సేవకు మారుపేరు-‘’లేడీ విత్ దిలాంప్’’ ఫ్లారెన్స్ నైటింగేల్ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్

ఈనాడు కరోనా విపత్తు సమయంలో ప్రపంచమంతా అతలాకుతలై పోతుంటే , అపర నారాయణ స్వరూపులుగా డాక్టర్లు ,వారికి సాయపడే నర్సుల నిస్వార్ధ సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి .అందుకనే ఆ నాడేప్పుడో బాధ పడుతున్న వారికి, రోగులకు సీవ చేయటం లోనే ఎంతో సంతృప్తి ఉందని ,మానవ సేవలో తనజీవితం ధన్యమైనదని భావించిన నిస్వార్ధ సేవ కురాలు ఫ్లారెన్స్ నైటింగేల్ ను గురించి తెలుసుకొని స్పూర్తి పొందుదాం . ఫ్లారెన్స్ నైటింగేల్ 1812మే నెలలో ఇటలీలో పుట్టింది .తండ్రి విలియం ఎడ్వర్డ్ మహా సంపన్నుడు .తన కూతుళ్ళు ఇద్దరికీ ఇంటిదగ్గరే లెక్కలు ,జాగ్రఫీ ,గ్రామర్ బోధించేవాడు .తల్లి చాలా అందగత్తె.అక్క ,తండ్రి లతోపాటు ఊళ్ళు తిరిగేది .ఆ కాలం లో వివాహం కాని ఆడ పిల్లలు ఇంటి దగ్గరే కూపస్థ మండూకాలు లాగా ఉండాలని పెద్దలు భావించేవారు .అక్కడి ఆసుపత్రులలో శుచి శుభ్రత లేకపోవటం చూసి చాలా బాధ పడింది .అయినా సరే నర్సుగా పని చేయటానికి నిర్ణ యించుకొన్నది .అంటే ఆమె ఒకరకంగా విప్లవాత్మక భావాలు ప్రదర్శించి ,పేదలకు, అనాధలకు సేవ చేయాలన్న గాఢ మైన కోరిక మనసులో జ్వలించింది

ఫ్లారెన్స్ తల్లి ,తన కూతురు ప్రపంచ ప్రసిద్ధ సాహితీ వేత్త కావాలని ఆశపడింది .కాని ఈమె జర్మని లోని కైజర్ సంస్థ గూర్చి విని తెలుసుకొని ,అక్కడే పని చేయాలన్న పూర్తి సంకల్పం తో ఇద్దరు బిడ్డల్ని దత్తత తీసుకొని పెంచింది .1852లో నలభై ఏళ్ళ వయసులో ఇంగ్లాండ్ వెళ్లి ,అక్కడి ఆస్పత్రుల స్థితి చూసి ,విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని కృత నిశ్చయురాలైంది .1853లో ‘’సిస్టర్స్ ఆఫ్ చారిటీ’’చూసి స్పూర్తిపొంది ,లండన్ వెళ్లి తన నాయనమ్మ సేవ చేయాలను కొన్నది .కాని అప్పటికే అక్కడ కలరా వ్యాధి విపరీతంగా వ్యాపించి మృత్యు ఘోష పెడుతు౦డటం ఆస్పత్రులకు వెళ్లి రోగులకు సేవచేస్తూ పగలూ రాత్రీ పని చేసి౦ది ఆ కరుణామయి .పరి శుభ్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ,రోగులకు బలవర్ధకమైన మంచి ఆహారం అందించేది .

1954-56లో క్రిమియా అనే చోట ఘోర యుద్ధం జరిగింది .తోటి నర్సులతో ఫ్లారెన్స్ ఇక్కడికి వచ్చి సైనికులకునిరుపమాన సేవలందించి,వారికి ధైర్యం చెబుతూ అందరి దృష్టీ ఆకర్షించింది .తోటి నర్సులు’’ఎరక్కపోయి వచ్చి ఇరుక్కు పోయాం ‘’అని ఈసడిస్తూ విసుక్కొంటూ సణుక్కు౦టుటే, అత్యంత ధనిక కుటుంబం లో పుట్టిన ఫ్లారెన్స్ మాత్రం అకు౦ఠిత దీక్ష ,మానవత్వం తో వారిని ఆదుకొన్నది .చేసే పని శ్రద్ధ ,ఇష్టం తో చేయటం వలన ఆమె రోగులపాలిటి ఆరాధ్య దేవత అయింది .రాత్రిళ్ళు లైట్లు ఉండేవి కావు .కానీ చేతిలో చిన్న దీపం తో రోగులముందు చిరు నవ్వుతో ప్రత్యక్షమై సేవలు అందించేది .ఆమె ముఖం ఆ దీపపు కాంతితో సేవా దీప్తి గా వెలిగిపోయి ‘’లేడీ విత్ ది లాంప్ ‘’అనే పేరు తెచ్చుకొన్నది . రోగులు కృతజ్ఞతా భావంతో కన్నీరు వర్షించేవారు .’’She is a “ministering angel” without any exaggeration in these hospitals, and as her slender form glides quietly along each corridor, every poor fellow’s face softens with gratitude at the sight of her. When all the medical officers have retired for the night and silence and darkness have settled down upon those miles of prostrate sick, she may be observed alone, with a little lamp in her hand, making her solitary round.

దీనినే’’Lo! in that house of misery
A lady with a lamp I see
Pass through the glimmering gloom,
And flit from room to room.

అని కవిత్వీకరింఛి చిర యశస్సు కల్పించాడు ప్రముఖ ఆంగ్లకవి హెచ్ డబ్ల్యు .లాంగ్ ఫెలో .

మొదట్లో ఆస్పత్రి డాక్టర్లు,అధికారులు తోటినర్సులు ఫ్లారెన్స్ నైటింగేల్ ను చూసి ఈర్ష పడేవారు .క్రమంగా ఆమె నిరుపమాన సేవానిరతి గుర్తించి ముగ్ధులయ్యారు. దీనితో రోగులకు అవసరమైన మందులు, ఆహార పదార్ధాలు ఆమె చెప్పటం ఆలస్యం ,సిద్ధం చేసేవారు .ఒక్కోసారి వారు పంపటం ఆలస్యమైతే తనస్వంత డబ్బు ఖర్చుపెట్టి తెప్పించి ,ఆదుకొనేది .ఆస్పత్రులలో రోగులకు సరిపడిన పడకలు లేకపోతె ,చుట్టుప్రక్కల ఉన్న పాత ఇళ్ళను, ,బిల్డింగ్ లను హాస్పిటల్స్ గా వాడుకోవటానికి అధికారులను ఒప్పించి ,సేవలకు ఆటంకం కలగకుండా చూసిన మానవీయ మూర్తి ఆమె ,రోజుకు మూడు గంటలు మాత్రమె నిద్రపోయి మిగిలిన కాలమంతా అంటే అహర్నిశలు సేవలోనే గడపటం తో ఫ్లారెన్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణించి బాగా చిక్కి పోయింది .అయినా అదే పూనికతో పని చేసేది .ఆమెలో ఒక దైవీ శక్తి ఆవహించిందేమో అని భావించేవారు .

ఇలా నిరంతర,అనుక్షణ సేవలో ఉండగా ఒకరోజు ఆమె అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయింది .మామూలు జ్వరమే అనుకొన్నారు.తర్వాత కాజిల్ హాస్పిటల్ లో చేర్చారు .ఆమెను చూసి రోగులు కన్నీరు మున్నీరుగా విలపించారు .ఆరోగ్యం కాస్త మెరుగు పడగానే క్రిమియా ,స్కుటారిఆస్పత్రుల మధ్య తిరుగుతూ మళ్ళీ యధాప్రకారం రోగులకు సేవ లందించింది . రోగులకు నిత్యం ధైర్యం చెబుతూ, డబ్బు తాగుడికి,వ్యసనాలకు ఖర్చుపెట్టకుండా కుటుంబం పట్ల శ్రద్ధపెట్టమని హితవు చెప్పేది .అందరికీ అందుబాటులో గ్రంథాలయాలు ఉండేట్లు చేసి,అక్షరాస్యత పెంచటానికి దోహదపడింది .

నైటింగేల్ తన నర్సు వృత్తి సంబంధమైన రెండు రచనలు 1-నోట్స్ ఆఫ్ హాస్పిటల్స్ 2-నోట్స్ ఆన్ నర్సింగ్ అనే ఉత్కృష్ట గ్రంథాలు రాసింది ,ధైర్యగా విక్టోరియా మహారాణికి ,పై అధికారులకు హాస్పిటల్స్ బాగోగులగురించి, వాటి స్థితి గతులను మెరుగు పరచాల్సిన అవసరాలగురించి ఎప్పటికప్పుడు ఉత్తరాలద్వారా రాసి, తెలియ బరచేది .దీనివల్లనే అప్పటి నుంచి నర్సులకు విధిగా శిక్షణ అంటే ట్రెయినింగ్ ఇచ్చే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి .1860జూన్ 24 న ‘’నైటింగేల్ స్కూల్ ఫర్ నర్సెస్ ‘’సంస్థను లండన్ లో స్థాపించారు.ఫ్లారెన్స్ నైటింగేల్ ను ‘’మదర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్ ‘’గా గుర్తించారు .ఆమె సేవలను గుర్తించి 1883లో బ్రిటిష్ ప్రభుత్వం ‘’రాయల్ రెడ్ క్రాస్ ‘’పురస్కారం .’’లేడీ ఆఫ్ గ్రేస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సెయంట్ జాన్ ‘’అవార్డ్ ,1907లో ‘’ఆర్డర్ ఆఫ్ మెరిట్ ‘’అవార్డ్ అందజేసి గౌరవించింది .

భారత దేశం లోనూ ఫ్లారెన్స్ సేవలు చేసి కీర్తిపొందింది .1859లో ఆరోగ్య సంస్కరణలకోసం విక్టోరియా మహారాణి ఒక కమీషన్ ను నియమించింది .మద్రాస్ మేయర్ ఆడ నర్సుల శిక్షణ ను ప్రోత్సహించగా ఆమె వచ్చి శిక్షణ నిచ్చింది .నగర పారిశుధ్యం బాగా మెరుగుపడింది .మనదేశం ఆమె మాటలకు విలువ నివ్వటం వలన దేశం లో మరణాల రేటు బాగా తగ్గిపోయింది .1913ఆగస్ట్ 13 న రోగులపాలితటి దేవత, మానవత్వం మూర్తీభవించిన సేవా మూర్తి ,ఆపద్బాందవి ఫ్లారెన్స్ నైటింగేల్ 90 ఏళ్ళు నిండుగా జీవించి ,మానవ సేవయే మాధవ సేవగా భావించి ఆర్తుల, బాధితుల సేవలో జన్మ ధన్యం చేసుకొని లండన్ లో మరణించి౦ది .

ఇస్తాంబుల్ లో నాలుగు ఆస్పత్రులు ఆమె పేర నిర్మించి వైద్య సేవలందిస్తున్నారు .లండన్ లో వెస్ట్ మినిస్టర్ లో ఆర్ధర్ జార్జి వాకర్ శిల్పించిన ఫ్లారెన్స్ నైటింగేల్ విగ్రహం స్పూర్తివంత౦ గా ఉంటుంది .ధామస్ హాస్పిటల్ లో నైటింగేల్ మ్యూజియం ఏర్పాటు చేశారు .ఆమె శతాబ్ది ఉత్సవాలలో భాగం గా 2010 లో మాల్వెర్న్ తో ఆమెకున్న అనుబంధాన్ని పురస్కరించుకొని ‘’మాల్వేర్న్ మ్యూజియం ‘’ఏర్పాటుచేసి ఆమె జ్ఞాపికలు ప్రదర్శించారు .ఫోనోగ్రాం లో రికార్డ్ చేసి ,భద్రపరచబడిన ఆమె వాయిస్’’ When I am no longer even a memory, just a name, I hope my voice may perpetuate the great work of my life. God bless my dear old comrades of Balaclava and bring them safe to shore. Florence Nightingale.’’ను బ్రిటిష్ లైబ్రరి సౌండ్ ఆర్కైవ్ లోనూ , ఆన్ లైన్ లోనూ వినవచ్చు .

1920లో ఆమె జీవితాన్ని ‘’లేడీ విత్ ది లాంప్ ‘’పేరుతో నాటకంగా ఎడిత్ ఇవాన్స్ రాసి ప్రదర్శించాడు .1951లో ఇదే పేరుతో సినిమా తీశారు .2008 లో బి.బి .సి.లో డాక్యుమెంటరి గా ప్రదర్శించింది 2009లో సంగీత నాటకంగా ప్రదర్శించారు .బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆమె చిత్రంతో 10పౌండ్ల నోటు ను 1975లో ముద్రించి విడుదల చేసింది . బ్రిటిష్ మహిళా మోనార్క్ ల బొమ్మలు కాక , వేరొక మహిళా చిత్రం ఉన్న బ్రిటిష్ కరెన్సీ ఒక్క నైటింగేల్ ది మాత్రమే.అదే ఆమెకు ఘనమైన నివాళి .1855లో మొదటిసారిగా ఆమె జీవిత చరిత్ర రాసి ప్రచురించారు .1911లో సాధికారికంగా నైటింగేల్ జీవితచరిత్రను ఎడ్వర్డ్ టాయ్స్ కుక్ రెండుభాగాలుగా రాసి వెలువరించాడు .2002లో బిబిసి ప్రకటించిన 100మంది’’ గ్రేట్ బ్రిటన్స్ ‘’లో ఆమెకు 52వ స్థానం లబిస్తే ,’’ది టాప్ హిస్టారికల్ పర్సన్స్ ఇన్ జపాన్ ‘’లో ఆమెకు 17వ రాంక్ లభించింది .అనేక దేశాలు నైటింగేల్ పోస్టేజ్ స్టాంప్ లు విడుదల చేసి గౌరవించాయి .ప్రపంచ నర్సింగ్ చరిత్రలో ‘’లెజెండ్ ‘’గా చిర యశస్సు నార్జించిన ఫ్లారెన్స్ నైటింగేల్ సకలమానవాళికి ఆదర్శం ,స్పూర్తి ,ప్రేరణ ,మార్గదర్శి .

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.