గౌరవ సంపాదకీయం – రెహానా

ఆమె పేరు జ్యోతి. నిన్నటి వరకు ఓ అనామకురాలు. ఆమె పేరు, ఊరు ప్రపంచానికి తెలియదు. తెలియాల్సిన అవసరం ఏముంటుంది? వందల కోట్ల మంది ఈ భూ ప్రపంచం మీద తమ అస్థిత్వ ముద్ర వేసుకోకుండానే, వేసుకునే అవకాశం లేకుండానే జీవితాన్ని ముగిస్తూ ఉంటారు. నలుగురు పిల్లలతో పాటు ఆర్ధిక సమస్యలతో సావాసం చేసే ఓ కుటుంబంలో ఆమె పెద్దమ్మాయి. పదిహేను, పదహారేళ్ళ వయస్సు. చదువులోనూ పెద్ద ప్రతిభ ఉన్న అమ్మాయి కాదు. ఓ మోస్తారు తెలివి తేటలు. మరుగుదొడ్డి ఉన్నా తలుపు ఉండని, గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నా సిలెండర్‌ కొనలేని జీవితం వాళ్ళది. తల్లీదండ్రి రెక్కాడించి నలుగురు పిల్లల్ని సాకాల్సిన పరిస్థితి. అందుకే ఉన్నప్పుడు తినటం లేనప్పుడు కబుర్లతో కడుపు నింపుకుని నిద్రపోవటం వాళ్ళకు అలవాటే. ఇలాంటి జీవితాలు మన చుట్టూ ఎన్నో అల్లుకుని కనిపిస్తూనే ఉంటాయి. కాని ఓ సాహస ప్రయాణం ఆమె జీవితంలో అనూహ్య మార్పు తీసుకువచ్చింది. నిజంగా చెప్పాలంటే చేస్తున్నది సాహసం అన్న స్పృహ ఆమెకు ఉందని అనుకోవటానికి లేదు. జీవితంతో పోరాటం. అంతే. ఇవాళ కోట్లాది వలస కార్మికులు పిల్లల్ని ఎత్తుకుని తీరని ఆవేదన, ఆందోళన, నిరాశ, నిస్పృహలతో మండే ఎండల్ని లెక్క చేయకుండా వందల మైళ్ళు ఎలా నడిచి వెళ్లగలుగుతున్నారంటే …మన దగ్గర ఏ సమాధానం ఉంటుందో ఈ అమ్మాయి విషయంలోనూ అదే సమాధానం చెప్పుకోవాలి. గత్యంతరం లేని స్థితి. మరో మార్గం లేని దైన్యం. ఎలాగైనా ఇంటికి చేరుకోవాలన్న బలమైన తాపత్రయం. అందుకే గురుగావ్‌లో అనారోగ్యంతో ఉన్న తండ్రి మోహ‌న్ పాస‌వాన్‌ను తన సైకిల్‌ పై ఎక్కించుకుని బీహార్‌ ద‌ర్భంగ జిల్లాలోని సిర్హుల్లీ గ్రామానికి చేరింది. ఆషామాషి దూరం కాదు. ఏకంగా 1200 కిలోమీటర్లు.


ఇవాళ జ్యోతి ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తిన్నగా కాళ్లు జాపుకుని పొడుకోవటానికి కూడా సరిపోనంత ఆ చిన్న ఇల్లు..ఇవాళ జ్యోతికి స్వీట్లు తినిపించటానికి, శాలువాలు కప్పటానికి, ఆమెతో సెల్ఫీలు దిగటానికి పోటీపడే జనంతో కిటకిటలాడుతోంది. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, అధికారులు, ఇంటర్వ్యూల కోసం మీడియా ప్రతినిధులు ఉదయం నుంచి రాత్రి పోద్దు పోయే వరకు అక్కడ క్యూ కట్టి కనిపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు కేంద్ర మంత్రులే కాదు ఏకంగా శ్వేత సౌధ అధిపతి కుమార్తె ఇవాంక ట్రంప్‌ కూడా ఆమెను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. నిండా పేదరికంలో మునిగి ఉన్న ఆ ఇంటి పై హామీల వర్షం కురుస్తోంది. చదువు మొదలు జ్యోతి పెళ్ళి వరకు ఉన్నాయి ఈ హామీలు. నాలుగైదు కొత్త సైకిళ్లు ఈ ఇంటి ముందు ఓ ఆడి కార్‌, ఓ మెర్సిడెజ్‌ బెంజ్‌లాగా నిలబడి ఉన్నాయి. కాస్త డబ్బులు కూడా వచ్చాయి ఆ కుటుంబానికి. సైక్లింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా కూడా జ్యోతికి శిక్షణ ఇచ్చి సైక్లిస్ట్‌గా మారుస్తామని ఆఫర్‌ చేసింది. ఓ ఎల్‌జేపీ నాయకుడు జ్యోతికి రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తినటానికి కూడా టైమ్‌ లేనంతగా ఆ కుటుంబం ఇవాళ బిజీ అయిపోయింది వచ్చే పోయే ప్రముఖులతో. బానే ఉంది. కనీసం మీడియా ద్వారా జ్యోతి అనే ఓ టీనేజర్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయం, పట్టుదల చూసి ప్రభుత్వాల్లో కొంత మేరకైన కదలిక వచ్చింది. ఆ కుటుంబానికి ఎంతో కొంత ఊరట దొరక్కపోదు అని అనిపిస్తోంది కదా.

కాని అసలు కథ ఇది కాదు. ఆలోచించాల్సిన కోణం ఇది మాత్రమే కాదు. తినటానికి తిండి లేక, నమ్ముకున్న ఊర్లో బతకలేక…ఒంట్లో సత్తువ లేకపోయినా రోడ్డున పడాల్సిన దుస్థితికి జ్యోతిని నెట్టిందెవరు? అంత సుదీర్ఘ ప్రయాణంలో తండ్రీ, కూతుర్లకు ఏమైనా అయ్యుంటే …వాళ్ల పేర్లు అయినా పత్రికల్లో వచ్చి ఉండేవా? “ఇద్దరు వలస కార్మికులు” అన్న సంబోధనతో పేపర్లలో చిన్న వార్త వచ్చి ఉండేది. కరోనా పై పోరాటం ఏమోగాని కోట్లాది మందికి లాక్‌డౌన్‌ చావు బతుకల పోరాటంగా మారింది. దీనికి కారకులు ఎవరు? తప్పెవరిది? శిక్ష ఎవరికి? నిస్సందేహంగా జ్యోతి పోరాట స్ఫూర్తిని రగిల్చింది. అదే సమయంలో మన ముందు ఎన్నో ప్రశ్నలను నిలబెట్టింది. ప్రభుత్వాల దగ్గర సమాధానం ఉందా?

 

— రెహానా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

One Response to గౌరవ సంపాదకీయం – రెహానా