సంపాదకీయం ఏప్రియల్ 2020

గత పదిరోజులుగా ఇంటా బయటా ఎన్నో మార్పులు. కొత్త భాష కొత్త భయం. కొత్త వాతావరణం ప్రపంచాన్ని అతలాకుతలం చేసేస్తోంది. కరోనా కొందరిని నేరుగా బాధిస్తే మరికొందరిని ఆర్ధిక పరంగా మానసికంగానూ క్రుంగదీస్తోంది. ముఖ్యంగా రోజువారీ కూలి డబ్బులు మీద ఏ పూటకా పూట కడుపు నింపుకునే శ్రమ జీవులు, పేద రైతులు, చిరు వ్యాపారస్తులకు ఇది పెద్ద దెబ్బ. భయాందోళనలు సృష్టించే వార్తలు వినీ వినీ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. మద్యానికి బానిసైన వారు హటాత్తుగా మద్యం దొరక్క ఆల్కహాల్ withdrawal సిండ్రోమ్ తో బాధ పడడం, ఒకిద్దరు ఆత్మహత్య కూడా చేస్కోడం చూస్తున్నాం. తక్షణ పరిష్కారాలు దొరకని పరిస్తితిలో ఉన్నాం. సంయమనం పాటించడం తప్ప మరో మార్గం లేదు. ఇంకో పక్క గృహిణులు, ఒంటరి మహిళలు మరింత వత్తిడికీ ఒంటరితనానికి లోనవుతుండడం, విద్యార్ధులు ఉద్యోగస్తులు తమ భవిష్యత్తు పై భయాలు పెట్టుకుని ఉండడం పెరుగుతున్నాయి.

కరోనా శారీరక దూరాన్ని పాటించమంటే మనషులు సామాజిక దూరాన్ని పాటించమంటున్నారు. కొందరికి కావలసినదేదో కాళ్ళ దగ్గరకు వచ్చినట్టు అనుకుంటారా అనిపిస్తుంది. మరి ఈ సామాజిక దూరం కరోన వైరస్ పోయిన వెంటనే పోతుందా లేక కుల వైరస్ కొనసాగిస్తుందా?సంచలనం కోసం ఎదురు చూసేవారికి చలనం ఉండడం అరుదుగా చూస్తుంటాం. ఈ సారీ కొత్తేం కాదు. అది కరోనా అయినా వేరే ఏదైనా సరే. కుల మతాల రోగాలు అసలు రోగాలకీ అంటించగల సమర్దులమని మళ్ళీ నిరూపించుకున్నం. ఎంత సునాయాసంగా మనం మతాన్ని కులపు అలవాట్లని ప్రపంచీకరణ చేసేయ్యగలం.

చైనీయుల ఆహారపు అలవాట్ల వల్లే కరోనా వైరస్ వచ్చిందని వార్తలొచ్చేసరికి వాళ్ళకి మన ఆహారం అంటే అన్నం, పప్పు, చారు అలవాటు చెయ్యాలి అంటూ సామజిక మాధ్యమాల్లో గేలి చేసారు తెలుగు వాళ్ళు. గబ్బిలాలు, కాకులు, పిట్టలు, ఎలుకలు, ఉసుళ్ళు, కప్పలు, పందుల్ని తినే ఆచారాలు తెలుగు వాళ్లలోనూ ఉన్నాయన్న స్పృహ గానీ సమాచారం గాని వీళ్ళ దగ్గర ఉండదు. ఎంత దౌర్జన్యంగా మన మతాచారాలే గొప్పవి అని మెదళ్ళలో నూరి పోసేస్తారు. కరోనా వైరస్ ముందు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేవుడూ గెలవలేదు. ఏ అతీత శక్తీ నిలవలేదు. అయినా మత విద్వేషాలకు వెనుకంజ వెయ్యలేదు మనం.మన మతం చేసింది మనకు కనబడదు. ఏం జరిగిందో తెలుసుకుందామన్న అవసరం కంటే ఎదుటి మతాన్ని ఎలా నిందించాలా అన్న ఆవేశాన్ని కరోనా కూడా ఆపలేకపోయింది. మన మెదళ్ళలో మనస్సులో ఉన్న కుళ్ళు కంటే ఈ కరోనా అంత పెద్ద మహమ్మారా!?…

-మానస ఎండ్లూరి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సంపాదకీయంPermalink

Comments are closed.