##నాన్న(కవిత ) -కోసూరి జయసుధ

 

 

 

 

తప్పతాగి తప్పటడుగులేసే నాన్నే గుర్తు నాకు..
రెండేళ్ల మా చిన్నికీ..
యాభై ఏళ్ల నాన్నకి చాలా పోలికలే వున్నై. !!

నడక రాక అదూగుతుంటే..
తప్పతాగి తానూగుతున్నాడు.. !!

మాటలురాని చిన్ని ముద్దు ముద్దు గా మాటాడుతుంటే..
మత్తులో నాన్న చిత్తుగా వాగుతున్నాడు.. !!

చీకటైతే పాకుతూ వచ్చే నాన్న..
పరువుపోతుందని పడుతూ లేస్తూ ఎదురెళ్ళే అమ్మ.. !!

బానిసత్వమే బహుమతిగా పుచ్చుకున్న అమ్మ ఏమీ అనలేక..
భారతీయ సంస్కృతిని బలంగా ఒంటబట్టించుకుంది.. !!

భూగోళం బద్దలయినా..
భర్తను గౌరవించాలనే అత్తగారి మాటకు బద్ధురాలై..
భద్రంగా నోరు కట్టేసుకుంది.. !!

తిండి గింజలకు తిప్పలు పడుతుంటే..
కేజీ బియ్యం కొట్లో తెచ్చి..
తన త్యాగనిరతిని చాటుకున్న నాన్న.. !!

రెండు వేళ్ళ మధ్య వెలిగే నిత్యాగ్నిహోత్రానికి..
అమ్మ ఒళ్ళు ఎన్నిసార్లు సమిధగా మారిందో.. !!

ఏడాదికో చీర తెచ్చి..
అమ్మముందు మొగుణ్ణనిపించుకొనే నాన్న.. !

నాన్న కళ్ళలో కనబడని ప్రేమని..
అయన తెచ్చిన జరీ అంచులో వెతుక్కుని మురిసిపోయిన అమ్మ కన్నీటి రాత్రులెన్నో.. !!

పక్కింటి పెద్దమ్మ పెళ్ళిరోజని పాయసమిస్తే..
పిల్లలకు లేకుండా జుర్రేసిన నాన్నని చూస్తే అసహ్యమేసింది.. !!

నాన్నంటే భుజాన మోసేవాడు..
భూతలాన్ని తన కంటితో చూపేవాడు..
అని చెప్తున్న అందర్నీ చూసి..

మాకు మాత్రమే ఎందుకీ దెయ్యం..
అంటూ ఏడ్చిన రోజులెన్నో.. !!

భవిష్యత్తే కాదు..
వర్తమానం కూడా లేని నాన్న.. !!

అందరికీ నాన్న వరమైతే..
కొందరికి శాపం.. !!

కానీ..,
నాన్నా..
నా ఎదుగుదలకి కారణభూతం మాత్రం నువ్వే.. !!

ఎలా ఉండకూడదో..
చెప్పి వెళ్ళావ్.. 

-కోసూరి జయసుధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.