నేను నేనుగానే వున్నా

జన్మించాననుకున్నా…

జగన్నాటకంలో పాత్రనయ్యనని తెలుసుకున్నా…

ఉపిరి తీస్తున్నాననుకున్నా….

విష వాయువుని ఆస్వాదిస్తున్నా…

ఎదుగుతున్నానని అనుకున్నా….

ఎదిగే కొద్ది నలుగుతున్నా…

పలుకుతున్నానని అనుకున్నా…

పై పై పిలుపులకి ఉలిక్కిపడుతున్నా…

చూస్తున్నానని అనుకున్నా….

అవాస్తవ గమనాన్ని తిలకిస్తున్నా….

నవ్వుతున్నాననుకున్నా….

హేళన నవ్వులు చూసి నివ్వెర పోతున్నా….

నడుస్తున్నాననుకున్నా….

ముళ్ళ బాటలు దాటలేక సతమతమవుతున్నా….

జీవిస్తున్నానని అనుకున్నా…

క్షణం క్షణం జీవనం పేరుతో మరణిస్తున్నా…

నా జీవితం అనుకున్నా…

నాదంటూ ఏమి లేదని తెలుసుకున్నా…

ఆనందాన్ని పెనవేసుకున్నాననుకున్నా….

వేదన కౌగిలోలో ఒదిగి వున్నా…

మనిషిని అంటే మహోత్తమం అని విన్నా….

అసలు మనిషి అంటే

మహా బూటకం అని తెలుసుకున్నా…

భయం అంటే తెలీదనుకున్నా….

ఈ నాటక చదరంగాన

నేను పావునవుతానేమోనని గాబరా పడుతున్నా….

అబద్ధం అంటే నాకు సుదూరం అనుకున్నా….

నేను నేనులా నిజంలో బ్రతకటానికి

అబద్ధం ఆడక తప్పదని తెలుసుకున్నా….

ఓదార్పు అనే అమోఘమైన మాట విన్నా….

అది మాటకే బహు అందం అని గ్రహించుకున్నా….

ప్రశ్నలు చేదించేది ఎవరనుకున్నా….

నా ప్రశ్నకు నేనే సమాధానం అన్న సమాధానం తెలుసుకున్నా…

నిస్వార్ధం అర్ధాన్ని వెతకాలనుకున్నా….

అది జన్మాంత అన్వేషణ అని అవగతం చేసుకున్నా…

ప్రేమ అనే నిజాన్ని చుడాలనుకున్నా…

అది కళ్ళున్నా చూడలేని మాయ అని మనసు మూసుకున్నా…

నిజాయితిగా నిక్కచ్చిగా బ్రతకాలనుకున్నా…

అందరు వెర్రి బాగులదాన్ని అంటుంటే

నాలో నేను అందర్నీ చూసి జాలి పడి నవ్వుకున్నా….

ఏమిటి ఇదంతా అనుకున్నా….

ఇదే జీవితం అని ఎవరో అంటే విని ఆశ్చర్యపడుతున్నా…

ఇంత దగా సమాజమా మన లోకం అన్నా….

నువ్వు లోకానికి విరుద్ధం అని నన్ను నిందిస్తుంటే నివ్వెరపోతున్నా….

నువ్వింకా ఎదగాలి అన్న మాటకి అర్ధం తెలుసుకున్నా…

ఎదుగుదల అంటే నయవంచనతో,

నాటకాలతో,ప్రతి క్షణం మోస పూరితంగా బ్రతకటమే ఎదగటం అని రోధిస్తున్నా….

ఏదేమైనా నేను నేను గానే బ్రతుకుతున్నా….

ఎదురైనా కష్టాలని ఇష్టంగా స్వీకరిస్తున్నా….

ప్రతి చోట స్వచ్చతనే వెదజల్లుతున్నా….

నా మనసుకి నా నడవడితోనే నవ్వుల మాలలు వేసి సత్కరిస్తున్నా….

– అభిలాష

కవితలు, , Permalink

9 Responses to నేను నేనుగానే వున్నా

 1. uday says:

  అభిలాష గారు, జీవితాన్ని పరిశీలిస్తున్న తీరు , అంతః సంఘర్షణ ని చాలా చక్కగా కవితాత్మకం గా చెప్పారు. అభినందనలు

 2. neeraja says:

  చాల బాగుంది abhi

 3. Abhilasha says:

  ధన్యవాదములు సుష@4U4ever@

 4. susha says:

  మీరు మీరుగానే ఉండాలనే మీ “అభి”లాష బాగుంది ,
  ఎన్ని కష్టాలెదురైనా మంచిగా బ్రతకాలి అనే
  మీ “అభి”మతం బాగుంది , కుళ్ళు సమాజం పై
  మీ “అభి”శంసన బాగుంది , అన్నిటినీ మించి
  స్వా”అభి”మానం బహు బాగుంది

  “అభి”నందనలు “అభి”గారు
  -సుష@4U4ever@

 5. Abhilasha says:

  ధన్యవాదములు ఉమా గారు and మై డియర్ కవి 🙂

 6. Kavitha Siddereni says:

  చాల బాగా రాసావు

 7. uma says:

  అభిన౦దనలు