కాలం కత్తెర (కవిత )- సుధామురళి

చాకచక్యంగా పనిచేయాల్సిన కాలం కత్తెర

అడ్డదిడ్డంగా ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించుకుంటూ వెళ్తోంది

రాలిపడుతోంది పండుటాకులో లేత చిగుర్లో

లెక్కేలేదు…. బాధా లేదు

కంచె వేస్తున్న ఆ నాలుగు చేతులూ

మంటల్లో కాలిపోతున్నాయి

రెక్కల చప్పుడు మరచిన గువ్వలే

ఇప్పుడక్కడక్కడా కనిపిస్తున్నాయి

కన్నీటి మిషన్ ఏదో ఆగకుండా పనిచేస్తున్నట్టుంది

ఏడుపులూ ఉపశమనాలివ్వని వేలాగోళాలౌతున్నాయి

ఇంటింటా పెరిగిన టచ్ మీ నాట్ మనసులతో

విశ్వమో రాతివనం

నవ్వుల్లోనూ విషాదమే చిగురిస్తోంది

మానవత్వపు ఎరువు ఎంతగా చల్లినా

బతుకు పంటలు ఎండిపోతున్నాయి

నాదాకా రాదనుకున్న కారుణ్య మరణమేదో

ఇప్పుడు ప్రతీ తలుపు దగ్గరా తచ్చాడుతోంది

ఇంటి పైకప్పుగా మారిన భయం

ఆందోళన వర్షాన్ని ఆపలేకుంది

                                                                                  -సుధామురళి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.