భయం – అభయం !!!!!!(కవిత )-ఆర్ . వేణుమాధవ్

ఎటు చూసినా భయం భయం
భయం గుప్పిట్లో మనమందరం

నేతిరిగిన బాటల్లో సంచరించాలంటే కాస్త బెరుకు
ఏ వస్తువు తాకితే ఏమౌతుందో!
ఏ పుట్టలో ఏ పాముందోనని
మిత్రులతో కలవాలని మది ఆరాటపడున్నా !
భయం నన్ను లాగేస్తోంది..వెళ్ళద్దని

ఒకప్పుడు నాణ్యత చూసి కొనే వాళ్ళం
నేడు వ్యక్తిని చూడాల్సివస్తోంది
ఎపుడూ శుభ్రత చేయని వాటిని
ఇపుడు స్వచ్ఛత చేయాల్సివస్తోంది
కలివిడితనం పోయి
విడివిడిగా ఉండాల్సి వస్తోంది

మాస్కు లేనోళ్ళకు ఆమడ దూరం పోతున్నం
కొత్త వారితో కలిసేందుకు జంకుతున్నం
ఎవరైనా తుమ్మినా, దగ్గినా
దరిదాపుల్లో లేక పారిపోతున్నం
భయం నన్ను వెంటాడుతోంది

నీళ్ళచెంబుతో అమ్మ ఎదురొచ్చి నిల్చింది
సతీరత్నం శానిటైజర్ తో స్వాగతం పలికింది
బామ్మ ఒంటిపై బట్టల్ని విడిచి రమ్మంది
నాన్న ఏడ తిరిగావన్న ప్రశ్నల వర్షం కురిసింది

ఎవరికైనా కాస్తనలతుంటే హైరాన చేస్తున్నాం
ఇరుగుపొరుగు వారి పట్ల
ఆప్యాయత కురిపిస్తున్నాం
ఆప్తుల,బంధువుల కుశలము
వాకబు చేస్తున్నాం
భయం నన్ను పరుగు పెట్టిస్తున్నది

పులికి సైతం గిలి పెట్టించి
గుబులు రేపింది
ప్రపంచానికి వణుకు పుట్టించి
అపాయంలోకి నెట్టింది

మూసిన గుళ్ళలోని దేవుళ్ళే
రక్కసిని తరిమే వైద్యులైరి
నర్సులు తోబుట్టువులై
బాధితులను గట్టెక్కించిరి
దండించిన రక్షక భటులే
పోపొమ్మని దండమెట్టిరి
సఫాయికార్మికులే సిపాయిలై
క్రిమి పీచమణచ సన్నద్ధులైరి
ఈ నలురుగు అభయమివ్వగ

ఇంటగెల్ఛి రచ్చ గెలుచుట ముఖ్యమోరన్న,
ఇంటనుండి దేశాన్ని గెల్పించుట నీ బాధ్యతన్న
కాళ్ళు బయట పెట్టే కన్న
క్షేమంగా ఉండుట మిన్న
సమాజ శ్రేయస్సుకు
సామాజిక దూరం పాటించన్న.

-ఆర్ . వేణుమాధవ్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.