గొర్రెలు (కథలు )- షఫేలా ఫ్రాంకిన్

చేతికున్న వాచ్ లో టైం చూసుకుంది సుచరిత. హోమ్ బెల్ కొట్టడానికి ఇంకా పావుగంట ఉంది, ఆటోలో వెళ్ళినా రూమ్ కి వెళ్ళడానికి ఇంకో‌ పావుగంట‌. మెల్లగా పొత్తికడుపులో నొప్పి మొదలైంది. పోనీ, పర్మిషన్ తీసుకుందామనుకుంటే వాళ్ళ హెచ్.యం దుర్వాసురాలు. మొన్న అమ్మనాన్నలు ఊరెళుతుంటే, సెండాఫ్ ఇవ్వడానికి స్టేషన్ కి వెళ్ళినందుకు అందరిముందూ చెడామడా తిట్టేసింది. పర్మిషన్ అడగడం కన్నా ఈ బాధ భరించడం‌ మేలనుకొని బెల్ కోసం ఎదురు చూస్తుండగానే మోగింది. పిల్లల్ని తప్పించుకుంటూ కనపడిన ఆటోకి ఎక్కేసి ఇంటికి చేరుకుని బ్యాగ్ ని విసిరేసి బాత్రూమ్ కి వెళ్ళి వచ్చాక రిలీఫ్ గా ఉంది సుచరితకు.

కాస్త ఫ్రెషప్ అయ్యి రెస్ట్ తీసుకుంటుండగానే అమ్మ నుండి ఫోన్, అవీ ఇవీ‌ మాట్లాడాక వాట్సాప్ లో ఒక‌మూడు ప్రొఫైల్స్, ఫొటోలు పంపుతున్నాని, నచ్చిన వాళ్ళ ప్రొఫైల్ ఫార్వర్డ్ చేయమని, టైం కి తినమని, స్విగ్గీ నుండి ఆర్డర్లు ఎక్కువగా పెట్టుకోవద్దనీ, కాఫీ ఎక్కువ తాగొద్దనీ జాగ్రత్తల లిస్ట్ చదివింది. అన్నిటికీ నిరాసక్తిగా ఊ కొట్టి ఫోన్ కట్ చేసింది.

ఎందుకో పెళ్ళంటే ఒక అభద్రతా భావం వల్ల ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుంది కానీ సంవత్సరం నుండి వయసెక్కువ అవుతుందని అమ్మ ఏడుపులు, బెదిరింపులు మొదలుపెట్టింది. వాట్సాప్ నోటిఫికేషన్ చూసి మెసేజెస్ ఓపెన్ చేసింది, ఎలాంటి ఆతృత అనిపించలేదు ఆ ఫొటోలను చూసి,
ఫోన్ పక్కన పడేసి ఇవాళ వంట చేయాల్సిన డ్యూటీ తనదేనని గుర్తొచ్చి వంట ముగించేలోగా, రూమ్మేట్ వచ్చింది. ఇద్దరూ కలిసి భోజనం చేసాక రేపు చెప్పాల్సిన లెసన్ ప్రిపేర్ అయ్యి, పడుకోబోతుండగా సన్నగా వీపుకింద నొప్పి మొదలైంది. జండూబామ్ రాసుకున్నా ఎంతకీ తగ్గలేదు, భరించలేని‌నొప్పి‌. తట్టుకోలేక రూమ్మేట్ ని లేపి పెయిన్ కిల్లర్ అడిగి తీసుకుని వేసుకున్నాక ప్రశాంతంగా నిద్రపట్టింది.

                                                                                ***
ఆ రోజు ఆదివారం కాబట్టి సుచరిత లేట్ గా లేచి పనులన్నీ చేసుకుని, మధ్యాహ్నం కో-టీచర్స్ తో సినిమాకి వెళదామని ప్లాన్ చేసుకుని సినిమాకి రెడీ అవుతుండగా మళ్ళీ నొప్పి మొదలైంది. తరచూ వస్తున్న నొప్పి ఏమయ్యుంటుందని హాస్పిటల్ కి వెళ్ళాల్సిందేనంటూ రూమ్మేట్ బలవంతం చేయడంతో సినిమా ప్రోగ్రాం కాస్త హెల్త్ చెకప్ ప్రోగ్రామయింది. సినిమాకి రాలేనని సోషల్ మిస్ కి ఓ మెసేజ్ చేసి తన రూమ్మేట్ తో హాస్పిటల్ దారి పట్టింది సుచరిత. ఓ రెండు గంటలు వెయిట్ చేసాక డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది, ప్రాబ్లం చెప్పగానే టెస్ట్ లు రాసారు, టెస్టులవీ చేయించాక తెలిసిందేమంటే కిడ్నీస్టోన్స్ అని‌.

రిపోర్ట్స్ చూస్తూ డాక్టర్ గారు మెడిసిన్ రాస్తూ నీళ్ళెక్కువ తాగమనీ, మంచి ఫైబర్ ఫుడ్ తినమనీ చెప్తుంటే దిగాలు మొహంతో కూర్చున్న సుచరితని ‘కంగారు పడకమ్మా’ అని డాక్టర్ అంటున్న మాటల్ని కూడా వినిపించుకోకుండా మెడిసిన్ తీసుకుని రూం కి వచ్చేశారు.

                                                                              ***

మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళగానే కొలీగ్స్ అంతా చుట్టూ చేరి ‘ఏం జరిగింది, హెల్త్ ఇప్పుడు ఎలా ఉందం’టూ ప్రశ్నలేస్తున్న అందరికీ ఒక్కొక్కరిగా సమాధనమిస్తుండగానే వికెట్ నెంబర్ రెండు అనుకుంటూ మ్యాథ్స్ మేడమ్ వచ్చారు.

“వికెట్ ఏంటి మేడమ్” అని మిగతావాళ్ళడిగితే “కిడ్నీ స్టోన్ బాధితురాలు నెంబర్ రెండు” అని నిర్లిప్తంగా వెళ్ళిపోయారు మాథ్స్ మేడమ్. ఆవిడ నుండి ఇక‌ ఎక్కువ సమాచారం రాబట్టలేం అనుకుంటూ ఎవరి క్లాస్ లకు వాళ్ళు వెళ్ళిపోయారు.

రోజూ హ్యాండ్ బ్యాగ్ లో లంచ్ బాక్స్ , బుక్స్ తో పాటు ట్యాబ్లెట్లు తీసుకెళ్ళడం ఓ రొటీన్ అయింది సుచరిత కి. అనుకోని సునామీలా ఆరోజే మెటర్నిటీ లీవ్ ముగించుకుని రీజాయినింగ్ కోసం‌ వచ్చిన ప్రియ మేడమ్ ఒక్కొక్కరినీ పలకరిస్తూ సుచరితని చూసి

“ఎందుకలా తగ్గిపోయారు ఏమైంది” అంటూ హెచ్. ఎం ముందే గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక, మాట దాటేసి స్టాఫ్ రూంలోకి వెళ్ళిపోయింది సుచరిత.

డాక్టర్ ఇచ్చిన కోర్స్ అంతా వాడినా నొప్పి ఇంకా తగ్గకపోగా మరింత ఎక్కువతున్నట్టనిపించింది.
మళ్ళీ చెకప్ కి వెళ్ళి టెస్ట్ లు చేయిస్తే స్టోన్స్ కరగలేదనీ ఆపరేషన్ ఒక్కటే పరిష్కారం అని చావు కబురు చల్లగా చెప్పారు‌.

ఇప్పటికిప్పుడు ఆపరేషన్ అంటే ఒక్కసారిగా కాళ్ళలో వణుకు వచ్చేసింది సుచరితకు, అమ్మకు ఫోన్చేసి చెప్పాలనుకుంది కానీ అనవసరంగా కంగారు పడుతుందని నాన్నకి ఫోన్ చేసి రమ్మన్నది. తన సేవింగ్స్ తో పాటూ కొలీగ్స్ దగ్గర కొంత అప్పు తీసుకొని ఆపరేషన్ కి సిద్దపడింది.

ఆపరేషన్ కోసం లీవ్ పెట్టడానికి వెళ్ళి మానేజ్మెంట్ ని కలిస్తే రెండు రోజులకు మించి ఇవ్వననీ, ఇప్పటికే చాలాసార్లు లీవ్ తీసుకున్నావనీ పని చెయ్యని బద్దకస్థులకు అసలు ఉద్యోగాలెందుకని ఏవేవో మాట్లాడారు.

ఆ మాటలకు తట్టుకోలేక స్టాఫ్ రూంలోకి బయటకు వచ్చి ఎవరూ లేకపోడంతో అక్కడే మొహాన్ని చేతులతో కప్పుకుని ‌భోరున ఏడ్చేసింది. కానీ P.E.T. సర్ చూసి కంగారుపడి ప్రియా మేడమ్ ని, ఇంకో ‌కొలీగ్ ని పిలిచారు. ఏం జరిగిందో తెలుసుకున్న ప్రియా మేడమ్ గట్టిగా హెచ్. ఎం కి వినపడేలా పరుషంగా మాట్లాడింది.

హెచ్ ఎం మాటల్ని చక్కగా మోసుకెళ్ళి సీనియర్ టీచర్లఅన్న గౌరవం కొద్దిగా కూడా లేకుండా ఇంకో నాలుగు చాడీలు కలిపి, మేనేజ్మెంట్ వివరణ కోరుతూ అపాలజీ లెటర్ అడగడం వెంట వెంటనే జరిగిపోయాయి.

పిల్లల ముందు ఇవన్నీ జరగడంతో అవమానంగా భావించిన సుచరిత ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామని తన వల్లే ఈ గొడవంతా మొదలైందని బతిమాలుకుంది కానీ హెచ్. ఎం చేసిన పనికి ప్రియా మేడమ్ కి ఒళ్ళంతా కారం పూసినట్టై మేనేజ్మెంట్ తోనే తేల్చుకుందాం అంటూ ఇంకో ముగ్గురు లేడీ టీచర్లని తీసుకెళ్ళింది.

చల్లని ఏసీ రూంలో విలాసంగా సోఫాలో కూర్చుని సినిమా చూస్తూ పట్టపగలు ఆఫీస్ లోనే మందు కొడుతున్న ఛైర్మన్ గారి పుత్రరత్నం వీళ్ళని చూసి వెటకారంగా నవ్వి

“ ఏంటి స్టాఫంతా కట్టకట్డుకుని వచ్చారు, ఇంకో సంవత్సరం వరకు జీతాలు పెంచడం జరగదు” అని విసుగ్గా చెప్పి సినిమా చూడ్డంలో‌ మునిగిపోయాడు.

చెప్పే మాట వినకుండా అసలేం జరిగిందో తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా అతనిచ్చిన సమాధానం విని ఒళ్ళు మండినా సాధ్యమైనంత కూల్ గా ‘ మేం ఛైర్మన్ గారితో మాట్లాడాలి’ అంటుండగానే చిరునవ్వుతో లోపలి నుండి ఛైర్మన్ వచ్చాడు.

“ ఏమ్మా మేం ఇచ్చే జీతాలు తక్కువయ్యాయా లేక వేరే స్కూల్లో కొత్త ఉద్యోగాలు దొరికాయా” అంటూ నవ్వడం మొదలు పెట్టాడు.

ఛైర్మన్ తో తేల్చుకుందామని వచ్చినా ఆయన కోపం‌ చూసి అంతా సైలెంట్ అయిపోయారు. పైగా మిడ్ ఇయర్ లో ‘గెట్ అవుట్’ అంటే ఎక్కడా జాయిన్ అవ్వలేని పరిస్థితి, అయినప్పటికీ ప్రియా మేడమ్ ధైర్యం చేసి నోరు తెరిచింది.

“సుచరిత మేడమ్ కి లీవ్ కావాలి సర్” అని అనింది.
“ ఏం ఆవిడ అడగలేదా” అంటూ వ్యంగ్యంగా నవ్వుతూ తనవైపు చూడ్డంతో అలర్ట్ అయిన సుచరిత ‘లీవ్ కావాల’ని అడిగింది.
కారణం తెలుసుకున్న ఛైర్మన్,

“ రెండు రోజులు సరిపోతాయా ఓ నెల సెలవు తీసుకోమ్మా” అన్న ఆ ఛైర్మన్ వ్యంగ్యానికి సుచరిత కోపం తారాస్థాయికి చేరుకుంది.
“అసలీ ఆపరేషన్ కి కారణం మీరు” ఎదురు తిరిగి అనడంతో బిత్తరపోయిన ఛైర్మన్ “నేనెలా కారణమమ్మాయ్” అంటూ తెల్లమొహం వేసాడు.

ప్రియా మేడమ్ కూడా కల్పించుకుని‌ “అవును సర్ మీరే కారణం. ఎన్నో రోజులుగా లేడీ స్టాఫ్ కి సెపరేట్ బాత్రూమ్ కావాలని అడుగుతున్నా మీరు పట్టించుకోలేదు, స్టాఫ్ కామన్ బాత్రూమ్ వాడుకోమనంటారు కానీ జెంట్ కొలీగ్స్ అదో రకమైన చూపుల్ని దాటుకుంటూ వెళ్ళడం‌ ఓ నరకం. పోనీ సిగ్గు విడిచి వెళ్ళినా సరిగ్గా శుభ్రం చేయకుండా ఉన్న టాయిలెట్స్ వాడితే ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఎంత బాగోకపోయినా పర్మిషన్ మాత్రం మీరు ఇవ్వరు. అందుకే అసలు నీళ్ళు తాగకుండా ఉంటే బాత్రూమ్ కి ‌వెళ్ళాల్సిన అవసరం రాదని లేడీ స్టాఫ్ స్కూల్ అయిపోయేంత వరకూ నీళ్ళని చాలా‌ పొదుపుగా తాగుతున్నాం, అలా తక్కువ తాగడం‌ వల్లనే ఈరోజు‌ సుచరితకి‌ కిడ్నీలో స్టోన్స్ వల్ల ఆపరేషన్ వరకూ వెళ్ళింది, ఇవాళ సుచరిత, మొన్న మ్యాథ్స్ మాడమ్, రేపు మాలో ఇంకొకరు. మా జీతాలు పెంచకున్నా పర్వాలేదు. మా ఆరోగ్యాలతో ఆడుకోకండి. దయచేసి, మాకో బాత్రూమ్ కట్టించండి” అంటూ కన్నీళ్ళ పర్యంతమైంది..

అంతా విన్నాక ఛైర్మన్ గారు దీర్ఘంగా శ్వాసించి, అందరికీ అప్పుడే తెప్పించిన కూల్డ్రింకులు ఆఫర్ చేసారు.

గొంతు సవరించుకుని,
“ మీరంతా నా స్కూల్ కి మూల స్థంభాలు, మీరు లేకపోతే నేను ‌లేను. ఈ స్కూల్ లేదు. అలాంటి మీకు కష్టం వస్తే తీర్చడం‌ నా కనీస ధర్మం. నన్ను నమ్మండి. ఇంకో పది రోజుల్లో దసరా సెలవులు వస్తున్నాయి, ఆ సెలవులైపోయే నాటికి మీకు బాత్రూమ్ కట్టించే పూచీ నాదీ” అంటూ ఆప్యాయంగా చెప్పే సరికి ఆనందంగా స్కూల్ దారి పట్టారు.

అంతా గమనిస్తున్న కొడుకు ఆశ్చర్యంతో అదేంటి డాడీ ఫండ్స్ కలెక్ట్ చేయకుండా ఎలా కట్టిస్తావ్ అని అడగడం చూసి పెద్దగా నవ్వేసిన ఛైర్మన్ “ పిచ్చోడా, ఇప్పుడు వీళ్ళకి బాత్రూమ్ కట్టిస్తే రేపు ఫ్యాన్లంటారు, ఆ తర్వాత ఏసీలంటారు. అడిగినవన్నీ చేస్తూ పోతే వీళ్ళు మన నెత్తికెక్కి ఆడతారు, మైండ్ ఇట్” అన్న వాళ్ళ నాన్న వైపు చిరాకుగా చూస్తూ “మరి కట్టిస్తానని చెప్పి వాళ్ళని ఆశపెట్డడం దేనికి” అని అడిగిన కొడుకు ప్రశ్నకి చిలిపిగా నవ్వేస్తూ “ పనివాళ్ళ మీద కోపం చూపిస్తే పని చెడిపోతుంది, ఉద్యోగస్థుల మీద చూపిస్తే పనిచేసే స్థలానికి ‌చెడ్డపేరు వస్తుంది. అలాంటి పేరు మన స్కూల్ కి రావడం నాకు ఇష్టం లేదు,
అందుకే కర్రా విరగకుండా పామూ చావకుండా కట్టిస్తానని ఓ అబద్దం చెప్తే వాళ్ళా భ్రమల్లో ఉంటారు,
ఇదిగో అదిగో పనివాళ్ళు దొరకలేదు అంటూ కాలయాపన చేస్తూ ఎండాకాలం సెలవుల వరకూ లాక్కొచ్చెస్తే ఆ రెండున్నర నెలలో వాళ్ళీ విషయాన్ని చాలా ఈజీగా మర్చిపోతారు, ఎవరైనా గట్డిపిండాలు గుర్తుంచుకుని గోల చేయబోతే ఉద్యోగం ఊడుతుందని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తే వాళ్ళే దారికొస్తారు, వాళ్ళడిగినవన్నీ చేయకూడదురా, ఇదో బిజినెస్. ఇక్కడ ఎమోషన్స్ సెంటిమెంట్స్ పనిచేయవు” అని నవ్వుకుంటూ వెళ్ళిపోతున్న తండ్రిని చూస్తూ మీలాంటి జిత్తులమారి నల్కలున్నంత కాలం జనాలు పదేపదే గొర్రెలవుతూనే ఉంటారు అనుకుంటూ మళ్ళీ సినిమా చూడడంలో ‌మునిగిపోయాడు కొడుకు.

– షఫేలా ఫ్రాంకిన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

4 Responses to గొర్రెలు (కథలు )- షఫేలా ఫ్రాంకిన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో