అరణ్యం -11 వ భాగం – జల పాత్రలు-దేవనపల్లి వీణావాణి


ఇదివరకే చెప్పినట్టు అటవీ నిర్వహణ ఒకే విధమైన పని కాదు. ప్రతి అటవీ అధికారి తను పనిచేసే చోట ఉన్న దేశ, కాల మరియు పర్యవరణ పరిస్థితులకు అనుగుణంగా నేర్చుకుంటూ పనిచేయవలసి వస్తుంది. మీరు యే అటవీ ఆఅధికారినైనా అడగండి ..ఏ రెండు అడవులు ఒకే విధంగా నిర్వహించబడవని చెప్పడం మీరు వింటారు. నేనూ అందుకు భిన్నం కాదు. కొత్త విషయాలు నిత్యం నేర్చుకుంటున్నట్టుగానే మా విధులు కొనసాగుతున్నాయి. ఈ మధ్య వచ్చిన కొత్త సమస్య ఏమిటంటే పాఖాల చెరువులో చేపల వేట, దానిని నియంత్రించడం.

మధ్యాహ్నానికి బయలుదేరాం. ఎప్పుడూ వెళ్లినట్టుగా పాఖాలకు అశోకేనగర్ దారి గుండా వెళ్ళ లేదు. నర్సంపేట నుంచి ముత్తోజీపేట, ఇటుకాల పల్లి, ఆకుల తండా , మేడపల్లి , దబీర్ పేట, కేర్య తండా, గుండం ద్వారా వెళ్ళాలనుకున్నాం. ఈ ప్రాంతాలు కూడా ఒకసారి చుట్టినట్టుగా అవుతుంది అలాకాకుండా గుండం చెరువు ద్వారా వెళ్ళినట్లయితే పాఖాల చెరువు వెనుక వైపు నుంచి వచ్చే చేపల వేట గాళ్ళను పట్టుకోవచ్చునని అలా వెళ్ళడానికి నిర్ణయించుకున్న కారణం చేత ఆయా పల్లెలను చూస్తూ వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో ఎక్కడ చూసినా చిన్న చిన్న కాలువలు మడుగులు నీళ్లతో నిండి ఉన్నాయి. వర్షాలు పడుతూనే ఉన్నాయి. కాకపోతే వర్షానికి వర్షానికి మధ్య దూరం పెరిగింది. ఈ సారి కురిసిన భారీ వర్షాల వల్ల వరి పంట లాభపడితే , పత్తి , మొక్క జొన్న నష్టపోయాయి. పత్తి పంట మురుగును తట్టుకోలేదు. వర్షం ఎక్కువ అయితే ఆకులు ఎర్రబడిపోయి రాలిపోతాయి. మొక్కజొన్న ఇప్పటికే కోతకు వచ్చి కోత కోసే ముందు, ఆరబోసినాక పడిన వర్షాలకు చాలా వరకు బూజు లేచింది. అలా బూజు లేచిన పంట ధర పాతాళానికి పడిపోతుంది. ఋతువుకోసారి రైతుకు పరీక్షలు ఎదురవుతుంటాయి. ఈ సారీ అందుకు అతీతం కాదు. వర్షం ఎక్కువా తక్కువా ఏదీ పంటలకు అనుకూలం కాదు .అనుకూలమైన వర్షం ఎప్పటికీ పడదు !

దబీర్ పేటకు చేరుకునే సరికి మా బృంద సభ్యులకు తెలిసిన వారు కొందరు , కొన్ని సీతఫలాలను రెండు చేతి సంచుల నిండా నింపుకొని మా కోసం తెచ్చారు. సీతాఫలాలు ఇక్కడ బాగానే దొరుకుతాయి. కొందరు గ్రామస్తులు సీతా ఫలం చెట్లను తమ పెరళ్ళలో పెంచుకున్నారు. అటువంటివే ఇవాళ మాకు ఇచ్చినవి. ఇక్కడి అడవుల్లో మాత్రం ఎక్కడా సితాఫలాల చెట్లను చూడలేదు. అసలు లేవనే చెప్పాలి. అయితే ఆశ్చర్యంగా దబీరపేట గ్రామస్తులు సీతఫలాలను తినరట. తింటే జలుబు , జ్వరం వస్తాయని ఒకటో రెండో మాత్రమే తింటారట. అందుకేనేమో మాకు ఇచ్చిన పళ్ళలో దోర కాయలనుంచి , మిగుల మగ్గిన పళ్ళు కూడా ఉన్నాయి. అనుకోని బహుమతిని హాయిగా స్వీకరించి జీపును ఒక చోట ఆపుకొని సంతోషంగా ఆరగించి గిజలను మూట గట్టాము. దారిలో వెళ్తూ వెళ్తూ అక్కడక్కడా గింజలను చల్లుతూ ముందుకు పోయాము. సీతాఫలపు గింజలు మూడు నెలల కాలం మాత్రమే మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి. ఆ తర్వాత అవి మొలకెత్తవు. ఇలా ఒక్కో జాతికి ఒక్కో రకమైన మొలకెత్తే శక్తి కాలం ఉంటుంది.

పంట కోసిన రైతులు మొక్కజొన్న కంకులను రోడ్డు మీదనే ఆరబోసుకున్నారు. అసలే ఇరుకు రోడ్లు అందులో సగం రోడ్డు ఇలా ఆరబోతలు. ఏమీ అనలేని పరిస్థితి. నెమ్మదిగానే వెళ్తున్నాం. ఒకవేళ వర్షం వస్తే పంట తడవకుండా రైతులు ఒక్కో చోట ఒక్కో ప్రయత్నం చేసారు. కొంతమంది టార్పాలిన్ కప్పి రోడ్ల మీద కురిసిన వర్షం నీళ్ళు పంట కుప్పలోకి రాకుండా మట్టితో నాలుగైదు ఇంచుల ఎత్తుతో చిన్నకట్ట కట్టారు. కొన్ని చోట్ల ఆ కట్ట మీద గింజలు పడి మొలకెత్తాయి కూడా. కానీ కీర్యా తండా దాటాక మాత్రం చాల చోట్ల రోడ్డు మీదనే ఒక అడుగు ఎత్తులో మంచె కట్టి ఆ మంచె మీదే మొక్క జొన్న కంకులను వరుసలుగా పేర్చి ఆరబెట్టుకున్నారు. నాకు చాలా గొప్పగా కనిపించింది. ఈ ఏర్పాటులో ఎట్టి పరిస్థితులో లోనూ కోసిన పంట తడిచే అవకాశం లేదు , ఇంకా పారే వర్షపు నీళ్ళు తాకే అవకాశం కూడా లేదు. ఇంత ఓపికగా కోయలు మాత్రమే చేయగలరట. వ్యవసాయం చేసే పద్దతిని బట్టి పొలాన్ని బట్టి అది ఎవరు సాగు చేస్తున్నారో చెప్పేయవచ్చునట. లంబాడాలు, కోయలు ఇద్దరూ వ్యవసాయమే చేసినప్పటికీ లంబాడాలు త్వరగా పనులు పూర్తిచేసి మరో పంటకు సిద్ధమవుతారట. కోయలు మాత్రం అలా కాదు . వారు వ్యవసాయ కూలీల మీద ఆధారపడరట. వారి పనులు వారే చేసుకుంటారట. వారు చేసుకోగలినంత మాత్రమే సాగు చేసుకుంటారట. ఆకాశ పాయగా సాగు చేయబడే క్షేత్ర్రాల్లో అత్యధిక సాగు కోయలదే. తమకు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే పంటలు వారి సంప్రదాయ పద్దతిలోనే పండించుకుంటూ ఆ పంట చేలతో అనుబంధం పెంచుకుంటూ పోతారన్నమాట. తొందరపడరు. సంతృప్తిగా చేస్తారు. చేతనైనంత పండించుచుకొని, పండింది ఏదో తిని నిజమైన నిరాడంబర భారతీయ జీవన శైలిని ప్రతిబింబిస్తారు.

ప్రయాణం మధ్య ఇటువంటి అనుభవ పూర్వక విషయాలను పంచుకుంటూ మేము పోతున్నాం. గుండం చెరువు హద్దు మొదలైంది. గుండం చెరువుకు ఒకవైపున మాత్రమే కట్ట ఉంటుంది మరో వైపు శిఖం భూమే. వర్షం నీళ్ళు ఎక్కవగా జమ అయినప్పుడు చెరువు విస్తీర్ణం ముందుకు జరుగుతుంది. చెరువు శిఖంలో ఇంతకు ముందు వేసిన వరి పంట మునిగిపోయి తెల్ల కలువలు దూరం నుంచి కూడా కనిపించేంతగా పెరిగాయి. రోడ్డుకు మరోవైపు చిన్న చిన్న మడులలో నాటిన వరి చక్కగా పెరిగి నిగ నిగ లాడుతుంది. దీనికి నీళ్లు కట్టరు. నాట్లు వేసి వదిలేస్తారు. కురిసిన వర్షాలకు పంట పండుతుంది. మిగిలిన అన్ని పనులు చేస్తారు. ఇటువంటి పొలాలలో ఒకే పంట పండుతుంది.ఇదే ఆకాశ పాయ సాగు అని ఇంతకు ముందు చెప్పాను.
గుండం చెరువు కట్టకు ఒకవైపున పాకాల చెరువు మరో పక్కన గుండం చెరువు. రెండు వైపులా నీటి కుండలతో బరువుగా ఉన్న కావడి కర్రలా ఉంది గుండం చెరువు కట్ట. ఎన్నెన్నో మొక్కలు. గుండం చెరువు రెవెన్యూ పరిధిలో ఉంది. పాకాల చెరువు అటవీ శాఖ పరిధిలో ఉంది.

చెరువు కట్ట మీద రకరకాల మొక్కలు. చాలా వాటికి నాకు పేర్లు తెలియదు. 2003లో విపరీతమైన కరువు వచ్చినప్పుడు పాఖాల చెరువు పూర్తిగా ఎండిపోయిందట. కానీ గుండం చెరువు ఇంతవరకూ ఎప్పుడూ ఎండిపోలేదట. పాఖాల చెరువు కన్నా గుండం చెరువు కొంచం ఎత్తులో ఉంటుంది. చెరువు చుట్టు పక్కల వెలసిన తండాల్లో వారు ఈ ప్రాంత వాస్థవ్యులు కారట. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ స్థిర పడుతున్నవారట. గుండం చెరువు బాగా నిండినప్పుడు నీళ్ళు పాఖాలకు చేరుతాయి కానీ కట్ట తెగదు. పాఖాల చెరువు నుంచి మరో చెరువుకు నీళ్ళు చేరతాయి. పాఖాల నుంచి ప్రవహించే మూల వాగు, ఏటి వాగులు, అడవి దారుల గుండా ప్రవహించి మరో చెరువుకు సాగి పోతాయి. ఇలా చుక్క నీరు వృధా కాకుండా నీటి వనరులను అభివృద్ధి చేయడమే కాకతీయుల చెరువుల నిర్మాణం ప్రత్యేకత. వీటిని గొలుసుకట్టు చెరువులు అంటారు. ఇది నిజాం కాలంలో కూడా కొనసాగింది.

మేము ముందుగా ఒక సారి చెరువు కట్ట వద్ద పరిస్థితి చూడాలనుకున్నాం. ముందు గుండం చెరువు కట్ట మీదుగా పాఖాల వైపుకు వెళ్ళాం. మొన్న అక్టోబర్లోనే చెరువు మత్తడి పోసింది. నాలుగేళ్ళ తర్వాత మత్తడి పోసిందట. ఈ మత్తడి ఉన్న చోటే షితాబ్ ఖాన్ గండి అని వరదాచార్యులు రాశారు. షితాబ్ ఖాన్ అనే అతనికి ప్రతాప రుద్రుడు కలలో కనిపించి అక్కడ ఉన్న నిధి రహస్యం తెలియజేసాడనీ అప్పుడు షితాబ్ ఖాన్ చెరువుకు గండి పెట్టి తిరిగి మత్తడి వేసాడని రాసారు. అది చరిత్రలో యే మూలన నిక్షిప్తమై ఉన్న నిజమో కదా ! అసలైతే చెరువు లోతు ముప్పై అడుగులు. మత్తడి కోసం కట్టిన కట్ట మీద ఆరు అడుగులున్న కొలత బద్దను ఉంచారు. అక్కడి నుంచి రెండు అడుగుల ఎత్తుతో నీళ్ళు మత్తడి పోశాయి. చుట్టు పక్కల గ్రామ ప్రజలకు పండుగ. జనం తండోప తండాలుగా వచ్చి చూస్తారు. ఆషాడ మాసంలోనైతే ఒక పది పదిహేను రోజుల పాటు పాఖాల కట్ట మైసమ్మ పండుగ చేస్తారు. దాదాపు పది వేల మందికి పైగా ఇక్కడికి వచ్చి పండుగ చేసుంటారు.

ఈ పాటికి పాఖాల చెరువు మత్తడి ఇంకా తగ్గి ఉంటుంది. అసలైతే పాఖాల చెరువు 31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండాడాలి. ప్రస్తుతం విస్తేర్ణం అధికారికంగా మరొక్కసారి సర్వే చేయించవలసి ఉంది. ఎండా కాలం వరకు రెండు పంటలకు నీళ్ళిచ్చే ఈ చెరువు పదమూడు కిలోమీటర్లకు కుంచించుకుపోతుంది. ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ఉన్న భూ భౌతిక స్వభావాన్ని , నీటి వనరుల లభ్యతను నేటితో పోల్చలేము. అందులోనూ నీటి లభ్యతను అనుసరించి విస్తీర్ణంలో మార్పు రావడం ఇటువంటి చెరువులలో సాధారణమే. అయినా ఎప్పుడో ఎనిమిది వందల ఏళ్ళ క్రితం తవ్వబడిన చెరువు ఇప్పటికీ రెండు పంటలకు కలిపి ముప్పై వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తుంది. అదీ గొప్ప విషయం. చెరువుకు ప్రస్తుతం ఉన్న కట్ట మొదటి నుంచి లేదని , రోడ్డుగా చెప్పబడుతున్నదే అసలైన చెరువు కట్ట అని స్థానికులు చెబుతారు.
చెరువు చుట్టూ చిలుకమ్మ గుట్టలు పెట్టని కట్టలు. చెరువు ఆనుకొని ఇరవై ఏళ్లుగా మరొక ఊరు స్థిరపడుతోంది. గుట్టలపేరుమీదుగా దానికి చిలుకమ్మ నగర్ అని పేరు పెట్టారు. అది పాఖాల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఉండేది కోయలు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు.

ఇంతకు ముందు, ప్రస్తుతం వన విలాస్ అన్న ప్రభుత్వ విడిది స్థానంలో పెద్ద విడిది భవనం ఉండేదట. నక్సలైట్లు ప్రాబల్యం ఉన్న రోజుల్లో మందుపాతర పెట్టి పేల్చివేసారు. పాఖాల కట్ట మీద కూడా ఒక అద్దాల విడిది భవనం ఉండేదట.అది రహదారులు భవనాల శాఖ నిర్మించిన భవనం. అది కూడా పేలుడుకు గురైంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రముఖ రచయిత , సినీ నటుడు గొల్లపూడి మారుతిరావు తన మొదటి సినిమా ఆత్మ గౌరవం(1964) లో పాటల చిత్రీకరణ కొరకు రమణీయ దృశ్యాలను వెతుకుతూ ఇక్కడికి వచ్చారట. వచ్చే సరికే రాత్రయ్యిందట. అక్కడ ఒక భవనం ఉంది అని తన ఆత్మకథ అమ్మ కడుపు చల్లగాలో రాసారు. కానీ వారు అనుకున్న పాటను ( ఒక పూల బాణం ) పాఖాలలో కాకుండా పాలంపేటలోని రామప్ప ఆలయంలో చిత్రీకరించారట. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే 1964 నాటికే పాఖాల చెరువు కట్ట మీద ఒక భవనం ఉండడం , చెరువు యొక్క ప్రకృతి సౌందర్యం ఎక్కడో మద్రాస్ లో ఉన్నతెలుగు సినీ పరిశ్రమకు తెలియడం ఈ ప్రాంత అద్భుత ప్రకృతికి సాక్ష్యం అనీ. కట్ట మీద ఉండే భవనం , పేలుడులో ద్వంసం అయ్యాక చాల ఏళ్ళ పాటు అలా ఉండిపోయింది. ఈ మధ్యే అక్కడ ఒక వాచ్ టవర్ నిర్మించి పర్యాటకులకు చెరువు మీద ఉదయాస్తమయాలను తనివి తీరా చూసే అవకాశం కల్పిస్తున్నది అటవీ శాఖ.

గొల్లపూడి మారుతిరావు అత్మకథలోనే నాకు మరో విషయం తెలిసింది. 1964 లోనే ప్రారంభించిన నంది అవార్డుల కొరకు బహూకరించే నంది బొమ్మ రామప్ప లోని నంది విగ్రహ రూపమేనట . నేను ఇంతకు ముందు విన్న దాని ప్రకారం అది లేపాక్షి నంది. అనుమాన నివృత్తి కోసం లేపాక్షి నంది , రామప్ప నంది , నంది అవార్డు మీద యుండే నంది అని అంతర్జాలం ద్వారా పరిశీలించాను. వారు రాసింది నిజమే ! అది ప్రచారంలో ఉన్నట్టు లేపాక్షి నంది కాదు , రామప్ప నందే. లేపాక్షి నంది కుడి కాలు ఎత్తి , ఎడమ కాలు ముడుచుకుంటుంది. రామప్ప నంది ఎడం కాలు ఎత్తి కుడి కాలు ముడుచుకుంటుంది . నంది అవార్డు పైన ఉండే నంది కూడా రామప్పలోని నంది వలె ఎడమ కాలు ఎత్తి కుడి కాలు ముడుచుకుంటుంది.కానీ నేనీ వ్యాసం రాసేనాటికి అంతర్జాలంలో ఉన్న సమాచారం నంది అవార్డు నంది లేపాక్షి నంది అనే. నంది ఎక్కడిది అనే అంశంలో నాకు విభేదం లేదు కానీ ఒక ప్రముఖ స్థానం దానికొరకు కేటాయించబడినప్పుడు అది ఒక ప్రాంత అస్తిత్వానికి ఒక గొప్ప స్థాయిని ఆపాదిస్తుంది. దానిని మసకబరచకూడదనే ఈ వివరణ.

ప్రస్తుతం ఉన్న చెరువు కట్ట మీద నుంచి చూస్తే నింగి నేల కలిసిపోయిన చోట ( Horizon ) చిలుకమ్మ గుట్ట బూడిదా, ఆకుపచ్చ రంగుతో ముడుచుకున్న పెదవుల వలె కనిపిస్తుంది. పర్యాటకులు ఇక్కడికి ఈ గుట్టల మీద ఉదయించే సూర్యున్ని చూడడానికి వస్తుంటారు. కృష్ణా నది ఉపనది అయిన మున్నేరు నది జన్మస్థానం పాఖాల చెరువే. చెరువు మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంటుంది. దానికి పేరు పాకాల రామక్క గుండం. ప్రతీ వర్షాకాలంలో ద్వీపం మునిగి పోతుంది. నీళ్ళు తగ్గినా కొద్దీ పైకి తేలుతుంది. ఆ ద్వీపం మీద ఉన్న వృక్ష జాతుల మీద ఇంకా పరిశోధనలు చేయవలిసి ఉంది. మే నెలలో ఆ ద్వీపం , చెరువు మధ్యలో విడువబడిన పెద్ద ఆకుపచ్చ బతుకమ్మలా ఉంటుంది. నీలి రంగు నీళ్ళ మధ్య ఆకుపచ్చని బతుకమ్మ.. ఎంతో అందమైన దృశ్యం కదా..

మత్తడి దాకా వెళ్ళాము. ఒకటిన్నర అడుగుల ఎత్తుతో నీళ్లు కిందకి పోస్తున్నాయి. నిశ్శబ్ధంగా ఉన్న అడవిలో జల ప్రవాహ శబ్దం హోరుమని శబ్దం చేస్తున్నది. వర్షం పడి పడి చెట్లు లేని చోట మెత్తని మట్టి పేరుకున్నది. కొట్టుకొచ్చిన ఎండ్రకాయను ఏదో తినగా మిగిలిన భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హోరుమన్న శబ్దంలో కూడా ఒక అంతస్సూత్రం దాగి ఉంది. కాసేపక్కడ నిలబడి చుట్టూ చూస్తూ నీటి శక్తిని గ్రహిస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తూ పోతూ ఉన్నారు. కట్ట మైసమ్మ వద్ద ఎటువంటి వేడుకలు ఈరోజు జరగడం లేదు.అందునా మేము వచ్చింది సాయంకాలం. ఇదివరకే చేసుకున్న వేడుకలలో కోసిన జంతువుల చర్మాలు కట్ట దగ్గర వేయడం వల్ల అధికారులు మరింత శ్రమించవలసి వచ్చింది. అధికారుల సేవలను వినియోగించుకోవడంలో ప్రజలు తెలివిగా వ్యవహరించకపోతే విలువైన మనవ వనరులు ఇటువంటి పనుల వల్ల వృధా అవుతాయి.

ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అటవీశాఖ కన్నుగప్పి ఇక్కడ చేపల వేటకు వస్తుంటారు. ఈ విషయం అటవీ శాఖ వారికి ప్రజలకు మధ్య ఘర్షణ కూడా కారణమవుతుంది. సరదాగా వచ్చే గ్రామస్తులు , రైతులు, కూలీలు కోడిమాంసము మిగులు అంటే పనికిరాని మాంసపు ముక్కలను వంకర తిరిగిన చేపల ఎరకు గుచ్చి పొడుగైన ప్లాస్టిక్ దారాన్ని ప్లాస్టిక్ మచినీళ్ళ సీసాకు కట్టి వదిలివేస్తారు. ఈ ఎరలు ప్రత్యేకంగా అమ్ముతారు కూడా. చుట్టూ కూర్చోడానికి అనుకూలంగా ఉన్న ఉన్న గట్ల మీద వీలు చూసుకుని కూర్చొని మాంసం ముక్కలు ఉపయోగిస్తూ చేపలు పడుతుంటారు.. అక్కడే తినడానికి ఏదైనా తెచ్చుకుని చేపలు దొరికే వరకు అలా కూర్చొని సాయంకాలానికి దొరికినవి తీసుకొని ఇంటికి వెళ్తారు.ఇది సరదాకు చేసే పనే. ఇక కొంత మంది మాత్రం చేపలు పట్టి అమ్ముకోవడానికి ధర్మకోల్ షీట్లతో చెరువు లోపలి వరకు వెళ్లి పెద్ద పెద్ద వలలు వేస్తారు. వీరు సాధారణంగా అటవీ అధికారుల నుంచి తప్పించుకోవడానికి పొద్దుపోయిన తర్వాత గానీ , తెల్ల వారుతుండగా గానీ వచ్చి వలలను తీసుకోవడానికి వస్తారు. నిజానికి ఇక్కడ చేపలు పట్టడం నిషిద్దం. చెరువుకు ఒక పక్క మహాబూబాబాద్ జిల్లా , మరొక పక్క వరంగల్ గ్రామీణ జిల్లా ఇటువంటి చేపల వేటను నిరోధించడానికి అనేక రకాలుగా దీన్ని నిరోధించడానికి ప్రయత్నిస్తుంటుంది. పట్టుబడిన వారికి సంధర్భాన్ని బట్టి వన్యప్రాణి చట్టం కింద కేసులు నమోదు చేయడం, వారికి అవగాహన కల్పించడం వంటివి చేస్తుంది. అప్పుడప్పుడు గ్రామస్తులు చెరువు నుంచి మొసళ్ళబారిన పడడం కూడా ఇక్కడ సాధారణమే. చేపల వేట ఏప్రిల్, మే మాసాలలో ఎక్కువ. మే నెలలో పాఖాల చెరువు వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బోట్ల సహాయంతో వలలను తొలగించాము. అయినా ఇది నిరంతరంగా ఉండే సమస్యే . ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటేనే చెరువు ఆరోగ్యకరంగా ఉంటుంది. అభయారణ్యం రక్షించబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో పర్యవరణపరంగా సున్నితంగా ఉండి ఆయా జంతు వృక్ష జాలాల సంరక్షణ కొరకు వన్యప్రాణిచట్టం ద్వారా ఏర్పరచిన సంరక్షణా స్థలాలు ఉన్నాయి. అందులో జాతీయ వనాలు , అభయారణ్యాలు ముఖ్యమైనవి. జాతీయ వనాలను మొత్తంగా ఆవరణ వ్యవస్థ కోసం సంరక్షిస్తే అభయారణ్యాలను ఆయా అడవులలో మనుగడ కొరకు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న జీవుల కోసం ఏర్పాటు చేస్తారు. ఇంకా కొన్ని జంతువుల కొరకు ప్రత్యేక ఆవాసాలుగా కూడా సంరక్షణ చర్యలు చేపడతారు. ఉదాహరణకు ప్రాజెక్ట్ టైగర్ , ప్రాజెక్ట్ ఎలిఫెంట్ , ప్రాజెక్ట్ క్రోకడైల్ వంటివి. సంరక్షణ చర్యల నియమాలు , నేరాల కాటిన్యత వరుసగా అభయారణ్యాలు. జాతీయ వనాలు , ప్రత్యేక సంరక్షణా ఆవాసలకు పెరుగుతుంది. కొన్ని జంతువులను వృక్షాలను వాటి సహజ ఆవాసాలలోనే పరిరక్షించడాన్ని సహజ ఆవరనాంతర్గత ( in situ conservation ) సంరక్షణ అంటారని ఇంతకు ముందు తెలియజేశాను. ఇప్పటి దాకా చెప్పిన వన్నీ సహజ ఆవరనాంతర్గత సంరక్షణ విధానాలే. వరంగల్ గ్రామీణ జిల్లాలోనున్న పాఖాల అభయారణ్యం కూడా అందులో ఒకటి. ఇది మంచి నీటి మొసళ్ళ సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన అభయారణ్యం.

ఇది మంచి నీటి చెరువు కనుక ఇక్కడ ఉన్న మొసళ్ళను మంచి నీటి మొసళ్ళు లేదా మగ్గర్లు అంటారు. ఇక్కడ ఉండే చేపల జాతులు కూడా మంచినీటి చేపల జాతులే. జీవ వైవిధ్యపరంగా పాఖాల అభయారణ్యం ఉన్నతమైన విలువను కలిగి ఉంది. దేశంలోని కాలుష్య రహిత మంచి నీటి ఆవాసాలలో ఒకటి. పాఖాల చుట్టపక్కల ఉన్న అడవితో 860 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పాఖాల అభయారణ్యంగా ప్రకటించారు. 1952లో హైదరాబాదు ప్రభుత్వం రక్షిత అభయారణ్యంగా ప్రకటించింది. నిజాం కాలంలో ఉన్న 19 వేట విడిది కేంద్రాల్లో ( Game reserves ) పాఖాల ఒకటి. ఇక్కడకి అనేక నీటి పక్షులు వలస వస్తుంటాయి. సహజంగా ఉండే అనేక పక్షుల జాతులకు కూడా ఇది భద్రమైన ఆవాసం. ప్రఖ్యత పక్షి శాస్త్రజ్ఞుడు భారతదేశ పక్షి పితామహుడు సలీంఅలీ ఇక్కడికి పక్షి జాతుల వివరాలు సేకరించడానికి సందర్శించానని తన ఆత్మ కథ The Fall of a Sparrow లో రాసుకున్నాడు.

ప్రపంచవ్యాప్తంగా మంచినీటి ఆవాసాలు తగ్గిపోవడం , మన దేశంలోనూ అటువంటి పరిస్థితిలే ఉండడం మంచి నీటి ఆధారంగా బతికే జీవులకు ముప్పు ఏర్పడడం వాటి కొరకు ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకునేలా చేసింది. అందులో భాగంగా మొసళ్ళను సేకరించి ఎంపిక చేసిన నీటి ఆవాసాలలో వదిలివేసారు అందు కొరకు 1978 నుంచి 1992 వరకు దేశంలో 28 వివిధ మంచినీటి ఆవాసాలను గుర్తించి కొన్నింటిని ప్రాజెక్ట్ క్రోకడైల్ కొరకు ఎంపిక చేసి దాదాపు1193 మొసళ్ళను వదిలి ఆ జాతిని కాపాడారు. అలా పాఖలలో ఇరవై మొసళ్ళను 1992లో వదిలివేసారు. మొసలి యాభై సంవత్సరాలు బతుకుతుంది.మొసలికి ఎందుకు ప్రాధాన్యత అంటే అది ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి ఉన్నతి స్థాయి మాంసాహారి. ఒక అడవిలో పులి , సింహం ఏ విధంగా అడవి జంతువుల మధ్య సమతుల్యతకు దోహద పడతాయో నీటిలో మెసలి కూడా అదే పని చేస్తుంది.

చెరువు పరిసరాలు ఒకసారి చూసుకొని తిరిగి గుండం చెరువు వైపుగా వెళ్ళాం. మునిమాపు వేళ రెండు చెరువుల సాన్నిధ్యంలో సూర్యుడు కిందకు దిగుతున్నాడు. కెంజాయ రంగు నీలి ఆకాశంలో ప్రతిఫలిస్తున్నది. చిన్న చిన్న నీటి తెరలు ఒడ్డుకు కొట్టుకుంటూ గాలి కదలికలకు అనుగుణంగా నర్తిస్తున్నాయి. గాలి మంద్రంగా వీస్తున్నది. ఇటువంటి ఆహ్ల్లదకరమైన వాతావరణం కోసమే నేను వెతుక్కుంటాను. ఇక్కడొక శివాలయం ఉంటుంది. దానికి శివ రామనాథ ఆలయం అనీ, చెరువుకు మౌద్గల్య తీర్థం అనీ పేరు. కానీ జన బాహుళ్యంలోమాత్రం శివాలయమనీ, గుండం చెరువు అనే పేరు స్థిరపడిపోయింది. దానిని అనుకోని ఉన్న అడవి పేరు భైరవ అభయారణ్యం. (ఇదే ఇప్పటి పాఖాల్ అభయారణ్యం అయ్యి ఉండవచ్చు ) . అక్కడ వెలసిన పట్టణం గణపపుర. పట్టణ ఆనవాళ్ళు ఇప్పుడేమీ కనిపించవు. కాల క్రమేనా గణపురం తన ప్రాభవం కోల్పోయి ఏనుగుల పెంకపు స్థావరంగా మిగిలిందని , ఏనుగుల పోషణ కొరకు ఉండే సహాయకుల కోసం వేసిన పాకల వల్లనే పాకాల అనే పేరు వచ్చిందని మరో కధనం. శివాలయం మాత్రం శిథిలావస్థలో ఉంది. సరిగ్గా ఇటువంటి ఆలయమే కొంకపాకలో ఉంటుంది.మిగిలిన కాకతీయ మందిరాలవలె అనిపించదు . ఆలయగోపురం మెట్లు మెట్లుగా ఉంటుంది. పెద్దగా బయటి ఆలంకరణలు లేకుండా ఉన్నా లోపల మాత్రం పెద్ద శివలింగం ఉంది. ఒకటేమో ఎవరో పగల గొట్టారట. ఒక లింగం గర్భాయలంలో ఉంటుంది.దానికే ఇప్పుడు ఆరాధన జరుగుతున్నది. ఈ మందిరాన్ని చూస్తే కాకతీయుల ఇతర మందిరాలలా అనిపించదు. ఇంకా పాతదేమో అనిపిస్తుంది. ఈ సాయంకాలం నేను ఈ శిథిల మందిర ప్రభను కొంతైనా స్వీకరిచాలని అనుకుంటున్నాను.

చలి పెరుగుతుంది. రెండు చెరువుల హద్దులో ఒక మందిరం.. నిశి వేళ నీలి రంగు మరింతగా చిక్కబడి ఒక అద్భుతమైన ఛాయా చిత్రాన్ని తలపిస్తున్నది. ఈ మధ్య కాలంలో అక్కడ కొంత రోడ్డు పని జరుగుతున్నది. అందుకోసం తెచ్చిన కంకర కుప్ప మీద కూర్చున్నాం. డ్రైవర్ ఒక పక్క , సిబ్బంది ఒక పక్క సేద దీరి మాట్లాడుకున్తున్నారు . వారి ముచ్చట్లలో ఉన్న విషయం ఈ రోజు రాత్రికి ఎలాగైనా చేపల వేటగాళ్ళని పట్టుకోవాలని.అయితే అందుకు మేము ముందు ఆకున్న దానికన్నా ఎక్కువ సమయమే ఉండవలసి వస్తుంది. ముందు మునిమాపు వేళ వరకు మాత్రమె ఉండాలని అనుకున్న కారణం చేత వేరే భోజన ఏర్పాట్లు చేసుకోలేదు. కొంత దూరంలో ఒక గుడిసె ..అప్పుడప్పుడు తినుబండారాలు అమ్ముతుంటారు అక్కడ. ఎక్కువ రోజులు తెరిచి ఉండదు. ప్రయత్నం చేసినా ఏమితినడానికి దొరకే అవకశం లేదు. డ్రైవర్ జీపులో ఉన్న మొక్క జొన్న కంకులు కాల్చే పనిలో పడ్డాడు. కొన్ని సీతాఫలాలు, నీళ్ళు ఎలాగూ ఉన్నాయి. అర్థ రాత్రి వరకు ఇక్కడే ఉండి తెల్లవారగట్ల మరో చోటుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది కనుక ఈ మాత్రం ఆలోచన.

నీటి శబ్దం చిన్న చిన్నగా కొనసాగుతోంది.ఈ చెరువుకు ముందు ఇక్కడ ఏమి ఉండేదో. నాటి నిర్మాణ సూత్రాలు ఏమిటో , ఎన్ని ఏళ్ళు , ఎంతమంది చెమటను దార పోశారో గానీ ఈ నాటికీ వారి చెమటే ఇంధనమై పట్టెడు గింజలు వస్తున్నాయి. బహుశా వారు ప్రకృతి సహజ సూత్రాలకు అనుగుణంగా ప్రయాణించి ఉంటారు. అందుకే ఇన్నాళ్ళకు కూడా వాటి లక్ష్యంలో ఏ మాత్రం మార్పు రాలేదు. వారి సంకల్పానికి, ముందు చూపుకు ఋణపడి ఉండవలసిందే. వారు మనకు ఒక సాంస్కృతిక ఒరవడిని , జీవన విధానాన్ని, ఆకలికి చింత లేని బతుకును బహూకరించారు . కనుక వాటిని కాపాడుకోవడమే మన కర్తవ్యం అవుతుంది.

పాఖాల అంటే సంస్కృతంలో జల పాత్ర అని అర్థం. ముఖ్యంగా ప్రయాణాలలో వాడుకునే పాత్ర అని చెప్తారు. జల పాత్ర అన్న అన్న అర్థం లోనే పాఖాల అనే పేరు స్థిరపడింది. ఇది కృత్రిమంగా తవ్వించిన మంచినీటి చెరువు. బహుశా గుండం చెరువు కు ఉన్న పూర్వ నామాన్ని బట్టి అంటే మౌద్గల్య తీర్థం అన్న పేరును బట్టి అది సహజమైనదని అనుకోవచ్చునో లేదో తెలియదు. ఎందుకటే ఈ చెరువు ఎవరు తవ్విన్చారో తెలియదు. పాఖాల చెరువుకు దొరికిన చారిత్రక వివరాలు దీనికి దొరకలేదు. పాఖాల చరిత్ర అనే పద్య కావ్యం రాసిన ముడుంబై వరదాచార్యులు గుండం గ్రామాన్ని గురించి చెప్తూ గుండం పల్లె అనీ ఆ పక్కనే ఉన్న రామక్క దేవాలయపు జాతరలో స్థానిక గిరిజనులు పాల్గొంటారని తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ రాసారు. నాకు తెలిసి ఒక చెరువు మీద చారిత్రక దృక్పథంతో రాసిన ఒకే ఒక పద్య కావ్యం పాఖాల చరిత్రనే. నిజాం కాలం నాటికి వేంకట లక్ష్మీ నరస జగన్నాథ రాజు అనే జమీందారు ఉండేవాడని బహుశా అతనే నర్సంపేట ను నిర్మించాడని ఆదిరాజు వీరభద్ర రాజు 1956 లో తెలంగానం అనే గ్రంధంలో రాసారని రాసారు. ఇంకా కొన్ని జన బాహుల్యంలోని కథలు , తెలిసిన విషయాలు ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇంకా ఏమైనా లభిస్తుందేమో చూడాలి.

కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని మంత్రి బయ్యన కుమారుడు జగదాల ముమ్మడి నాయకుడు అధ్వర్యంలో క్రీ.శ.1213లో ఈ చెరువు తవ్వబడినట్టు చరిత్ర చెబుతుంది.కాకతీయుల కాలంలో మహారాణులు కూడా చెరువులు తవ్వించారు, శాసనాలు వేయించారు.ప్రఖ్యాత బయ్యారం శాసనం, లక్న వరం చెరువులు రాణులు తవ్వించిందే. కాకతీయుల కాలంలో నిర్మాణాలు మంత్రుల పర్యవేక్షణలో జరిగేవట. పాఖాల కూడా అలా మంత్రి అజమాయిషీలో తవ్వించబడినదే. జగదాల్ ముమ్మడి, పాఖాల్ రుద్రుడు ఇద్దరు ఇంజనీర్లు. కాకతీయుల చరిత్ర నిర్మాణంలో పాఖాల శాసనం కూడా చెప్పుకోదగిన వివరాలను అందించింది. పి. వి.పరబ్రహ్మ శాస్త్రి గారు పాఖాల శాసనం మీద మోనోగ్రాఫ్ రాసారు. ఇప్పటికీ ఈ శాసనాన్ని పాఖాల కట్ట మీద చూడవచ్చు. కాకతీయుల కాలంలో ఇక్కడ ఒక్క భవంతి ఉండేదని చరిత్రకారుల విశ్వాసం. ఈ విషయాలన రచించిన కవికి ఒక భవంతిని కొంత భూమిని ఇచినట్లు చెప్పబడింది. చరిత్ర కారులు వెతికే భవంతి అదే కావచ్చు. కాకతీయ రాజులు విశ్రాంతి కొరకు ఇక్కడికి వచ్చేవారట. కానీ అందుకు ఎటువంటి భౌతిక ఆధారాలు లభించలేదు. ఇప్పటికీ ఆ చారిత్రక అన్వేషణ కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతం అటవీ శాఖ కూడా చెరువు సౌందర్యాన్ని ఆస్వాదించే విధంగా కట్ట మీద మంచెలు ఏర్పాటు చేసారు.

కాకతీయుల కాలం తర్వాత పాఖాల ప్రస్థానం తెలియదు గానీ పాఖాల శాసనం మొదటిసారి యూజెన్ జూలియస్ థియోడర్ హల్ట్జ్ ( Eugen Julius Theodor Huktzsch) అనే శాసన పరిశోధకుడు వెలుగులోకి తెచ్చాడు. ఆయన జర్మన్ దేశస్థుడు. మీరు గమనించి నట్లయితే మన దేశ చారిత్రక అన్వేషణలో అత్యధికంగా కన్పించేది జర్మన్ దేశస్థులే. అందుకు కారణం లేకపోలేదు. ఫ్రాన్స్ విప్లవం తర్వాత యూరోప్ మొత్తం తమ దేశాల స్వీయ అస్తిత్వాలను రచించుకున్నాయి. అయితే జర్మనీ మాత్రం భారత దేశ చరిత్ర నుంచి తన మూలాలను కనుగొనే ప్రయత్నం చేసింది. అందుకు దారి తీసిన అనేక పరిస్థితులలలో జర్మనీ విశాల భారతాన్ని తన చరిత్రకు కొనసాగింపుగా ఎంచుకున్నది. అందులో భారత దేశ చరిత్రను యూరోప్ ఆధారంగా చిత్రించడం ఒకటి. ఇందుకు గాను జర్మనీ నుంచి వచ్చిన అనేకమంది అందుకు తగిన భౌతిక చరిత్రాక ఆధారాల అన్వేషణలో పడ్డారు. ఇందులో బాగా ప్రభావితం చేసిన వాడు మాక్స్ ముల్లర్. ఆర్య సిద్ధాంతం , జర్మన్ల సంస్కృత భాషాభిమానం , ఆర్యుల యూరేషియా సిద్దాంతం , స్వస్తిక్ గుర్తును వాడుకోవడం అంటివి అందులో భాగమే. దీనికి బ్రిటిష్ సామ్రాజ్యం పూర్తి సహాయ సహకారాలు లభించడం వల్లనే ప్రస్తుతం మనం చరిత్ర అని భావిస్తున్న మన చరిత్ర రూపు దిద్దుకున్నది. దీని ప్రయోజనం భారతీయ మూలలను సమూలంగా పెకిలించి పురాపరాధీనత దేశంగా ప్రకటించి మరింత కాలం పరిపాలనానుకూలంగా మార్చుకోవడం. అందువల్లనే భారతీయ గ్రందాల ఆంగ్లీకరణ , చరిత్ర అన్వేషణ అప్పటి వరకు మరుగున పడిన చరిత్రను కనుగొనడం వంతో అంశాలను తలకెత్తుకోవడం జరిగింది. ఏదైతేనేం భారతీయుల వాజ్మయ ఆంగ్లీకరణ మన జీవన విధానాన్ని విశ్వ వ్యాప్తం చేయడమే కాక నవీన జీవనానికి కావలిసిన కొత్త తాత్వికను అన్వేషించే హృదయాలను నేరుగా ప్రభావితం చేసింది.

హల్ట్జ్ , 1886 లో ఆర్కియోలజీ సర్వే అఫ్ ఇండియా ముఖ్య అధికారిగా చేరి అనేక దేవాలయాలను సందర్శించి ఆయా చోట్ల ఉన్న శాసనాలను విపులీకరించే ప్రయత్నం చేసాడు. ఆయన పరిశోధనలో భాగంగా పాఖాల శాసనం కూడా వెలుగులోకి వచ్చింది. 1902-03 సంవత్సరంలో విడుదల చేసిన వార్షికనివేదికలో మొదటి సారి ప్రస్తావన చేశాడు. తదుపరి పదిహేనేళ్ళ తర్వాత జీ . యజ్దని (G. Yazdani), బార్నెట్ ( i.D. Barnett ) హైదరాబాద్ అర్కియోలోజికల్ సిరీస్ లో ప్రచురణ కొరకు కృషి చేసారు. పాఖాల శిలా శాసనన్ని విపులీకరించడంలో బార్నెట్ సఫలీకృతుడయ్యాడు. తదుపరి కాకతీయుల చరిత్ర అన్వేషణలో పాఖాల శాసనం చెప్పుకోదగిన వివరాలు అందించినట్టు నిర్దారించబడింది.

పాఖాల గురించి వెతుకుతూ వెతుకుతూ నేను మా ఊరిని కూడా కనుక్కున్నాను. మా ఇంటి పేరు దేవనపల్లి. మా పూర్వీకుల అన్వేషణకు నాకు పి.వి. పరబ్రహ్మ శాస్రి రాసిన కాకతీయులు పుస్తకంలో వివరణ దొరికింది. దాంట్లో ఆయన దేవనపల్లి గ్రామాన్ని గురించి వివరించాడు. ప్రస్తుత కరీంనగర్ జిల్లాకు చెందిన చామనపల్లి , పెద్దపల్లి జిల్లాకు చెందిన కుమ్మరికుంట , దేవనపల్లి, కాట్యకోలపల్లి ల మధ్యన గొనుగు కాలువ నీటి పంపకం లో వచ్చిన వివాదాన్ని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు తీర్చాడని రాశారు. కాలక్రమంలో మా పూర్వీకుల ఊరు కాలువలో మునిగిపోయిందని ప్రజలు వేరే చోటకు వలసపోయి ఉంటారని భావించవచ్చు. ఆ గ్రామానికి చెందిన వారం కనుక అదే ఇంటి పేరు స్థిరపడి ఉంటుంది.

నేను కంకర కుప్ప మీద నుంచి లేచి చెరువు కట్ట మీదుగా నడుస్తూ వెళ్తున్నాను. ఎంత సుందరమైన దృశ్యం చూస్తున్నాను. ఒకవైపు వెన్నెల, చలి , చీకటి… ప్రతి చెట్టూ తన భయంకరమైన నీడను భూమి మీద వేసి తానూ విశ్రాంతి తీసుకుంటున్నది. చుట్టూ మసక చీకటి. నిజానికి ఒక భయంకరమైన గంభీరతలో నాకెందుకు సుందరమనిపిస్తుంది. ప్రకృతి ఎంతో నేర్పుగా , మార్మికంగా నాలో మానసిక స్థిరతను వృద్ది చేసి ఉంటుందా .. అలా ఉంటే తప్ప ఇటువంటి నిర్జన ప్రదేశానికి చూసినప్పుడు మనోవైకల్యం చెందకుండా ఎలా ఉండగలం.
వెన్నెల కాస్తుంది. వెన్నెల వెలుగులు చెరువు నుంచి మీద ఒక స్పష్టమైన వెండి మెరుపు. పక్షి కూతలు వింటూ డ్రైవర్ తెచ్చిన మొక్కజొన్న పొత్తులను తింటూ కట్ట మీద నడుస్తున్నాను. మందిరం నీడ నా నడకను బట్టి ఒక్కోసారి ఒక్కోవైపు కనిపిస్తున్నది.ఈ క్షణం నాకేమనిపించిందంటే కొన్నిసార్లు నీదైన లోకంలో బతకాల్సిన ఉంటుంది లేదా అటువంటి పరిస్థితి వస్తుంది. అందులో మన ప్రమేయం ఉందా లేదా అన్నది పక్కన బెడితే అటువంటి స్థితి అసాధారణమైంది , ఉత్కృష్టమైనది ఎందుకంటే అది నిన్ను నిన్నుగా నిలబెడుతుంది, నీకు చెబుతుంది… నాలో ఎదో అర్థం కాని ప్రకృతి జ్ఞానం ప్రవహిస్తున్నట్టుంది. నిరంతరం అడవుల్లో తిరిగే ఇటువంటి దృశ్య పరిచయం వంటివికూడా మమల్ని ఇటువంటి సందర్భాలకు సన్నద్ధం చేస్తుంటాయేమో. ఇటువంటి మనో స్థిరత కోసమే ఋషులు వనవాసం చేసి ఉంటారు. వార అఖండ ఏకాంతంలో వారు దర్శించిన విషయాలు వాజ్మయం అయ్యాయా .. అంతే అయ్యుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ప్రకృతి ఆరాధకుల్ని చేయడం వెనుక అదే కారణం కావచ్చు. ఇటువంటి శక్తిని ప్రత్యక్షంగా పొందడం కోసమే హెన్రీ డేవిడ్ ధోరో వాల్డన్ సరస్సు పక్కన రెండేళ్ళు నివసించి ప్రాకృతిక దివ్యత్వాన్ని అనుభూతి చెందాడనుకుంటాను. ఆ తాత్వికానుభూతి నుంచే సకల మానవుల శ్రేయస్సు కోరే అంతః శక్తి పొంది ఉంటాడు. మన పూర్వీకుల నుంచి ఒక జ్ఞాన రేఖ జనించి తిరిగి మనకు అంతే ప్రేరణగా తిరిగివచ్చిందని ధోరో చరిత్ర చదివితే అర్థం చేసుకోవచ్చునేమో .

ధోరో ఇంతకు ముందు పరిచయం చేసిన ఎమర్సన్ కు మిత్రుడు. వాల్డన్ అమెరికా దేశంలోని, మసాచూట్స్ వద్ద ఉన్న ఒక చిన్న సరస్సు. దానికి అనుకొని ఉన్న ఎమర్సన్ కు చెందిన స్థలంలో ఎమర్సన్ అనుమతితో రెడేళ్ళ రెండు నెలల రెండు రోజుల పాటు తానే నిర్మించుకున్న ఏకాంత గదిలో నివసిస్తూ సరస్సు నూ , పక్కన ఉన్న అడవిని సేవిస్తుంటాడు. తన అనుభవాలన్నీ వాల్డన్ పేరుతో పుస్తకం వేశాడు. శబ్దాలని , సరస్సుని , శీతాకాలపు సరస్సు అందాలని , జంతువులని వర్ణిస్తూ అనేక విషయాలను చెప్పుకుపోతాడు. భారతీయ , గ్రీకు తాత్వికుల వచనాలను ఉదాహరిస్తుంటాడు. మొదటి సారి తాను నిర్మించుకున్న గదిలో ఉండిపోయేటప్పుడు భారతీయ నిరాడంబర జీవన శైలిలా ఎందుకు ఉండకూడదని అనుకుంటాడు. ఒకనాటి శీతాకాలపు రోజున వాల్డన్ సరస్సులో గడ్డ కట్టిన పంచుపలకలను తవ్వి భారత దేశానికి తరలిస్తున్న వేళ “The sweltering inhabitants of Charleston and New Orleans, of Madras and Bombay and Calcutta drink at my well ..the pure water is mingled with the sacred water of the Ganges” అని రాసుకున్నాడు. ( ఒకప్పుడు అమెరికా నుంచి మనకు మంచు వ్యాపారం Ice Trade జరిగేది. ఇది ఒక దశాబ్ద కలం కొనసాగింది). “Rather than love , than money , than fame , give me truth” అన్న అతని అన్వేషణ, ప్రకృతిలోనే కొనసాగింది.

భారత దేశ స్వతంత్ర్య సంగ్రామంలో , సహాయ నిరాకరణ ఉద్యమానికి గాందీకి ప్రేరణినిచ్చింది థోరోనే. ఒక్క గాంధీనే కాదు మార్టిన్ లూథర్ కింగ్నికూడా ప్రభావితం చేసింది థోరోనే. బానిసత్వానికి వ్యతిరేకంగా జరిగిన సామజిక సంఘర్షణలో మానవత్వం వైపు నిలబడి తన దేశాన్నే కాదు ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు థోరో. ఒక యోగిలా జీవిస్తూ జీవిత సారాన్ని అంతా పీల్చుకోవాలని ఉవ్విళ్ళూరాడు. అందుకు ప్రయత్నం చేసాడు. థోరో వెనుక వెన్నెముక గా నిలిచిన తాత్విక మూలాలు అరణ్యావర్తనం చెందిన మన ఋషుల ద్వారా వాజ్మయ రూపం దాల్చిన ప్రకృతి ప్రవాహమనే అంటాను నేను. ఎలా అయితే సూర్యుని వెలుగు భూమిని చేరి ప్రతిఫలించి చంద్ర కాంతిగా తిరిగి భూమిని చేరుతుందో అలాగ మన తాత్విక లక్ష్యం తిరిగి మననే చేరి తన లక్ష్యం నెరవేర్చుకున్నది. నేనది ఇప్పుడు అనుభూతి చెందుతున్నాను.

మా బృంద సభ్యుల పిలుపుతో ఆలోచనలో నుంచి బయటకు వచ్చాను. సమయం రాత్రి పదకొండున్నర గంటలకు చేరుకున్నది. నా అంతరంగ విశ్లేషణలతో నా మస్తిష్కం వేడెక్కినా ఆరుబయట మాత్రం చలి అంతకంతకూ పెరుగుతున్నది. అనుకున్నట్లుగా చేపల వేటకు ఎవరూ రాలేదనీ మత్తడి పోయడం తగ్గిన తర్వత మరొక్క మారు బోట్ల సహాయంతో వలలను యేరివేయాలనీ చెప్తూ నిర్ణయం నాకు వదిలివేశారు. అన్నీ సర్దుకొని మరొక సారి జీపులోనే చుట్టు పక్కల గమనిస్తూ పరకాల వైపుగా వెళ్ళాలణి నిర్ణయించుకున్నాం.

అందరం జీపు ఎక్కేసాం.అర్థరాత్రి నిండు జల పాత్రల వైభవం తలుచుకుంటూ అక్కన్నుంచి వెళ్లిపోతున్నాను. నిశ్శబ్దపు అడవిలో మా జీపు చప్పుడు చేస్తూ ముందుకు పోతున్నది. చెరువు మీద చంద్రుని ప్రతిబింబం మెరుస్తుండగా విచ్చుకుంటున్న తెల్ల కాలువలు జీపు లైట్ల కాంతిలో మా కళ్ళ వలె మెరుస్తున్నాయి .

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
3 months ago

వీణావాణిగారూ, మీది బహుముఖీనమైన అక్షర ప్రభ. చదువరుల్ని వెంట తీసుకుపోవడం మీకు తెలుసు. అక్షరాలతో బొమ్మలు జీసీమరీ చూపించారు. అభినందనలు

N N RAJU
N N RAJU
3 months ago

థోరో గురించి తెలుసుకుని ఆనందం కలిగింది.ఫోటోలు కూడా జతచేసి ఉంటే బాగుండేదని అనిపించింది. పాఖాల, గుండం, శివాలయం, దేవనపల్లి, అన్నీ వివరంగా చెప్పారు. కృతజ్ఞతలు మేడం. నీలకంఠం నరసరాజు హైదరాబాద్

శ్రీనివాస్ గెడ్డం
శ్రీనివాస్ గెడ్డం
3 months ago

చాలా అద్భుతమైన అమృతజ్ఞాపక వివరణ