బహుశా ఈ కథ (కవిత )–ఉషా జ్యోతి బంధం

రహదారుల వెంటా , నగరాల్లోనూ …
గాలులో రేణువుల్లా
ఖాళీలను నింపుకుంటూ …
గాలి విసురుకు రాలిపడిన
పూ రేకుల్లా …
తలో దిక్కుకూ చెదిరిపోయిన
అపరిచితుల కథ గావచ్చు

బస్సుల్లో రైళ్ళుల్లో …
ఇల్లు విడిచీ ….
ప్రియతములనూ , గతాన్నీ
వదిలి …
నిరంతరం కాలంలో కలిసిపోయిన
అపరిచితులు ….

ఎవరికీ ఎరుకలేని
తమకే విస్మృతి లేని
ఓటమి నుంచీ
యుద్ధ విరామాల నుంచీ
తిర్గి వచ్చిన
సైనికుల లాంటి
అపరిచితులు….

స్మృతులలో కలసి కరిగిపోయి …
రాలే ఆకుల్లా , నీటిలా మాటలాడే
ఏ గదురూ లేని
అపరిచితులు
మనలో ఎవరూ చూడలేని
నిషిద్ధ భాగాన్ని పంచుకునే
అపరిచితులు….

కట్టలు తెగిన మన దుఃఖాన్ని
తమ కౌగిలో దాచుకునే
అపరిచితులు ..

సమాధానం దొరకని
మానవాళి ప్రశ్నల కోసం
తమని తాము అంతం చేసుకునే
అపరిచితులు ….

దూరపు క్షితిజంలో
కలిసిపోయిన నేలలో
తిరుగాడే సంచారులకి
ఉద్వేగంతో ఉత్తరాలు రాసే
అపరిచితులు ….

కూలిపోయిన భవంతుల్లో
శిథిలమైన గదుల మధ్యా
ఒకరినొకరు చుట్టుకున్న
ప్రేమికులైన
అపరిచితులు….

తమ జీవిత గాధల్లో
తమని తామే పోగొట్టుకున్న
అపరిచితులు ….

బహుశా ….జరిగేదంలా
ఈ అపరిచితుల గాధే కావచ్చు .

-ఉషా జ్యోతి బంధం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.