గజల్-14 – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

అపురూపమైన స్నేహాన్ని పొందడం నిజంగా వరమే.
స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే కొన్ని స్నేహాలు వాళ్ళు పెరిగిపెద్దవాళ్ళయ్యాక
ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఆ స్నేహామృతాన్ని మళ్ళీ సేవించినట్లనిపిస్తుంది.
అలాంటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ … అలాంటి స్థితిలోకి పరకాయప్రవేశం చేసి వ్రాసిన గజల్ ఇది …

ఖండగతిలో వ్రాసిన గజల్ మీకోసం .

గజల్:

కుసుమాల వానలా తడిపేది నీ చెలిమి
శిశిరాన్ని ఎచటికో తరిమేది నీ చెలిమి

పొంగేటి కన్నీరు తుడిచేది నీ చెలిమి
శోకాల సంద్రాన్ని అణిచేది నీ చెలిమి

వెలుగునే చూసాయి నా స్నేహనేత్రాలు
గగనాన తారలా మెరిసేది నీ చెలిమి

మృదువైన స్పర్శతో పరవశిస్తుంటుంది
నెమిలీకలా మదిని నిమిరేది నీ చెలిమి

చల్లచల్లని కాంతి నా కనుల సొంతమే
కలలలో జాబిలై వెలిగేది నీ చెలిమి

ఎదలోని చీకట్లు పరుగులిడుతున్నాయి
లోలోన వెన్నెలై కురిసేది నీ చెలిమి

గమ్యాన్ని చేరేటి దారిలో “నెలరాజ”
నా తోడు నీడగా నడిచేది నీ చెలిమి

– ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.