వద్దు.. కరోనా రావొద్దు!(కవిత )-బి.రమేష్

బుడగ వంటి బడుగు

బలహీన బతుకులలోకి

చెమట చుక్కలు చిందించి

చద్దన్నం తినే  మురికివాడలలోకి

రెక్కాడితే గాని డొక్కాడని

ఆకలి రెక్కల జీవితాలలోకి

వద్దు కరోనా రావద్దు!

మా కండల్లో కష్టాన్ని  దోచుకుని

బతికే  ధనికవర్గం దగ్గరకి

జనాన్ని మోసం చేసి బతికే  మోసగాళ్ల దగ్గరకి

అధిక ధరలకు అమ్ముకునే దళారుల దగ్గరకి

మోసపోయినా… బతుకుతున్న  పేదల దగ్గరకి

ఎన్నో రోగాల్ని పంటికింద నొక్కిపెట్టి

మమ్మల్ని నమ్ముకున్నోళ్లను పోషించుకుంటున్న

పోషనార్థ జీవులం

నీ కంటే పెద్ద రోగాన్ని

ఎండిపోయిన డొక్కల మధ్య భరిస్తున్న వాళ్లం

అదే… ఆకలి

మనిషి స్వార్థపరుడైన క్షణం నుంచి

ఎదుటి మనిషి కడుపున మోస్తున్న పల్లకి

ఇప్పుడు నువ్వొస్తే పేగులు మరింత ఒరుస్తాయి

నాలుగు మెతుకులు తింటున్న మా వాళ్లు

మళ్లీ మెతుకులకు దూరం అవుతారు

వద్దు కరోనా రావొద్దు!

వైద్యం వ్యాపారమయమైన దేశంలో

కనీస అవసరాలు కరెన్సీ రూపం దాల్చిన దేశంలో

పేదవాడు కేవలం ఓటుహక్కయిన దేశంలోకి

రావొద్దు

డబ్బున్న వాళ్లే నిన్ను మోయలేనప్పుడు

నిన్ను భరించడం మా వల్ల కాదు

వద్దు కరోనా రావొద్దు!

గంజన్నం పరమాన్నంలా తింటున్న

గుడిసెల్లోకి రావొద్దు

నువ్వొచ్చి పల్లెల్ని పీనుగుల కుప్పగా మార్చొద్దు

పచ్చగా బతుకుతున్న బతుకుల్లో

రోగం నిప్పురవ్వలేసి కాల్చొద్దు

వద్దు కరోనా రావొద్దు!

సాటివాడికి సహాయపడడానికి సిగ్గుపడే

స్వతంత్ర దేశంలోకి రావొద్దు

పేదవాడ్ని పురుగుల్లా చూసే

ధనికులున్న దేశంలోకి రావొద్దు

ఎందుకంటే

పేదవాడు రోగాన్ని తట్టుకోగలడు గాని

అవమానాన్ని తట్టుకోలేడు.

ఇక్కడ అవమానం నీ కంటే గొప్పది..

                              –    బి. రమేష్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to వద్దు.. కరోనా రావొద్దు!(కవిత )-బి.రమేష్

  1. Vinay kumar says:

    సూపర్ సర్