*నువ్వేం తప్పు చేశావ్ …. నాన్నా*(కవిత )-బట్టు విజయ్ కుమార్..

నాన్న !
నీ చేతి వేలు పట్టి
నడవాలని ఉంది
నీ గుండెపై
ఎక్కి ఆడుకోవాలనుంది
నువ్వు బయటికి వెళ్తే
చిట్టి అడుగులతో పట్టుకోవాలని ఉంది
చిన్ని పెదవులతో
చెంపపై ముద్దియాలని ఉంది
నీ వీపుపై ఎక్కి
స్వారీ చెయ్యాలని ఉంది
నన్ను పిలిచినప్పుడల్లా
దాగుడు మూతలాడుకోవాలని ఉంది
నీ చొక్కా వేసుకుని
గర్వించాలని ఉంది
ఇదంతా మరపించి
నిన్నో ఐసోలేషన్ లో పెట్టి
నాలుగు గోడల మధ్య బంధించారు
అద్దాల అరలోన పడుకోబెట్టాడు
మా సమస్యలు పరిష్కరించే నిన్ను
సామాజిక దూరం పాటించమన్నారు
మంచి మాటలు చెప్పే నిన్ను
ముట్టుకోవద్దంటున్నారు
నీ పలుకులు విందామంటే
ముఖానికి మస్కు వేసేశారు
*నువ్వేం తప్పు చేశావ్ … నాన్న*
అదేదో వ్యాధి నిన్నెందుకు కబళించింది
నీ స్పర్శ లేకుంటే
మాలో చలనం ఎక్కడిది
అయినా ….
నువ్వో వైద్యుడివేగా
ఎంతో మందికి ప్రాణాలు పోశావుగా
నీ చేయి తాకిన ప్రతి గుండె
స్పందించిందిగా
నిన్నెందుకు నాన్న
ఒంటరివాణ్ణి చేశారు

-బట్టు విజయ్ కుమార్..

కవితలుPermalink

Comments are closed.