వ్యథ శాల-అరణ్యం 9 -దేవనపల్లి వీణావాణి

రాత్రి నర్సంపేటలోనే ఉండిపోయాం. ఉదయం వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మా జిల్లా యంత్రాంగం అంతా చిన్న చిన్న బృందాలుగా విడిపోయాం. ఒక్కో బృందానిది ఒక్కో పని. వరంగల్ గ్రామీణ జిల్లాలో వన్యప్రాణి సంరక్షణ అంటే పాఖాల అభయారణ్యం గురించే చెప్పవలసి ఉంటుంది. వారోత్సవాలలో భాగంగా విభిన్న కార్యక్రమాల ప్రణాళిక రచించారు . రేపటినుంచి వారం పాటు వివిధ పాటశాలల పిల్లలకు అభయారణ్యం సందర్శణ ఉచితం. ఇంకా రకరకాల పోటీలు, సర్పాల అవగాహనా సదస్సులు , గడ్డి భూముల సందర్శన, పాఖాల సరస్సు సందర్శనలు వంటివి ఉన్నాయి. రేపటి కార్యక్రమాలను ముందుగానే మాట్లాడుకొని ఎవరి చోటకి వాళ్ళం వెళ్లి పోయాము . సరిగ్గా మధ్య రాత్రిలో ఉండగా నా సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుండడంతో మెళకువ వచ్చింది. ఒక అటవీ సంభంద సమాచారం. ఎడ్ల బండిలో కలప రవాణా గురించిన సమాచారం. సమాచారం ఇచ్చిన వ్యక్తి ఫలానా చోటునుంచి ఫలానా ఊరి మీదుగా వెళ్తున్నట్టు మాత్రం చెప్పాడు. మిగిలిన వివరాలు అడిగే లోపు ఫోన్తో సంభందం తెగిపోయింది. మెళకువ కాస్తా ఆందోళనగా మారిపోయి మా బృంద సభ్యులకు సమాచారం అందించి ,అందర్నీ సమాయత్త పరచి అరగంటలో బయలుదేరాం.

దారులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. నిన్న మంగళవారం అంటే ఇప్పుడు నేను చెప్తున్న రాత్రి మంగళ వారపు రాత్రి , మంగళ వారం నర్సంపేటలో అన్ని వ్యాపారాలకు సెలవు కనుక మా ఆఫీసు దారిలో నిత్యం కనిపించే హడావిడి లేదు. మాములుగా ఉండే రద్దీనే లేదు కనుక రాత్రి మరింతగా నెమ్మదిగా ఉంది. శరద్రుతువులో ఒక శుక్ల పక్ష రాత్రి , నీలంగా మారిన రాత్రి…. కనిపించే ప్రతీదీ తన ఒంటి నిండా నీలాస్మిక వర్ణం పులుముకొని తనదైన ఒక మార్మిక సౌందర్యాన్ని వెదజల్లుతుంది. అటు పల్లె గానూ , ఇటు పట్టణంగానూ వర్గీకరించే వీలు లేని ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్ళలో ఎక్కడా దీపపు వెళుతురు లేదు. నర్సంపేట నుంచి మల్లంపల్లి గుండా మేడారం వరకు విస్తరించిన దారి మాత్రం గంబీరంగా ఉంటుంది. ఈ దారి నుంచి మళ్ళీ పక్క దారుల ద్వారా వివిధ గ్రామాలకు వెళ్ళే దారులుంటాయి. వాటిలో ఒక దారి నుంచి మేం వెళ్ళవలసి ఉంది. జీపు లైట్ల వెలుతురు పడ్డ చెట్లు ఒక బంగారు గుమ్మటం మాదిరిగా వెలిగి మళ్ళీ వెన్నెల కాంతికి తల ఒగ్గుతున్నాయి. వానలు రెండు రోజులుగా లేవు. మల్లంపల్లి రోడ్డు దిగి పక్క దారి గుండా కిందకు వెళ్తున్నాం. రాత్రి మరింత చిక్కబడ్డది. ఇంకాస్త ముందుకు వెళ్లి ఒక చెట్టుకు పక్కగా జీపు ఆపుకొని ఉన్నాం. మల్లంపల్లి రోడ్డు మీద కూడా వాహనాల సందడి లేదు. అంతటా నిశ్శబ్దం.. నిశ్శబ్దం.. పక్కన ఉన్న చెట్ట్లు మీద నుంచి రెండో మూడు సార్లు విడతల వారీగా పక్షుల శబ్దాలు తప్ప అంతటా నిస్సబ్దం. కీచు రాళ్ళ రొద కూడా వినబడటం లేదు. వ్యావసాయక రసాయనిక ఉత్పాతానికి ఘాత పడ్డ జీవులలో ఇవి కూడా చేరి ఉంటాయి. నిద్ర మొఖాలు , చిమ్మ చీకటి , నిశ్శబ్దం.. నిశ్శబ్దపు గాలి మెదడు దాకా అందుతుంది.

మా బృందంలో ఒకరు ముప్పై ఏళ్ళ సర్వీసు పూర్తి చేసారు , మరొకరు ఇరవై ఆరెళ్ళ సర్వీసు పూర్తి చేసారు.. కొన్ని విషయాలు తెలుసుకోవడం కోసం , కొన్ని విషయాలు నేర్చుకోవడం కోసం నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. ఈ నిశ్శబ్దాన్ని కదిలిస్తూ నేను మాట్లాడటం మొదలు పెట్టాను. నేను సర్వీసులో చేరిన కొత్తల్లో ఒక సారి ఎడ్ల బండిలో వస్తున్న పెద యేగిస (Pterocarpus marsupium ) కలపను పట్టుకున్నాను. విస్తారమైన టేకు వనాలు ద్వంసం అయ్యాక పెద యేగిస కలప గొప్ప ప్రత్యామ్నాయం గా కనిపించడం చేత దోపిడీదారులు ఈ కలపను ఎంచుకున్నారు. అదే నేను పట్టుకున్న మొదటి కలప అక్రమ రవాణ నేరం. తర్వాత అటువంటి చాలా నేరాలను అదుపు చేయగలిగాం. మధ్యలో కాంత్ కాలం వేరే విభగంలో, వేరే చోట పనిచేయడం వల్ల అడవి జీవితానికి కొంత దూరం అయ్యాను . వీళ్ళు మాత్రం ఎప్పటి నుంచో అడవితో సహవాసం చేస్తూనే ఉన్నారు. వీరి నిరాడంబర జీవన శైలికి కారణం ఇలా ప్రకృతితో అనుసంధానమై ఉండడం అనుకుంటాను. చాలా సార్లు నిర్మొహమాటంగా ఒక దిన పత్రికనో , తువ్వాలనో పరుచుకొని దొరికిన చోట నిద్రించడం నేను గమించాను. అటవీ అధికారులందరి జీవితాలలో ఇలా సర్దుకుపోవడం కనిపిస్తుంటుంది. దొరికినది తినడం, కాస్త అనువుగా ఉన్న చోట కునుకు తీయడం, ఆటవికుని జీవనానికి, ఆధునిక జీవితానికి మధ్య ఊగిసలాడుతుంటుంది. ఇప్పటి మా సందర్బం కూడా అటువంటిదే. నిద్రలో నుంచి లేచి వచ్చినందుననేమో, అందులో పెద్ద వాడైన లాల్సింగ్ ఎక్కడైనా ఒరుగుదామని జాడ వెతుక్కుంటున్నాడు. వారిని ఉత్సాహపరచడానికి నేను మాటలు మొదలు పెట్టాను.

లాల్సింగ్ కొండముచ్చుల్ని ఎలా పట్టుకుంటారో చెప్తున్నాడు. ముఖ్యంగా కోయలు, గుత్తికోయలు. వీరి ఆహారంలో అన్ని అడవి జంతువులూ ఉంటాయి. కోతులు, కొండముచ్చులు అడవిదున్నలు, ఉడతలు, కప్పలు , ఉడుములు ఆఖరికి ఎలుగుబంటితో సహా జంతువులను వేటాడడంలో వారు చాలా ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు. అడవి జంతువులను వేటాడడం మనుషులకు కొత్త కాకపోయినా మానవులే అంతటా విస్తరించి సమస్త జంతు జాలాన్ని ఒక పక్కకు పెట్టి వేసి వాటి మనుగడ ప్రశ్నార్థకం అయిన ఈ రోజులలో ఏ ఒక్క ప్రాణీ కేవలం ఆహారం కోసం అంతరించిపోవడం సబబు కాదు కదా..!

అడవి జంతువుల వేట ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా జరుగుతుంది. అడవి మీద బాగా పట్టు ఉన్న గిరిజనులు ఆయా జంతువుల జీవన శైలికి అనుగుణంగా వేటాడే సామగ్రిని తయారు చేస్తారు. కోతులు, కొండముచ్చులను కూడా వలపన్ని పట్టుకుంటారు. కోతులను తరిమివేయడానికి కొండముచ్చులు వాడడం అందరికీ తెలిసింది కానీ ఈ కొండముచ్చులు మాత్రం ఆహారం కోసం మనిషి చేసే పన్నాగంలో దొరికిపోతాయి. పట్టుకోవడానికి ముందు అది ఉన్న చోటును గమనిస్తారు. ఆ తర్వాత ఏ చెట్టు మీద అయితే అది కూర్చుంటుందో ఆ చెట్టు చుట్టూ ఉన్న అన్ని చెట్లను కొట్టి వేస్తారు.అప్పుడు అది వేరే చెట్టు మీద దూకి తనను తాను రక్షించుకునే అవకాశం ఉండదు. అప్పుడు అది కిందికి దిగే వీలు లేక ఎక్కడికి వెళ్లలేక అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత కిందకి దిగడానికి ఒక కొమ్మను పెడతారు. ఆ కొమ్మను పట్టుకొని కొండముచ్చు కిందకు దిగడానికి ప్రయత్నించే క్రమంలో వల వేసి పట్టుకుంటారు. అటు తర్వాత చంపి మాంసాన్ని వరుగులు చేసి ఎండబెట్టి వండుకొని తింటారు. అది కూడా పచ్చి మాంసపు వాసన బాగుండదని అలా చేస్తారట.. అందువల్ల వరుగులు చేసిన మాంసమే తింటారట. అడవిలో ఎక్కడైనా గుండ్రంగా నరికిన చెట్లు కనిపిస్తే అది కొండ ముచ్చులను పట్టుకున్న చోటు అని గుర్తుపట్టవచ్చునట. కొండ ముచ్చులు కూడా ఎక్కడపడితే అక్కడ లేవు. వాటి సంఖ్యా తక్కువే. ఇంకా ఉడతలను పట్టుకోవడం, పక్షులను పట్టుకోవడం , ఎలుగుబంటిని పట్టుకోవడం వంటివి మా మాటల్లో దొర్లిపోతున్నాయి. ఎలుగు బంటిని అయితే అది రోజూ తిరుగాడే చోటును గమనించి ఒక చోట పటాకులు కూర్చిన అన్నం విస్తరి పెడతారు. అది తినడానికి వచ్చినప్పుడు పటాకులు పేలి మూతి పగులుతుంది. అప్పుడు బాధతో కిందపడినప్పుడు పట్టుకుంటారు. అడవులు, జీవాలు ..వేట వంటి విషయాలతో మా మాటలు, వాతావరణాన్ని గంభీరంగా మారుస్తుంటే చెట్టూ పిట్టా కూడా తలొగ్గి వింటున్నట్టు చిన్న చిన్న గాలి సవ్వడులకు కొమ్మలు ఊగుతున్నాయి.

సమాచారం చేరవేసిన వ్యక్తికి మళ్ళీ మాట్లాడాలని అనుకుంటే కుదరలేదు. వెన్నెల మరింతగా వెలుగుతుండగా గోరుకొయ్యలు పొడిచే వేళ దగ్గరపడుతున్నది. సప్తర్షి మండలం, జరుగుతున్న సమయానికి అనుగుణంగా కదిలినట్టు భావన. చలి ఉంది కానీ మరీ ముదురుచలి కాదు. ఇది కూడా ఒక అనుభూతే కదా .. వెన్నెల ఆకాశంలో చుక్కలు చూడగలగడం …. కాల గమనంలో ఒక పొద్దు పొడిచే సమయానికి సాక్ష్యంగా
తూరుపుకు ఎదురుగా నిలబడడం… సన్నని వెలుగు రేఖలు నీలాకాశపు సముద్రం మీద ఎర్రెర్రగా విచ్చుకోవడం… బాగుంటుంది. ఒక అడవి దారి మీద నేను చూసిన పొద్దుపొడుపుని ఇలా కాగితంమీదకు అనువదిస్తున్నాను. నా ఈ అనువాదం భావస్పోరకమో కాదో గానీ ఎప్పుడైనా ఒక రోజు నిశ్శబ్డంగా ఉన్న అడవిలో ఒక శరత్ కాలపు వెన్నెలను మాత్రం చూడకుండా జీవితాన్ని ముగించడం ఒక విలుప్త నదీ ప్రవాహమే అవుతుందని చెప్పగలను.

పగడపు మెరుపు కాస్త తెల్లని ఎండ పొడగా మారే వరకు చూసి ఇక వెనక్కి బయలు దేరాలని నిర్ణయించుకొని వారోత్సవాల ప్రణాళికలో మధ్యాహ్నం నుంచి పాల్గొనగలమని సమాచారం ఇచ్చి ఇంటి ముఖం పట్టాము. నేరాలను అదుపు చేయడం అనుకున్నంత సులభమయిన విషయమేమీ కాదు.ఎన్నో సాధకబాధకాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో మనకు వచ్చే సమాచారం ఫలవంతమైప్పటికీ ఒక్కోసారి విఫలమవడమూ జరుగుతుంది ఈ రోజు లాగా.

మధ్యాహ్నం వరంగల్ కాకతీయ జూపార్కుకి వెళ్ళవలసి ఉంది. జీవ వైవిధ్య సంరక్షణలో ఆవాసాలకు ఆవల ( ex situ conservation ) సంరక్షణ విధానంలో జంతు సంరక్షణ శాల ఒకటి. అందరూ అనుకున్నట్టు అది ఊరికే జంతువులను ప్రదర్శించే చోటు కాదు. సహజ ఆవాసాలలో మనలేని జాతులను సంరక్షించి , ప్రజననం జరిపించి తగినంతగా జనాభా వృద్ధి జరిగినప్పుడు తిరిగి ఆయా జాతులను వాటి సహజ ఆవాసాలలో వదిలిపెడుతుంటారు. ఆ విధంగా మానవులు తమ వల్ల జరిగిన ప్రాకృతిక నష్టాన్ని పూరించే ప్రయత్నం చేస్తుంటారు. ఆవాసాల లోపల ( in situ conservation ) జాతులను సంరక్షించే పద్దతి కూడా ఉంటుంది. అభయారణ్యాలు , జాతీయ వనాలు వీటికి ఉదాహరణ.

మేం వెళ్ళేటప్పటికి జూ పార్క్ సందడిగా ఉంది. ఉచిత ప్రవేశాన్ని ఉపయోగించుకోవడానికి నగరంలోని పలు విద్యాసంస్థలు పోటీ పడ్డట్టు తెలుస్తున్నది. కాకతీయ జూపార్క్ పరిమాణం ఇతర జంతు ప్రదర్శన శాలలతో పోలిస్తే చిన్నది, ఇది మొదలవడమే మినీ జూ గా మొదలైంది. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న జంతువుల పరిరక్షణ పాఖాల అభయారణ్యంలోనే జరిగేది. ఇక్కడికి మార్చిన దరిమిలా పూర్తి స్థాయి జంతు సంరక్షణశాలగా మారింది. జూపార్క్ లో ఎక్కడ చుసినా పిల్లలు వరసలు కట్టి ఒక్కో జంతువును చూస్తూ ముందుకు పోతున్నారు. చిన్న చిన్న పిల్లలు .. వారి పాటాలలో చదువుకున్న జంతువులను చూసి కేరింతలు కొడుతున్నారు. వారిని అదుపు చేస్తూ వారి గురువులు తంటాలు పడుతున్నారు. అంతా సందడిగా ఉంది. జాతర వాతావరణం నెలకొంది. సాయంత్రం వేళకి కార్యక్రమాలు ముగిసి మళ్ళీ తెల్లవారుతుండగానే ప్రారంభం అవుతాయి. పనిలో పడిపోయాం. పర్యావరణ పరిరక్షణ గురించి తయారు చేసిన ప్రదర్శికలను సందర్శనలో ఉంచడం జరిగింది. చిన్న పాటి సమావేశం ఏర్పాటు చేయబడింది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ వంటి అంశాల మీద సమవేశానికి హాజరైన ప్రముఖులచేత ప్రసంగానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అంతా సవ్యంగానే జరిగిపోతున్నది.

ప్రజా కార్యక్రమాల నిర్వహణ కత్తి మీద సాములాంటిది. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది కనుక ఎవరికి కేటాయించిన పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. జూపార్క్ లో ఒక పక్కన ఉన్న బెంచీ వద్ద కూర్చున్నాను . రాత్రి నిద్ర లేదు కనుక ఒకరకమైన నిస్సత్తువ..
నేను కూర్చున్న బెంచీకి ఎదురుగ్గా చిరుతపులి ఎంక్లోజర్ ఉంది. అలసట నిండిన కళ్ళతో చిరుతపులి వైపు చూసాను. పిల్లలు శబ్దం చేస్తున్నా అది కదలడం లేదు. దాని కోసం తయారు చేసిన చెట్టు లాంటి నిర్మాణం మీద శరీరాన్ని వేలాడేసి తల ఒక పక్కగా పెట్టి ద్వేషమూ ఆక్రోషమూ నిండిన కళ్ళతో చూసి మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నది. మరొక వైపు ఉన్న ఎలుగు బంటి గుహలో నుంచి బయటకే రావడం లేదు. ఇలాటి సందడి, హడావుడి వాటి జీవితంలో లేదు. ఉత్కృష్ట అరణ్యాలలో నిశ్శబ్ద లయగా కలిసిపోయిన జీవనం వాటిది. అవి గంభీరమైన ప్రకృతి వికాసానికి సాక్ష్యాలు. తన సహచరుల మధ్య, తన కుటుంబంతో నీ లాగా నాలాగా బతుకును అనుభవించే వ్యక్తి రూపాలె అవి. కానీ ఇప్పుడు అది తన నుంచి , తన గమనం నుంచి , తన కుటుంబం నుంచీ ..తనదే అనుకున్న ప్రపంచం నుంచీ యే కారణం చేతనో విడిపోయింది. ఆకలి చేతనో దాహం చేతనో కావలసిన దానిని వెతుక్కుంటూ తప్పిపోయి ఉంటుంది..లేదా యే ప్రమాదం లోనో వన పాలకులకు చిక్కి ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో జంతు సంరక్షణ శాలలకు ఇటువంటి కారణాల వల్లనే వస్తుంటాయి. అటువంటి సందర్భాల్లో కొన్ని అదృష్టవంతులు మాత్రమే తిరిగి అడవి మొఖం చూస్తాయి. ఇక్కడున్న చిరుత కొన్నాళ్ళ క్రితం ఇక్కడకు వచ్చింది. అడవి నుంచి వచ్చినవైతే వాటికీ ఇంటి బెంగ ఉంటుంది. అవి కూడా జంతు సంరక్షణశాల వాతావరణానికి అలవాటు పడాలంటే కొంత సమయం పడుతుంది. అది ఎంతో జాగ్రత్తగా మెలిగే సయమం. వాటిని జూ సిబ్బంది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాటి సంరక్షణ కొరకు ప్రత్యక శిక్షకులు, నిపుణులు , జంతు వైద్యులు ఉంటారు. అయినా వాటి సహజ జీవనాన్ని ప్రతిక్షేపించలేము కదా.. ఇప్పుడు నా ముందు ఉన్న చిరుత బాధను నేను అర్థం చేసుకోగలను . అది బాధ పడుతూంది..తన జీవితమంతా ఇక్కడ గడప బోతున్నానని దానికి అర్థం అయ్యి ఉంటుందా..తాను వదిలి వచ్చిన అడవి తన అస్తిత్వ వేదనై వెంబడిస్తుందా.. విషాదమంతా నిండుకున్న కళ్ళలో ఆ భావమే చెప్పలేక చెప్తున్నది.. అన్నిటికీ మించి ఇప్పుడది ఒంటరిది. ఇప్పుడది తనది కాని , తనదంటూ లేని ఒకానొక మానవ నిర్మిత ఇరుకు కల్మష కారాగారంలో ఒక బందీ మాత్రమే..

సమావేశం మొదలై , ముగిసి అందరం తిరిగి ఇళ్ళకు వెళ్ళే సమయం వచ్చేసింది. సమావేశం జరుగుతున్నతసేపు నేనూ ఒక వక్తను , నేనూ ఒక పృశ్చకున్ని …చిన్న చిన్న పిల్లల ప్రశ్నలకు సమాదానం చెప్పి ఒప్పించాను గానీ ఒక నిర్వేదం నన్నూ ఆవహించింది. నేనే ఒక చిన్న పిల్లనై ప్రశ్నించుకున్నట్లు ఊట చెలిమ లాంటి ప్రశ్నలు నా మెదడును అల్లుకుంటున్నాయి.తిరిగి ఇళ్ళకు చేరే సమయం వచ్చేసింది . నా అనుమతి తోనే మా వెంట ఉన్నవన్నీ సర్దేసి జీపు లో పెట్టేసాడు డ్రైవర్.అలాగే ఇంటికి వెళ్ళిపోయాను.

యథావిధి పనులు త్వరగా ముగించుకొన్నాను. రాత్రి కావస్తుంది. నిద్ర పోదామనే అనుకున్నాను. కానీ నిద్ర రావడం లేదు. పదే పదే జూ పార్క్ లో చిరుత పులి మొఖమే గుర్తుకు వస్తున్నది. అన్నిటికీ మించి సమావేశంలో ఒక పాప వన్యప్రాణి సంరక్షణ గురించి నన్ను అడిగిన ప్రశ్న ఇంకా ఇంకా వేధిస్తున్నది. ఆమె ఇలా అడిగింది..Madam, If zoo is Conservation centre , why our lessons has mentioned as Exhibition centre…in Telugu .? అని నిజమే కదా.. జంతు ప్రదర్శనశాల అనే పేరుతోనే కదా తెలుగులో రాస్తున్నాం , నిజానికది జంతు సంరక్షణ శాల అనికదా రాయాలి. ఈ తరపు పిల్లల సూక్ష్మ బుద్ధికి మెచ్చుకోవాల్సిందే. శాస్త్ర పరిజ్ఞానానికి, దానిని ప్రజల దాకా తెసుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో లోపాలను ఇటువంటి సందర్బాలు వెతికిపెడతాయి. మనం దిద్దుకోవాల్సిందే.

అనుకోని ప్రశ్నకి ఖంగు తిని అప్పటికి ఏదో సమాధానమైతే చెప్పాను గానీ అది ఎంత పెద్ద పొరపాటో గ్రహించాక అటువంటి ప్రశ్ననే జూ పార్క్ లోని చిరుతపులి కూడా అడిగినట్టు అనిపించింది. మనమెవరంరం వాటిని ప్రదర్శించడానికి , అన్ని జీవులు సమమైన స్వేచ్చతో కదా పుట్టాయి. వాటికోసం వాటిని బంధించామని అయితే సర్ది చెప్పుకోగలం గానీ అది సహేతుకుమే అని సమర్ధించుకోగలమా….మన దురాశ వల్లనే కదా వాటికీ గతి పట్టింది చివరాఖరికి వాటికి దొరికేది స్వేచ్చనో విముక్తో కాలమే నిర్ణయించాలి. వాటికి స్వేచ్చ .. ఎవరు ఇస్తారు వాటికి సేచ్చ..? …. వాటికి దొరికేది విముక్తి మాత్రమే ..! విముక్తి అంటే విశేషమైన ముక్తి..ఇక తిరిగి రానక్కరలేని ముక్తి… విముక్తి వాటికి జీవన్మరణ సమస్య ..మరణమూ కనికరించని నిర్భేధ్య పరావరణంలో తనకు తానుగా ఆత్మహత్య అయినా చేసుకోలేని నిర్భాగ్యత్వం సాక్షిగా విముక్తి కల.. పగటి కల..అసలు పగలు కూడా రాత్రే అయిన వాటి జీవితాల్లో ప్రత్యేకంగా రాత్రి అంటూ ఉంటుందా …
నిద్రరావడం లేదు. అలసిపోయి ఉన్నా కళ్ళు మూత పడ్డం లేదు.
నాకు డయానా ఫెర్రుస్ రాసిన I have come to take you Home కవిత గుర్తుకు వస్తున్నది.

నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను
నీకు గుర్తుందా
పెద్ద ఓక్ వృక్షం కింద పరుచుకొన్న ఆకుపచ్చ గడ్డి?
అక్కడి చల్లని గాలి , సూర్యుడు అక్కడ ఉండలేడు
నేను ఆ కొండ సానువుల మధ్య నీ కోసం పరుపును సిద్దం చేసాను.

నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను
అక్కడ నీ కోసం పాడతాను
నీవు నాకు శాంతిని తెచ్చావు కనుక
నీవు మాకు శాంతిని తెచ్చావు కనుక ..

డయానా ఫెర్రుస్ ఈ కవితను సారా బార్ట్ మాన్ కోసం రాసింది. ఆమె ఆఫ్రికా మూలవాసి అయిన సారా బార్ట్మన్ స్మృతిలో రాసింది.తన గడ్డ మీద పుట్టిన తన లాంటి మనిషి కోసం రాసింది. ఆ తన లాంటి మనిషి నూట యాభ ఏళ్ళకు పైగా ప్రదర్శనకు పెట్టబడిన ఒక స్త్రీ, డయానా దక్షిణ అఫ్రికాకు చెందిన కవయిత్రి….ఆఫ్రికన్ మూలవాసుల అస్తిత్వవాద ఉద్యమాలలో ఒక మేలుకొలుపు కవిత అది. బహుశా ప్రపంచ వైజ్ఞానిక చరిత్రలో సారా బార్ట్మన్ వంటి సందర్భం మరొకటి లేదని అనడం అతిశయోక్తి కాదు.

ఆఫ్రికాలోని గడ్డి భూముల మీద ఆధారపడి జీవించే ఖోయి ఖోయి ( Khoi Khoi ) ఒక స్థానిక జాతి. ఖోయి ఖోయి తెగకు చెందిన సారా 1789 లో జన్మిస్తుంది. గంటూస్ (Gamtoos) లోయ ఆమె జన్మ స్థానం. స్థానిక జాతులను చిన్న చూపు చూసే యురోపియన్లు వీరికి Hottentot అనే పేరును తగిలిస్తారు. ఈ పదమిప్పుడు నిషేదించబడిన పదం. ఆశ్చర్యకరంగా ఈ పదాన్ని సూచించిన Francois bernier అనబడే ఫ్రెంచ్ జాతీయుడు మన దేశపు మొఘలు చక్రవర్తి అయిన దారాషికోకు వ్యక్తిగత వైద్యడు , ఇతను ఔరంగజేబు కాలంలో దాదాపు పన్నెండు ఏళ్ళు మన దేశంలోనే గడిపాడు. 1684లో మొదటి సారిగా A New division of the Earth పేరుతో జాతుల మీద ఒక గ్రంథం రాసాడు.

ప్రపంచ దేశాలు యూరోపియన్ల హస్తగతమౌతున్న సంధి కాలంలో దక్షిణ ఆఫ్రికా డచ్ వారి చేతిలో చిక్కుకున్నప్పుడు ఏర్పడిన కాలనీ పేరు కేప్ టౌన్. ఆఫ్రికాలో కాలనీ ఏర్పరుచుకున్న డచ్ వారి చేతిలో అనేక ఆటుపోట్లకు గురైన అనేక కుటుంబాలలో సారా కుటుంబం కూడా ఒకటి. కేప్ టౌన్లో బతుకు కోసం చేసే పోరాటంలో తల్లిదండ్రులను, భర్తను పోగొట్టుకున్న ఆమె, హెండ్రిక్ సేసేర్స్ అనే తన యజమాని , అదే కాలనీలో పని చేసే డున్లోప్ అనే డాక్టర్ ద్వారా లండన్ చేరుతుంది. ఆమె అక్కడ చేసే పని , ఫ్రీక్ షో లో అంటే వివిధ రకాల జీవులను ప్రదర్శించే ఒక సర్కస్ లాంటి వేదికలో ప్రదర్శనకు నిలబడడం. జంతువులతో పాటుగా మనుషులను ప్రదర్శనకు నిలబెట్టవచ్చునన్న వారి ఆలోచన ఎంత హేయమైనదో కదా .

యూరోపియన్ లలో అత్యంత ఆదరణ కలిగిన ఈ ప్రదర్శనలలో ఈమెనే ప్రధాన ఆకర్షణ. అందుకు కారణం ఆమెకు ఉన్న ఎత్తైన పిరుదులు. అది ఆమెకు మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం కాదు. అది ఆ జాతి లక్షణం. ఆ లక్షణమే ఆమెను ప్రదర్శన కొరకు ఎంపిక చేసుకునే కారణమైంది. ఆమె అలా నాలుగేళ్ళు ప్రదర్శించబడినాక ఆమె యజమానులు ఆమెను ఫ్రాన్సుకు చెందిన సర్కస్ కంపనీ కి అమ్మేస్తారు. అలా ఇంగ్లండు నుంచి పారిస్ చేరుకుంటుంది. ఆమెను కొనుక్కున్నహెన్రీ టేలర్ , S. Reaux కు అమ్ముతాడు. ఇతను స్వయంగా జంతు శిక్షకుడు. ఆనోటా ఈ నోటా సారా విషయం పారిస్ రాజమహల్ దాకా చేరుతుంది. S. Reaux ద్వారా ఆమె పారిస్ రాజమహల్లో ప్రద్ర్శించబడుతుంది. పారిస్ రాజమహల్ ఆధ్వర్యంలో నడిచే ప్రదర్శనశాలలో సంరక్షుడిగా పనిచేసే జార్జెస్ క్యువియర్ (Georges Cuvier) కంటపడుతుంది . జార్జెస్ క్యువియర్ సామాన్యుడేమీ కాదు, శరీర నిర్మాణం మీద అప్పటికే అలుపులేని పరిశోధన చేస్తున్నవాడు. ఆయన విలువైన సేవలు ఆయనకు Founding father of Paleontology అని పేరు తెచ్చిపెట్టాయి. పారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ మీద చెక్కబడిన డెబ్భైరెండు ఫ్రాన్స్ గొప్పవ్యక్తుల్లో పేరు దక్కించుకున్న జీవ శాస్త్రవేత్త.

జార్జెస్ క్యువియర్ తన పరిశోధనలో ఏర్పడిన ఖాళీని పూరించే ఆశను సారా లో కనుగొంటాడు. ఆయన సారా జాతి ప్రజలు జంతువులకు , మానవులకు మధ్య పరిణామ క్రమంలో తెగిన లంకెగా గుర్తిస్తాడు. అతని పరిశోధనలు ఎముకల నిర్మాణం మీద ఆధారపడి చేసిన ఆధ్యయనాలు. సారా ఎత్తైన పిరుదుల వెనుక ఉన్న ఎముకల నిర్మాణం అయన ఊహకు ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికను బల పరిచే ప్రయోగాలు , పరిశోధనలు జరుగుతున్న క్రమంలోనే 1815 లో ఆమె మరణిస్తుంది. అప్పటికి ఆమె వయసు పాతికేళ్ళు మాత్రమే. ఎక్కడి గంటూస్ లోయ , ఎక్కడి పారిస్ నగరం ..ఆమె శరీర ప్రస్థానం ఆమె ఊహించి అయనా ఉండదు. అసలు భాష రాదు , తన ప్రపంచం కాదు , స్త్రీ సహజాతమైన దేహాభిమానం, లజ్జ ఆమెను బందీ చేసిన వికృత ప్రదర్శన ముందు ఓడిపోయాయి.

మరణాంతరం సారా దేహం నిలవ చేయబడుతుంది, జార్జెస్ క్యువియర్ పరోశోధనల ఆధారంగా ఆమె దేహపు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నమూనా , ఆమె దేహ భాగాలు ప్రదర్శించబడతాయి. పారిస్ నగరంలో Museum Of Man – Anthropology Museum in Paris లో 2002 వరకు దాదాపు నూటాయభై ఏళ్లకు పైగా సారా ప్రదర్శనకు నిలబడింది. ప్రపంచం యావత్తు స్వేచ్చ దిశగా మేల్కొన్నప్పుడు సారా దేహ ప్రదర్శనను వైజ్ఞానిక జాతివివక్షగా పేర్కొన్న ఆఫ్రికన్ ప్రజలు ఆమె దేహాన్ని తిరిగి స్వదేశానికి తేవడానికి సంకల్పిస్తారు. ఆ క్రమంలోనే డయానా ఈ కవిత రాసింది. అప్పటికె వెల్లువెత్తిన అమానవీయ ప్రదర్శనకు వ్యతిరేకంగా ఆమె దేహ భాగాల ప్రదర్శన నిలుపుచేబడినా తిరిగి ఆమె దేహాన్ని స్వదేశం రప్పించేదాకా వారు శాంతించలేదు. అయితే జార్జెస్ క్యువియర్ సారా విషయంలో చేసిన ప్రతిపాదనలు కొట్టివేయబడ్డాయి. అయినప్పటికీ అతని ఇతర పరిశోధనలు మాత్రం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడంలో విశిష్ట భావనను పరిచయం చేసాయి.

డయానా, నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని పాడుతుంది..అది ఆత్మ గౌరవపు మేల్కొల్పు. వారు కలిసి పోరాడారు. తమ దేహమే ప్రదర్శనకు ఉన్నట్టుగా బాధ పడ్డారు. వేలాది ఆఫ్రికన్ల ఆకాంక్షల ఫలితంగా 1996లో ఆఫ్రికా స్వతంత్రం పొందిన తర్వాత తొలి అధ్యక్షుని స్థానంలో ఉన్న నెల్సన్ మండేలా ఫ్రాన్స్ అధ్యక్షునితో సమావేశం అయినప్పుడు ఆమె దేహాన్ని తిరిగి ఆఫ్రికాకు చేరవేయాలని కోరాదడు. అటు మీదట ఆమె పార్థివ దేహం 2002లో తన స్వస్థలం చేరింది. 192 సంవత్సరాల తర్వాత చేరిన సారా దేహం ఆగస్టు 9న ఆఫ్రికన్ జాతీయ మహిళా దినోత్సవం రోజున Vergaderingskop కొండ మీద శాశ్వతంగా నిద్రించింది. సారా జ్ఞాపకంగా దక్షిణ ఆఫ్రికా పర్యావరణ పరిరక్షణ వెస్సెల్ కు సారా బార్ట మాన్ పేరును పెట్టారు.

సారా ఈ రోజు రాత్రి నా నిద్రను కమ్మేసింది. అనేక విచిత్ర జంతువుల మధ్య తనను తాను మరిచి పోయి , తన ఉనికే తనకు తెలియకుండా ఆమె ప్రదర్శించబడింది. చూసే వాళ్ళు అత్యుత్సాహంగా విసిరిన రాళ్ళ దెబ్బలను , టికెట్టు కన్నాఎక్కువ ధర ఇచ్చి తనను తాకాలని కోరుకున్న వాళ్ళను తట్టుకున్నది. జంతు శిక్షకుడు ఆమెను కొనుక్కోవడం ఊహించడానికే బరువెక్కితే, తన దేశానికి తన వారసత్వానికి దూరంగా మరెప్పుడూ చేరుకోలెనంతగా ఆమె విసిరివేయబడినప్పుడు ఈ రోజు నేను చుసిన చిరుత మొఖం లాగానే ఆమె చిన్నబోయి ఉంటుంది…ఆమె దుఖం, చీకటి అయిన తన స్వేచ్చా జీవితం లాగానే నల్లగా స్రవించి ఉంటుందా…సజీవంగానే ఆమె మూర్తిమత్వమంతా మరణించి ఉంటుంది.. పిల్లల కేరింతల నడుమ ముడుచుకు పోయిన ఎలుగుబంటి వలెనే ఆమె ముడుచుకు పోయి ఉంటుంది ….

శాస్త్రీయ నిరూపణల కోసం తెచ్చిన , వచ్చిన జంతువులు కూడా సారా వలెనె ప్రదర్శించబడినప్పుడు వాటి ఆత్మ అంతకు మించి ఎలా ఘోషించగలదు ? గజాల లెక్కన తన పాదాలు నడువాల్సిన నేలను కొలిచి కంచెనో , కందకాన్నో సరిహద్దును చేసినప్పుడు అంతకు భిన్నంగా ఎలా ఉండగలదు…ఇరుకు గదిలో తన విశాల మైన అడవిని కుదించుకోలేక చిన్నబోక ఎలా మనగలదు .. ఎలా మనసు పట్ట గలదు

సారా కోసం పోరాడినట్టు ఈ చిరుత కోసం మిగిలిన చిరుతల సమూహం రాలేదు …అవును తన కోసం వచ్చేవారు ఎవరూ లేరు..

చిరుత మొఖం మరింతగా జాలి గొలుపుతున్నది.. స్వేచ్చగా తిరుగాడిన నీదైన నేల మీద నీ అంతిమ యాత్ర రాసి పెట్టి లేదు.. అది మానవులనే వారి చేతలలో చిక్కి విల విల లాడుతున్నది …ప్రకృతి మీకు సమజాన్ని ఏర్పరుచుకునే తెలివిమాత్రమే ఇచ్చిది .. మరో లాటి తెలివి ఇవ్వలేదు ..ఇచ్చి ఉంటె డయానా ఫెర్రుస్ లా ఆత్మాభిమానం పొంగుతుండగా తన వాళ్ళ కోసం మీరు వచ్చేవారు .. నీ తోటి వారి కోసం మీ ప్రాణాల్ని ధారపోసే వారు ..మానవుడు తనకు దొరికిన అవకాశాన్ని ఇలా వాడుకుంటాడని ప్రకృతి ఊహించి ఉండదు..ఊహించి ఉంటె ఇంత మేధస్సూ ఒక్క జాతికే పోత పోయదు. అయితే తను ప్రసాదించిన మేధను ప్రకృతి వెనక్కి తీసుకోలేదు కానీ ముందుకు వెళ్ళకుండా ఆపగలదు ..తనను తాను అదృశ్యం చేసుకొని అంతర్ధానమై అంతులేని ఎడారి మధ్య నిలబెట్టగలదు…
ఆవేదన, సంవేదనల మధ్య కలమూ కాగితమూ తీసుకొని రాస్తున్నాను… ఎర్ర బడ్డ కళ్ళు వాలిపోతుండగా మసక మసకగా రాస్తూ పోతున్నాను… ఏదో రాసాను.. రాస్తూ కూర్చున్నాను.. అలాగే నిద్ర పోయాను..

ఉదయం లేచే సరికి రాసిన కాగితం మీదనే నా తల ఆనించి ఉంది..నిద్ర కళ్ళతోనే నేనే రాసిన వాక్యాలను చదువుకుంటున్నాను..

“ విశ్వాత్మను నేను .. మీలోనే ఉన్న అమానవున్ని ప్రశ్నిస్తుంటాను..అర చేతులనిండా అంటుకున్న చెంపల మీది ఉప్పునీటిని సాక్ష్యంగా పెట్టి నిలదీస్తాను..మీ నియమాల సంకెళ్ళు లో ఇమడని వ్యథ శాలల ఆత్మల ఘోష మిమ్మల్ని వెంటాడుతుండగా వెనక్కి తిరిగి తిరిగి చూస్తాను.. తనకు తానుగా మరణశాసనం రాసుకునే మానవజాతి వైపు సూటిగా చూపుడు వేలెత్తి హెచ్చరిస్తుంటాను …విశ్వాత్మను నేను …”

నా కనుబొమ్మలు ముడిపడుతుండగా నాలో ఒక సందేహం తచ్చాడుతున్నది

రాసింది నేనేనా..చిరుతనా…?

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి
జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి
7 months ago

ఎంత ఉత్సాహం
ఎంత ఉద్వేగం
ఎంతటి బాధ్యత
ఎంతటి సాహసోపేతమైన సహజ జీవనం
నిబద్ధతకీ-విజ్ఞానిబద్దతకీ
చక్కటి ముగింపు