సమాలోచన- సంపాదకీయం – మానస ఎండ్లూరి

సమాలోచన

కరోనా నేపధ్యంలో మానవత్వం మళ్ళీ మళ్ళీ చచ్చిపోడం చూస్తూనే ఉన్నాం. కరోనా ఉన్నా లేకున్నా ఆకలి చావులు ఉంటూనే ఉన్నాయి. కరోనా ఉన్నా లేకున్నా కొన్ని వైరస్లు మనలో ఉంటూనే ఉంటాయి. పైగా అందరికీ అంటిస్తూ పోతూనే ఉంటాం. అందులో ఒకటి కులం మరొకటి స్త్రీల పై పైశాచిక హింస. ఏదోక ఉదంతం జరిగితే తప్ప మనకు స్త్రీల పై దాడులు ఇంకా జరుగుతున్నాయన్న స్పృహ రాదు. కుల దాడులు జరిగినా కులం లేదని బుకాయిస్తూనే ఉంటాం. ఇదొక మందులేని వైరస్. వ్యాపించుకుంటూపోడమే తప్ప అంతమయ్యే అవకాశం లేని వైరస్.

జూన్ లో తెలంగాణా లోని కొత్తగూడెంలో  దేవిక అనే ఇంటర్ మీడియట్ అమ్మాయిని అత్యాచారం చేసిన  దారుణంగా చంపేసి రైలు పట్టాలపై పడేశారు. కొన్ని రోజుల కిందట రాజమండ్రిలో ఒక పదహారేళ్ల నిరుపేద అమ్మాయిని పదకొండు రోజుల పాటు నిర్భందించి మత్తు ఇస్తూ పదమూడు మంది అత్యాచారం చేసి స్పృహలో లేని ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు మీదే విడిచిపెట్టి పోయారు. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడంలో సహకరించిన స్త్రీలే ఆమె తల్లి తండ్రితో పాటు ఆ అమ్మాయి కోసం వెతికారు కూడా. అన్నింటికంటే ఈ విషయం అందరినీ విస్తుపోయేలా చేసింది. పైగా సామూహిక అత్యాచారం చేసిన పదమూడు మందిలో ఇద్దరికి కోవిడ్ పాసిటివ్ అని పరీక్షల్లో తేలింది.

ఈ మైనర్ బాలికల పేర్లు నిర్భయగా ,దిశగా మారవు. ఎవరికీ తెలియకుండానే కేసులు మరుగున పడిపోతాయి. వీళ్ళే దోషుల్లాగా అవమానాలు పడుతూ న్యాయం జరగక జీవితకాలం ఒక నిరుత్సాహాన్ని నింపుకుని బతకాల్సివస్తుంది. అదే రాజమండ్రిలో ప్రభుత్వం కట్టించిన దిశ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష అమలు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రే అంటారు. వాస్తవంలో ఈ పేద ఆడపిల్లలు అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైన చిహ్నాలుగానే మిగిలిపోతారు.

అదే తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో పోలీసే ఒక దళిత యువకుడు వరప్రసాద్ కి శిరోముండనం చేసి చితకబాదారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీని ఆపడమే ఇతను చేసిన తప్పు. సత్కరించాల్సింది పోయి ఇతని పైనే కేసు పెట్టి అనుమానుషంగా జుట్టు మీసాలు కత్తిరించి కిరాతకంగా కొట్టారు. ఇదంతా అక్షరాల పోలీస్ స్టేషన్ లోనే జరిగింది. పోలీస్ స్టేషన్ అంటే ప్రజలకు నరకాన్ని తలపించే విధంగా ఉన్నాయంటే ఎంతో సిగ్గు పడాల్సిన విషయం. ఈ ఘటనలో ఒక ఎస్సై ఇద్దరు కానిస్టేబుల్స్ పై కేసు నమోదు చేశారు. కానీ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది?

చీరాలలో మాస్క్ లేని కారణంగా మరో దళిత యువకుడు కిరణ్ కుమార్ ను అతి దారుణంగా కొట్టి చంపారు పోలీసులు. పది లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రభుత్వం ఇచ్చినప్పుడు అధికారులపై కిరణ్ కుమార్ చెల్లెళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ చేసిన రోదనలు అందరినీ కదిలించేశాయి. కొన్ని యుగాలుగా పట్టని దళిత ఏడుపులు ఇప్పుడు మాత్రం అద్బుతాలు సృష్టిస్తాయా? అమెరికాలో జార్జ్ ఫ్లోడ్ పై జరిగిన పోలీసు హత్యకు ఇక్కడ మనవాళ్లు కదిలారు, గొంతెత్తడం చేశారు తప్ప ఏనాడూ సొంత గడ్డ పై జరిగిన అన్యాయాలకు నోరు మెదపరు.

కరోనా కొంత సమయం తీసుకున్నా కరొన రహిత ప్రపంచం మళ్ళీ వస్తుందని ఒక నమ్మకం అందరికీ ఉంది. కానీ ఈ కుల హత్యలు, అత్యాచారాలు పోయే నమ్మకం మనకుందా?

– మానస ఎండ్లూరి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Comments are closed.