యద్భావం తద్భవతి(కవిత )-S.రత్నలక్ష్మి

 

 

 

 

పరిగెడుతున్న ప్రపంచం

ఒక్కసారిగా స్థంభించింది

కరోనా వైరస్ కాళ్ళకు బ్రేకులేసి

ఇంట్లో కూర్చోబెట్టింది

మాసిపోతున్న మానవ సంబంధాలను

మళ్ళీ పునరుద్ధరించింది

అందరి నడుమ

ఆనందరాగాలను ఆలపించింది

కన్నవారితో ఆత్మీయ పలకరింపులు
కట్టుకున్న వారితో కమ్మని ఊసులు
కన్నపిల్లలతో ఆడిన సరదా గేములు
కలిమిలేములకు అడ్డేరాని

ఆనందానుభూతులు

ఇవి స్వీయగృహ నిర్భంధంలో

నేను ఆస్వాదించిన తేనెచినుకులు

ప్రభాతంలో పలుకరించిన ప్రకృతి అందాలు
ప్రశాంత మనస్సుతో చేసే పరమాత్ముని పూజలు
పరిగెత్తకుండా తృప్తిగా ఆరగించే ఫలహారాలు
పందేలతో ఆడిన అష్టాచెమ్మా వైకుంఠపాళీలు

ఇవి స్వీయ నియంత్రణలో

నేను ఆఘ్రాణించిన ఆత్మీయ పరిమళాలు

యాంత్రిక జీవితంలో దొరికిన అమూల్య సమయాలు
కుటుంబ సభ్యులతో కలిసి

జరుపుకుంటున్న ఆత్మీయ వేడుకలు
ఇరువురి నడుమా తొలగిన అపోహల మౌనతెరలు
టీవీ వీడియోల్లో వీక్షించిన వినోదవల్లరుల వీచికలు

ఇవి కాలు బయట పెట్టకనే

నేను అనుభూతించిన స్వర్గ సౌఖ్యాలు

ఈ లాక్డౌన్ కాలమంతా యద్భావం తద్భవతి
ప్రతికూలతతో పరిశీలిస్తే ప్రతిదీ

జైలుజీవితంలా అనిపిస్తుంది
అనుకూలంగా అలోచిస్తే అన్నింటా

ఆనందాలనే ఆవిష్కరిస్తుంది
మనమంతా

స్వీయనియంత్రణతో స్వీట్ హోంలో

ఉంటూనే కరోనాని జయిద్దాం

దేశక్షేమంకోసం ఈ సంక్షోభ సమయంలో

విధులు నిర్వర్తించే ప్రతిఒక్కరికీ సహకరిద్దాం

S. రత్నలక్ష్మి
అసిస్టెంట్ ఇంజనీరు
తెలుగుగంగ కార్యాలయం
నంద్యాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.