ఆపన్న హస్తం(సంపాదకీయం ) – కవిత పులి

అది మార్చి 10 సావిత్రిబాయి ఫులే వర్ధంతి.. ఒక మీటింగ్ లో ఉన్న. ఆ రోజు నా వాట్సాప్ స్టేటస్ చూసిన ఒక స్నేహితురాలు నాకు ఒక మెసేజ్ చేసింది. “డియర్ సిస్టర్ హాప్ యు ఆర్ డూయింగ్ వెల్. థిస్ కోవిడ్ 19 విల్ టర్న్ ఆస్ పాండేమిక్. అల్ మేజర్ కంట్రీస్ విల్ ఎఫెక్ట్ బాడ్లీ. ఎస్పెషల్లే హై పాపులేషన్ డెన్సీటీ కంట్రీస్ లైక్ ఇండియా. సో బీ కెర్ఫుల్. యూ ఆర్ వెరీ వాల్నరబుల్. స్టే సేఫ్. విత్ లవ్ ఫ్రేమ్ వియత్నాం”. ఈ మెసేజ్ చేసిన స్నేహితురాలు వియత్నాం లో “ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్” లో అధికారి. తను డిసెంబర్ లో మలేషియాలో జరిగిన APWLD కాన్ఫరెన్స్ లో కలిసింది. అప్పుడప్పుడు వాట్సాప్లో హాయ్ హాల్లో చెప్పుకోవడం తప్పా పెద్దగా మాట్లాడుకుని స్నేహాన్ని పెంచుకున్నది ఏమీలేదు. అలాంటిది ఆమె ప్రత్యేకంగా జాగ్రత్తలు చెపుతూ కరోనా పాన్ డేమిక్ గురించి మెసేజ్ చెయ్యడం నాకు ఇది ఏదో సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం అనిపించింది. అయితే వెంటనే 14 వ తేదీన నా కొడుకు హాస్టల్లో ఉంటే చూడడానికి వెళ్ళాను. అక్కడ ఉండగానే సాయంత్రం 4 గంటలకు రేపటి నుండి పాఠశాల లకు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అనే వార్త టీవీలలో వస్తోంది. 22 న జనతా కర్ఫ్యూ గురించిన వార్తలు కూడా వస్తున్నాయి. అందరూ ఇదే విషయం చర్చించుకుంటున్నారు. అంతలోనే 10వ తరగతి పరీక్షల ద్యూటీలు కూడా సర్కులేట్ అవుతున్నాయి. రకరకాల ఊహాగానాల నడుమ 10 వ తరగతికి 3 పరీక్షలు కూడా పెట్టేసారు. కేంద్రప్రభుత్వం విధించిన ఒకరోజు జనతా కర్ఫ్యూను పండుగలా సెలబ్రేట్ చేసుకున్న దేశప్రజలు తప్పెట్లు తాళాలతో వీధుల్లో విజయగర్వాన్ని చాటుకున్నరు.

తెల్లవారి నుండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అయినా యధావిధిగా రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. జనాలు అవసరం ఉన్నా లేకున్నా షాపుల ముందు క్యూ కట్టి వెనుకవాడికి దొరక్కుండా సరుకులన్నీ అందినకాడికి ఊడ్చుకుపోయారు. షాపులన్నీ సరుకులు లేక వెలవెల పోయాయి. ఉన్నత మధ్యతరగతి ప్రజలు ఈ విధంగా హైరానా పడుతుంటే మరోదిక్కు రెక్కాడితే డొక్కాడని పేద బతుకుల భవిష్యత్ చీకటయ్యింది.

ఏ పూట పని చేసుకుని ఆపూట కడుపు నింపుకుని బతికే జనాలకు కూలీ కారువయింది. ఒకదిక్కు ఆకలి బాధలు. మరొకదిక్కు పేరుతెలువని రోగం భయం. పేదల బతుకులు పెనం మీంచి పొయ్యిల పడ్డట్టయ్యింది. ముక్యంగా హైదరాబాద్ నగరంలో వలస బతుకులు మొదటివారంలోనే అధ్వాన్నంగా మారాయి.

ఆ సమయంలో నే తెలంగాణ మహిళా ట్రాన్సజెండర్ జెఏసీ నుండి మరియు ఇతర సంఘాల నుండి సజయక్క, వసుధ నాగరాజ్, ఖాలీదా ఆపా లాంటి వాళ్ళు స్వయంగా ఆహారం వండించి పంచడం, రేషన్ సరుకులు పంచడం చేస్తున్నారు.

అదే క్రమంలో చైల్డ్ రైట్స్ ఆక్టివిస్ట్ వర్షా భార్గవి, రాజ్ జంగం, సజయక్క రైతు స్వరాజ్య వేదిక రవి గారు తదితరులు కలిసి విజయనగర్ కాలనీలోని సెంయిట్ ఆన్స్ పాఠశాల వేదికగా డ్రైరేషన్ పంచాలని అనుకుంటున్నప్పుడు వారితో కలిసి నేను కూడా డ్రైరేషన్ పంచడంలో పాలుపంచుకున్న. ఆ పనిచేస్తున్న క్రమంలో రకరకాల వ్యక్తులు, సమూహాల నుండి రిక్వెస్ట్ లు వచ్చేవి. హైదరాబాద్ లో, నగరం చుట్టుపక్కల, శివారు ప్రాంతాల్లో ఉన్న వివిధ రాష్ట్రాల, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల వలస కూలీలు ఎంతమంది ఉన్నారో అప్పుడే తెలిసింది. మా దృష్టికి రానివాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారన్నది కూడా అప్పటికి తెలియదు. మొత్తానికి మా దగ్గర ఉన్న నిధులకు అనుగుణంగా అత్యవసరంలో ఉన్నవాళ్లకు పంచగలిగాము.

అయితే చాలామందికి ఇక్కడ చెయ్యడానికి పనిలేదు. చేతిల రూపాయి కొత్తలేదు.. ఆకలికె దిక్కులేని తనం.. అప్పటికే నెలతిరిగి ఫస్టు తారీఖు వచ్చింది. ఇండ్ల కిరాయి బాధ ఓ దిక్కు. పోనీ కష్టమో నష్టమో ఉందామంటే పరిస్థితులు సర్దుకుని పనిదొరుకుతదనే నమ్మకం కనిపిస్తలేదు. దాతలు పెద్దమనుసు చేసుకుని ఉడికిన తిండి, రేషన్ సరుకులు అందిస్తున్నరు. కానీ కిరాయి ఎవరు కడతరు. ఇక్కడ ఉండి రోగమొచ్చి ఛస్తే కుక్కనీడ్చినట్టు గుంజి పడేస్తరనే పుకార్లు ఒకదిక్కు వణికిస్తున్నయి.

ఇట్లా మనదేశంలో మార్చి 22 జనతా కర్ఫ్యూ తో ప్రారంభం అయిన లాక్డౌన్ పేదల జీవితాల్లో పెను సంక్షోభాన్ని సృష్టించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన లక్షలాదిమంది అంతరాష్ట్ర వలసకూలీల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రోజు కూలీ చేస్తే తప్ప ఐదువేళ్ళు నోట్లోకి పోనీ నిరుపేదలకు ఉపాధి ఆహార భద్రతను దూరం చేసింది. గ్రామాల్లో, వారి వారి రాష్ట్రాల్లో ఉపాధి లేక పిల్లాజెల్లతో పొట్టచేతపట్టుకుని పట్టణాలకు వలస వచ్చిన వాళ్ళు పనిలేక, ఉండే వసతి లేక, తమ గ్రామాల బాట పట్టారు.

అయితే మొదటి విడత లాక్డౌన్ దాకా దాతల సహాయం తో ఎలాగో నెట్టుకొచ్చిన వాళ్ళు లాక్డౌన్ విడతల వారిగా పొడిగించడంతో ఉపాధి లేకపోవడం, ఇంటి అద్దె యజమానుల వేధింపులు తాళలేక, ఉండేదిక్కులేక ఇంటిబాట పట్టారు. కరోనా వైరస్ తాలూకు పుకార్లకు భయపడి మాత్రం కాదు. పనిలేని ఈ ఆపత్కాలంలో ఎక్కడున్నా ఆకలికి చస్తాం. ఆ చచ్చేదేదో సొంత గ్రామాల్లో అయిన వాళ్ల చెంత సొంత మనుషులతో ఉంటే చావైనా బతుకైనా ఎదుర్కునే ఓదార్పు ఉంటదనే నమ్మకంతో పిల్లాజెల్లా, మూట ముల్లెతో రవాణా సదుపాయాల కోసం ఎదురుచూడకుండా జాతీయ రహదారులపై నడవడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై గుంపులు గుంపులుగా.. వయసుతో నిమిత్తం లేకుండా.. పిల్లలు, ఆడవాళ్లు.. గర్భిణులు.. బాలింతలు.., ముసలి వాళ్ళు.. రోగగ్రసులు అనే తేడాలేకుండా.. రాత్రనక పగలనక.. ఎర్రటి ఎండను సైతం లెక్కచెయ్యకుండా చెప్పులు కూడా లేని పాదాలతో వందల మైళ్ళ దూరం ఆ నడక కొనసాగుతోంది..

ఇకపోతే మన రాష్ట్రంలో వలస కార్మికుల పరిస్థితి చూస్తే.. ఇక్కడ తెలంగాణ లో జనతా కర్ఫ్యూ తర్వాత వెంటనే లాక్డౌన్ మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో ప్రజారవాన స్తంభించింది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ రెండో రోజే 51 సంవత్సరాల మంచిర్యాల జిల్లా రామకృషాపూర్ వాసి వరంగల్ నుండి తన సొంత ఊరికి నడవడం మొదలుపెట్టాడు. అతను వరంగల్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేవాడు. నడకకు కారణం అతని మాటల్లో వింటే.. “ఇక్కడ నేను మెస్త్రీ కింద తాపీ పని చేస్తా. వారం అంతా ఇక్కడ పనిచేసుకుంటా దొరికింది తిని లాడ్జీల పంటా. వారాణికోపాలి ఇంటికిపోయి పిల్లలను వాళ్ళ అవసరాలను చూసుకొనత్త. ఇప్పుడు పని లేదు. లాడ్జీలు మూసేసిండ్లు. ఉండడానికి చోటు లేదు. చెయ్యడానికి పనిలేదు. తినడానికి హోటల్స్ లేవు. తిండిపెట్టే దిక్కులేదు. ఈ లాక్డౌన్ ఎప్పుడు పోతదో…! పనిదొరుకుతదో లేదో..! ఈడ చిక్కి పోతే ఎట్లా..? ఇంట్ల పరిశనైతరు. ఎదురుచూస్తరూ. ఏమైతది..? మా అంటే 5 రోజులు కష్ట పడుతకావచ్చు. అయితమాయే.. ఇల్లుజేరింది కావాలె.. నడుత్తా”. అన్నడు. ఇతనిది ఒకవైపు ఉపాదిలేకపోవడం, మరోవైపు కరోనా భయం . వెంటనే కుటుంబ సభ్యులను చేరాలని రెల్వ్ పట్టాల వెంట నడక సాగించాడు. దారిలో మనసున్న మనుషుల సహకారంతో 4వ రోజున ఇల్లుచేరుకున్నాడు.. ఉగాది పండుగ నాడు దారిలో కొందరు యువకులు ఇతన్ని మాట్లాడించిన చిన్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది కూడా.

ఆ తర్వాత విజయనగరం నుండి హైదరాబాద్ కు వచ్చి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 6 గురు వ్యక్తుల బృందం కూడా ఉత్తరాంధ్రకు కాలినడకన బయలుదేరింది. వీళ్లకు సజయక్క వాళ్ళు డ్రై రేషన్ ఇప్పించినప్పుడే ఇంటికి వెళ్తాం అంటే ఎక్కడికి వెళ్ళొదు. పరిస్థితులు సర్దుకున్నాకా మేమే పంపిస్తాం అని చెప్పినా వినకుండా నడిచివేళ్ళారు. ఆ విషయం తెలుసుకున్న సజయక్క రమేష్ అన్న ఫెస్బుక్ లో పెట్టిన పోస్టుకు స్పందించిన మనసున్న దాతలు దారిలో ఆహారం నీళ్లు అందించారు.

అదేవిధంగా నేను టీచర్ గా పనిచేస్తున్న అత్తాపూర్ పరిధిలోని పాఠశాలలకు వచ్చే పిల్లల్లో చాలా మంది మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కుటుంబాల పిల్లలే ఉంటరు. డ్రైరేషన్ పంచుతున్నాప్పుడు వాళ్లకు కూడా ఇద్దామని మా అంగన్ వాడి టీచర్ కు ఫోన్ చేసాను. వేరే రాష్ట్రాల వాళ్ళు ఉన్నరు.. మిగతా వాళ్ళ గురించి రేపు చెప్తా టీచర్ అని చెప్పింది. నేనే ఉండబట్టలేక ఒక పేరెంట్ కు ఫోన్ చేస్తే “కిరాయి అతను లొల్లి చేసిండు టీచర్. మా ఊరోళ్ళు నడిచిపోతున్నరు. సోపతికి వాళ్లెంట మేము కూడా నడిచిపోతున్నాం” అని చెప్పిండు. నాకు మనసంతా వికలమైంది. ఎర్రటి నడి ఏప్రిల్ ఎండ.. నెత్తిన మూటలు.. ముగ్గురు చిన్న చిన్న పిల్లలు అంతా 10 ఏండ్ల లోపే.. ఎట్లా నడుస్తున్నారో అని దుఖః వచ్చింది. అయినా నేనేమి చెయ్యలేని పరిస్థితి.

ఇలా రోజు రోజుకు హైదరాబాద్ శివారుల నుండి ఒక్కొక్కరుగా కుటుంబాలతో పాలమూరు, నల్లగొండ జిల్లాలకు నడకలు మొదలయ్యాయి. ప్రజలు ప్రతిరోజు మూట మూల్లెలతో నడవడాన్ని చూసిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం కూడా చూసి చూడనట్టుగా బాధ్యత రాహిత్యం గా వదిలేసింది. కానీ అప్పటికే స్పందించిన సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు ఉపాధి లేక ఆకలితో అల్లాడే పేద, రోజువారీ కూలీలను వలస కూలీలను ఆదుకోవడానికి రేషన్ సరుకుల పంపిణీతో పాటు సిటీ నుండి సొంత గ్రామాలకు నదుస్తున్న వాళ్ళకు దారిలో ఏక్కడికక్కడ దాతల సహాయంతో నీళ్లు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ దశలవారీగా పొడిగించడంతో చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడికక్కడ కంపెనీలు కర్మాగారాలు మూత పడ్డాయి. బాధ్యత గా ప్రవర్తించని చాలా సంస్థల యాజమాన్యాలు తమ కూలీలకు జీతాలివ్వని తిండి పెట్టని పరిస్థితులు. కనీసం ఇంటికి వెల్దామన్నా వెళ్లలేని పరిస్థితి.

దేశ రాజధాని ఢిల్లీలో వేలాది మంది ప్రజలు బస్సులు, రైళ్ల కోసం వీధుల్లోకి వచ్చారు. పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. వీటన్నింటినీ చూసిన జనం ప్రభుత్వాలను కాక తమకాళ్లనే నమ్ముకున్నరూ. కండ్ల ముందున్న ఆకలి కష్టం ముందు కిలోమీటర్ల దూరం భారంగా భయపెట్టలేదు వాళ్ళను. ఇక్కడుంటే కరోనా రోగం చంపుతదో లేదో తెలియదు కానీ పేదరోగం మాత్రం తమను కచ్చితంగా చంపుద్ధి అని తెలుసు. అందుకే ఎర్రటి ఎండ చంపుతున్న.. కాళ్ళకు చెప్పులు లేకున్నా.. కడుపుకు తిండి నీళ్లు లేకున్నా.. జాతీయ రహదారులపై దండు కట్టినరు. కంకర కుప్పలు, మూళ్ళపొదలు, పురుగు పుట్రా లను లెక్క చెయ్యక రైల్వే ట్రాకుల వెంట బారులు తీరిండ్లు. అలసి సొలసి అదే పట్టాలపై పడుకుని ఘాడ నిద్రల అదే పట్టాలకు నెత్తుటి తర్పణం ఆయిండ్లు. ఇంత జరుగుతున్న.. జాతీయ రహదారులన్నీ దళిత బహుజన వలస కూలీల కమిలిన పాదాలతో రక్తమోడుతున్న పాలకుల మనసు ఏమాత్రం చలించకపోగా వరుసగా లాక్డౌన్ ప్రకటించారు. ఓటు లెక్కల్లో తప్ప మనుషుల లెక్కల్లో లేని భారత ఆర్థిక వ్యవస్థ మూల స్తంభాలైన లక్షలాదిమంది వలస కార్మికులను, వారి పట్ల బాధ్యతలను నిస్సిగ్గుగా విస్మరించారు.

నెలన్నర లాక్డౌన్ గడిచాక దాతల రేషన్ తమ కడుపులు నింపగలుగుతున్నప్పటికి ఇంటికాడ పిల్లాజెల్ల ఎట్లఉండిరో అనే దిగులు, ఇంటికాడి పరిస్థితులు వలసకూలీలను మానసికంగా కుంగదీసింది. అందుకు 49 ఏండ్ల నరేష్ భూయా జీవితమే ఒక ఉదాహరణ. ఇతను హైదరాబాద్ లోని భవన నిర్మాణ సంస్థలో పనిచేసే వలసకూలి. ఇతనిది ఝర్హాండ్ లోని ఘర్కా జిల్లా. కేవలం నెలకు 6000 జీతం కోసం కుటుంబాన్ని వదిలి వందల కిలోమీటర్ల దూరం వచ్చి పనిచేస్తున్నాడు. లాక్డౌన్ మొదలు కాగానే పని ఆగిపోయింది. గుత్తేదారు జీతం ఇవ్వలేదు. ఇంటి దగ్గర దుర్భర పేదరికంలో ఉన్న భార్య తిండిలేక చనిపోయింది. పిల్లలు చిన్నవాళ్ళు. గుడ్డి తల్లి తప్ప చుసుకునే వాళ్ళు లేరు. ఈయనేమో ఇక్కడ అనాథగా చిక్కుకుపోయాడు. చేతిలో రూపాయిలేదు. నడిచిపోను కూడా ఊరూ దారి తెలియని దైన్యం. బతికుండగానే మనిషి మానసిక వేదనతో చిక్కి శల్యం అయ్యాడు. దారిపొడవునా ఇలాంటి కథలు, వ్యథలెన్నో .

తెలంగాణలో సహాయం కోసం, మంచిరోజుల కోసం ఎదురు చూసీ చూసీ విసుగు పుట్టిన జనం నేషనల్ హైవే 44 వైపు నడక సాగించారు. కాస్తో కూస్తో దాచుకున్న పదో పరకో ఉంటే పట్టుకొని గూడ్స్ ట్రక్కుల్లో పోవడానికి నగర శివారులో మేడ్చెల్ ఔటర్ రింగ్ రోడ్డు లో ట్రక్ బే దగ్గర క్యూ కట్టారు. ఎర్రటి ఎండ.. దరిదాపుల్లో చెట్టు చెమ లేదు. గుక్కెడు నీళ్లిచ్చే దిక్కులేదు. ఆకలైతే కన్నీళ్ళతో కడుపు నింపుకోవాలసిందే. ట్రక్కుల్లోనెమో పశువులను మెలిగినట్టు ఆడ, మగ, పిల్లలు, ముసలి వాళ్ళు తేడా లేకుండా మేలుగుతరు. అందులో ఆడవాళ్లుంటారు.. గర్భిణులు, బాలింతలుంటారు. పసిపిల్లలుంటారు వయసు పిల్లలుంటారు. ఆడవాళ్లకు అది అత్యంత దుర్భరమైన, అసౌకర్యమైన, అవమానకరమైన ప్రయాణం అది. పక్కకు కూడా కదలలేనంతగా చుట్టూ మగవాళ్ళ మధ్య కూర్చుని రెండు మూడు రోజులు రాత్రనక పగలనక ప్రయాణించాలి. ఎవరెక్కడ తాకుతున్నారు..? ఎవరు ఎమ్ చేస్తున్నారు..? తాకేవాడు కావాలని తాకుతున్నాడో.. అనుకోకుండా తాకుతున్నారో తెలియని పరిస్థితి. ఏంచేసినా అడగలేని నిస్సహాయత. అందులో పీరియడ్ వచ్చినా అలాగే భరించాల్సిన దుస్థితి. గంటలకు గంటలు మూత్రం ఆపుకోవాల్సిన దైన్యత. పైగా ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణానికి దూరాన్ని బట్టి ఒక్కొక్కరికి రొండువేల నుండి అయిదు వేల రూపాయలు తీసుకుంటరు లారీ వాళ్ళు. ఇన్ని
సవాళ్ల మధ్య ప్రయాణం నరకానికి నకలులాంటిది. అయినా ఇల్లు చేరాలనే తాపత్రయం వారిని ఆ ప్రయాణం చేసేలా చేస్తోంది. ఇలా లారీల్లో పోవడానికి చేతిలో పైసలు లేని జనం నిస్సహాయంగా కాళ్లకు పనిచెప్పారు.

ఇలా రాత్రనక పగలనక ట్రక్కుల కోసం లేదా నడుస్తూ పోతూ నేషనల్ హైవే 44 పై జనం పోగవుతున్నారు . ఈ క్రమంలో సి. వనజక్క తను రేషన్ ఇస్తోన్న ఒక బాలింత కుటుంబం తమ ఊరు ట్రక్కుల్లో వెళ్ళడానికి ఇక్కడకు వచ్చింది. లోకల్ లో రవాణా సదుపాయం లేనందున ఆ కుటుంబాన్ని ఇక్కడ దింపడానికి వచ్చిన ఆమె మరియు అడ్వాకెట్ వసుధా నాగరాజ్, సజయక్క సత్యవతి కొండవీటి మరియు ప్యూర్ సంధ్య తదితరులు వీళ్ళు ఇలా ఎండలో అలమఠించడం చూసి ముందుగా బిస్కట్లు నీళ్ళందించడానికి ముందుకొచ్చారు. అక్కడి అవసరాన్ని పేస్బుక్ వేదికలో పంచుకున్నరు. అది చూసిన స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అంతా ఒక్కొక్కరుగా స్పందించి సమూహంగా ఒక్కటయ్యాము. స్థానిక నాయకులు, అధికారులు కూడా తోడ్పాటును ఇచ్చారు. ఫలితంగా వలస కూలీలకు నీడనివ్వడానికి ఎడారిలాంటి మేడ్చెల్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో టెంట్స్ వెలిశాయి.

నేను కూడా సజయక్క ఫెస్బుక్ పోస్ట్ ద్వారా హైవేపై నడుస్తూ మేడ్చెల్ దగ్గర పొగవుతున్న వలసకార్మికుల గురించి తెలుసుకున్నాను. అలాగే పెర్కిట్ దగ్గర జరుగుతున్న ఆహార పంపిణీ గురించి కూడా గంగారెడ్డి గారి పోస్టుల ద్వారా తెలుసుకున్నాను. నాకు నా చిన్న చిన్న విద్యార్థులు నడవడం గుర్తుకొచ్చింది. నిత్యం సావిత్రిబాయి ఫ్యూలే ఆశయాలు ప్రచారం చేసే నేను చావు భయంతో ఇంట్లో కూర్చోవడం ఏంటని సిగ్గనిపించింది. కానీ అక్కడికి వెళ్లాలంటే నాకు కారు లేదు. కనీసం టూ వీలర్ కూడా లేదు. క్యాబ్ ఆటో ఫెసిలిటీ లేదు. దింపేవాళ్ళు కూడా లేరు. మొదటి మూడు రోజులు అటుగా వెళ్ళేవాళ్లను చాలా మంది ని అడిగాను బతిమాలాను. ఎవరూ నేనున్నా దారినుండి వెళ్ళేవాళ్ళు లేరు. మొత్తానికి వనజక్క పికప్ చేసుకుంటా అన్నది. అదేరోజు అపర్ణ తోట కూడా రావడంతో ఆమెతో 3వరోజు అక్కడికి వెళ్లగలిగాను.

అక్కడికి వెళ్ళగానే అక్కడి దృశ్యాలు చూసి నా మనసంతా వికలం అయింది. పిల్లలు, బాలింతలు, ఆడవాళ్లు నడవడం ట్రక్కుల్లో పోవడం చెప్పులు కూడా లేకుండా ఉండటం చూసి బాగా ఏడ్చాను. నావంతుగా ఇంకా ఏదన్నా చెయ్యాలి. ఎవరు సహాయం చేస్తారు.. అని ఆలోచిస్తూ నిద్ర పట్టలేదు. అలా ఆలోచిస్తూనే అర్ధరాత్రి డా. R S ప్రవీణ్ కుమార్ సార్ కు విషయాన్ని వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ చేసాను. ఆయన ఉదయాన్నే ఆ మెసేజ్ ను స్వేరో నెట్వర్క్ సెంట్రల్ కమిటీ గ్రూపు లో పోస్ట్ చేసారు. అది చూసిన సెంట్రల్ కమీటీ మెంబర్స్ బాలప్రసాద్ గారు 1000 మజ్జిగ పాకెట్స్ అందించారు. గీత దుబ్బ గారు ఆమె ఫ్రెండ్ సృజన 10 మంది ఉత్తరప్రదేశ్ వెళ్లే బృందానికి ట్రక్ చార్జెస్ ఇచ్చారు.
మరీ ముఖ్యంగా స్వేరో నెట్వర్క్ నుండి లైఫ్ లైన్ లీగ్ అధ్యక్షుడు డా. మంద శ్రీకాంత్ గారి సపోర్టు ఎనలేది. ఆయన పీడియాట్రిక్ అసోసియేషన్ తరుపు నుండి 1000 మాస్కులు, బిస్కట్లు, నీళ్లు అందించారు. తన బృందం తో వచ్చి మెడికల్ క్యాంపు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే డా. శైలజా ప్రకాష్ గారు కూడా ఆడవాళ్లకు 1000 (సానిటర్ పాడ్స్, స్నానం సబ్బు, బట్టల సబ్బు, సాంపు, పౌడర్ తో కూడిన) సానిటరీ కిట్స్ ఇచ్చారు. 500 డ్రై రేషన్ కిట్స్ మరియు 200 మంది ఆడవాళ్లకు 500 చొప్పున డబ్బులు కూడా ఇచ్చారు. డా. అజాం గారు వారం రోజులు 300 ఫుడ్ పాకెట్స్ ఇచ్చారు. ఇదంతా కూడా డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ ఇచ్చిన సపోర్ట్.

2 వరోజు పోలీసులు ట్రక్కుల్లో పంపడాన్ని అడ్డుకోవడం తో కాస్తా ఇబ్బందులు పడ్డాము. అయినా సరే వలస కార్మికులను వాళ్ళ ఇండ్లకు క్షేమంగా పంపించాలనే ఉదేశ్యంతో దాతల సహాయం కోసం నేను ఒక ఫెస్బుక్ లైవ్ వీడియో పెట్టాను. అది చూసిన రిటైర్డ్ రైల్వే ఆఫీసర్ డా. అప్పికట్ల భరత్ భూషణ్ గారు నాకు ఫోన్ చేసి అక్కడ ఏమేమి అవసరమో కనుక్కున్నారు. ఆయన తన పరిచయాల ద్వారా 10 లక్షల విరాళాలు సేకరించి మూడు విడతల్లో పిల్లలకు ఆడవాళ్లకు, మగవాళ్లకు కావలసిన చెప్పులు, చీరలు, బిస్కెట్స్, ఫ్రూట్ జ్యూసెస్ మరియు నీళ్ళ బాటిల్స్ తెచ్చారు. ఒక లక్ష 60 వేళతో 70 మందిని గోర్కపూర్ కు పంపించాడానికి ఒక బస్ కూడా స్పాన్సర్ చేశారు. ఎర్రటి ఎండలో స్వయంగా ఆయనే అన్ని కొనుక్కుని వచ్చి మేడ్చెల్ లో మరియు ఘట్కేసర్ లో పంచారు. మేడ్చెల్ లో జరిగిన పనిలో నా తరుపున అత్యంత ఎక్కువగా పని జరగడానికి కారణం భరత్ భూషణ్ సర్. కేవలం మేడ్చెల్ లొనే కాదు ఇలా అవసరం ఉంది అని చెప్పగానే ఈ నెల 19, 20 తేదీల్లో ఏటూరునాగారం అడవుల్లో ఆదివాసీలకు కూడా దాదాపు 5లక్షల విలువైన చెప్పులు, దుప్పట్లు, బట్టలు స్వయంగా ఆయనే వచ్చి పంచారు. అడగ్గానే మొదటగా స్పందించి చేయూతనందించే చల్లని హృదయం భరత్ భూషణ్ సార్ ది.

వీళ్లేకాదు సత్యం అన్న, సజేశ్ రావు, షాగంటి మల్లేష్, స్వాతి మోర్తాల మరియు సాయిరాం అతని స్నేహితులు ఇంకా ఎందరో దాతలు ఆహారం, నీళ్లు, మజ్జిగ, గుడ్లు, పండ్లు రొట్టెలు, బన్నులు, బిస్జట్లు, అన్నం కూరలు సకల పౌష్టికాహారాన్ని వ్యక్తులుగా సమకూర్చారు. ఎండల్లో నడవడం వల్ల బొబ్బ లెక్కి గాయపడ్డ కాళ్లకు చెప్పులందించారు. ఎవరెవరో ప్రతిరోజు కొత్తవ్యక్తులు తమ దాతృత్వపు సేవలను విస్తరించారు.

చినుకు చినుకు కలిసి సముద్రం అయినట్టు ఎక్కడెక్కడ నుంచో ఒక్కొవ్యక్తి కలిసి మేమంతా ఒక సమూహ శక్తిగా మారాము. అదేవిధంగా ఎక్కడెక్కడ నుండో నడుచుకుంటూ వస్తున్న వలస కూలీలకు మేడ్చెల్ రహదారి ఒక ఓదార్పు హస్తంగా మారింది. దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వారధిగా ఉన్న హైదరాబాద్ శివారు మేడ్చెల్ ప్రాంతం వలసకూలీల కు నేషనల్ హైవే 44 పై ఒక ముఖ్యమైన ప్రాంతంగా మారింది. దక్షిణ రాష్టాల నుండి ఉత్తర రాష్ట్రాలకు నడుస్తూ వస్తున్న వేలాది మంది మా రిలీఫ్ క్యాంపు లో ఆగుతున్నరు. ఆకలి దాహం తీర్చుకుంటున్నారు. ఆగిన గూడ్స్ ట్రక్కుల్లో వెళ్లే అవకాశం ఉన్నవాళ్లు వెళుతున్నారు. డబ్బులు లేక ట్రక్కుల్లో కూడా వెళ్లలేక నడిచే వాళ్ళను అక్కడి మా నిర్వాహక బృందం దాతల సహకారంతో ట్రక్కుల్లో పంపిస్తున్నాము. దీనివల్ల ఇక్కడికి చేరుకుంటే తాము ఇంటికి చేరినట్టేనని బలమైన అభిప్రాయం వాళ్ళల్లో ఏర్పడింది. ఈ విషయం దక్షిణ రాష్ట్రాల్లోని వలస కార్మికుల వర్గాల్లో విపరీతమైన మౌఖిక ప్రచారం జరిగడం వల్ల గుంపులు గుంపులుగా నడుస్తూ మేడ్చెల్ కు చేరుకుంటున్నారు. అలా అక్కడ ఫుడ్ క్యాంపు ద్వారా రోజుకు 8వేల నుండి పదివేల మంది సొంత రాష్ట్రాలకు పంపించాము. వాళ్లలో చాలా మంది రోజుల పసిపిల్లలు, బాలింతలున్నారు. నెలలు నిండిన గర్భిణులున్నరు. పిల్లల తల్లులున్నారు. అక్కడికి వచ్చిన ప్రతి జంట దగ్గర ఇద్దరి నుండి నలుగురు పిల్లలున్నారు. దాదాపు ఆ పిల్లలంతా 10 ఇండ్లలోపు వాళ్లే. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కొక్క గాథ.

రూపాలి ఆమె భర్త మరో ఐదుగురూ వ్యక్తులతో కలిసి మేడ్చెల్ క్యాంపు కు వచ్చింది. ఆమె చేతిలో సన్నగా వీక్ గా ఉన్న పాప ఉంది. పుట్టి 21 రోజులవుతుందట. గజ్వేల్ దగ్గర యాడారం నుండి వచ్చినరు. ఉదయం 4 లకు బయలుదేరి నడుచుకుంటూ వచ్చారంటా. క్యాంపు దగ్గరకు11 గంటలకు చేరుకున్నరూ. ఫుడ్ ఇస్తే తినకుండా దాచుకోవడం చూసాను. వెళ్లి అడిగితే దారిలో తింటా అని చెప్పింది. చేతిలో పాప ఉంది. తిరిగి నడవడానికి సిద్ధం అయ్యింది. ఎలా వెళ్తావు ఎండలో అంటే నడుస్తా అని బయలుదేరింది. అయితే అప్పటికే మనం ప్రమాదకరమైన ట్రక్కులను బంధుచేసి వారి వారి గమ్యస్థానాలకు బస్సులు, కార్లు పెడుతున్నాము. వీళ్ళను కూడా అలా బస్సులు పెట్టె ప్రాంతానికి పంపించాము. తల్లి పిల్ల ఇద్దరు నీరసంగా ఉన్నరు. పైగా వీరి జిల్లా మధ్యప్రదేశ్ లో మారుమూల జిల్లా. మధ్యప్రదేశ్, ఛాతీసుగర్ బార్డర్ లో ఉంటది. ఆ రెండింటిలో ఏ రాష్ట్రంలో దిగినా మళ్లీ 400 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఇవన్నీ చూసి వాళ్ళను ఒంటరీగా వడలలేక ప్రత్యేకంగా ఇన్నోవా కార్ పెట్టి పంపించాము.

అలాగే మరో పాప పుట్టి ఎదురోజులే అవుతుంది. తల్లి ప్లాస్టిక్ కవర్ లో చుట్టి తెచ్చింది. ఆ పాపను కూడా ప్రత్యేకంగా కారు పెట్టి గడ్చిరోలీ పంపాము. అలాగే మరో పాప అత్యంత దూరం అయిన గోరకపూర్ కారులో వెల్లింది.
ఒకరోజు మిత్తమధ్యాహ్నాం మధ్యప్రదేశ్ వెళ్లాల్సిన ఒక కుటుంబం చెన్నై నుండి వచ్చింది. వాళ్లలో ఒక బాలింత ఉంది. కాళ్లకు చెప్పులు తెగిపోయాయి. చీర పాలిస్టర్ ది చెమటకు ఉప్పు పట్టి ఉంది. నేను సూరేపల్లి సుజాతక్క భరత్ భూషణ్ సార్ చెప్పులు పంచుతున్నాం. ఇంతలో చంకలో పిలగాడు ఏడుస్తున్నాడు. ఊపిరి పట్టిండు. తల్లికి పాలస్తలేవు. అప్పటికి తిని 2 రోజులవుతుందట. నీడలోకి తీసుకొనిపోయి పిల్లాడి మొహం కడిగి తల్లికి తినిపిస్తే అప్పుడు కొద్దిసేపటి తర్వాత కొన్ని పాలొచ్చినయి. మేడ్చెల్ వర్క్స్ లో నన్ను అత్యంత బాధపెట్టిన సంఘటనల్లో ఇదొకటి.

కీసర దగ్గర నుండి వచ్చిన ఒక పెద్ద కుటుంబానిది మరో కథ. వాళ్ళు కీసర దగ్గర లో కోళ్లఫారంలో పని చేయడానికి వచ్చారంటా. మధ్యప్రదేశ్ ఝాన్సీ వెళ్ళాలి. టీనేజ్ ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నారు ఈ కుటుంబంలో. వీళ్లంతా ఒక ఆడపిల్ల పెళ్లిచేయ్యడం కోసం కావలసిన డబ్బు సంపాదన కోసం ఇంతదూరం వచ్చారు. అమ్మమ్మ మేనామామలు భార్యాపిల్లలతో కలిసు పెండ్లి కూతురును మరియు ఆమె చెల్లి అన్న తమ్ముడు మరికొందరు బంధువులతో వచ్చారు. అంతకోడితే ఆ పెళ్లికి కావాల్సిన ఖర్చు అబ్బాయికి పెట్టాల్సిన “అపాచి మోటార్ సైకిల్” మరియు “నిఖా దావత్”. ఎందుకంటే అబ్బాయి సైన్యం లో పనిచేస్తాడట. వీళ్ల ఖాన్దాన్ ఇంత వరకు ఇలాంటి మంచి సంబందం ఎవరికి రాలేదట. అందుకోసం పెళ్ళి గౌరవంగా చెయ్యాలి అని ఇలా పెళ్లికూతురుతో సహా ఇంత దూరం వచ్చారు. కానీ 2 నెలలుగా సదరు యజమాని తిండి పెట్టక జీతం ఇవ్వక నానా తిప్పలు పెట్టాడట. ఎవరో కనికరించి తిండిపెడితే ఇలా మన క్యాంపు కు చేరుకున్నారు. ఇంతదూరం వస్తే మాకు ఎమ్ మిగిలింది. ఫోన్ చేస్తే యాజమాని తియ్యట్లేదు. వట్టి చేతులతో వెళ్తున్నాం.. ఎంటకష్టం వచ్చినా మా ఊరు దాటం ఇలాంటి కష్టాలు పడం అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఝార్ఖండ్ వెళ్ళాల్సిన మరో గ్రూపు క్యాంపు కు వచ్చారు. నడుస్తూ వెళ్తున్నరు. బలవంతంగా ఆపితే కూడా ఆపట్లేదు. పైగా తిడుతున్నరు. అయినా ఆపాము. ఎందుకంటే వాళ్లలో చిన్న చిన్నపిల్లలున్నారు. ఒక బాబుకు కాలు కూడా కాలింది. ఒకామె నిండు గర్భవతి. వీళ్ళు ఒక ఎత్నిక్ గ్రూపు ప్రత్యేకంగా ఉన్నారు. భార్యలు భర్తలకన్నా పెద్ద వయసు వాళ్ళు. వీళ్లకు ఊరు అడ్రస్ ఖచ్చితంగా తెలియదు. తీసుకొచ్చిన కాంట్రాక్టర్లు తప్పించుకు వెళ్లిపోయారు. మొత్తానికి అతికష్టం మీద అడ్రస్ కనుక్కుని పంపించాము.

కర్నాటక నుండి బీహార్ వెళ్ళాల్సిన ఒక యంగ్ గ్రూపు 40 ట్రైన్స్ వెళ్ళడానికి ముందు రోజు మేడ్చెల్ వచ్చింది. దాంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నరు. ఎదో కంపెనీలో బోల్టులు బిగించే పని చేస్తారట. 16, 17 ఏండ్లు ఉంటాయి. నేనే రిజిస్టర్ చేసుకున్న. అందులో ఒక అమ్మాయి ఇబ్బందిగా నడుస్తోంది. పీరియడ్ ఏమో అనుకోని పక్కన ICDS వాళ్ళను అడిగితే సానిటర్ పాడ్స్ ఇచ్చారు. తెచ్చి ఇస్తే వద్దంది. సిగ్గుపడుతుందేమో అని బలవంతంగా ఇవ్వబోయాను. నెట్టేసింది. విషయం అడిగాను.. చెప్పట్లేదు. కొంచెం మృదువుగా ఆడిగేసరికి చెప్పిన విషయం ఏంటంటే కంపెనీ సూపర్వైసర్ డబ్బులు ఇస్తా అని పిలిచి 2 రోజులు రూంలో బంధించి పాడుచేశాడట. తప్పించుకుని కొద్దిదూరం నడిచొచ్చి స్నేహితులను కలుసుకొని ట్రక్కుల్లో ఇక్కడికి వచ్చారంటా. ఈ విషయం అప్పుడే అక్కడే సజయక్క తోనో, సుజాతక్క తోనో చెప్పాలనుకున్న. కానీ ఆ పిల్ల బాధను ఇంకా రెట్టింపు చెయ్యాలనిపించలేదు. ఆమె బాధపంచుకుని ఏడవడం తప్ప అప్పుడు నేను చేయగలిగే ఉపశమనం కూడా ఏమీలేదు. నా వంతుగా 700 రూపాలు ఇవ్వబోతే తీసుకోలేదు.

ఇలా క్యాంపు నుండి వెళ్లిన వలస కార్మికులంతా దళిత ఆదివాసీ మరియు బహుజనులే. వీళ్ళు అంతా ఈ దేశంలో ఓటు వేసేప్పుడు తప్ప మామూలు సమయంలో జనాభా లెక్కల్లోకి రానివాళ్ళు. మూడు పూటలా అయిదు వేళ్ళు నోట్లోకి పోవడానికి తన రక్తాన్ని చమటగా మార్చి ఈ దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముక గా నిలబడే వాళ్ళు. కష్టం వస్తే ఆదుకునే దిక్కులేని వాళ్ళు. పొట్టచేతబట్టుకుని వందల మైళ్ళు ఆశల రెక్కలతో ఎగిరిల్లే వలస పక్షులు. అసౌకర్యాల మధ్య కరిగిపోయే కొవ్వొత్తులు. ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో 314 మిలియన్లని 2001 జనాభా లెక్కలు చెపుతున్నాయి. 2005 లో తెచ్చిన ఉపాధి హామీ పథకం తో ఈ సంఖ్య 13% తగ్గిందని 2011 లేక్కలు చేతున్నాయి. అయినా అనధికారికంగా వాస్తంవంలో ఈ లెక్కలు పెరిగాయి తప్ప తగ్గలేదు అని ఈ లాక్డౌన్ పీరియడ్ వలస కార్మికుల నడక చెప్తోంది. ఇప్పటి ఈ వలసలు స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోందని ఎందరో పెద్ద వయసువాళ్ళు చెపుతున్నారు. ఒకరకంగా ప్రత్యక్షంగా ప్రాణాలు తీయకపోయిన ఇది ముమ్మాటికీ జీనోసైడ్.
కేవలం వలస కార్మికులు ఉపాధి అవకాశాలను మాత్రమే హరించలేదు. ఆహార భద్రతతో పాటు సామాజిక భద్రతతను మానసిక శక్తిని హరించింది.

ఇంత జరుగుతుంటే 40 శ్రామిక రైళ్లను ఓకేరోజు పెట్టిన ప్రభుత్వం రైళ్లను పెట్టింది. అయితే ఆ రైళ్ల సమాచారం వివరాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం లో అధికార యంత్రాంగం విఫలమైంది. ఈ శ్రామిక రైళ్లలో ఎక్కాలంటే అత్యంత కీలకమైనది పోలీసులు చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియ. అదే ముఖ్య సమస్య. పోలీసు స్టేషన్లలో తగినంత సిబ్బంది లేకపోవడం, లాక్డౌన్ మొదటి నుండి పోలీసులపై పని ఒత్తిడి అధికంగా ఉండడం వంటి కారణాల వల్ల చాలామంది కార్మికులు ట్రైన్స్ లో వెళ్లలేకపోయారు. చాలా ట్రైన్స్ ఖాళీగా వెళ్లాయి. దాంతో ప్రభుత్వం వలస కార్మికుల సమస్య లేదని నమ్మింది. కానీ కనీసం ఫోన్ కూడా లేని చదువుకొని కూలీలు ఎటువంటి అవగాహన లేని వాళ్ళు తిరిగి తమ పాదాలనే నమ్ముకున్నరూ. 40 రైళ్ల ను పెట్టిన తర్వాత కూడా మేడ్చెల్ పాయింట్ కు వలస కూలీల తాకిడి తగ్గకపోగా ఇంకా పెరిగింది. సగటున లక్ష నుండి లక్షన్నర ఖర్చు పెడితే తప్ప ఒక రాష్ట్రానికి ఒక బస్సులో 50 నుండి 60 మందిని పంపగలం. కానీ ఎన్నని బస్సులు పెట్టగలం. ఇప్పటికే చాలా మంది దాతలు సహాయం చేసారు. దాదాపు అన్ని ఉత్తరభారత రాష్ట్రాలకు లక్షలు వెచ్చించి చాలా బస్సులు పంపించాము. వ్యక్తులుగా మాకు సాధ్యం అయ్యేదానికి మించిచేసాం. కానీ పరిమితికి మించి ఏన్నిరోజులు..? ఎంతవరకు చేయగలం..? ఇది కేవలం వ్యవస్థ వల్ల మాత్రమే సాధ్యం అయ్యేపని. అందుకే బాధ్యత కలిగిన వ్యక్తులు రాష్ట్ర హైకోర్టు లో ప్రజా ప్రయోజన వాజ్యం వేశారు. వాదనలు విన్న కోర్టు ఎంక్వైరీ కమీషన్ వేసింది. పరిశీలించిన కమీషన్ వాస్తవాలను కోర్టుకు రిపోర్ట్ చేసింది. సానుకూలంగా స్పందించిన కోర్టు రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వానికి సూచనలు చేసింది.

మొత్తానికి కోర్టు జోక్యంతో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒరిస్సా వెస్ట్ బెంగాల్ లకు కొన్ని రైళ్లు పెట్టింది. అది కూడా కొద్దీ రోజులే.. అయినా ఇంకా వందలాది మంది రైల్వేస్టేషన్ ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈసారి ప్రత్యేకించి ఒరిస్సా ఇటుకబట్టీ కార్మికుల సమస్యలు మొదలయ్యాయి. బట్టీల యజమానులు రైల్వే స్టేషన్లలో దింపి వెళ్తున్నారు. ఇది చూడలేని సివిల్ సొసైటీ, సూరేపల్లి సుజాతక్క, వసుదక్క లాంటి వాళ్ళు మళ్ళీ బాధ్యత తీసుకుని వాళ్ళను ఇంటికి పంపించారు.

లాక్డౌన్ టైంలో పనిలేకపోయినా దాతలు ఆహారం పెడుతున్నప్పటికి తిండి వాళ్ళ మొదటి అవసరం కాదు. ఇప్పుడు ఇక్కడ పనులు మొదలైనప్పటికీ ఇక్కడ ఉండలేరు. ఇంటికి చేరడమే వారి ప్రధాన ఆకాంక్ష. ఎందుకంటే రెండు, మూడు నెలలుగా తీవ్రమైన మానసిక వేదన, ఆకలి బాధలు, కరోనా భయాన్ని చూసారు. తమను తీసుకొచ్చిన టెకేదార్లు, సర్దార్లు, కంపెనీ యజమానులు జీతాలివ్వక తిండిపెట్టక నరకాన్ని చూపించారు. లాక్డౌన్ అయిపోయాక మళ్లీ వస్తారా అని ఒక బీహార్ పెద్దాయనను అడిగితే ఆయన “అమ్మా బ్రిటీష్ వాళ్ళు మనవాళ్ళతో ఎలా చాకిరీ చేయించుకున్నారో సినిమాల్లో చూసాము. కానీ అంతకన్నా ఎక్కువగానే మముల్ని కష్టపెట్టారు ఇక్కడ. జీతాలివ్వక, తిండిపెట్టక మా విశ్వాసాన్ని కోల్పోయారు. మా ఊర్లో మేము ఆకలితో చచ్చిపోయినా సరే మళ్లీ తిరిగి మాత్రం రాము” అని అన్నడు.
దాదాపు అందరు ఇదే మాటచెప్పారు. కానీ కాలగమనంలో అవసరం వాళ్ళను తిరిగి ఎంతదూరం అయినా రప్పిస్తది. బహుశా వీళ్లంతా మల్లి తిరిగి రావచ్చు. ఇప్పుడు మూటపడ్డ చిన్న చిన్న పరిశ్రమలు పెద్ద పెద్ద సంస్థలు తిరిగి పనిమొదలు పెట్టాలంటే యాజమాన్యాలు కూలీలను తిరిగి తెచ్చుకుంటారు. అలా తెచ్చుకునే క్రమంలో పకడ్బందీగా వలస కార్మిక చట్టాలు ఉండాలి. కార్మికుల కు ప్రభుత్వం జవాబుదారీగా ఉండే విధంగా పాలసీ చర్చలు జరగాలి. వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాలి.

మొత్తానికి నేషనల్ హైవే 44 పై వలస కార్మికుల మేడ్చెల్ మిషన్ సామాజిక మాధ్యమాల్లో కలుసుకున్నా సామాన్య ప్రజల సామూహిక ముందడుగు కలిసికట్టుగా కొంతమందినైనా తమ కుటుంబాలకు చేరువ చేసింది. అయితే ఇంకా సమస్య సమసిపోలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని పట్టణాల్లో, నగరాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కమ్యూనిటీ వ్యాప్తి దశలో కి వెల్లింది. మళ్లీ లాక్డౌన్ ముంగిట్లో ఉన్నాం. ఒకవైపు వైరస్ మరోవైపు ఆకలి, అవగాహన లేమీ. మరోవైపు ప్రజావైద్య అసౌకర్యాలు. రాష్ట్రాలు, ప్రభుత్వాలు కూడా చేతులెత్తేస్తున్న ఈ తరుణంలో కూటికి లేని పేద బతుకులు గాలిలో దీపాలలాంటివే. పరిశుభ్రంగా ఉంటూ, పోశాకాహారం తీసుకోవడం వల్ల వ్యాధితో కొంత వరకు పోరాడి గెలవొచ్చు అని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నరు. కాబట్టి ఈ సమయంలో తిరిగి మనసున్న వ్యక్తులు ఆయా పేద వర్గాలకు పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించడం.. ఉన్నంతలో పోషకాహారం అందించడం.. మానసిక ధైర్యం పెంపొందించడం ద్వారా ఈ కరోనా కష్టకాలాన్ని ఉమ్మడిగా జయించవచ్చు.

– కవిత పులి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)