అరణ్యం 10 – ” ఆకాశ పాయ “-దేవనపల్లి వీణావాణి

వన్య ప్రాణి వారోత్సవాలు మోయేటి కంటే ఈ యేడు ఘనంగా ముగిశాయి. అటవీ అధికారులు ఎప్పటికన్నా ఈ సారి బాగా కష్ట పడ్డారు. పాఖాలకు , జిల్లాలోని ఉన్న వివిధ పాటశాలలకు , జంతు ప్రదర్శన శాలకు తిరగడం , కార్యక్రమాలను వరుసబెట్టి నిర్వహించడం ఇలా వారం మొత్తం ఎలా గడిచిందో తెలియలేదు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధి విధులకు అదనం.

నేను పనిచేసే విభాగం అటవీ అక్రమాలను అరికట్టేటందుకు ప్రత్యేకంగా కేటాయించినది. ఈ బాధ్యతను అధికారికంగా స్ట్రైక్ ఫోర్సు అంటారు. మా సిబ్బందితో కలిసి నిరంతరం గస్తీ కాసే పనిలో ఉండి జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, కొన్ని కేసులను నిర్వహించడం మా కర్తవ్యం. అందులో వర్షాకాలంలో అటవీ భూభాగాల ఆక్రమణల పట్ల శ్రద్దగా పనిచేయడం ముఖ్యమైంది. కొన్ని అటవీ పరిసర గ్రామాలలో అటవీ భూముల ఆక్రమణ నిరంతర సమస్య. మరికొన్ని చోట్ల ఋతు గమనానుసారం జరిగే పని. అందువల్ల అటవీ యాజమాన్య నిర్వహణ సౌకర్యం కొరకు ఆయా బీటు ప్రాంతాలను హాని జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు గానూ (vulnerable) హాని జరిగే అవకాశం లేని ప్రాంతాలుగాను( Non Vulnerable ) విడదీస్తారు. హాని జరిగేందుకు అవకాశం ఎక్కువ ఉన్న బీటులలో నిఘా ఎక్కువ. హాని కలిగించే అంశాలు ఏవైనా కావచ్చు పరిసర గ్రామాల ప్రజలు, పశువుల మేత , ఆక్రమణలు, సున్నితమైన వన్య ప్రాణుల ఆవాసం వంటివి, అవి మొక్కలైనా లేదా జంతువులైనా సరే.ఎక్కవ నిర్వహణ , నియంత్రణ అవసరమైన చోట ఇటువంటి ఏర్పాటు అడవులను సమగ్రంగా కాపాడడంలో ఉపకరిస్తుంది. ఈ రోజు అటువంటి పని మీదే హాని జరిగే అవకాశమున్న బీటు ప్రాంతాల్లో అటవీ ఆక్రమణలు ఏవైనా ఉన్నాయా తెలుసుకోవడం కోసం సూర్యోదయానికి ముందే బయలుదేరాం.

నర్సంపేట నుంచి పాఖాల వెళ్ళే దారి ఇల్లందుతో కలుపుతుంది. మధ్యలో కొత్తగూడ, పందెం వంటి ప్రాంతాలు కలుస్తాయి. పందెం కూడా చాలా అందమైన అడవి. అక్కడి లోయల సౌందర్యం అలవికానిది. కొత్తగూడ, పందెం ఇంతకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్ర జిల్లాల పునర్వవ్యవస్తీకరణలో భాగంగా ఇది మహబూబాబాద్ జిల్లాకు కేటాయించబడినాయి. ప్రస్తుతానికైతే పాఖాల చెరువుకు ఒక హద్దు మహాబూబాబాదు మరొక పక్క వరంగల్ గ్రామీణ జిల్లా. మధ్యలో చెరువు. పాఖాల అడవి కూడా రెండు బీటులుగా ఉంటుంది. నర్సంపేట నుంచి పాఖాల దాదాపు పన్నెండు కిలోమీటర్ల దారి. మధ్యలో రెండు మూడు చిన్న పల్లెలు. పాఖాల చేరడానికన్న ముందు వచ్చే ఊరు అశోక్ నగర్. అశోక్ నగర్ నుంచి ఎడమ వైపు వెళ్తే దబీర్ పేట, కీర్యా తండా వస్తాయి. సూటిగా వెళ్తే పాఖాల వస్తుంది. అశోక్ నగర్ పేరుతో బీటు కూడా ఉంటుంది. ఈ రోజు వెళ్ళే బీటుల్లో అది కూడా ఒకటి.

మా ప్రయాణంలో ముందుగా వచ్చేది అశోక్ నగరే.అశోక్ నగర్ కూడా రెండు బీటులుగా ఉంటుంది. ఈ బీటు పరిధిలో చాలా వరకు ఆక్రమణలకు గురియైనదే. వాటిలో చాలా కేసులలో అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆయా రైతులకు కేటాయించడం జరిగింది. మరికొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. ఎప్పటి లాగానే ఇక్కడి ఆవాసమూ ప్రత్యేకమైనదే మరియు విశేషమైనదనే చెప్పాలి. ఈ ప్రాంతంలో ఇంతకు ముందు పనిచేసిన పూర్వాధికారులకు అశోక్ నగర్ పేరు చెప్పగానే టక్కున అక్కడ పెద్ద చింత తోపు ఉండేదండీ అంటారు. తోపు అంటే తోటకు సమానార్థకం. అడవీ , చింత చెట్లు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారేమో కదా…అవును చింత చెట్లు ఒక్కటే అడవి అయ్యే అవకాశం లేదు ఎందుకంటే అంత దగ్గర దగ్గరగా చింత చెట్లు పెరగవు. కాకపోతే ముందు తరాల వారు నాటినవే అయ్యి ఉండే అవకాశం ఉంది.నా అంచనా ప్రకారం వాటి వయసు వందేళ్ళ పైబడే ఉంటుంది.

మీరెప్పుడైనా తెలంగాణ గ్రామీణ జీవన చిత్రాన్ని గమనిస్తే ఊరి చివరలో మామిడి తోపులో , చింత తోపులో ఉండడం గమినించే ఉంటారు. ఇప్పడు అటువంటి తోపులు కనిపించకపోయినా తాటి, ఈత చెట్లు మాత్రం ఊరి శివార్లలో కనిపిస్తాయి. ఇది కూడా అటువంటి ఒక తోపు అని నిర్దారణ చేసే అంశాలు ఇక్కడ కానవస్తాయి.తెలంగాణ తొలితరం సాహితీ ద్రష్ట, దాశరథి రంగాచార్య , తన చిల్లర దేవుళ్ళు నవలలో నాటి సామాజిక జీవనాన్ని చూపిస్తూనే గ్రామ శివారులలో తోపుల ప్రస్తావన చేస్తాడు .చింత తోపు నవలలో చెప్పుకోదగిన చారిత్రక సందర్భాన్ని నమోదు చేస్తుంది. ఆ నవలలో కేవలం దొర అనుమతి లేకుండా పీరిగాడు చింత కాయలు కోసుకోవడం, అందుకు ప్రతిగా అతడు ప్రాణాలు పోగుట్టుకోవడం మనల్ని కలిచివేస్తుంది. అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రతీ గ్రామానికి ప్రజల అవసరాల నిమిత్తం ఇటువంటి తోపులను పెంచేవారనీ , వాటి కాతను వేలం వేసేవారనీ , స్థానిక అవసరాలు తీర్చుకునేవారనీ , కొంత వ్యాపారం జరగుతుందనీ. గ్రామ పెద్దలుగా వ్యవహరించేవారి అజమాయిషీలో తోపులు నిర్వహించబడేవి. కానీ ఇప్పుడక్కడ చింత తోపులకు బదులుగా మొండి చింతలు మాత్రమే కనబడతాయి. అందుకు తగ్గట్టుగానే చింత తోపు ఉన్న ప్రాంతం అంటే అశోక్ నగర్ శివారు పేరు ఇప్పుడు మొండి చింతలు..!

చింత చెట్ల ఆనవాళ్ళు చాలా దూరం వరకు కనిపిస్తాయి. కొన్ని చెట్లు మాత్రమే చెట్లుగా మిగిలాయి.
చింత తోపును ఆక్రమించుకున్న స్థానికులు వాటి విశాల బాహువులను కత్తిరించారు. అందువల్ల ఒక నిటారు స్థంభం మీద ఆకుపచ్చ గుబురుగా చివుళ్లు వచ్చి ఒక ఆధునిక పూల గుచ్చ అలంకరణలా కనిపిస్తుంది తప్ప చింత చెట్టు లా ఏమీ కనిపించదు. సహజంగానే చింత చెట్టు పెద్దగా ఉండి చాలా దూరం శాఖలను విస్తరిస్తుంది. అందువల్ల నీడ ఎక్కువ . నీడలో పంటలు పండవు కాబట్టి ఆక్రమణదారులు వాటి శాఖలను కత్తిరించారు. ఇలాంటి చింత చెట్లు ప్రతి వంద రెండువందల మీటర్లకు ఒకటి చొప్పున కనిపిస్తాయి. చెట్ల మధ్య వ్యవసాయ పంటలు. అలా కనిపించే గుట్టల వరకు ఇదే సామాన్య దృశ్యం. గుట్టల పేరు కూడా మొండి చింతలగుట్ట అనే పేరే స్థిరపడింది.

బీటు ప్రాంతం కొండల వరుస. భూమి ఎత్తు వంపులుగా ఉంది. కనుక ఈ మధ్య కురిసిన వర్షాలకు పై మట్టి కొట్టుకుపోయి తెల్లని రాళ్ళు తెట్టు కట్టాయి. అన్నీ గులకరాళ్ళ పరిమాణంలో ఉన్నాయి. ఇలాటి తెల్లని రాళ్ళు సేకరించుకొని చిన్నప్పుడు గచ్చకాయలు ఆడుకునే వాళ్ళం. మా డ్రైవర్ భద్రు, కొన్ని రాళ్ళు గుండ్రంగా ఉన్నవి ఏరడానికి తయారయ్యాడు. మిగతా మా బృందం అంతా అడవి లోపలి వెళ్తున్నాము. ఇక్కడ మరీ ఎత్తైన వృక్షాలు ఏమీ లేవు. గుల్మాలు , పొదలు , చిన్న చిన్న చెట్లు. ఇక్కడ దుప్పులు , కొండ గొర్రెలు , ఎలుగుబంట్లు ఉండే అవకాశం ఉంది. గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా లేవు.

నేల పచ్చిగా ఉన్న చోట పై పొరను అంటిపెట్టుకొని ఉన్నట్టు కొన్ని మొక్కలు పచ్చగా , తాజాగా కనిపిస్తున్నాయి. కుచ్చులు కుచ్చులుగా నేలను అంటి పెట్టుకొని పెరుగుతున్న మొక్కలు నీలాకాశపు మంద్ర వెలుగులో మృదువైన ఆకుపచ్చ రంగును శోభిస్తున్నాయి. దగ్గరికి వెళ్లి చూసాను. అది పిట్టకాలు మొక్క. దీనిని పిట్ట అడుగు , పిట్టాడుగు అని కూడా అంటారు. వృక్ష శాస్త్రం లో ఆదిమ జాతుల గురించి పరిచయం చేసేటప్పుడు ఈ మొక్కల ప్రస్థావన వస్తుంది. శాస్త్రీయంగా దీనిని సెలాజినెల్లా బ్రయోప్టేరిస్ ( Selaginella bryopteris ) అంటారు. ఇది భారత దేశ సహజ ఉద్బీజం . మొక్కల వర్గీకరణ శాస్త్రం ప్రకారం బ్రయోఫైటా విభాగానికి చెందినది. ఇవి భూమి మీద యాభై కోట్ల ఏళ్ళ నుంచి మనుగడ సాగిస్తున్నాయి. రామాయణం లో హనుమంతుడు లక్ష్మనున్ని బతికించడం కోసం తెచ్చిన సంజీవని ఇదే అని అంటారు. భారతీయ గ్రామాలలో ఈ మొక్కను వినియోగించడం అనాదిగా వాడుకలోనున్నదే. దీనిని మందు మొక్కగానూ , వడదెబ్బ నుంచి కాపాడుకోవడానికీ, ఇంకా ఎండిన ముక్కలను చిన్న పిల్లలకు దృష్టి దోషం రాకుండా వేసే ఊదు పొగ లోనూ వాడతారు. ఈ మొక్కలు నీళ్ళు లేనప్పుడు లోపలి వైపు తిరిగి చిన్న ఎండిన గడ్డి బంతులుగా కనిపిస్తాయి. తరువాత వాన పడినప్పుడు , తేమ తాకిడికి వెంటనే ఆకుపచ్చగా మారిపోతాయి. అది కూడా నిముషాల్లో. సంజీవిని అన్న పేరుకు తగ్గట్టుగానే ఇది ఎండిపోయినట్లు ఉండి నీళ్లు చిలకరించ గానే పచ్చగా మారిపోతుంది. ఎంత పచ్చగా అంటే అంతకు ముందు మీరు చుసిన మొక్క అదేనా అనుకునేంతగా. ఈ సంజీవనిని ఆర్థికంగా లాభసాటిగా సాగుచేయడం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మేము వెళ్ళిన ప్రాంతమంతా ఈ మొక్క ఉంది.

ఈ మధ్య ఆఫీసు ఆవరణలో కూడా ఇటువంటివే చిన్న చిన్న మొక్కలు మొలిచాయి. అవి కాలేయం ఆకారంలో ఉండే లివర్ వర్ట్స్. శాస్త్రీయంగా రిక్సియా అని అంటారు (Riccia sps). ఇవి కూడా బ్రయోఫైటా వర్గానికి చెందినవే. ఇవి కూడా పురాతన మొక్కలే. ఇవి చాలా చిన్న మొక్కలు ఇవి నేలను అంటుకొని గుండ్రని వలయాల వలె పెరుగుతాయి. నీటి నుంచి జీవం భూమికి మారే క్రమంలో రూపొందిన మొక్కలివి. వీటి నుంచే పరిణామ క్రమంలో పెద్ద వృక్షాలకు జీవం పరిణామం చెందింది.

ప్రఖ్యాత ఫ్రెంచ్ తాత్వికుడు హెన్రీ బెర్గ్ సన్ తన సృజనాత్మక పరిణామం (Creative Evolution ) అన్న పుస్తకంలో పరిణామ క్రమం గురించిన సిద్దాంతం చెబుతాడు. గమ్మత్తు అయిన విషయం ఏమిటంటే బెర్గ్సన్ ఒక శాస్త్రవేత్త కాదు , ఒక తత్వవేత్త. శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఒకే విషయాన్ని భిన్న కోణాల్లో దర్శిస్తారు. ఆయన పరిణామ క్రమాన్ని సృజనాత్మక పరిణామం అని అనడంలోనే జీవం తనను తాను సృజనాత్మకంగా ప్రదర్శించుకుంటుందని చెప్పకనే చెబుతాడు. జీవం ముందు నీటి నుంచి భూమి మీదకు వచ్చి వృక్షాలుగా అంటే స్థానువుగా ప్రకటించుకుంది. అటు తర్వాత వృక్షాలను నుంచి ఉత్పత్తి అయిన శక్తితో చలనశీలత పొందింది. మన సాంప్రదాయంలో తరచూ వినిపించే జంగమ స్థావరాలన్నమాట. జంగమ అంటే చలన శీలత కలిగినది అనీ, స్థావరం అంటే స్థాణువు అనీ అర్థం. వృక్షాలలో ఉన్న చైతన్యం(Consciousness ) స్థిరత్వాన్ని కోరుకుంటే , జంతువులలో చైతన్యం స్థిరత్వం కన్నా చలనశీలతను కోరుకుందని అంటాడు. జంతువులు , వృక్షాలలో నిలువ అయిన శక్తిని వినియోగించుకొని చలన శీలతను పొందాయి. జంతువులు ఆ స్వభావం,సౌకర్యం వల్లనే శక్తిని స్వయంగా తయారు చేసుకొనే శ్రమని ఎంచుకోలేదు. ప్రతిగా తనకు కావలసిన శక్తిని స్థావరాలనుంచి పొందడమే పరిణామక్రమంలో ఒక గొప్ప చైతన్య ప్రతీక.

బెర్గ్ సన్, ఇంకా సరళ స్వభావం నుంచి సంక్లిష్టంగా మారడంలోనే జీవులలోని చైతన్యం ( Consciousness ) పరిణామ క్రమంలోని సృజనాత్మకతగా వ్యక్తమవుతుందని వివరిస్తాడు. జీవం తనను తాను ప్రత్యేకంగానూ, అధ్బుతంగానూ ప్రకటించుకోవడానికి ,నిలబెట్టుకోవడానికి సంక్లిష్టత వైపు పయనిస్తుంది. అది చైతన్యానికి ఉన్న అద్వీతీయమైన శక్తి. దాని పరాకాష్ట స్వభావం ఎలా ఉంటుందో ఎలా పరిణామం చెందనుందో ఊహించడం అసాధ్యం.అదే ఈ భూ మండలం మీద జీవం ఉనికిని నిలబెట్టే అద్వితీయమైన శక్తి. ఆయన పుస్తకం అంతా ఆసక్తి కరమైన వివరాలతో ఉంటుంది. అయితే మరో ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త , స్టీఫెన్ హాకింగ్ మాత్రం తన కాలం కథలో (A Brief history of Time ) ప్రతిదీ సువ్యవస్థనుంచి అవ్యవస్థకు అంటే సంక్లిష్టత నుంచి సరళతకు పయనిస్తుందని వివరిస్తాడు. ఈ రెంటిని ఒకే దగ్గరగా ఉంచి ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏమిటంటే జీవులు సరళతనుంచి సంక్లిష్టతను పొందుతాయి. కాలమొకటి మాత్రం ఇక్కడ సమానం. జీవంలో ఉండే చైతన్యం ఒక గొప్ప వ్యవస్థగా పరిణామం చెందితే అదే సమయంలో నిర్జీవులు సంక్లిష్టత నుంచి సరళతను పొందుతాయి, విభిన్న అణువులుగా విడిపోతాయి. ఇదే విషయాన్ని సోదాహరణంగా అర్థం చేసుకోవాలంటే , జంతువులు ఏక కణ అమీబా నుంచి మానవుని దాకా అభివృద్ధి చెందితే ఒక శిల మాత్రం క్రమంగా క్షయమై మట్టి అణువులుగా మిగులుతుంది. మరింతగా తనకు తాను సంక్లిష్టతను వదిలించుకొని తన ఉనికిని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంది.అటువంటి సందర్భంలో విడివిడిన అణువులు స్వయంగా ప్రకటితమయ్యేది లేకపోయినా నిర్జీవ అణువుల ఒక నిర్దిష్టమైన అమరికగా మారినప్పుడు మాత్రం చైతన్యాన్ని ప్రకటించుకునే శక్తిని పొందుతుంది. అంటే విడి విడిగా ఉన్న నిర్జీవ అణువులకు లేని చైతన్యం వాటి నిర్దిష్ట అమరికలో ఉన్నప్పుడు మాత్రం ఉద్భవిస్తుంది. మనం జన్యువులుగా చెప్పుకునే సందర్భం అదే. ఆ అణువుల అమరికే జీవులకు నిర్జీవులకు మధ్య ఉన్న సంధి. ఎందుకు నిర్జీవ అణువులు ఒక క్రమ వికాసంగా నిర్దిష్ట క్రమంలో అమరి చైతన్యాన్ని బహు అంశాలుగా ప్రకటించుకుంటున్నాయి… మరి యేది జీవులలో అటువంటి చైత్యానానికి మూలం ? ఈ విధంగా తనను తాను వ్యక్త పరుచుకునేది ఏది? అది తెలుసుకోవడానికి ఇక్కడ శాస్త్రవేత్తల కన్నా తత్వవేత్తల అవసరం ఉంటుందనుకుంటాను. అన్నింటికీ మించి ఈ చైతన్యం జీవంచి ఉన్న ప్రతి దానిలోనూ కొనసాగడం దాని విశ్వవ్యాప్తిని , ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భారతీయతత్వం అంతా ఈ చైతన్యం చుట్టూతానే తిరుగుతుంది. ఒక్క భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన తాత్విక సిద్ధాంతాల వెనుక ఉన్నది ఈ చైతన్య అన్వేషణనే.

ఏదైతేనేం ఇటువంటి చిన్న చిన్న మొక్కలే సంక్లిష్ట జీవానికి ఆద్యులు .ఈ పురా వృక్షాలు స్పష్టపరిచే మరొక అంశం పర్యావరణ ఆరోగ్యం. ఎందుకంటే ఇక్కడ అయితే వాతావరణ కాలుష్యం లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుందో అక్కడ మాత్రమే ఇవి పెరుగుతాయి. వీటి ఉనికిని బట్టి వాతావరణంలో ఎటువంటి మార్పులు వచ్చాయో పరిశీలించే అవకాశం లభిస్తుంది. ఇటువంటి మొక్కలను సూచికా మొక్కలు ( Indicater plants ) అంటారు.

ఇక్కడ శిలల స్వరూపం కూడా వైవిధ్యమైనదే. ఇక్కడి శిలలు పలకల మాదిరిగా పునాదిరాళ్ల పరిమాణంలో ఉన్నాయి. కొండ అంతా కూడా ఎక్కువ భాగం మట్టి . అందులో అక్కడక్కడ రాళ్ళు . రాళ్ల తలం మీద చిన్న చిన్న రంధ్రాలు. వందకు పైగా రంధ్రాలు ఒక అడుగు తలమీద వ్యాపించి ఉన్నాయి. నేను ఇంతకుముందు ఇటువంటి రాళ్ళను ఈ చుట్టూ పక్కల గమనించలేదు. రంధ్రాలు ఏర్పడడానికి కారణం లావా ద్రవంలోని గాలి బుడగలు. అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వస్తుంది కదా, అప్పుడు ఉబికి వచ్చే లావా వేడికి చుట్టూ ఉన్న గాలి వేడెక్కి పైకి వ్యాపిస్తుంది అటువంటప్పుడు లావా ప్రవహించి చల్లబడినాక ఏర్పడే రాళ్లలో గాలి బుడగలు ఉండవు. కానీ చాలా కాలం కిందట ఎంత చల్లగా ఉండేదంటే అగ్నిపర్వతం బద్దలై లావా బయటకు వస్తున్నప్పుడు కూడా ఇంకా మిగిలిపోయిన గాలి లావాతో కలిసి పోయేది. ఎందుకంటే చల్లని గాలి యొక్క సాంద్రత ఎక్కువ గనుక. అలా గాలి బుడగలు శిలా ప్రవాహంలో చిక్కుకు పోయినప్పుడు శిలలలో రంధ్రాలు ఏర్పడతాయి. రాళ్ళను బట్టి మట్టి, మట్టిని బట్టి నీళ్ళు , నీళ్ళు మట్టిని బట్టి జీవాలు ఇలా అన్నమాట. ఇంతకు ముందు ఖానాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ మరో రకం శిలలు చూసాను. జనపనార సంచుల వలె వాటి తలం అంతా ముడతలు ముడతలుగా ఉంటుంది. బండల అంచులు లోపలివైపు అరిగిపోవడం ..అరిగిన వైపు నీటి ప్రవాహం ఉందని సూచిస్తుంది.మేడపల్లిలో గడ్డి జాతులు ఎంత విరివిగా ఉండేవో ఖానాపూర్లో చెట్ల జాతులు అలా ఉన్నాయి.

మెల్ల మెల్లగా గుట్టలు ఎక్కుతున్నాం. మరీ లోపలికేం వెళ్ళలేదు. గుట్ట మరీ పెద్దది కూడా కాదు కాకపోతే ఇక్కడి నుంచి చూస్తే చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది కనుక పైకి వెళ్తున్నాం. పైన ఇదివరకే ఉండి వదిలివేసిన ఒక గుడిసె ఒకటి ఉంది. ఇంతకు ముందు కాలంలో గుట్ట మీద దాదాపు సమతలంగా ఉన్న చోట సాగు చేసేందుకు వేసి ఉంటారు. ఇలా వర్షాధారంగా వీలైనంత సాగు చేసే ప్రయత్నం కూడా అటవీ ఆక్రమణలలో ఒక భాగం. ఇలా సాగు చేయడాన్ని ఆకాశపాయగా పిలుస్తారు. ఆక్రమణలు అటుంచితే ఈ మాటను మొదటిసారి విన్నప్పుడు జన వ్యవహారంలో వర్షానికి ఆకాశపాయ అన్న వాడుక మాట ఉండడం నాకైతే ఎంతగానో ఆశ్చర్యంగా అనిపించింది. గొప్ప వ్యక్తీకరణ అని కూడా అనిపించింది. ఆకాశ పాయ నిజంగానే అద్భుతమైన పద ప్రయోగంగా లేదూ.

సహాయకులు ముందుండి కాళ్ళకి అడ్డం పడుతున్న చిన్నచిన్న పొదలని, కంపను ఎండు కర్రలను కొడవలి లాంటి వస్తువుతో తొలగిస్తున్నారు. వరుసలో నేనే చివర ఉన్నాను. గుట్ట మీద బలమైన గడ్డి పొదలు ..కొన్ని అయితే రాళ్ళను చీల్చుకొని మరీ ఎదుగుతున్నాయి. పచ్చని వాటి ఆకుల పొడుగు మీటరుకు తక్కువ ఉండదు. చూడడానికి నిమ్మగడ్డి లాగానే కనిపిస్తుంది కానీ కాదు. ఇటువంటి గుట్టల మీద పెరిగే గడ్డిని గుట్ట గడ్డి అంటారు. ఇది చాలా బలంగా రాళ్లు రప్పలు, ఎంత కఠినమైన నేల అయినా చాలా బలంగా విస్తరిస్తుంది . ఈ గుట్ట గడ్డినే గుడిసెల మీద, ఎడ్ల కొట్టాల మీద కప్పడానికి వాడతారు. గ్రామాల్లో గుడిసెల మీద కనిపించే గడ్డి ఇదే. గుట్ట గడ్డి ఆరు నుంచి ఏడు అడుగుల వరకు పెరుగుతుంది ఎండా కాలంలో దీనిని సేకరిస్తారు. గుట్టలమీద పెరుగుతుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఇటువంటిదే కాలువల ఒడ్డున కూడా పెరుగుతుంది. దాన్ని యెట్ట గడ్డి అంటారు. బహుశా యేటి గడ్డి కావచ్చు వాడుకలో యెట్ట గడ్డి అయ్యుంటుంది. అయితే యెట్ట గడ్డిని కప్పడానికి వాడరు, గుట్ట గడ్డిని మాత్రమే గుడిసెలను కప్పడానికి వాడతారు .వానలు రాక ఆలస్యం ఎలా అయిందో అలాగే గడ్డి జాతులు ఇతర చిన్న చిన్న మొక్కలు పెరగడం వర్షాధారిత పెరగడం కూడా ఆలస్యమైంది . ఇలా ఆక్రమిత అడవులలో సాగుచేసే పంటలు వర్షాధారితంగా సాగు చేయబడతాయి. వరుసగా వానలు పడడం ఆలస్యం అయితే అటవీ ఆక్రమణలు కూడా తగ్గుముఖం పడతాయి. కానీ అలా కోరుకోలేము కదా.

నడుస్తూ నడుస్తూ గుట్ట పైకి చేరుకున్నాం.పక్కన ఉన్న గుట్టల మధ్య మేము నిలుచున్న గుట్ట . వరుసగా పోసిన ఎత్తయిన మట్టి కుప్పల వలె కనిపిస్తుందేమో పైనుంచి చూస్తే. ఇక్కడ కూడా పిట్టడుగు చెట్లు నేలంతా ఉన్నాయి. కొండ గొర్రెల పెంటికల కుప్పలు అక్కడక్కడా కనిపించాయి. గుట్ట మీద కొంత దూరంలో పాల చెట్టు మండల మధ్య చిన్న పక్షి గూడు. ఎంత అందంగా ఉందో. ఈ రోజు వర్షం లేదు కానీ మబ్బుపట్టి వాతావరణం చల్లగా ఉంది. ఆహ్లాదకరంగా ఉంది. సాయంత్రం వరకు వర్షం వస్తుందేమో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందులో పచ్చని అడవి, నడిచే వీలున్న దారి, అందులో ఒక పిట్టగూడు… అది అరచేతి వెడల్పు లో ఉన్న ఆకుల దొన్నె. అందులో ఒక పచ్చని ఆకు కూడా ఉంది. బహుశా అది చెట్టు నుంచి రాలి పడిన ఆకు. పిట్ట గూట్లో గుడ్లు లేవు . పిట్ట చాలా రోజుల కిందట వదిలేసి ఉంటుంది . ఎందుకంటే పక్షులు తమ గూడు పట్ల చాలా శ్రద్ధ వహిస్తాయి. గుడ్లు పెట్టే ప్రతి సారి జాగ్రత్తగా కొత్తగా కట్టి , గుడ్లు పెడతాయి. కొంగలకు, గ్రద్దలు దీనికి మినహాయింపు . అది యే పిట్ట గూడో చెప్పడం కష్టం.

ఎక్కడా కొత్త ఆక్రమణలు కనిపించలేదు. గుట్ట మీద నుంచి కిందికి దిగుతున్నప్పుడు బెల్లం ఉడకబెట్టిన వాసన. మా బృంద సభ్యలు ఒకరి మొఖం ఒకరు చూస్తూ నవ్వుకున్నారు. నా వైపు తిరిగి స్థానికులు ఎక్కడో గుడుంబా తయారు చేస్తున్నారని అన్నారు. ఇది ఈ గిరిజన కుటుంబాలలో సాధారణంగా కనిపించే వ్యాపకం. కాసేపు దాని గురించి చర్చించుకుంటూ కిందకు వెళ్ళాం.

దబీర్ పేట వరకూ వెళ్లి తిరిగి అశోక్ నగర్ నుంచి పాఖాల బీటుకు వచ్చాం. పాఖాల కూడా రెండు బీట్లుగా చేయబడిందని ఇంతకుముందు చెప్పాను. ఇక్కడ కూడా ఆక్రమణల సమస్య ఎక్కువే . పాఖాల బీటుకు ప్రవేశిస్తూనే పెద్ద పెద్ద మోదుగ చెట్లు , తీగ మోదుగ చెట్లు , సండ్రా ,టేకు, అడవి పత్తి ,పాల చెట్లు ఎదురయ్యాయి. చీమల పుట్టలు కూడా విస్తారంగా ఉన్నాయి. అంటే ఎలుగుబంట్లు ఉండే అవకాశం ఉందన్నమాట. ఎలుగుబంట్లు చీమలను , తేనెను ఇష్టంగా తింటాయి. నేల మీద అక్కడక్కడా పసుపు రంగు తెలుపు రంగు పూల మొక్కలు వచ్చాయి. ఇవి వర్షాధారంగా వచ్చేటువంటి మొక్కలు. ఇవి దుంప జాతి మొక్కలు. దుంపలను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. చిన్న చిన్న నీటి పారకం ఉన్న చోట గుంపులుగుంపులుగా సీతాకోకలు పసుపు రంగువి,తేనే రంగు మీద నల్లని చుక్కలు గలవి, ఇంకా రకరకాల రంగు రంగులవి గుంపులు గుంపులుగా నీటి తడి మీద కూర్చుంటున్నాయి, లేస్తున్నాయి. అక్కడ పేరుకున్న ఉప్పు సంభంద పదార్థాలను స్వీకరిస్తుంటాయి. ఇలా చాలా చోట్ల కనిపిస్తాయి. పశువుల పేడ మీద, ఎండిపోయిన పేడ మీద చినుకులు పడ్డప్పుడు వీటిని చూడవచ్చు. మా అడుగుల శబ్దానికి సీతకోకల గుంపు చెదిరిపోతూ , మళ్ళీ వస్తూ..సాగిపోతోంది.

లోపలి వెళ్ళే కొద్దీ అడవి చిక్కబడుతున్నది. ఎంతగా అంటే ముందుకు వెళ్ళలేనంతగా . దట్టంగా పెద్ద పెద్ద అకులతో ఒక గోడలాగా అల్లుకుపోయిన తీగ మోదుగ అందుకు కారణం. తీగ మోదుగ కాండం బలంగా చుట్టూ పక్కల ఉన్న చెట్లను అల్లుకుపోయి దుర్భేధ్యంగా తయారైంది. ఈ ఆకులు మామూలు మోదుగ ఆకుల కన్నా పెద్దగా లేతగా ఉంటాయి. వీటిని పచ్చిగా ఉన్నప్పుడు విస్తల్లుగా వాడతారు కానీ విస్తళ్ళు కుట్టడానికి వాడరు. పత్ర దళం పలుచగా ఉండడం ఆరిన ఆకులు పెళుసుగా ఉండడం విస్తళ్ళ తయరికి అనుకూలంగా ఉండదు. నిలబడే మోదుగ చెట్టు ఆకులను మాత్రమే విస్తల్లకు వాడతారు. ఎటు చూసినా పచ్చని గోడల వలె ఉండి ముందుకు వెళ్ళే లా లేదు. కనుక పరిసరాలు గమనిస్తూ వెనక్కి వచ్చేసాం.

మధ్యాహ్నం దాటింది. అక్కణ్ణించి నర్సంపేట వెళ్లి మళ్ళీ అటునుంచి ఖానాపూర్ వైపు వెళ్ళాం. మబ్బులు కూడుతున్నాయి. అటుపక్క కూడా ఒక సారి చూసుకుంటే ఈ రోజు పనులు ముగిసినట్టే. ఖానా పూర్ చేరేసరికే మూడు గంటలు కావొస్తుంది. వెళ్ళే దారిలో ఎడమవైపు దొరసానమ్మ ,కుంట కుడివైపు ఈదుల చెరువు నిండుకుండల్లాగా ఉన్నాయి. మా జీపును ఒకపక్కగా ఉంచి అడవిలోపలికి వెళ్ళాం. వాతావరణం చల్లగా హాయిగా ఉంది. వర్షం రావడానికి ముందు ఉన్న కొద్దిపాటి ఉక్కపోత. మధ్యమధ్యలో వస్తున్న చల్లని గాలులతో నడక పెద్దగా విసుగు అనిపించలేదు. లోపలికి వచ్చాక ఉన్న చిన్న సైజు గుట్టలకు బొప్పోని మెత్త అని పేరు. పేరు ప్రత్యేకంగా విచిత్రంగా ఉంది. ఎలా వచ్చిందో తెలియదు. చాలా సేపు నడిచాం. సాయంత్రం కనుక ఎక్కడా విసుగు అనిపించలేదు. ఒక మోస్తారు ఎత్తున్నచెట్లు , నేల కింద మాత్రం చక్కగా అల్లుకుపోయి కాలుమోప వీలు లేనంతగా చిన్న మొక్కలు పెరిగి చీకటిగా కూడా ఉంది. అంటే మొక్కల అల్లిక అంత చిక్కగా , దగ్గరగా ఉన్నాయన్నమాట . ఇక్కడ అడవి పందులు, కొండ గొర్రెలు ఉన్నాయి. ఎలుగు బంట్లకు అనువైన ప్రాంతం. ఎత్తైన చీమల పుట్టలు, రెండు మూడు కొత్త మొక్కలు కూడా కనిపించాయి.మరో మొక్క ఆకుపచ్చ గొలుసు మీద పసుపు రేకలు గుచ్చినట్టు అచ్చం పూల దండలా పాకుతూ పెరిగే మరో మొక్క ఉంటుంది. నిజంగా ఆ మొక్కను నెల మీద చూడవలసిందే. అంత చిక్కని పసుపు రంగు. దాని పేరు Heylandia laterbrosa –చిక్కుడు జాతికి చెందింది. జనుము పూల లాగ ఉంటుంది. స్థానికంగా ఏమంటారో తెలియదు.

ఒకప్పుడు ఇదంతా పెద్ద పెద్ద టేకు వృక్షాలతో ఉన్న అడవి. అటవీ ఆక్రమణలు , కలప అక్రమ రవాణ ఈ అడవి గంబీరతను దెబ్బతీసాయి. అయినప్పటికీ అటవీ శాఖ చాలా వరకు అటవీ భూమిని తిరిగి స్వాదీనం చేసుకొని అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టిన కారణం చేత తిరిగి అడవి విస్తరిస్తున్నది. ఇప్పుడు కనిపించే టేకు చెట్లలో చాలా వరకు ఇంతకు ముందు కొట్టివేసిన చెట్ల నుంచి వచ్చిన పిలకలే. ఇటువంటి పంటను పిలకల అడవి( Coppice forest ) అంటారు . కొత్త గడ్డి జాతులు లేవు. కానీ రకరకాల వృక్ష జాతులు ఉన్నాయి.
కొత్త మొక్కలు కోసం వెతుకుతూ నడుస్తున్నప్పుడు ఒక తీగ చిన్నదే దానికి కూజా ఆకారంలో ఉన్న నల్లటి పూలు కనిపించాయి. పువ్వులు ఎప్పుడు నల్లగా ఉండవు కానీ నలుపు రంగు లో ఉన్నటువంటి పువ్వు దొరికింది. మొదటి సారి ముదురు కాఫీ పొడి రంగు రంగుల పూలను చూడడం . ఫోటోలు తీసుకున్నాను. ఆ మొక్కల పేరు తెలుసుకోవాల్సి ఉంది. ఇక్కడ అన్ని చెట్ల జాతులు ఉన్నాయి, తప్ప గడ్డి జాతులు దాదాపు తక్కువ. చెట్ల మధ్య ఖాళీగా ఉన్న ప్రాంతమంతా మహావీర చెట్లు ఆక్రమించుకున్నాయి. మహావీర గురించి ఇంతకుముందు నేను ప్రస్తావించాను. మహావీరను స్థానికులు మందుగా కూడా వాడతారట. మహావీర ఆకులని కాల్చి పొడిచేసి ఆ పొడిని పసుపు నూనె తో కలిసి ఎక్కడైనా బూజు (Fungus )వల్ల వచ్చే జబ్బులను తగ్గించడానికి వాడతారట. మహావీర లేకపోతే ఇంకా ఎటువంటి మొక్కలు చుసేవాళ్ళమో తెలియదు.

చాలా దూరం నడిచాము. మేము వస్తున్నప్పుడు చల్లగా ఉన్న చోట మేఘాలు మెత్తబడి వర్షం. చినుకులు వస్తూపోతూ ఉన్నాయి. కాసేపటికి చిన్నగా వాన అందుకుంది. ధర[అతంగా కురుస్తున్నది. అడవిలో వర్షమో మీరెప్పుడైనా చూసారా …పెద్ద నీటి కుండ కుమ్మరించినట్టు , గంభీరమైన శాభాల నడుమ తన్మయమవుతున్న చెట్లు .. పెద్ద పెద్ద వృక్షాల శాలపై నుంచి జారుతున్న జల దారాలకు కంగారుకంగారు పరుగేతున్న చీమల గుంపులు, దొరికిన చోట ముడుచుకుంటున్న మర్కటాలు అదో అనుభూతి. మనసంత లోతు.. చూసేవారికి చూడగలిగినంత.

మేము ఆగిపోయిన చోటుకి జీపు రాలేదు , కొంచం నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్లాలి . మరో రెండు కిలోమీటర్లు నడిస్తే బండమీద మామిడి తండా అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి మెయిన్ రోడ్ కి వెళ్ళవచ్చు. వర్షం ఆగలేదు కానీ కొంచం తగ్గగానే అలా నడుస్తూ నడుస్తూ పోయాం. ఇక్కడ కూడా పెద్ద పెద్ద చింత చెట్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు విస్తారమైన గంభీరమైన ఇక్కడి టేకు వృక్షరాజాలు యే ఇంటి వసారా లోననో , పడక గదుల్లోనో శాశ్వత విశ్రాంతి పొంది ఉంటాయి.

కొంత దూరం నడిచాక వర్షం మళ్ళీ మొదలై అంతకంతకు పెద్దదవున్నది. ఇక తప్పదన్నట్లు తడుస్తూనే నడుస్తున్నాం. చెట్లు తలపైకి ఎత్తి, కురుస్తున్న వాన నీటిని తాగుతున్నట్లుగా కనిపిస్తుండగా వాన నీళ్ళ శబ్దం అడవంతా ప్రతిధ్వనిస్తున్నది. నిలబడి కురుస్తున్నట్లుగా వర్షంలో కూడా ఒక హుందాతనం. సంధ్య చీకటి తెలియడం లేదు. అంతా వాన..ఒకలాంటి వెండి తెలుపు. ఆ తెలుపులోనూ ఎర్రని లేత కొమ్మలతో పూసగు చెట్టు దూరం నుంచి కూడా స్పష్టంగానూ ,ప్రత్యేకంగానూ కనిపిస్తుంది. బాగా పండిన గోరింటాకు చూపెడుతున్న అమ్మాయి చేతులలాగా పూసుగు కొమ్మల లాలిత్యం వర్షంతో మరింత సుందరంగా కనిపిస్తున్నది.

ఇంతలో జీపు వచ్చేసింది. తిరిగి బయలుదేరాం. దారిలో ఇంటికి చేరుకుంటున్న పశువులు కురుస్తున్న వర్షానికి తీరిగ్గా తోకలు వూపుకుంటూ మెల్లగా కదులుతూ ఉంటే నల్లని వాటి శరీరాలు వాన నీటితో శుభ్ర పడుతున్నాయి. పైన నల్లని మేఘాలు , కింద నడుస్తున్న నల్లని మేఘాలతో ఒక వారధిగా నేలతో పాటూ మా మనసునూ తడుపుతూ ఆకాశ పాయ ప్రవహిస్తున్నది.

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)