తొలకరి (కవిత )- వినయ్ కుమార్ కొట్టే

మొక్కజొన్న కంకుల పై
అల్లుకున్న
తీగలవోలె నీ కురులు….
ఆకుల చాటున దాగిన అల్లనేరేడి పండ్లవోలె నీ కళ్ళు…
ఎర్రగా పూసిన మందార పువ్వులవోలె నీ అధరాలు…
విరగకాసిన జొన్న కంకుల వోలె

నీ చెవుల కమ్మల బుట్టలు…
అలుపెరగక సాగే వాగు అలలావోలె

నీ చేతి గాజుల సప్పుళ్ళు…
తుమ్మ చెట్టు కాయల వరుసలవోలె

నీ కాళ్ళ పట్టీలు…
పచ్చటి వరి పైరే నీ కొంగు బంగారం…
ప్రకృతి సొగసే నీకు నిండైన అలంకారం….
నీ దరి చేరే దారికై
మది గదుల్లో ముసురుకుంటున్న

భావాలను ఎద లోతుల్లోకి తోస్తూ…
పొలమారించే నీ మొరటు తలుపులను

కాగితపు దొంతరలలో నిలిపివేస్తూ ….
వేచి ఉన్నాను నీ తొలిపలుకుల

తొలకరికై పులకించే పుడమి లాగా…

-వినయ్ కుమార్ కొట్టే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.