శాసనమండలి మొదటి మహిళా డిప్యూటీ ప్రెసిడెంట్ –పద్మ భూషణ్ -ముత్తులక్ష్మీ రెడ్డి-(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

తమిళనాడు పుదుక్కొట లో 30-7-1886 న జన్మించిన ముత్తు లక్ష్మీ రెడ్డి తండ్రి నారాయణ స్వామి అయ్యర్ మహారాజాకాలేజి ప్రిన్సిపాల్ .తల్లి చంద్రమ్మాళ్ దేవదాసి .,ఈ వివాహానికి తండ్రిని కులం నుంచి వెలివేశారు .ఆనాడు బాలికావిద్యాభ్యాసానికి ఉన్న అన్ని అవరోధాలను అధిగమించి,తండ్రి ఆమెను స్కూల్ లో చదివించాడు .ఆమెకున్న తెలివి తేటలను గుర్తించిన ఉపాధ్యాయులు ,ఆమె తండ్రికి మాత్రమె ఇష్టమైనవి కాక ,ఇతర సబ్జెక్ట్ లనూ ఆమెకు బోధించారు .రజస్వల కాగానే చదువు మానిపించారు ..కాని ఇంటివద్ద ట్యూషన్ చెప్పించి చదువుకు ప్రోత్సహించారు . ఆమెకు మిగిలిన సామాన్య ఆడపిల్లలగా ఉండటానికి ఇష్టం లేక స్వంత,స్వతంత్ర అభిప్రాయాలను ఏర్పరచుకొన్నది .తల్లి పై ఆదరంతో దేవదాసి వ్యవస్థను అధ్యయనం చేసి వారిపై ,వారి సమస్యలపై సాను భూతి చూపేది .సమాజంలో ,ఇంట్లో పురుషాధిక్యతను సహి౦ చేదికాదు . విద్య మగవారికే అన్న దానిపై తీవ్రంగా ఆగ్రహించి స్త్రీలకూ విద్యకావాలి వాదించేది . అవసరం వచ్చినప్పుడల్లా మహిళలకుమద్దతునిచ్చేది .

మెట్రిక్ పాసై , మహారాజా కాలేజిలో చేరటానికి అప్లికేషన్ పెడితే ,ప్రిన్సిపాల్ తోపాటు మగపిల్లల తలి దండ్రులూ ఆడపిల్లకు చదువేమిటి అనీ మగపిల్లలను చెడ గొడుతుందని భయపడి వ్యతిరేకించారు .సంస్కారవ౦తుడైన పుదుక్కొట మహారాజు ఈ అభ్య౦తరాలను తోసి రాజని ,చేర్చుకొని ,స్కాలర్ షిప్ కూడా ఏర్పాటు చేశాడు .తండ్రికి ఆమె టీచర్ గా ఉంటె చాలు అనుకొంటే ,ఆమెమద్రాస్ మెడికల్ కాలేజి లో చేరి ,తెలివి తేటలతో చదువులో అందరికన్నా ముందు నిలిచి,బంగారు పతకం తో సహా అనేక అవార్డులు పొందింది .1912లో మెడిసిన్ పాసై, భారతదేశం లో తొలి తరం మహిళా డాక్టర్లలో ఒకరుగా గుర్తింపు పొందింది .మద్రాస్ మహిళా శిశు సంక్షేమ హాస్పిటల్ హౌస్ సర్జన్ గా చేరింది .అంతేకాదు పురుషులకాలేజిలో చదివిన మొదటి మహిళ ,మొదటి మహిళా హౌస్ సర్జన్ ,శాసనమండలి మొదటి మహిళా సభ్యురాలు ,సోషల్ వెల్ఫేర్అడ్వైజరీ బోర్డ్ కు మొదటి మహిళా చైర్ పర్సన్,లెజిస్లేటివ్ కౌన్సిల్ కు మొదటి డెప్యూటీ ప్రెసిడెంట్ ,మద్రాస్ కార్పోరేషన్ అవ్వై హోమ్ కు మొట్టమొదటి ఆల్డర్ వుమన్ .ఇన్నిటా ప్రధమంగా నిలిచిన మహోన్నత మహిళా రత్నం ముత్తులక్ష్మీ రెడ్డి . మొదట్లో ఆనీబిసేంట్ ప్రభావానికి తర్వాత మహాత్మా గాంధీ ప్రభావానికి లోనైంది .

సుందర రెడ్డి తనను ఎప్పుడూ గౌరవంగా,సమానంగా చూస్తానని వాగ్దానం చేశాక మాత్రమే 1914లో 28 వ ఏట’’1872నేటివ్ మారేజ్ యాక్ట్’’ ప్రకారం పెళ్లిచేసుకొన్నది.కాలేజీలో చదువుతున్నప్పుడే సరోజినీనాయుడు మహిళా మీటింగ్ లకు వెళ్లి ,స్త్రీలు తమ హక్కులకోసం పోరాడాలని చెప్పేది.ఆనీబీసేంట్ ,మహాత్మాగాంధీ మహోన్నత వ్యక్తిత్వాలు ఆమెను ప్రభావితం చేశాయి .ఉన్నత విద్యకోసం ఇంగ్లాండ్ వెళ్లి తిరిగి వచ్చి ,మాంచి ఊపులో ఉన్న డాక్టరీ వృత్తిని,అఖిలభారత మహిళా సంఘం అభ్యర్ధన మేరకు వదిలేసి మద్రాస్ శాసనమండలికి పోటీ చేసి ఏకగ్రీవంగా డిప్యూటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైంది .మునిసిపల్ ,శాసన సభలలో మహిళలకు ఓటు హక్కు కావాలని ఆందోళన చేసింది .అనాథులపట్ల, అందులోనూ ముఖ్యంగాఅనాథ బాలికలపట్ల విపరీతమైన సాను భూతి చూపుతూ ,వారికి ఉచిత వసతి భోజన సౌకర్యాలు కల్పిస్తూ ‘’అవ్వై హోం’’ను స్థాపించింది .

ముత్తులక్ష్మి అనేక మహిళా సంస్కరణలకు ఆద్యురాలైంది.ఆమె రాసిన ‘’మై ఎక్స్పీరిఎన్సేస్ ఆజ్ ఎ లేజీ స్లేటర్ ‘’ పుస్తకం లో తాను చేసిన సేవలను వివరంగా రాసింది . స్త్రీ శిశు సంక్షేమ ప్రత్యేక హాస్పిటల్ నిర్మించాలన్నతీర్మానాన్ని ఆమోదించింది .ఆమెకోర్కెను అంగీకరించి ప్రభుత్వం ప్రసూతి హాస్పత్రిలో విడిగా శిశుసంక్షేమ శాఖను ఏర్పాటు చేసింది .మునిసిపాలిటీలు ,ఇతర స్థానిక సంస్థల స్కూళ్ళు,కాలేజీలలో క్రమబద్ధమైన మెడికల్ ఇన్స్పెక్షన్ జరిగేట్లు చేసింది .ట్రిప్లికేన్ లో ఏర్పాటైన కస్తూర్బా హాస్పిటల్ ఆమె కృషిఫలితమే.

అఖిలభారత మహిళా సంఘానికి శ్రీమతి రెడ్డి అధ్యక్షురాలైనది .వ్యభిచారం ,వారిపై అక్రమ కేసులు ,స్త్రీలను బాలికలను ఆ వృత్తి లో బలాత్కారంగా దించే ప్రయత్నాలు అరికట్టటానికిఒక బిల్లు పాస్ చేసింది .వ్యభిచార వృత్తినుంచి విడుదల చేయబడిన బాలికలకు రక్షణగా ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయించింది .ఆమె ప్రయత్నం తో ముస్లిం బాలికలకు హాస్టల్ ఏర్పడింది .హరిజన బాలికలకు స్కాలర్ షిప్ లు వచ్చాయి .మగపిల్లలకు 21 ఆడపిల్లలకు 16ఏళ్ళ వయసు దాటనిదే వివాహం చేయరాదనిచట్టం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ‘

కేన్సర్ రిలీఫ్ ఫండ్ ను ఏర్పాటు చేసి౦ది .ఇది అఖిలభారత సంస్థగా మారి చికిత్స ,రిసెర్చ్ కు అవకాశం ఏర్పడి,ఇండియాలోని అన్నిప్రాంతాల కేన్సర్ రోగులకు అందుబాటులోకి వచ్చింది నేడుఏటా 80వేలమందికి ఆసరాగా ఉన్నది .ఆమె రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ బోర్డ్ కుమొదటి మహిళా చైర్ పర్సన్ గా నియమింప బడి అమూల్యమైన సేవలు అందించింది .భారత దేశం లో విద్యా పురోగతిని అధ్యయనం చేసే ‘’హార్టాగ్ ఎడ్యు కేషనల్ కమిటీ ‘సభ్యురాలుగా ఆమె కృషి అమోఘమని అందరి ప్రశంసలు పొందింది .దేశమంతా విస్తృతంగా పర్యటించి విద్యాభి వృద్ధిని అంచనా వేస్తూ ,స్త్రీవిద్యాభి వృద్ధి నికూడా అధ్యయనం చేసింది .ఆ కమిటీలో ఆమె ఒక్కతే మహిళా సభ్యురాలు .తన నివేదికతో విద్యలో ఎన్నో అభి వృద్ధికార్యక్రమాలు అమలు జరిగేట్లు చేయగలిగింది.రోషిణి మేగజైన్ కు ఎడిటర్ గా కూడా సేవలు అందించింది .ఆమె జీవితకాలం లో ఏపని తలపెట్టినా అవరోధం ఆటంకం ఎదురుకాలేదు .వచ్చినా నిర్భయంగా ఎదిరించి అనుకొన్నది సాధి౦చి౦ది.అదే ఆమె ప్రత్యేకత . 80ఏళ్ళ వయసులోనూ ఆమెలో సంకల్పబలం కార్యాచరణ ఏమాత్రం తగ్గలేదు .రాజకీయాలకు అతీతంగా అలోచించి సేవలందించింది .ఇన్నిరకాల అనితర సాధ్యమైన సేవలు అందించిన ముత్తులక్ష్మికి 1956లో భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారమందించి గౌరవించింది .ఆమెకు లభించిన పురస్కారాలు,ప్రైజులు అన్నీ మద్రాస్ అవ్వై హోంలో, కేన్సర్ ఇన్ స్టి ట్యూట్ లో భద్రపరచారు .1927లో ఆమెను సాక్షి హరిహరన్ మద్రాస్ శాసనమండలి సభ్యురాలుగా నామినేట్ చేశాడు .దీనితో భారత దేశం లో శాసన సభ లేక మండలికి ఎన్నికైన మొదటి ఏకైక మహిళగా రికార్డ్ సాధించింది .దేవదాసి వ్యవస్థ రద్దుకు ఆమె చేసిన కృషి అనితర సాధ్యమైనది .22-7-1968న 81వ ఏట త్యాగమయి , సేవామూర్తి ,అన్నిటా ప్రథమురాలుగా నిలిచిన తొలితరం డాక్టర్, పద్మభూషణ్ శ్రీమతి ముత్తు లక్ష్మీ రెడ్డి మరణించింది .ఆమె జీవితం ధన్యం .తరతరాలకు ఆదర్శప్రాయం .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.