అరణ్యం 8 – గొల్లవంపులు -దేవనపల్లి వీణావాణి

అటూ ఇటూగా గత నెల నుంచీ విపరీతమైన క్షేత్ర సందర్శనలూ, సమావేశాలు… ఒత్తిడి అని అనలేను గానీ మడతలు విప్పుకున్న ఋతువొకటి నా కళ్ళముందు నుంచే హడావుడిగా వెళ్లిపోయినట్టు, ఆరుబయట నిలబడి అపురూపమైన వర్ణ చిత్రాన్ని చిత్రంచదలిచిన చిత్రకారుడు జోరువానలో తడిచి లక్ష్యం వంక జాలిగా చుసినట్టూ, వానాకాలం చుట్టూరా అల్లుకున్న నా ఆలోచనలన్నీ తడి లేని నేలలా బిగుసుకుపోయాయి. అక్టోబర్ రానే వచ్చింది. కొండ మీద నుంచి దొర్లుకుంటూపోతున్న గులక రాయిలా కాలం చేతుల్లోంచి జారి పోతూనే ఉంది.
ప్రవహించే నదికి ఒళ్లంతా కాళ్ళు
మండే మంటకు ఒళ్లంతా నోళ్ళు
వీచే గాలికి ఒళ్లంతా చేతులు
ఈ కారణం వల్ల గుహేశ్వరా
శరణులకు లింగమయమయ్య

ఈ పద్య రాజం నాకు, ఈమధ్యే తెలుగు భాషా సమితి అనే సంస్థ ప్రచురించి భారత భారతి పేరుతో తెచ్చిన విజ్ఞాన సర్వస్వంలో దొరికింది (1947లో తెలుగులో విజ్ఞాన సర్వస్వాల రచనకు, ప్రచురణకు గాను మద్రాసులో తెలుగు భాషా సమితి అనే సంస్థను అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరచింది . 1956 వరకు ఇది మద్రాసులో పనిచేసి ఆ తర్వాత హైదరబాదుకు మారింది. 1986లో తెలుగు విశ్వ విద్యాలయంలో విలీనం అయింది.) కన్నడ కవి అల్లమ ప్రభు గుహేశ్వర మకుటంతో రాసిన ఈ పద్యం ప్రవహించే నదీ , మండే మంటా, వీచే గాలీ వంటి నిర్జీవులన్నవాటికీ సజీవత్వాన్నిచ్చి ప్రకృతిలోని ప్రతి పదార్థపు గతి శీలతను కొనియాడుతూ భక్తి భావాన్ని ప్రకటించింది. ఒక క్షణం తను ముందుకు జరుగుతూ మరు క్షణానికి చోటునిస్తూ జరిగిపోతుంది. కాలం కొలతల్లో జరామరణాలు కలిగిన జీవులే కాదు అంతర్లీనపు నిర్జీవ వస్తు స్వభావం కూడా గతిశీలతను పొందుతోంది. మంచు పలకలు కరిగి నదిగా ప్రవహించడం.. రాళ్ళూ క్షయమై నేలగా మారడం బంటివి అందుకు నిదర్శనాలు . ఆ విధంగా చూస్తే ప్రవహించే నది తన కాళ్ళతో ప్రయాణిస్తూ , మండే మంట తన నోటితో స్వాహా చేసి , ఒంటి నిండా చేతులతో గాలీ పనిచేసి అవిశ్రాంత కాలాన్ని గణిస్తూ ప్రకృతి మీద ప్రకటితమవుతాయి. .

కాలాన్ని ఎలా గణించడం , కాలానికి ఉన్నఅంగాలేమిటి ? యే అంగాలు లేకపోతే ఒక స్థితి నుంచి స్థితికి మారే గతిశీలతను ఎలా పొందగలిగింది ? కాలంలోనే అన్నీ కలిసిపోయి ఉన్నాయి కనుక కాలం సజీవమని అనవచ్చునా , నిర్దిష్ట అంగాలు కలిగి జరామరణాలు ఉండి తన తరాన్ని సృష్టించలిగినదే సజీవమని అనబడుతుంది కనుక దేహానికి ఉండేలాగా కాలానికి అవేవీ లేవు కనుక నిర్జీవమా? మన సూర్యునికి ఆద్యంతం ఉంది, ప్రకృతికి ఆద్యంతం ఉంది , పరిణామ క్రమమే కాలం సృష్టించే తరమైతే పంచ భూతాలు తన అంగాలు అనుకుంటే అప్పుడు కాలం సజీవమే అవుతుందా ?! హెరాక్లేటస్ , పార్మేనిడీస్, హెన్రీ బెర్గ్ సన్ లకు తోచి ఉండదు..కాలం కదులుతుందని , కాలం కదలదని వాళ్ళు వాదించు కుంటారు , కాలం ప్రవాహమని , అవిచ్చిన్న ధార అనీ ఎప్పటికీ పూర్తి కాలేని విచారమనీ రాశీ భూతమైన కాలం లో అక్కడక్కడా తళుక్కుమనే మెరుపులే జ్ఞాపకాలని ఎన్ని సిద్దాంతాలు రాసుకుంటారు. కాల ప్రవాహం మీద ఎన్ని తర్కాలు ..! వాళ్ళు ఏదో ఒకటి తేల్చివేస్తారు , అన్వయిస్తారు, ఒక్కో సిద్ధంతంలో ఒక్కో ఊహ, నాకు కూడా అటువంటి ఊహే తట్టి ఉంటుంది కావచ్చు .. ఏమో.. అయ్యి ఉండవచ్చు ..అందువల్లనే ఈనాడు ఇలా తాత్విక వచనాలు నా కలం నుంచి కాగితం మీదకు ఒలికిపోతున్నాయేమో.

అడవికి కాలం తెలుసా అని అనుమానం అక్కరలేదు , తెలుసుగనకనే భూత , భవిష్యత్ , వర్తమాన కాలాలుగా విడిపోయిన కాలం , చెట్టు భాషలో నిన్న నిలదొక్కుకున్న వేరు , నేటికి పూవు , రేపటికి విత్తనం. అంతేకాదు అడవి, కాలాన్ని ఏక మొత్తంగా వ్యక్తీకరిస్తుంది. తనతో కలిసి ఉన్న జీవులన్నింటినీ కలుపుకొని తనకు తానుగా ఋతు స్పర్శ రూపంలో వ్యక్తీకరించుకుంటుంది. అటువంటి చోట మానవుడు ఉన్నట్లయితే ఆ సందర్బాన్ని గుర్తించినట్లైతే అది అతని స్మృతి లో తళుక్కుమనే జ్ఞాపకంలా మెరుస్తుంది. తత్వవేత్తల కాల పరిశీలన ఎలా ఉన్నా అలా గుర్తించిన ఒక్క కళాకారుడు మాత్రం తన దివ్య చక్షువుతో నిమిత్తమైన క్షణానికి శాశ్వతత్వ్వాన్ని జోడిస్తాడు. తానొక్కడే అనుభవించిన ఆ తళుకును కాల పరీక్షకు ఎదురు నిలిచే కళాఖండంగానో , సాహిత్యంలోనో నిలుపుతాడు. అలా అతను నిర్జీవమైన వస్తువును సజీవం చేసి తాను మరణించినా భావ స్పృహ పొందిన ప్రతి హృదయంలోనూ జన్మిస్తూంటాడు..ఇలా తాత్వక లోచనాలని తెరిపిస్తుంటాడు. ఇప్పటి ఈ పద్యంలా ఎక్కడికో లాక్కువెళ్తాడు.. అల్లమ ప్రభు ఈ కాలంలో ఉంటే ఏమి రాసేవాడో, ప్రతి పదార్థంలోనూ దివ్యత్వాన్ని దైవత్వాన్ని దర్శించే ఇలాటి వారిని శాశ్వతంగా పొదుముకున్నది కనుకనే ఈనాటికీ కదళివనం ఒక దివ్యమైన అరణ్య శోభను కలిగి కాలుష్య కాసారలైన మానవ సమూహాల మధ్య గంధపు చెక్కలా నిలిచి ఉంది. నిజానికి నేను ఈ సెప్టెంబర్ మాసంలో కదళీవనం ( నల్లమల అడవులు ) వెళ్ళాలని అనుకున్నాను. ఈ సమయంలో స్వచ్చమైన అడవిలో ఎన్నో విశేషాలు చూడవచ్చుకనుక. కానీ వీలుపడే అవకాశం లేక వచ్చే యేటికి అనివార్యంగా వాయిదా వేసుకున్నాను.

ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త హేరాక్లిటస్ (Heraclitus) “యే మనిషీ ఒకే నదిలో రెండు సార్లు అడుగు పెట్టలేడు ఎందుకంటే అది ఒకే నది కాదు అతను ఒకే మనిషీ కాదు (No man ever steps in the same river twice , for its not the same river and he is not the same man)” అని రాసాడు. ఈ వాక్యాన్ని అనేక సార్లు అనేకులు తమ రాతల్లో ఇముడ్చుకోవడం నేను గమనించాను. కొందరు యే మనిషీ ఒకే నదిలో రెండు సార్లు స్నానం చేయలేడు అని కూడా అనువదించుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే మార్పు అనేదే. క్షణం మారినా అన్నింటి స్వభావం మారుతందని చెప్పడమే. హేరక్లిటసే మరొక చోట ప్రకృతి తనను తాను దాచుకోలేదనీ (Nature is Wont Hide Herself ) రాశాడు. తనను తాను దాచుకోలేని ప్రకృతి మారే కాలానికి తానూ మారుతూ క్షణ క్షణమూ మారిపోతుంది. అందువల్ల యే మనిషీ ఒకసారి చుసిన అడవినే మళ్ళీ చూడలేడు, ఎందుకంటే అది ఒకే అడవి కాదు అతను ఒకే మనిషీ కాడు అని నేను అన్వయిస్తాను. ఇది నా ప్రత్యక్షానుఅభావం కూడా. రోజూ చూసే అడవే అయినా యే రోజు కా రోజే కొత్తదీ ప్రత్యకమైనదీనూ. నేను యే అడవి కాలాన్ని ప్రత్యేకమని అనుకుంటానో ఆ కాలాన్ని ఈ సారికి అనుకున్నంతగా దర్శించలేకపోయాను. వానాకాలంలో వికసించే పత్ర పుష్ప ఫలాలు , వాటి మీద కనిపించే జీవులు ఆ ఋతువుకే ప్రత్యకమైనవి. ఋతువుల్లోని గుణశీలత జీవుల్లో కనిపించడమే ఆ ప్రత్యేకత.

మా బృందం మళ్ళీ యథావిధి పనుల్లో మునిగిపోయింది. ఈ నెలలో ముఖ్యమైన పని వన్యప్రాణి వారోత్సవాల నిర్వహణ. అది రేపటి నుంచి మొదలు చేయవలసి ఉంది. గాంధీ జయంతి నుంచి మొదలుకొని వారం రోజుల పాటు వన్యప్రాణి సప్తాహం జాతీయ స్థాయిలో నిర్వహించడం విధిగా వస్తున్నది. 1972లో మొదటి సారి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ ఏర్పడినప్పటి నుంచి వన్యప్రాణుల పట్ల సమాజంలో ఒక అవగాహన పెంచి వాటిని సంరక్షించుకోవడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం ఇందులో ప్రధాన భాగం.మన రాజ్యాంగంలో 51A వ అధికరణ ప్రకారం ఒక ప్రాథమిక వన్యప్రాణుల సంరక్షణ ఒక విధి. అంతేకాక రాజ్యాన్ని ఆదేశించే ఒక ఆదేశిక సూత్రం కూడా. ఇందులో భాగంగానే సభలు ,సమావేశాలు ,ఉత్సవాలు , పోటీలు వంటివి వివిధ సామాజిక స్థాయిలలో అంటే విద్యార్థులకు, అధ్యాపకులకు , గ్రామస్తులకు ప్రతి ఒక్కరికీ వణ్యప్రాణుల పట్ల సహానుభూతిని , బాధ్యతను తెలియజేయడం కొరకు నిర్వహిస్తారు. తద్వారా రాజ్యాంగం సూచించిన విధంగా పౌరులను సిద్దపరచడం అనే అంతర్లీన లక్ష్యాన్ని నెరవేరుస్తారు. ఈ సారి మా వద్ద కూడా అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ రోజు గోవిందాపూర్ వెళ్తున్నాం. ఇదీ నర్సంపేట పరిధిలోనిదే. ఈ బీటులో కొంత మాత్రమే చిక్కని అడవి ఉంది. గ్రామస్తులు తమ పశువుల కోసం చిక్కని అడవిని ఆక్రమణలకు వ్యతిరేకంగా కాపాడుకోవడానికి తీర్మానించుకొని కాపాడుతూ వస్తున్నారు. లేక పోతే దాదాపు వంద హెక్టార్ల విస్తీర్ణం గల ఈ చిన్న అడవి ముక్క కూడా ఆక్రమణల బారిన పడేదే. పక్కనే కాపుకు వచ్చిన నీలగిరి వనం ఉంది. అది అటవీ శాఖ వారు పెంచిందే అయినా దానిని ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉందన్న కారణం చేత, ఫలసాయం తీసుకోకుండానే వదిలిపెట్టారు. విస్తీర్ణంలో చిన్నదే అయినా ఇక్కడ అడవి జిగిబిగిగా అల్లుకున్న తీగ మోదుగలతో , టేకు పిలకల్తో చిక్కగా ఉంది. లోలోపలికి వెళ్తున్నాం. జూలై మాసంలో ఇక్కడి వచ్చినప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటిగా ఉన్న ఇల్లంత చెట్ల నిండా వర్ణించడానికి అనుపమానమైన సీతాకోకచిలుకల్తోటి ముసురుకుంటున్న దృశ్యం ఇప్పుడు లేదు. దాదాపు పదికి పైననే సీతాకోకల రకాలను గుర్తించాను అప్పుడు. ఆ చెట్టు తేనె వాటికప్పుడు ఎంతమధురంగా తోచిందో. ఇప్పుడు అవ్వన్నీ మరణించి ఉంటాయి. వాటి తరువాత తరం యే చెట్ల మీదనో గొంగళి పురుగులై ఉండి ఉంటాయి. కొన్ని అప్పుడే పుట్టిన పక్షి పిల్లల ఆకలి తీర్చి ఉంటాయి. కొన్ని మాత్రమే మరో జీవిత చక్రాన్ని సృష్టించడానికి మిగిలిపోయి ఉంటాయి..

ఒక చోట భూమిని ఆనుకొని పంగ ఉన్న చెట్టు దగ్గర పూజ చేసినట్లు తెలుస్తుంది. పసుపు, కుంకుమ, చీర, రవిక ముక్క ఇంకా కొన్ని ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టి ఉన్నాయి. దగ్గరలోనే ఉన్న ఉఉరి వాళ్ళు ఎవరైనా ఈ పని చేసి ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఇటువంటివి కనబడడం మాములే. కోతులు తప్ప మరో పెద్ద జంతువు కనిపించలేదు. అటవీ అక్రమణలను నిరోధించడానికి అటవీ భూభాగ పరిధి చుట్టూ తవ్విన కందకం గట్టు మీద దోసిటి వెడల్పుతో హృదయాకరపు పత్రాలున్న మొక్క, దానిని చెన్న గడ్డ (Air Potato , Air yam, Potato Yam , Diascorea bulbifera ) అంటారు. ఇది ఆఫ్రికాలో పుట్టి, తర్వాత ప్రపంచమంతా విస్తరించింది. దీనిలో ఉన్న డైసోజెనిన్ ( Disogenin)అనే పదార్థం స్టీరాయిడ్స్ ను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని నేనెప్పుడు తినలేదు కానీ చిలగడ దుంప లాగా ఉడికించుకొని తినడం ఈ ప్రాంతంలో వాడుకలో ఉంది. ఉడికించడం వల్ల వగరు పోతుందని అంటారు. ఆదివాసీల ఆహారంలో ఇదీ ముఖ్యమిందే.

అక్కడక్కడా కొట్టేసిన మోదుగు చెట్లు ,వాటికీ సమానంగా పచ్చబడుతున్న రేగు పొదలు నేల మీద పచ్చదనాన్ని సమతూకంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడి నేలలో ఇనుప ఖనిజం పాలు ఎక్కువ , పొడిబారిన మట్టిని వానచినుకులు తరలించుకుపోతే నున్నటి రాళ్ళు చిన్న చిన్న ఇనుప గోళీల వలె తేలి ఎండ పొడకు మెరుస్తున్నాయి. ఏమీ లేని చోట పిల్ల దారికి పక్క పక్కలుగా వాన నీటి ప్రవాహానికి అనుగుణంగా ధార కట్టిన ఈ రాతి గుళికలు పచ్చని కాన్వాసు మీద ఈస్ట్ మన్ రంగు దారి తామే అయ్యి మిల మిల మెరవడం మట్టిపరుపులో ఒక విన్యాసం. నా కాళ్ళకి ఉన్న షూస్ తీసి ఆ గుళికల మీద ఉంచాను. అది గోరువెచ్చని స్పర్శ, పసిబిడ్డకు స్నానం చేయిస్తున్న అమ్మ, వేడి నీళ్ళు చల్ల నీళ్ళు కలిపి కలిపి పోసే వేడి నీళ్ళ స్పర్శ..చల్లగా వీస్తున్న అడవి గాలి మధ్య పాదాన్ని వెచ్చబరుస్తున్న స్పర్శ. ఇదే ఎండాకాలం అయితే ఈ సుతిమెత్తని వెచ్చని స్పర్శే గరుడ పురాణం నేను ఇంకా చదవలేదు కానీ అందులో చేర్చ దగ్గ శిక్ష అవుతుంది ! మరలా చేతితోతాకి చూసాను. అరచేతి పాదం కన్నా కొంత సున్నితం కనుక ఇంకొంచం వెచ్చగా తాకాయి. చిన్నగా నవ్వుకున్నాను.

Live in the sunshine
swim in the sea
drink the wild air’s salubrity

అని ప్రసిద్ద అమెరికన్ కవీ,రచయిత, తాత్వికుడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ( Ralph Waldo Emerson)తను రాసిన Merlin’s song అన్న కవిత లో రాశాడు .(May day and other pieces, 1867 ). ఏదైనా అనుభవించి చూస్తేనే కదా తెలుస్తుంది. అలా అనుభవించమనే ఎమర్సన్ సూచన చేశాడు. నేను అదే ఇప్పుడు చేసాను. అతను అలా చెప్పకపోతే గులకరాళ్ళను స్పర్శించి చూడాలనే స్పృహ నాకు వచ్చి వుండేది కాదేమో. ఎమర్సన్ , 18వ శతాబ్దంలో ఇంగ్లండ్లో ఊపిరి పోసుకున్న Transdentalism అనే తాత్వక భావనకు మూలస్థంభం వంటి వాడు. అటు తర్వాత అమెరికాకు చేరిన Transdentalism జాతి వివక్షకు వ్యతిరేకంగా అనేక మెదళ్ళను కదిలించింది. Transdentalism, ఒకానొక దివ్యత్వం, సకల ప్రకృతిలోనూ , మానవునిలో వ్యాపించి ఉందని దాన్ని ఎరుకపరుకోవడం ద్వారా శాంతిని పొందవచ్చని ప్రకటించే భావన. ఇంద్రియాతీత శక్తి ఒకటి, జీవం అన్న ప్రతిదానిని అపురూపంగా మలిచి నియంత్రిస్తున్నదనీ ప్రతిపాదిస్తుంది. నాకు ఎమర్సన్తో పరిచయం అబ్దుల్ కలాం రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ లో ఆయన రాసిన బ్రహ్మ కవితను ఒక సందర్భంలో పేర్కొనడం వల్ల కలిగింది . తెలుగులో విజేత ఆత్మకథ పేరుతో వాడ్రేవు చినవీర భద్రుడు ఆ పుస్తకానికి చేసిన హృద్యమైన అనువాదం చేసారు. ఆ కవితా పంక్తుల పట్ల నేను ఎంతగానో ప్రభావితమై ఎమర్సన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసాను. నిజం చెప్పాలంటే నేను ఒకసారి ట్రైన్లో వెళ్తూనప్పుడు చదివాను. అప్రయత్నంగా నా కళ్ళు తడిసిపోయాయి. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేకానేక సంఘర్షణల్లో పడి కొట్టుకు పోయినప్పుడు కాసేపు నిలిచి ,తరచి విశ్లేషించుకొమని చెప్పినట్టుగా ఒక ఓదార్పు నా కళ్ళని తడిపేసింది. ఎమర్సన్ రాసిన ఈ ప్రసిద్ద బ్రహ్మ కవిత ప్రత్యక్షంగా ఉపనిషద్ వాక్యమే . అది కటోపనిషద్ లో ఇంతకు ముందే చెప్పబడిన మంత్రమే. ఆ మంత్రాన్ని వివరిస్తూ నండూరి రామమోహనరావు తన విశ్వ దర్శనం లో ( మొదటి భాగం ; పేజీ 168) ఇలా రాసారు..

హంతా చేన్మన్వతే హంతుం
హతశ్చే న్మన్యతే హతమే
ఉభౌతౌ న విజానీతో
నాయం హంతి న హన్యతే (2-19)

హంత అయిన వాడు తాను వదిస్తున్నాని అభిప్రాయ పడినట్లయితే అలాగే హతుడైన వాడు తానూ నిహతుడనైనానని భావించి నట్లయితే , ఉభయులు కూడా పొరబడుతున్నారన్నమాటే. నిజానికి అది చంపేదీ కాదు . చంపబడేది కాదు.
దేశ , కాల ప్రయోజనాలకు అతీతంగా ఒక సమున్నత భావాన్ని స్వీకరించగల, ప్రచారం చేయగల తాత్వకుల దార్శనికతను కూడా ఈ సందర్బం స్పష్టం చేస్తుంది.

నేను పూర్తి కనితను సంపాదించి మళ్ళీమళ్ళీ చదువుకున్నాను. ఎమర్సన్ శీర్షిక పెట్టినట్టు బ్రహ్మ అనేది త్రిమూర్తుల్ల్లో ఒకరైన బ్రహ్మగురించి కాదు , పోతన భాగవతంలో గజరాజు చేత చెప్పించిన ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలోపల నుండు లీనమై యెవ్వనియందుడిందు బరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వ డనాదిమధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్ అన్న బ్రహ్మమ్ గురించి…ఆ బ్రహ్మం ఎవరికి చెందుతాడో ఎవరికీ తెలియదు. ఇంతకన్నా గొప్పగా ఇంద్రియాతీత శక్తిని యే లౌకిక పదాలలో ఒదిగించగలం ! ఎంతో బరువైన తాత్వికత నిండిన ఎమర్సన్ బ్రహ్మ కవితను నేను స్వేచ్చనునువాదం చేశాను. అది ఇలా ఉంటుంది…

ఒక వేళ చంపేవాడు తాను చంపుతున్నాడనుకున్నా
లేక చంపబడేవాడు తాను చంపబడుతున్నానని అనుకున్నా
వారికింకా సూక్ష్మ గమ్యాల లయ తెలియలేదనే అనాలి
నేను నిత్యాన్ని, నిరంతర వాహిణిని ,పునరాగమనాన్ని

నేను దూరంగా ఉన్నానని అనుకుంటారో లేక
సమీపాన్ని మర్చిపోతారో గాని
నాకు వెలుగు నీడలు రెండూ ఒకటే
అదృశ్య దైవాలూ ప్రత్యక్షులే
ఇంకా నాకవమానాలు , యశస్సులు ఏక రూపులే

వాళ్ల… అనారోగ్య దేహాల నుంచి
బహిష్కృతుడనైనప్పుడు
ఎగిరిపోయే వాళ్ళ రెక్కలు నేనే
నేనే సందేహాన్ని , సందేహించే వాణ్ని
బ్రాహ్మణుడు పాడే ఆ శ్లోకమూనేనే

ఉత్క్రుష్ట దైవాలు నా నివాసం కోసం
దేవదారు వృక్షాలవుతాయి
అయినా ఆ దేవదారు వృక్షాలు
సప్తఋషుల * స్థానం పొందలేదు
అయినప్పటికీ…
సదా సద్విషయానురక్తుడవైన నీవు
నన్ను తెలుసుకో
నీ పురోగమనమంతా స్వర్గతుల్యమవుతుంది…

( గ్రీకులు కూడా సప్త విజ్ఞానులు (Seven Wise men) కలిగి ఉన్నారు కానీ వారు తాత్వికులు , ఎమెర్సన్ పేర్కొన్నది భారతీయుల సప్తఋషులు అని గమనించాలి )

అవును నేను అదే చేస్తున్నాను.. ప్రకృతిలో నిండిన ప్రతి అణువును అనుభూతి చెందడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు గాలిలో ఎగురుతున్న సీతాకోక చిలుకా, ఎండకు మెరుస్తున్న ఈ గుళకరాయి ఒక్క లాగే కనిపిస్తున్నాయి. తమ తమ విధ్యుక్త ధర్మాలను అనుసరించి ఒక దీర్ఘకాల విన్యాసంలో భాగమైన తీరును నేను గమిస్తున్నాను. సూక్ష్మ గమ్యాల లయను తెలుసుకుంటున్నాను… ఎమర్సన్ చెప్పిన ఆ బ్రహ్మమ్ ప్రకృతేనా..!?

గులకరాయిని పిడికిట్లో ఉంచుకొని షూస్లో కాళ్ళు దూర్చి వెళ్తున్నాను. గులకరాయి వెచ్చదనం తగ్గుతున్నది.

ఎమర్సన్ Nature అన్న పుస్తకం రాసాడు. అది నలభై ఎనిమిది పేజీల చిన్న పుస్తకంగా వచ్చిన వ్యాస సంపుటి. అదే ఆదిగా Transdentalism ఊపిరి పోసుకుంది. ప్రకృతిని , వినియోగ వస్తువుగా, సౌందర్యంగా , భాషగా , క్రమశిక్షణ, ఆదర్శవంతంగా , ఆత్మికతకు ఆలంబనగా వివరిస్తాడు. వ్యాసాలన్నీ చిక్కటి భావాలతో మానవాతీత నిమితత్తను ప్రతిపాదిస్తాయి. మన దేశపు నోబెల్ కవి రవీంద్రుని గీతాంజలిలో ప్రవహించిన దివ్యత్వమంతా ఆ కోవ లోనిదే. ప్రపంచవ్యాప్తంగా ఎమర్సన్ గుర్తించబడ్డాడు. ఎందరినో ప్రభావితం చేశాడు. అయితే ఎమర్సన్ను ప్రభావితం చేసింది మాత్రం భారతీయ వేదాంతమే !

మధ్యాహ్నం కావస్తుంది. మేకలని తోలుకు వెళ్ళే వాళ్ళు చద్ది మూటలు విప్పే సమయం …అటూ ఇటూగా రెండూ రెండున్నర. మేమూ తినవలసి ఉంది. ఏమీ తెచ్చుకోలేదు ఇవ్వాళ. పెద్ద అడవి కాదు కనుక కాస్త ఆలస్యమైనా నర్సంపేటకు వెళ్ళాకనే తినాలని అనుకున్నాం. మావాళ్ళు నా వెనకాలే వచ్చి కొంత దూరంలో నా నుంచి పక్క పక్కగా అడవిలోకి వెళ్లారు. అక్కడ ఉన్నవారి వద్ద నుండి గొడ్డలి తీసుకోవడానికి ప్రయత్నిస్తూన్నట్టున్నారు. మాటలు పెద్దగా వినబడుతున్నాయి. నేను అక్కడున్న టేకు చెట్టు కింద నిలబడ్డాను. అది ఇంతకుముందే కొట్టి వేస్తే మళ్ళీ పిలకలు వేసిన చెట్టు. పిలకలు కూడా పెద్దవైపోయాయి. అటవీ హక్కు చట్టం అమలు కాలంలో స్థానికులు అవగాహనారాహిత్యం తో నరికివేసిన చెట్టై ఉంటుంది. పిలకలు గుంజల సైజులోనే ఉన్నాయి. ఇప్పుడు గొడ్డలి కలిగి ఉన్న వ్యక్తి ఈ టేకు పిలకలకోసం వచ్చిన వ్యక్తి అయ్యి ఉండకపోవచ్చు. పిలకల పరిమాణం ఎందుకూ ఉపయోగపడేది కాదు. గొల్ల వంపుల చేస్తున్న వ్యక్తి అయి ఉండవచ్చు. గొల్ల వంపులు అంటే మేకలు తినడం కోసం కొమ్మ మేత ( Browsing ) , అవి తినే చెట్ల కొమ్మలను వాటికి అందే విధంగా చిన్న గొడ్డలితో చెట్టు నుంచి వేరు పడకుండా ఒడుపుగా గొడ్డలితో దెబ్బ వేసే చెట్లన్నమాట. పందిరి గుంజ పరిమాణంలో కొమ్మలను ఇందుకు ఎంచుకుంటారు. అంటే గొల్ల వారు గొడ్డలిని ఉపయోగించి చెట్లను , చెట్ల కొమ్మలను మేకలకు అందే విదంగా వంచటం అన్నమాట. అలా వంచడం వల్ల మేకలు సులభంగా ఆకులని అందుకుంటాయి. వంచిన కొమ్మకు తల్లి చెట్టు పూర్తిగా సంబంధం తెగిపోదు గనుక మళ్ళీ చిగిరించి ఆకుల్ని వేస్తుంది. గొల్లవారు మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చే సరికి మళ్ళీ చిగురించిన ఆకులు మేకలకు అందుబాటులో ఉంటాయి. అయితే అది చెట్లకు మంచి చేయదు. ఇలా వంచబడిన చెట్లకు ఇక నిటారు కాండం రాదు, అన్ని సార్లూ కొమ్మలు మళ్ళీఆరోగ్యంగా పెరగవు.

గొల్ల వారిలో అడవిని నష్టపరచాలన్న దురుద్దేశ్యం లేకపోయినా ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న ఒక మోస్తరు అడవిని కాపాడుకోవడం ఒక సమస్య అయితే మేకలు తిన్న చెట్లు వాటి లాలాజలంలో ఉన్న రసాయనాల ప్రభావానికి గురై గిడసబారి పోవడం మరొక అంశం. ఇంకా మేకలు ఇలా కొమ్మలు తినడం వల్ల పూత దశలో ఉన్న చెట్లు వాటి సంతతిని వృద్ధి చేసుకోవడంలో ఆటంకం కలుగుతుంది. పరిశోధనల ప్రకారం మేకల కొమ్మమేత అటవీ వృక్ష సంవిదానంలోనే మార్పు తేగలదని నిరూపించబడింది. అందువల్ల గొర్రెల కన్నా మేకలు అడవికి చేసే నష్టం ఎక్కువ. గొర్రెలు , మేకలూ రెండూ అడవిలో తినేవే అయినప్పటికీ గొర్రెలు తినే విధానాన్ని గడ్డిమేత ( Grazing ) అంటే నేలకు అంటి పెట్టుకుని ఉండే మొక్కలని తినడం అనీ మేకలు తినే విధానాన్ని కొమ్మ మేత ( Browsing )అంటే తల పైకేత్తి అలా అందిన కొమ్మలను తినడం అనీ అంటారు. అంతేకాదు మేకలను ఉపయోగించి ప్రమాదకరంగా పరిణమించిన కొన్ని మొక్కల జాతులను నివారించే ప్రయత్నాల మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి . ఒకవేళ అందులో ఫలవంతమైతే కలుపు నాశకాల దుష్ప్రభావం లేకుండానే సహజ ఉద్బీజాల సంరక్షణ చేపట్టవచ్చు, హానికారక మొక్కలను నియంత్రించవచ్చు.

అటవీ చట్టం ప్రకారం ఒక ప్రాంతాన్ని రక్షిత అడవిగా ప్రకటించేటప్పుడు స్థానికులకు వారి వారి పశువులను అడవి ద్వారా పోషించుకునే అవకాశం కల్పించబడుతుంది. ఇలా చట్టపరమైన అవకాశం కల్పించడం ఉత్తరాది రాష్ట్రాల్లో అమలులో ఉన్నది. అక్కడ గడ్డి మేత కొరకు ప్రత్యేక విధానం అమలులో ఉంటుంది. అది కూడా గడ్డి మేత కొరకు ఉద్దేశ్యించిందే కానీ కొమ్మమేత మీద మాత్రం పూర్తిగా నిషేధం ఉన్నది. మన రాష్ట్రంలో గడ్డిమేత కొరకు అటువంటి వెసులుబాటు మన ప్రాంత అడవుల స్వభావాన్ని బట్టి ప్రత్యేకంగా కల్పించకపోయినా స్థానికులు అడవిలో జీవాల పోషణకు రావడం మామూలే. అందులోనూ ఈ మధ్యే ప్రభుత్వం ప్రారంభించిన పశుపోషణ స్వయం ఉపాధి పథకానికి అడవిలో పశువుల మేత కొరకు కొంత భూభాగాన్ని ఆయా సందర్బాన్ని ప్రాంతాన్ని , అడవి బట్టీ కేటాయించారు. అయినప్పటికీ అడవిలో గొడ్డలిని కలిగి ఉండి సంచరించడం , అనుమతి లేకుండా రక్షిత అడవిలోకి ప్రవేశించడం అటవీ చట్టం ప్రకారం నేరం కనుక అందులోనూ ఎవరు యే ఉద్దేశ్యంతో అడవిలోకి వస్తున్నారో మనకు తెలియదు కనుక గొడ్డల్లను స్వాధీనం చేసుకోక తప్పదు. ఇలాచేయకపోతే అడవిని రక్షించుకోవడం సాధ్యం కాదు. అటవీ శాఖ అనేక సందర్భాల్లో అటవీ పరిసర గ్రామాల ప్రజలకు గడ్డి మేత, కొమ్మ మేత గురించిన అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడ్డళ్ళతో అడవిలో తిరుగుతూ కనిపిస్తుంటారు , మేము స్వాధీనం చేసుకుంటాం. ఇక్కడా అదే జరిగింది. స్వాదీనం చేసుకున్న గొడ్డళ్ళతో మా వాళ్ళు జీపు వైపుకి వస్తున్నారు. పశువుల కాపర్లను హెచ్చరించి వదిలివేసినట్టున్నారు. అందరం తిరిగి వెళ్ళవలసి ఉంది. గొడ్డళ్ళను జీపులో వేసేసారు. తిరిగి వెళ్ళే సమయం వచ్చేసింది. కాసిన్ని మంచి నీళ్ళు తాగి , ఇంకొన్ని మొఖం మీద జల్లుకొని జీపు ఎక్కేసాం.

దారి మీద అక్కడక్కడా గొర్రెలు , మేకలు మందలు మందలుగా వెళ్తున్నాయి. చిన్నవీ, పెద్దవీ , కొన్ని పొట్టేల్లు మే ..మే.. అంటున్న చిన్న అరుపుల్తో అందరూ వస్తున్నారా అంటూ తలో కేకా వేసినట్టు వెళ్తున్నాయి. అక్టోబర్, నవంబర్ జీవాల ఈత కాలం. ఒక మేకల మంద చివర , కాపరి చేతిలో ఒక మేక పిల్ల… మే.. అంటుంటే దాని తల్లి కావచ్చు ఇంకా గట్టిగా పెదాగా ప్రతి జవాబు ఇస్తున్నది. అప్పుడే పుట్టినట్టుంది. అప్పుడే పుట్టినా శుభ్రంగానే ఉంటాయవి. తల్లి మేక, బిడ్డ శరీరం మొత్తం తన నాలుకతోనే శుబ్రపరుస్తుంది. పాపం..వాటి పుట్టుక ఒక శరీరంగా ఒక అడవిలో మొదలై మరణం మాత్రం అనేక ఖండాలుగా చేధించబడిన అదే శరీరం అత్యంత విషాదంగా మరుగుదొడ్డిలో అంతమవుతుంది. ఎంతటి విషాదం! వాటికి మరణ స్వేచ్చ లేదు. వాటి శరీరాలకు , మెదళ్ళకు వార్ధక్య స్పృహ లేదు. యజమాని దయతలిస్తే ఎంపిక కాబడిన జీవాలు మరో తరానికి తల్లితండ్రులు మాత్రం అవుతాయి.

ఆహారం కోసం జరిగే హింసకు సైతం వ్యతిరేకంగా ఎదిగిన జైన మతం సల్లేఖన వ్రతం సృష్టించుకున్నది. ఆదిమ మానవుని నుంచి స్వేచ్చామరణం వరకూ ఎదిగిన మానవుని మనో స్థిరత వెనుక ఎంతటి ప్రకృతి అధ్యయనం ఉండి ఉంటుంది ! ఎన్నెన్ని దివ్య నేత్రాలతో ప్రతి జీవంలోనూ హింసకు వ్యతిరేకంగా నిస్సహాయుల దుఖాన్ని దర్శించి అంతటి నిర్ణయానికి వచ్చి ఉంటారు! దాన్ని ఆచరణలోకి తేవడానికి ఒక జీవన విధానంగా మార్చుకోవడానికి ఎంతసంఘర్షణను ఎదుర్కొని ఉంటారు ?! మరణంలో కూడా స్వేచ్చ ఉండాలనే భారతీయుల యోగుల తాపత్రయం ప్రతి జీవికీ దివ్యత్వాన్ని ఆపాదించింది. ఆదునిక కాలంలో గాంధీ ప్రచారంలోకి తెచ్చిన అహింస నిజానికి ఒక విష రహిత పాము పలికిన మాట కదా.. మహాభారత కర్త వ్యాస భగవానుడు ఋషి రురు కి ఒక పాము చేత అహింసో పరమో ధర్మః అని చెప్పిస్తాడు కదా..ఒక అల్ప ప్రాణి చేత ఒక ఆశ్రమవాసికి జ్ఞానబోధ చేయడంలో వ్యాస భగవానుడు ఎంతటి భూత జ్ఞానాన్ని పండిస్తాడు ! ఆ సంధర్బం రురునికి చెందినది . రురుడు భ్రుగు మహర్షి యొక్క మూడో తరం వాడు, స్థులకేషుని కూతురు ప్రమద్వారని వివాహం చేసుకోవలసి ఉండగా పాము కాటు వల్ల మరణిస్తుంది. అందుకు పాములపై కోపం పెంచుకొని కనిపించిన ప్రతి పాముని చంపివేస్తుంటాడు. అటువంటి ఒక సందర్భంలో దుందుభుడనే విషరహిత సర్పాన్ని చంపినపుడు అది మనుష్య రూపం పొంది తన పూర్వ వృత్తాంతం చెప్పి ఒక బ్రాహ్మణునికి అసింహ యే పరమ ధర్మం కదా నీవు ఎందుకు ఇలా కనిపించన వాటినన్నింటినీ చంపగలవు అని చెప్పే సందర్భంలో లోక ప్రసిద్దమైన అహింసో పరమ ధర్మ: అన్న శ్లోకం చెబుతాడు. ఈ కథ మహాభారతంలోని ఆది పర్వపు పౌలోమ ఉప పర్వంలో ఉంటుంది. ఇక్కడ శ్లోకంలో బ్రాహ్మణుడు అంటే చాతుర్వర్ణ బ్రాహ్మణునికి చెప్పిన ధర్మమే అయినప్పటికీ బ్రాహ్మణుడు అంటే ఎమర్సన్ విశదీకరించిన బ్రహ్మాలోనూ , పోతన వివరించిన బ్రహ్మలో వసించే మానవుడని అసలు అర్థం. అలా నిరంతరం బ్రహ్మములో సంచరించే వాడే బ్రాహ్మణుడని శ్యామా చరణ్ లాహిరీ మహాశయులు భ్రాహ్మణ శబ్దార్థం వివరించారు. అటువంటి స్పృహ కలిగిన వారు ఎవరైనా బ్రహ్మణులే , వారికి భూత దయే పరమ వ్రతం. మరి లంకెలెక్కడ తెగిపోయాయి. మనమంతా వేరువేరుగా ప్రకటించబడిన జీవం రూపాలమని మరణించే ప్రతిదీ దుఖిస్తుందని మనమెందుకు మర్చిపోతున్నాం… దుఖపు దేహ ఖండాలను ఆరగిస్తూ స్వర్గపు మెట్లు ఎక్కినట్టు భ్రమపడితే అది అచ్చమైన భ్రమకాక మరేం అవుతుంది.

చాన్నల్లక్రితం మహారాష్ట్రలోని ఒక ఆచారం గురించి మా నాన్న ద్వారా విన్న విషయం ఒకటి గుర్తుకు వచ్చింది. అక్కడ ఒక పశువుకు చక్కగా అలంకరించి మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్తున్నారట. ఇది ఏం ఉత్సవం అని ఆయన అడిగినప్పుడు పశువును అడవికి పంపే ఉత్సవం అని చెప్పారట. ఇన్నాళ్ళు మాకు సేవ చేసింది కదా ఇక దానికి పని చేసే శక్తి లేదు కనుక దానిని అడవిలి వదిలేస్తే తన శేష జీవితాన్ని స్వేచ్చగా అడవిలో గడిపి మరణిస్తుందని .. ఇన్నాళ్ళ సేవకు గుర్తుగా దానికి ఈ చిన్న వేడుక ద్వారా వీడుకోలు పలుకుతున్నామనీ చెప్పారట . నేనెంతో ఆశ్చర్య పోయాను. మన వద్ద పొలాల అమావాస్యకు , వివిధ జాతరల సంధర్బంలో పశువుల అలంకరణ తెలుసుగానీ వనవాసానికి తరలిస్తూ వీడుకోలు వేడుక చేయడం తెలియదు. అసలు అటువంటి స్పృహ కలిగి ఉండడమే కదా కృతజ్ఞత అంటే . అలా వీడుకోలు పొందిన పశువులు అరణ్యాశ్రయం పొంది ప్రకృతిలో కలిసిపోతాయి. కానీ ఇప్పుడు మా ముందు కదులుతున్న , గొర్రెల ,మేకల మందకు అటువంటి అవకాశం లేదు. వాటి మరణం అనేక జీర్ణాశయాల మధ్య నిశ్చయమై పోయి ఉంది. దానికి ఇప్పుడప్పుడే విరుగుడు లేదు. వాటికి ఆధారభూతమైన అడవి ఉన్నంతవరకు మనుషులు విశాల ప్రాతిపదికగా జీవన మార్గాన్ని అన్వేషించుకునే అవసరం వారికి రాదు… అడవి కుంచించుకు పోతున్న ఈ రోజుల్లో అయినా ఆ స్పృహ మేల్కొంటుందా..?

గొర్రెల మందను తప్పిస్తూ జీపును ఒడుపుగా నడుపుతున్నాడు డ్రైవరు. ఆలోచనల్లోంచి తెగిపోయి రోడ్డును చూస్తున్నాను. ఇవ్వన్నీ అడవి దారులు కనుక వంపులు తెంపులుగా ఉంది. అందులోనూ వానాకాలపు పచ్చిదనం.

అటూ ఇటూ గా సంధ్యాకాలం సమీపిస్తున్నది . ఆకాశం తేలికగా కదులుతూ దినానికి వేడెక్కిన వెచ్చని గాలి తలుపుల్లేని జీపులోకి ప్రవహిస్తూ ఆకలితో సమానంగా వేడెక్కిస్తున్నది. పొద్దున్నుంచి తిరిగి వాడిపోయిన మా మొఖాలు అలసటను మరపించడానికా అన్నట్లు కనురెప్పలు వాలుతున్న సమయంలో నర్సంపేట శివార్లకు చేరుకున్నాం. ఒక ట్రాలీ ఆటోలో పూర్తిగా నల్లని టార్పలిన్తో కప్పి కట్టు కట్టి ఉన్నది. మా కూడా వస్తున్నట్టు గమనించిన డ్రైవర్ జీపును ఆపాడు. ఏవైనా అనుమతిలేని కలప రవాణా అయి ఉంటుందా అన్న అనుమానం రావడం మా విధిలో ఒక భాగం కనుక ఒక పక్కగా ట్రాలీ ఆటోను ఆపి విచారించడానికి మా వాళ్ళు కిందకు దిగారు. నేనూ దిగాను. ట్రాలీకి కట్టిన టార్పాలిన్ కట్లు విప్పి చూడగా అందులో ఐదు పశువులను కుక్కి కట్టివేశారు . రెండు ఎద్దులు , మూడు ఆవులు. అవి అంత ఆరోగ్యంగా ఏమీ లేవు. అప్పటి వరకు ఊపరి ఆడకుండా కట్టు కట్టి ఉన్నందున టార్పలిన్ తీయగానే ఒక ఎద్దు లేవడానికి ప్రయత్నిస్తూ మా వైపు చూసింది. మిగిలినవి కళ్ళు తిప్పగలవు గానీ కదలలేవు. ఇప్పటిదాకా ఇదే విషయాన్నిమననం చేసుకున్న నేను ఒక్కసారిగా నిరాశ చెందాను. ట్రాలీ డ్రైవర్ ఆ పశువులకు సంభందించిన అనుమతి పత్రాలను చూపుతున్నాడు. దాన్ని నన్ను కూడా చూడమన్నట్లుగా మా వాళ్ళు నా చేతికి ఇచ్చారు. విచలిత మనస్కురాలినై ఏదైనా తప్పు దొరకక పోతుందా అని నా చేతికి వచ్చిన చిన్న ముక్కను తరచి తరచి చూసాను. అందులో యే తప్పూ లేదు.

……. ……. మార్కెట్టు , ….గ్రామం , ……….. తేదీ ,………… చెందిన ఐదు పశువులు (2 ఎద్దులు , ౩ ఆవులు ) అక్షరాల ………………….రూ లకు ………………………..,నకు అమ్మడమైనది.

అవి చట్ట ప్రకారమే వెళ్తున్నాయి. నా కళ్ళు చెమ్మగిల్లినయి. అవి ఎక్కడికి వెళతాయో నాకు తెలుసు. మా బృంద సభ్యలందరూ లంబాడాలే. పశువులను ప్రేమించే అతి కొద్ది ఆధునిక మానవ సమూహాలలో వాటితో అనుభందాన్ని అంతో ఇంతో పొందిన తరం వాళ్ళది. కొద్ది సేపు మా మొఖాలు మేము చూసుకొని నిట్టూరుస్తూ ట్రాలీ యజమానికి అతను చూపించిన రసీదు వాపసు చేసాం. అతను తిరిగి టార్పలిన్ను కట్టడానికి తాడు సర్దుకుంటున్నాడు. ఆఖరి చూపుకు వచ్చిన బంధువును చూసినట్టు ఆ ఎద్దులు చూసిన చూపుతో దుఃఖ పూరిత పాశమేదో మమ్మల్ని చుట్టుకుంది. అవి తిరిగి ట్రాలీలోకి దూర్చబడుతున్నాయి. నిలబడడానికి ప్రయత్నంచిన ఎద్దు తిరిగి కూలబడింది. చేతకాని ఆవులు కళ్ళు మూసుకొని మోర వాల్చేసాయి. తన నిర్భంద మరణంలో ఆ పశువుకు తాను హతురాలిననీ..మనల్ని హంతకులనీ తెలియదు. తెలిసిన నేను ఆపలేను…

నాకు ఎమర్సన్ మాటలు మరింత స్పష్టంగా వినిపిస్తున్నాయి
వాటి… అనారోగ్య హృదయాల నుంచి
బహిష్కృతుడనైనప్పుడు
ఎగిరిపోయే హతుల ఆత్మ ఘోషగా మారిన బ్రహ్మాన్ని ..నేనే
నేనే మానవ జాతికి మరణ శాసనం లిఖించే వాణ్ణి నేనే….

-దేవనపల్లి వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.