సంపాదకీయం – వలస నడకలు – మానస ఎండ్లూరి

రహదారులే సముద్రాలై అంతులేని ఎదురీతను వలస కార్మికులకు సవాలుగా మారుతుంటే జీవితమంటే పోరాటం తప్ప మరేమీ తెలియని వాళ్ళు పయనమాపేసి వెను తిరుగుతారా? 

నడిచారు నడిచారు నడుస్తూనే ఉన్నారు… కంటికి కనిపించని శత్రువు పై యుద్ధం చేస్తున్నామంటూ మనందరం చేతులు కడిగేసుకుంటున్నాం. వలస వచ్చిన వారి గురించి ఆలోచించే కాసింత చోటు మన మనస్సులో లేకపోయింది. 

పొట్ట కూటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రాలు పేద ప్రజలు వలస వచ్చి చేతనైన పని చేసుకోడం భారత దేశమంతా ఉన్నదే. విపత్తులు వచ్చినప్పుడు గల్లంతయ్యేది, దిక్కు లేకుండా, గుర్తింపు లేకుండా మిగిలిపోయే వారిలో మొదట ఉండేది ఈ వలస కూలీలే. ఎన్నో సార్లు భవనాలు కూలి వీరు చనిపోడం, గాయాలు పాలు కావడం చూస్తుంటాం. ఎన్నో సార్లు వీరిని ఏ రాష్ట్రమూ ఆదుకోదు. ఉప్పెన లా వచ్చిపడ్డ కరోన కూడా వీరిపైనే విజ్రoభిస్తోంది. సొంత రాష్ట్రం లోనే ఉండే కూలీలు, చిరు వ్యాపారస్తులకు కనీసం నీడకు ఢోకా లేదు. వలస కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం. నెత్తిన, భుజాన సామాను సరంజామాతో చంకన చంటి పిల్లలతో ఎండలో వేల కిలో మీటర్లు కాలి నడకన ప్రయాణం ఊహకు అందనిది. 

అయితే తాజాగా భారత రైల్వే శాఖ అవసరమైతే రోజుకు 400 ప్రత్యేక రైళ్ళను నడిపిస్తామని తెలిపింది. కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ తమ రాష్ట్రంలో దేశ నలుమూలల నుంచి వచ్చిన 6.5 లక్షల వలస కూలీలు కాంప్స్ లో ఉంటున్నారని తెలియజేసారు. ఎంత త్వరగా ఎవరి ఊళ్ళకి వాళ్ళు సురక్షితంగా చేరితే మంచిది. వారికి తిండి నీరు మనసున్న ఏ మనిషన్నా పెడతాడు. వారిని వారి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కరోన మొదలైన వెంటనే విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి ప్రత్యేక విమానాల్లో పిలిపించి రెండు వారాల పాటూ  క్వారంటైన్ హోం లో ఉంచి ఢిల్లీ ముంబై ల నుండి ఎవరి రాష్ట్రాలకు వారిని ప్రభుత్వమే ప్రయాణ సౌకర్యాలు కల్పించి పంపారు. మరి ఇక్కడే ఉండే వాళ్లకు అంత ఖర్చు కూడా కాని వలస కూలీల ప్రయాణానికి ఎందుకని ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తుంది? పేదవారు ఈ దేశంలో ప్రతి విషయంలోనూ ప్రతి అడుగులోనూ నిర్లక్ష్యానికి గురి కావడం కొత్తేమీ కాదు. అయినా కూడా ఎప్పుడూ లేని ఈ క్లిష్ట సమయంలో వారి బాధను కళ్ళ ముందే చూస్తూ ఎలా మౌనం వహిస్తోంది ప్రభుత్వం అన్నది ఆశ్చర్యమే. 

ఒక పక్క ప్రముఖులు కొన్ని వేల కోట్ల రూపాయిలు ఇప్పటికే ప్రభుత్వాలకి ఇవ్వడం చూస్తూనే ఉన్నా ఆ డబ్బంతా ఏ రకంగా ఖర్చు అవుతుందో ఎవరికీ తెలియని ప్రశ్న. అయినా సరిపడా మాస్కులు కిట్లు లేవని పడుతున్న ఇబ్బందులు, జనాల ఇక్కట్లు గమనిస్తూనే ఉన్నాం. కేవలం ప్రత్యక్ష సహాయం అందుకుంటున్న ప్రజలు మాత్రమే కొంత వరకు బాగున్నారని వార్తలు చెప్పకనే చెబుతున్నాయి.  

పది రోజుల క్రితం పన్నెండేళ్ళ బాలిక కుటుంబంతో తెలంగాణా నుంచి చతీస్ ఘడ్ కు వంద కిలోమీటర్ల నడక పూర్తి చేసి మరో పదకుండు కిలోమీటర్ల దూరంలో ఇల్లు చేరుకునే సమయానికి అలసిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిరోజులకే బెంగుళూరు నుంచి చిత్తూర్ జిల్లా లోని రామసముద్రం రావడానికి దాదాపు 700 కిమీ. నడిచి ఊరు చేరుకునే సరికి ప్రాణాలు విడిచాడు ఒక నిరు పేద కార్మికుడు. ఊరి జనం అతనికి కరోన లేదని పరీక్షలు నిర్వహించి నివేదికను ఇచ్చేంత వరకు మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకోనే లేదు. ఇదంతా ఎంత వేదన ఎంత బాధ. ఇప్పటికైనా వీరికి ఒక సరైన దారి దొరుకుతుందని ఆశిద్దాం.     

-ఎండ్లూరి మానస.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Comments are closed.