు, అటవీ కార్యాలయాలపై దాడులు చేసిన మూలంగా అటవీ అధికారుల ఆయుధాలను పోలీసుశాఖకు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఆయుధాలు ఇవ్వబడలేదు. అనేక దురదృష్టకర సందర్భాల్లో అటవీ సిబ్బంది ఇలా అక్రమ కలప రవాణాదారులను పట్టుకునే క్రమంలో, భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. అలా అటవీ రక్షణలో అమరులైన సిబ్బంది స్మృతిగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం ప్రతి ఏడాది సెప్టెంబర్ 11న నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు నవంబెర్ 10 వ తేదీని జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా జరుపుకునే వారు. ఈ నవంబెర్ 10 , (1991వ సంవత్సరం ) తేదీననే కర్నాటకలో అంతర్జాతీయ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్కడి అటవీశాఖ ఉన్నతాధికారి అయిన మన తెలుగువాడు, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన పందిల్లపల్లి శ్రీనివాస్ ను హత్య చేశాడు. యావత్ దేశాన్ని కలిచివేసింది ఈ సంఘటన.అప్పటినుంచి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుతూ వస్తున్నారు. ఇప్పటివరకు పద్నాలుగు వందల మంది అటవీ సిబ్బంది అడవులను కాపాడడంలో అమరులయ్యారు. అయితే ఇప్పుడు వన్య సంపదను కాపాడడంలో అమ్రితాదేవి ఆదిగా గొప్పత్యాగం చేసిన మూడువందల అరవై బిష్ణోయ్ ప్రజల స్మృతిగా సెప్టెంబర్ 11న జరుపుకుంటున్నాం.

బిష్ణోయ్ తెగవారు రాజస్తాన్ కు చెందిన వారు. నేను 2007 ఆ బిష్ణోయ్ తెగ వారిని కలుసుకున్నాను. అమ్రితాదేవి సమాధిని దర్శించి ఈ కథను వారి నోటి నుంచే విన్నాను. 1730 ప్రాంతంలో అక్కడి జోద్ పూర్ రాజా వారు కొత్త మహల్ కట్టడంకొరకు సున్నం తయారు చేయడానికి వీరు నివసించే ఖేజ్డీ గ్రామంలో ( ఖేజ్డీ అంటే జమ్మి చెట్టు ) విస్తారంగా లభించే జమ్మి చెట్లను నరకివేయాలని అనుకుంటారు. అందుకు ప్రతిఘటించిన గ్రామస్తులు అమ్రితాదేవి అద్వర్యంలో ఒక్కొక్కరు ఒక్కో చెట్టును హత్తుకొని తమ ప్రాణాలు తీసాకే చెట్టును నరకాలని అడ్డు పడతారు. రాజు సైన్యం వారిని చంపివేసి రాజాజ్ఞను పాటిస్తారు.అలా మూడు వందల అరవై మందిని చంపేస్తారు. ఈ విషయం తెలుసుకున్న రాజు తను చేసిన పొరపాటుకు సిగ్గుపడి బిష్ణోయ్ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పుడూ భవిష్యత్తులోనూ ఎవరూ బిష్ణోయ్ ప్రజలు నివసించే చోట వన్య సంపదకు ఎటువంటి నష్టం కలగజేయకూడదని ఆజ్ఞాపిస్తాడు. ప్రఖ్యాత పర్యావరణవేత్త సుందర్ లాల్ బహుగుణ చిప్కో ఉద్యమానికి స్ఫూర్తి నిచ్చింది ఈ కథనే. ఈ విషయ చెప్తున్నంత సేపూ వారి కళ్ళలో ఒక నిండైన గర్వం తొనికిసలాడింది. మేము అక్కడి వెళ్ళిన కాలంలోనే ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, కృష్ణ జింకను వేటాడిన కేసు నడుస్తున్నది .ప్రకృతిని కాపాడుకోవడంలో అందుకు పోరాడటంలో బిష్ణోయ్ ప్రజలది ఎంత నిబద్దత !

ఈ ఒక్క విషయమే కాదు ఇంతకుముందు మన దేశంలో ప్రజలు యేనాడు విచ్చలవిడిగా అడవుల్ని ధ్వంసం చేసిన చరిత్ర కనబడదు. రాజులకు వేట నేర్పడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. అంతటా వేట చేసేవారు కాదు. ఎంపిక చేసిన విడిదిలలోనే ఈ ఏర్పాట్లు ఉండేవి. ఇవి నిన్న మొన్నటి వరకూ అంటే నిజాం పరిపాలనాకాలం నాటికీ కొనసాగాయి. మరి ఎక్కడ మార్పు మొదలైంది. ఏకబిగిన అడవుల ద్వంసం ఏ కారణం అయి ఉంటుంది అని ఆలోచించినప్పుడు అనివార్యంగా మనం పారిశ్రామీకరణ తెచ్చిన మార్పులను మననం చేసుకోవాల్సి వస్తుంది.

జర్మనీలో ఆవిరి ఇంజను కనిపెట్టింది మొదలు ప్రపంచం అంతా ఒక్క కుదుపు. పరిశ్రమలు , మెరుగైన రవాణ సౌకర్యాలు ఇలా దానంతట అదిగా మార్పు మొదలైంది. యూరోప్ అంతటా మొదలై, యూరోప్ అధీన దేశాలను ఎలా ఈ విప్లవాత్మకమైన మార్పులో భాగస్వామ్యం చేసి లాభాలు గడించాలన్న ఆలోచన మొదలైంది. ఇంకేం ఎక్కడిక్కడ ప్రకృతి వనరుల సర్వేక్షణ, మానవ వనరుల సమీకరణ , అధికారాల విస్తరణ ల పట్ల అధ్యయనం మొదలైంది, అమలు చేయడానికి రంగం సిద్దమైంది. ఆసియా దేశాల ప్రకృతి వనరులు , ఆఫ్రికన్ దేశాల మానవ వనరులు, యూరోప్ దేశాల అధికార విస్తరణ ఇంకేం సరికొత్త పారిశ్రామిక ప్రపంచానికి సరితూగే యవనిక. అందులో భాగంగానే కొత్త అవసరాలకి అనుగుణంగా కొత్త అధ్యయన విభాగాలు ప్రారంభించబడ్డాయి. అటవీ అధ్యయన శాస్త్రం అందులో ఒకటి.

ఒక పద్ధతి ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం అడవులపై అధికారం సాధించింది. రూట్స్ నవలలో ఎలెక్స్ హెలీ ఒక మాట రాస్తాడు. బ్రిటిష్ వారు ఎక్కడికి వెళ్ళినా ముందుగా చేసే పని,తమకు అనుకూలంగా చట్టాన్ని తయారుచేయడం, చట్టం మాటున జనాన్ని నియంత్రించడం, అధికారాన్ని కొనసాగించడం , విస్తరించడం జరుగుతుందని… భారతదేశంలో కూడా ఈ చారిత్రక వాస్తవాన్ని మనం గుర్తించవచ్చు. బ్రిటిష్ కాలంనాటి అటవీ చట్టాలు , విధానాలు అందుకు అతీతమైనవేమీ కాదు. పారిశ్రామిక అవసరాలకు భూమిని అన్వేషించి విస్తారంగా పత్తి పంటను, నీలి మందును, తేయాకును పండించడం, ఉత్పత్తిని ఒక చోటునుంచి మరో చోటుకు రవాణా చేయడం కొరకు రైల్వేలైన్ లను ఏర్పాటు చేయడం వంటివి భారతీయ అడవుల విధ్వంసానికి ప్రధాన కారణం.

మనదేశంలో 1793నాటికి కార్న్ వాలిస్ జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇది అప్పటివరకు రాజరికపువ్యవస్థ ద్వారా నియంత్రించబడిన గ్రామీణ వ్యవసాయ క్షేత్రాలను తమకు అనుకూలమైన వ్యక్తులను జమీందార్లుగా నియమించుకొని పరోక్షంగా ఆయా భూములమీద అధికారం పొందేలా చేసింది. రాజ వంశాల, సామంతుల ప్రాభవం దీని వల్ల మరుగున పడింది. ఆయా జమీల నుంచి అధిక ఆదాయం రావాలంటే అధిక విస్తీర్ణం సాగు చేయాలి కనుక జమీ కింద జమపడే భూములను అడవులను నరికి విస్తరించాలి. ఇక వాణిజ్యపంటలుగా పత్తి పంటను, నీలి మందును, తేయాకును పండించడం ఎప్పుడైతే మొదలయ్యిందో వాటి రవాణా కొరకు రైల్వే లైన్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి అయింది.రైల్వే మార్గాలను ఏర్పరచాలంటే సిమెంటు వాడకం లేని నాటి రోజులలో స్లీపర్లుగా కలప తప్ప మరో వెసులుబాటు లేదు.

మన దేశంలో 1855 నుంచి రైల్వే లైన్లు ఏర్పటు చేయడం ప్రారంభం అయితే 1910 నాటికి యాభై వేల కిలోమీటర్లు విస్తరించింది. దీనికి కావలసిన కలప, వేల ఏకరాల అడవులను నరికితే లభించింది. ఉత్తరాన దేవదారు వృక్షాలు , తూర్పున బర్మా దాక విస్తరించిన టేకు అడవులు, మధ్య భారతంలో సాల్ అడవులు ఇందుకోసం కరిగిపోయాయి. అప్పటి వరకు ప్రజల వినియోగానికి అందుబాటులో ఉండే అడవుల మీద యాజమాన్య అధికారం ఉంటె తప్ప విస్తారమైన దారు వనరులను సేకరించడం సాధ్యం కాదు. అందుకొరకే 1865 లోనే ఇంపీరియల్ ఫారెస్ట్ ఆక్ట్ తీసుకు వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ చట్టంతో అడవులమీద నియంత్రణ సాధించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ అధికారులు తప్ప మరొకరు అడవిలోకి వెళ్ళడం మీద నిషేధం విధించబడింది. 1878 లో అటవీ చట్టం తీసుకువచ్చి మొట్టమొదటి సారిగా రక్షిత అడవులు, రిజర్వు అడవులు, గ్రామీణ అడవులుగా విభజించింది. దీనివల్ల ప్రజలకు ప్రభుత్వం సూచించిన లేదా అనుమతించిన అడవులలోకి మాత్రమే అనుమతి ఇవ్వబడింది.

అదే సమయంలో అంటే 1893లో Dr. Voelcker భారతీయ వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం (Improvement of Indian Agriculture) ఎలా అని ఇచ్చిన సిఫార్సుల మేరకు 1894 లో చేసిన మొట్టమొదటి అటవీ విధానంలో అడవులను నరికి వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహం ఇవ్వబడింది. ఇదే ఇదే ఈ పాలసీనే భారతీయ గ్రామీణ సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన అంశం. గ్రామీణసామాజిక ఆర్థిక అసమానతలను విశ్లేషించడంలో తరుచుగా మరుగున పడే అంశం. ఈ పాలసీలో సూచించిన వెసులుబాటును ఆధారం చేసుకొని అనేక జమీల విస్తీర్ణం పెంచుకునే ప్రయత్నం చేసారు జమీందార్లు. ఈకారణం చేత జమీందార్లు ఘనమైన క్షేత్రాలకు అధిపతులు కాగలిగారు. అడవులను నరికి సాగు చేసిన ప్రజలు కౌలు దార్లు అయ్యారు. అసలైతే బ్రిటిష్ వారు ఈ పాలసీ వల్ల రెండు రకాలుగా లాభపడ్డారు, ఒకటి సాన్ద్రతర అడవులమీద అధికారం పొంది తమకు కావలసిన కలపను సులువుగా సేకరించగలగడం , రెండవది జమీల విస్తీర్ణం పెంచి శిస్తు వసూళ్లను పెంచుకోవడం ,మరొక లాభం కూడా జరిగింది అది వాణిజ్య పంటలు సాగు చేసేందుకు లభించే సాగు భూమి అందుబాటు పెరగడం , దానిని నిర్బంధంగా నైనా అమలు పరిచే జమిందార్లు లభించడం.

మొదటినుంచీ భారతీయ గ్రామాలది స్వయంపోషిత వ్యవస్థ. వృతుల ఆధారంగా జీవనం సాగించడం వల్ల బయటి నుంచి ఎటువంటి ఒత్తిడి వచ్చినా గ్రామీణ సామాజిక స్థితిమీద చూపిన ప్రభావం బహు తక్కువ. అయితే బ్రిటిష్ వారు వచ్చాక మాత్రం ఇది కొనసాగలేదు. బ్రిటిష్ పారశ్రామిక విధానం మొదలైనప్పటినుంచి వృత్తి పనులు నిర్వీర్యం అయి సంప్రదాయకంగా జీవించే వారి మనుగడ కష్టం అయింది. అనివార్యంగా వారంతా జమీలలో పనిచేసేందుకు కుదురుకున్నారు. వరుస కరువులు , యుద్దాలు, బ్రిటిష్ విధానాలు గ్రామీణ సమాజాన్ని ఒక అసహాయక స్థితిలోకి నెట్టివేసాయి. లక్షలాది ఎకరాల అడవులు సువ్యవసాయ క్షేత్రాలయ్యాయి. జమీల అధికారం స్థిరపడింది. వ్యవసాయక ఆధారిత కుటుంబాలు ప్రధాన నిర్ణాయక శక్తులుగా ఎదిగాయి. అధికారం చెలాయించే వారు , సేవకులు , శ్రామికులుగా గ్రామీణ ప్రజానీకం విడిపోయారు. మన గ్రామీణ సమాజంలో అంతకుముందు లేని ఆర్థిక అసమానతలు , సామాజిక స్థాయిలుగా పరిణామం చెందడానికి దోహదం చేసాయి.

ఇక అడవుల విషయానికి వస్తే లక్షలాది ఎకరాల అడవులు నరికివేయబడ్డాయి, వన్యప్రాణులు తగిన ఆవాసం లేక వాటి సంఖ్య తగ్గింది. రక్షిత అడవులలోకి ఎవరికీ అనుమతి లేదు. అడవులను నిర్వహించడానికి అటవీ అధికారులు నియమించబడ్డారు. అప్పటి అటవీ అధికారుల పని ప్రధానంగా కలపను సేకరించడమే.

అంతకుముందు స్వేచ్చగా పశువులను మేపుకుంటూ , పోడు సాగు చేసుకుంటూ , అడవుల మీదనే ఆధారపడి బతికే గిరిజనులు నిరాశ్రయులయ్యారు. పశువులను మేపుకునే వారు ప్రభుత్వానికి పశువుకి ఇంత అని పన్ను కట్టవలసి వచ్చేది. కలప , ఇతర వనరులను సేకరించుకోవడం మీద నిషేధం ఉండేది. ఇది స్థానిక ప్రజలకు , అధికారులకు , ప్రభుత్వానికి మధ్య తరచుగా ఘర్షణకు కారణమయ్యేది. అది పోనుపోను గిరిజన తిరుబాట్లుగా పరిణమించింది. భారత స్వతంత్ర సంగ్రామానికి అదనంగా గిరిజన, రైతాంగ పోరాటాలు ఈ పర్యావసానాన్ని కొనసాగించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1882 మద్రాస్ అటవీ చట్టానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు చేసిన విశాఖ మన్యం తిరుగుబాటు , నిజాం అటవీ చట్టానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్ గోండుల తిరుగుబాటు అలాంటివే. అటవీ భూములమీద ప్రభుత్వ నిర్భందానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు ఇవి అయితే తెలంగాణ సాయుధ పోరాటం సాగు భూమిపై యాజమాన్య హక్కులకోసం చేసిన పోరాటం. ఇందాకే చెప్పినట్టు జమీలలో కౌలు దార్లుగా మారిన రైతులు తమ యజమానికి అంటే జమీందార్లకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి ఉండాలని పోరాడారు. రైతులను ఇందుకు సంఘటిత పరిచి తగిన సన్నద్దతను అందివ్వడంలో ఆనాటి స్వత్రంత్ర కాంక్షతో పాటు కమ్యూనిస్టూల నేపథ్యంలో ప్రయత్నం జరిగిందనేది అంగీకరించవల్సిన విషయం. అయితే హైదరాబాదు విమోచన తర్వాత కమ్యూనిస్టు వర్గాల చారిత్రక, సైద్దంతిక తప్పిదం వారిని జన ప్రధాన స్రవంతికి దూరం చేసి అడవులకు పరిమితం చేసింది.

చాలా మంది భారతీయుల ప్రస్తుత సామాజిక అసమానతలకు, సనాతన జీవన విధానంలోని లోపాలు కారణమని భావించడం నేను గమనించాను. అయితే అది విదేశీ పాలకుల దమననీతి వలన ఏర్పడిన పరిస్థితుల పరిమితులు తప్ప మరొకటి కాదన్న విషయం అర్థం చేసుకోవలసి వస్తుంది. ఈ దమన నీతి వల్ల బతుకు తెరువు కోల్పోయిన అనేక వృత్తుల వాళ్ళు మరో గత్యంతరం లేక వ్యవసాయ పనులలో చేరిపోయారు. అప్పటికి సిద్దంగా ఉన్న జమీందార్ల వ్యవస్థ వివిధ స్థాయిలలో వారిని స్థిరపరచింది. యే వృత్తి పనివారు అత్యధికంగా బ్రిటిష్ విధానం వల్ల దెబ్బ తిన్నారో వారు అత్యధికంగా పేదలుగా , అట్టడుగు స్థాయికి నెట్టివేయబడ్డారు. అందువల్లనే అత్యధికులు వ్యవసాయ కూలీలుగా మారారు. కూలీలు అని అనడం, శ్రామికులు అని అనడం సరియైనది కాదని నా అభిప్రాయం. అందుకు ప్రతిగా వ్యవసాయ సహాయకులు అని అనడం సరియైనదని నేను భావిస్తాను. శారీరక శ్రమ చేసేవారిని శ్రామికులు అంటుంటారు కానీ శ్రమ లేకుండా యే పని ఉంటుంది చెప్పండి. అందునా వ్యవసాయం ఉత్త శారీరక శ్రమ కాదు ఒక విజ్ఞానం తో కూడిన నిర్వహణ , కార్మికులు అందం కూడా సరైనది కాదు, వారు సహాయకులు, నైపుణ్యం తో కూడిన సహాయకులు మాత్రమే. శ్రమ చేయడంలో శ్రమ ఉంటుంది కానీ కేవలం శ్రమ వల్లనే వ్యవసాయం జరుగదు.

చైనాపై అరుణతార (Red Star over China) రాసిన ఎడ్గార్ స్నో, మావో ను ఇలాంటి ప్రశ్న నే అడుగుతాడు. యూరోప్ పారిశ్రామిక కార్మికుల నేపధ్యంలో వచ్చిన కమ్యునిస్టు సిద్ధాంతాన్ని, ఆసియాలోని వ్యవసాయ కూలీకి/ శ్రామీకునికి (సహాహయకునికి) ముడిపెట్టడం ఎలా సాధ్యమవుతుందని అంటాడు. పారిశ్రామిక కార్మికులను , వ్యవసాయ సహాయకులను ఒకే గాటన కట్టలేము. భాషను ఒకేలా అనువర్తింపజేయడం వల్ల తరచుగా సిద్ధాంతపరమైన పొరపాటు దొర్లిపోతుంది. వ్యవసాయం ఒక పరిశ్రమ కాదు. ఒక వృత్తి. ఆసక్తి ఉన్న వారు అందులో కొనసాగవచ్చు. అందులో ఇంత ఉత్పత్తి సాధించాలన్న నిర్భందమేమీ ఉండదు. కనుక శ్రామీకులు అనో , కార్మికులు అనో అనడం కన్నా సహాయకులు అనడమే సరియైనది. వారికి గౌరవం కూడా.

స్వతంత్ర సముపార్జన తర్వాత భారత ప్రభుత్వం జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది , భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి పరిమితికి మించిన మిగులు భూమిని అర్హులకు పంచింది. అయినప్పటికీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా లక్షలాది ఎకరాల అడవులను ఆక్రమించుకొని సాగు చేయడం మొదలు పెట్టారు. ఫలితంగా అడవుల విస్తీర్ణం మరింత కుదించుకుపోయింది.

స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన 1952 జాతీయ అటవీ విధానం భూగోలికంగా మైదాన ప్రాంతాల్లో ౩౩ శాతం , కొండ ప్రాంతాల్లో 66 శాతం అడవులు ఉండాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇది 24 శాతం మాత్రమే ఉంది. అనేక రాష్ట్రాల్లో అటవీ భూముల ఆక్రమణ అతి క్లిష్టమైన సమస్య. అది అనేక రకాలుగా వన్య సంపదకు , ప్రజలకు, అడవుల నిర్వహణకూ మధ్య ఘర్షణకు కారణమవుతుంటుంది. అటవీ ఆక్రమణలకు ఇలా అక్రమ నరుకుళ్ళు తోడై సమస్య జటిలమవుతుంది.

నాకు ఈ విషయాలన్నీ ఆలోచించినప్పుడు ఎంతో బాధకలుగుతుంది. అన్నన్ని చెట్లను తొలగించినప్పుడు వాటిపై ఆధార పడిన జీవరాశి ఎంతగా చెదిరిపోయిందో కదా…ఇంకా ప్రపంచానికి తెలియని జీవ రహస్యలన్నీ అంతటితో ఆగిపోయాయి కదా…వేల వేల వృక్షరాజాలు నేలకు ఒరుగుతూ తమ శరీర ఖండాల మీద ఇనుప చట్రాల మోయడానికి నిస్సాయంగా సిద్దపడిన వేళ ..ఈ నేల , ఆకాశపు వెన్నెల ఎర్రబడి ఉంటుందా..తమకు ఆశ్రయం పెద్ద పెద్ద అడవులు చిన్నవై పోతుంటే వన్య ప్రాణులన్నీ ఎంత చిన్నబుచ్చుకున్నాయో.. కుంచుకుపోయిన అరణ్యాన్ని దాటి యే కొండ కోనల్లోకి వలస పోయాయో. అవి విడచిన దుఖ సంద్రంలో మనం ఎప్పటికైనా మునిగిపోతామేమో …

అదిగో మేము ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. మా బృంద సభ్యుల పిలుపుతో అందరం మళ్ళీ ఒక సారి వచ్చినపనిపై దృష్టి పెట్టాం. డ్రైవర్ గబగబా జీప్ స్టార్ట్ చేసాడు. వెంటనే వెళ్లి వీలున్నంత తొందరగా కలప రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకోవాలి. చలిగాలిని చీల్చుకుంటూ వేగంగా వెళ్తున్నాం. చలిగాలి మరింత చల్లగా తాకుతున్నది. ఈ రోజు ఎలాగైనా పట్టుకు తీరాలన్న మా సంకల్పం నెరవేరినట్టె ఉంది. మాకు ఎదురుగ్గా వస్తున్న కలప వాహనం మాకు దొరికిపోయింది. తదుపరి కార్యక్రమాలకోసం మా బృంద సభ్యులం అంతే వేగంగా కిందకు దిగి పనిలో పడిపోయాం. పట్టుకున్న కలపతో నర్సంపేట వెళ్లి అక్కడ భద్రంగా ఉంచాలి. ఉదయం కేసు వివరాలు చూడవలసి ఉంటుంది. నర్సంపేట బయలుదేరాం. ఇక ఈ రాత్రికి నర్సంపేట చేరేసరికి తెల్లవారు ఝాము మూడు గంటలు అవుతుండవచ్చు.

నర్సంపేట చేరేసరికి వెన్నెల మరింత తేజంగా కాస్తున్నది. మా వెనుక వచ్చే వాహనంలో నిస్తేజంగా పడి ఉన్న నిన్నటి వృక్షం నేటి వెన్నెలను స్వీకరించలేదు. దానికి ఇది చల్లని క్షణం కాదు. తరుఘోష వెన్నెలను తరుముతున్నది. నిజానికి అది మరణించలేదు. హత్యచేయబడింది. నేను మృత వృక్షాన్ని తీసుకువెళుతున్నాను. దానితో పాటుగా క్షతమైన మనసును మోసుకుపోతున్నాను.

                                                     

                                                                                                                              -దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments