అఘాయిత్యపు అంతానికి ముందడుగు వేద్దాం (కవిత )- గాయత్రి శంకర్ నాగాభట్ల

బాల్యం బలైపోతోంది…

చనువిచ్చిన చుట్టం చేష్టలకు

చిన్నారి శరీరం ఛిద్రం అవుతుంటే

యవ్వనం దోచుకోబడుతోంది…

గుట్టుగా దాచుకున్న మానాన్ని

ఆక్రందనల మధ్య ఆక్రమించుకుంటుంటే

వృద్దాప్యం వొణికిపోతోంది…

ఒడిలిన దేహాన్నయినా వదలక

తమ అవసరాన్ని తీర్చుకుంటుంటే

ఎక్కడ ఉంది రక్షణ మహిళకు?
మాదకద్రవ్యాల మత్తులో మాన భక్షణ

మరిగిన మృగాళ్లు వేసే కాటుకు?

లింగభేదాన్ని ప్రదర్శించి హింసిస్తే సర్దుకున్నాం…
ఆకలిగొన్న చూపులు ఆడతనాన్ని ఆక్రమిస్తుంటే సహించాం….

ఐనా… ఇంకా ఇలా ఉండిపోదామా

ఘటన జరిగింది మాకు కాదు కదా అంటూ
తప్పించుకుతిరుగుదామా తనువుని

హింసించే కళ్ళను తప్పించుకుతిరుగుతూ

జరిగినవి చాలు… ఇక కదలండి

ఉగ్గుపాల వయసు నుండే

సభ్యతా – సంస్కారాలు నూరిపోస్తూ
అసభ్యతని ప్రేరేపించే

సాధనాల వాడకాల్ని నియంత్రిస్తూ

స్త్రీ అంటే ” సృష్టికార్యపు గని ” అనే ఆలోచనల్ని తరిమేద్దాం
ఇక ఏ బలహీన క్షణాల ఆవేశానికి

ఆడపడుచుల్ని బలివ్వనివ్వమని ప్రతిజ్ఞ చేయిద్దాం

యావత్ ప్రపంచపుమహిళా కోరుకునేది ఒక్కటే

“ఒక్కరోజు ఉద్ధరించే దినోత్సవాలు మాకొద్దని “
ఏ స్త్రీని దౌర్జన్యంగా తాకే ప్రయత్నం చెయ్యొద్దని “

ఐనా.. ఇబ్బంది పెట్టె ఘటనలు పురావృతమయ్యాయో

క్షమయాదరిత్రి కన్నెర్ర చేస్తూ సహనాన్ని

పక్కన పెడితే… కామాంధులకి కాష్ఠమే

ధీర వనితల ఉద్యమ సెగకు విపరీత బుద్దులు భస్మమే…!!

-గాయత్రి శంకర్ నాగాభట్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to అఘాయిత్యపు అంతానికి ముందడుగు వేద్దాం (కవిత )- గాయత్రి శంకర్ నాగాభట్ల

  1. NOOJILLA SRINIVAS says:

    Very powerful poem Gayatri garu.