జనపదం జానపదం-2ఆపద సమయాల్లో జానపదుల జీవన విధానం- తాటికాయల భోజన్న,

జానపదుల జీవన విధానం పట్టణ జీవన విధానాలకు చాలా తేడాలు కనిపిస్తాయి. జానపదులు పాటించే జాగ్రత్తల వలన వీరు అనేక రోగాలను దరిచేరనీయకుండా చూసుకుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభణలో సతమతమౌతున్న ప్రపంచం కొన్ని నియమాలను పెట్టుకొని అందరూ పాటిస్తూ రోగాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పూర్వకాలంలో జానపదులు ఆ కాలంలోని అంటువ్యాధులను, కట్టడి చేయడానికి, నివారించడానికి, వ్యాధులనుండి తప్పించుకోవడానికి ప్రస్తుతం ప్రపంచం అవలంభిస్తున్న విధానాలను ఆ కాలంలోనే పాటించి అంటువ్యాధులను దగ్గరకు రానివ్వకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. వాడి తదనంతర కాలంలో ఈ జాగ్రత్తలు ఒక సాంప్రదాయంగా ముందు తరాలకు అందించబడ్డాయి. అయితే అధిక జనాభా పెరుగుదల వలన పూర్వుల మాటలను చాదస్తంగా, మూఢ నమ్మకంగా, పస లేని మాటలు గా నేటి తరాలు నమ్ముతూ వారు చెప్పిన జాగ్రత్తలను పెడచెవిన బెట్టి అనేక సమస్యలను మూటగట్టుకున్నారు.

అంటువ్యాధులకు సంబంధించిన స్పృహ వేద కాలం నుండి ఉన్నట్లు తెలుస్తోంది. అధర్వణ వేదంలో ” రోగాలు నానాక్రిముల వలన వ్యాపిస్తాయి’’ (1.5,2.35) ఏ వేదజ్ఞానం లేని జానపదులకు తమను తాము రక్షించుకోవడం తెలుసు. వీరి జీవితంలో అతి జాగ్రత్తని మనం గమనించవచ్చు. ఇదే అధర్వణ వేదంలో ‘‘ సూర్య కిరణాల ద్వారా క్రిములు వినాశం జరుగుతుంది’’ (1.12,4.37). ప్రస్తుతం సూర్యకిరణాల ప్రస్తావన వినిపిస్తుంది. ఈ విషయం ఏనాడో వేదంలో చెప్పబడింది. జానపదులు నిరంతరం ఎండలోనే పనులు చెసుకుంటారు. కాబట్టి సూర్యకిరణాలు రోజాంతా వీరిపై పడుతూనే ఉంటాయి. దీనికారణంగా వీరి దేహం ఉక్కులా తయారవుతుంది, మరియు వీరిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాని పట్టణ నివాసాల్లో జీవించే ప్రజలు కనిసం రోజులో సూర్యుని చూడనివారు కనిపిస్తారు. కనీసం నాలుగు అడుగులు వేయడానికి చాలా మంది తటపటాయిస్తుంటారు. కాబట్టే రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక అంటువ్యాధులకు త్వరగా గురౌతున్నారు.

జానపదులు నిరంతరం మట్టిలో పనులు చేస్తుంటారు. చిన్న పిల్లలుసైతం మట్టిలోనే ఆటలు ఆడుతుంటారు. మరియు పశువులతో సహవాసం చేస్తూ వాటి పేడను, మూత్రాన్ని శుభ్రం చేస్తూ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను మొదలైనవి స్వీకరిస్తారు. అంతేకాకుండా ఒర్రె, వాగు, కాలువ, నది, చెరువులలో నల్లమట్టిని ఉపయోగిస్తు స్నానం చేయడం, అంబలి, చారు, తెల్లకల్లు, రసాలు, తాగడం, గైగడ్డ, కలబంధ గడ్డ, చేమగడ్డ, చింతవల్కాయలు, ముంజకామలు మొదలైన ఆయా కాలాల్లోని పండ్లను తప్పక తింటారు. మరియు పచ్చని వాతవరణంలో ఎక్కువగా గడుపుతారు. అనేక దేవతల పేర్లు చెప్పి అడవుల్లో పండగలు చేసుకుంటారు. ఉదా : పసుక తీర్థాలు, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, అరగొండల మొదలైనవి. వీటిలో వీరికే తెలియని అనేక శాస్తీయ అంశాలు దాగి ఉంటాయి. ఈ విధానాల వలన అనేక వ్యాధులు, అంటువ్యాధులు వీరి దరిచేరవు. నేటికి పల్లెల్లో జీవించే వారికి కరోనా వైరస్ వలన జరిగిన నష్టం తక్కువనే చెప్పవచ్చు. ఏవైన అంటువ్యాధులు ప్రబలితే దూరాన్ని పాటించడం, చనిపోతే ముట్టు, చనిపోతే కొన్నాళ్ళు ఇల్లు వదిలిపెట్టడం, గ్రామాన్ని వదిలిపెట్టడం చేస్తారు.

జానపదులు తాము సంపాదించుకున్న దానిలో కొన్నిపాళ్ళు గరిసె, గుమ్మి, కాగు, ఐరేని కుండ, బానలలో ధాన్యాన్ని దాచకుంటారు. డబ్బుని కూడా చాలా పొదుపుగా వాడుకుంటారు. ఇది కష్టకాలంలో వారికి భరోసనిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశాంత వాతావరణంలో ఎలా ఉన్నా ప్రళయంలో మాత్రం జానపదులు ముందుగానే మేల్కోని తగుజాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే మానవాళికి వారిచ్చే మార్గదర్శకత్వం.

– తాటికాయల భోజన్న,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.