జనపదం -జానపదం – జానపదుల జీవన విధానంలో పాటించే జాగ్రత్తలు- తాటికాయల భోజన్న

మానవ జీవితం అత్యంత ప్రయోజన కారి, మరియు ప్రమాదకారి కూడా మానవ జీవితంలో అనేక ఒడిదుడుకులు, సవాళ్ళు, నిరంతరం ఉంటాయి. అందులో శారీరక, మానసిక సమస్యలు మనిషిని ఎక్కువగా క్రుంగదీస్తాయ్. దీనిని గమనించిన పెద్దలు అనేక వ్యక్తిగత వైద్య విధానాలను జీవన విధానంలో భాగంగా అలవర్చుకున్నారు. కానీ ఈ అత్యాధునిక జీవనంలో మానవ జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. ప్రాచీన ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, కొద్ది కొద్దిగా మారిపోతున్నాయి. దీని ఫలితమే ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వ్యక్తిగత వ్యాధులు. నేడు ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ లాంటి అనేక సవాళ్లకు భయపడక ఏమాత్రం వైద్య సదుపాయాలు లేని ఆ కాలంలోనే నిలబడి పోరాటం చేశారు. జానపదుల జీవన విధానంలో ప్రతి క్షణం విలువైనదే. వ్యక్తిగత జీవితాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకున్నారు.

ఉదయం లేవగానే కళ్ళాపి చల్లడం, తులసి పూజ, ముగ్గులు వేయడం, కాళ్ళను చేతులను దేహాన్ని శుభ్రంగా కడుక్కోవడం, స్త్రీలు శరీరానికి పసుపు రాసుకోవడం, యాగాలు, పూజలు, పునస్కారాలు మొదలైన అనేక అంశాలు మానసికంగా, శారీరకంగా దృఢంగ చేస్తాయి.

భారతీయ సాంప్రదాయంలో నమస్కారానికి చాలా విశిష్టత ఉంది. వీరు పలకరించుకునే అద్భుతంగా ఉంటుంది. ఇందుకు భిన్నంగా పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలు మనకు అనేకం కనిపిస్తాయి. ఇలాంటి విపరీత ధోరణులు ప్రస్తుతం భారతదేశంలోను వ్యాపిస్తున్నాయి. వీటికారణంగా అనేక వ్యాధులు ప్రబలి కొందరు మరణిస్తుండగా మరికొందరు బ్రతికుండి జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్న నాటి జానపద తరానికి ఏమాత్రం జాగ్రత్తలు పాటించని నేటి తరానికి అనేక జీవితాలు నేడు బలవుతున్నాయి.

వ్యక్తిగత దూరం పాటించని కారణంగా ఇటలీలో, అమెరికాలో, దక్షిణ అమెరికా ఇలా అనేక దేశాలు భారీ మూల్యం చెల్లించుకున్నాయి. భారతదేశంలోనూ వ్యక్తిగత ఆహార అలవాట్ల కారణంగా అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితులలో ప్రపంచ దేశాలు భారతీయ సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి వాతావరణం అనేక వ్యాధులను, వైరస్ లను దూరం చేస్తున్నాయి. ఈ మధ్య జరుగుతున్న అనేక సదస్సుల్లో దేశాధినేతలుసైతం ఒకరినొకరు హత్తుకొని చుంబనాలు చేసే సంస్కృతిని వదిలి ఒకరికొకరు నమస్కారం చేయడం జానపదుల గొప్పదనాన్ని తెలియజేస్తున్నది.

పూర్వకాలంలో కలరా అనే మహమ్మారి వలన గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ సమయంలో ప్రజలకు కలరా అనే వ్యాధి గురించి తెలియదు. వారు దానిని గత్తర అనే పేరుతో పిలుచుకొని కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి తీసుకుంటున్న జాగ్రత్తలు పాటించారని తెలుస్తుంది. కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం, చేతులను పదేపదే కడగడం ఇంటికి బంధువులు వస్తే నీళ్లు ఇచ్చి శుభ్రం చేసుకోండి అని చెప్పడం, చెప్పులను ఇంటికి దూరంగా వదలడం పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం, మరుగుదొడ్డిని ఇంటికి దూరంగా ఏర్పాటు చేసుకోవడం పశువుల పేడను ఇంటికి దూరంగా వేయడం మొదలైన అనేక పద్ధతులు పాటించి వ్యాధులను దూరం చేసుకుంటారు కానీ పట్టణాలలో నివసించే వారు వీటన్నిటికీ వ్యతిరేకంగా ఉంటారు ఫలితంగా అనేక వ్యాధులు వైరస్లు మనపై దాడిచేసి, పరిమితం చేస్తూ ప్రాచీన పద్ధతులను పాటించే విధంగా చేస్తున్నాయి.

కానీ ఇవన్నీ సమస్య అంతవరకే భాగింపబడిన తదనంతరం కనుమరుగైతే మళ్లీ ఇలాంటి సమస్యలు అనేకం ప్రపంచ మానవాళి పై దాడి చేయక మానవు. ప్లేగు, కలరా, స్వైన్ ప్లూ, చికెన్ గున్యా, డెగ్యూ, ఆటలమ్మ, తట్టు, జలుబు, మసూచి, పోలియో, గవదబిల్లలు, ఎయిడ్స్, బర్డ్ ప్లూ మొదలైన వ్యాధులు రకరకాల వైరస్ ల వలన కలుగుతున్నాయి. ఇవేకాకుండా అనేక వైరస్ లు ఈ భూమిపై ఉన్నాయి. ఇలాంటి వాటినుండి మానవుడు తప్పించుకుని సుఖవంతమైన జీవితం గడుపాలంటే క్రమబద్ధమైన జీవన విధానాన్ని పాటించాలి.

— తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Comments are closed.