తొలివలపు (కవిత ) – కోసూరి జయసుధ

బండబారిన నా మనసు కూడా స్పందిస్తుందని..
నిన్ను చూసాకే తెలిసింది..
నువ్వు నా పక్కన నిలబడిన ఆ ఒక్క క్షణం…
అద్భుతం.. !!

నీ నుంచి వచ్చే ఆ పరిమళం ఇదివరకెప్పుడు నే నెరుగనిది …
ప్రతిక్షణం నా కనుల వెతుకులాట నీ కోసమే …
ఇదేనా తొలివలపంటే…?

￰ప్రపంచమంతా వెతికి నిన్నేరుకున్నానే !!
మల్లెపూవునో,మంచి గంధాన్నో ఆస్వాదిస్తున్నట్లు
ఆ నిట్టూర్పులేమిటి ..!!

వేళ్ళకొనలతో తాకిన అలల వలే.. నా ముంగురులు

సవరిస్తూ తాకి నా ఒళ్ళంతా తిమ్మిరులు పుట్టిస్తావే ….?

ఆ మెత్తని ఎండ నీ నడుమొoపుల్లో పడి మా ఊఁరి ఏరులా..
చప్పున వంగి తిరిగిన ఒడ్డులా లేదూ…?
అబ్బ….మరణం లోంచి జీవనం లో పడ్డట్టుంది..!!

￰ఎదలోనిభావాలన్నీ మది ముంగిటే నిలిచాయి..
నీమది అనుమతితో నీ ఎదలో చేరాలని..!!

￰చక్కర కూడా చేదైనదే నీ పలుకుల రుచి తెలిశాక
చంద్రకాంత చక్కదనమంతా
నీ చెక్కిలిలోనే దాగుందేమో..
వద్దన్నప్రియురాలి ముద్దు కూడా

పొద్దు పొడుపు లాగా వెచ్చగా ఉంటుందేమో..!!

గాలి కూడా నీ ఊసులనే మోసుకొచ్చే నేనే నువ్వైన క్షణాన!!
నీ తలపుల తూణీరాలు నా మనసును ముసరగా …
నా మదిగది ఇరుకైనదే చెలీ..!!

నీకూ నాకూ మధ్య ఏంటంటే ఏం చెప్పను
శూన్యంలో చూసినా నీ రూపే కనిపిస్తుందని..!!

రెండుగుండెల చప్పుడు ఒక్కటయ్యేవేళ..
రెండుమనసుల ఊహలు ఊసులాడేవేళ..
రెండు తనువుల చక్కిలిగిలి తీరేవేళ..
ఎన్నెన్ని నీలి ఊహలో కదా ఎద భారమైన వేళ.. !!

-కోసూరి జయసుధ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Comments are closed.