మా లచ్చిమీ ఇంటున్నవా నా మాట(కవిత )-వెంకట్ .కె

అబివుద్దికి ఆమడ దూరంలో

ఇశాఖ తీరానికి ఆవల

కొండ గుట్టల మద్యన

దారులే లేని కీకారణ్యంలో

నిట్టాడితో పూరిగుడిసి నిలుపుకుని

ఈతసాప తడికడ్డు ఎట్టుకుని

సెలయేటీలో నీల్లు తాగుతా

కారడవి లో కాందాబచ్చలి

కూరొండుకుతింటూ బతికే

ఓ మాలచ్చిమీ

ఇంటున్నవా నా మాట

ఏడో సైనా దేశంలో పురుడోసుకుందంటే

ఆ మాయదారి కొయిడ్ రోగం

పూరేడుకి ఉచ్చేసినట్టు

గోరింకని బంకతో బందీ సేసేత్తనట్టు

మన గూడేనికి వచ్చేత్తదంటే

ఊడల మర్రి మనులా

జడలల్లుకుంటా

తిప్పతీగ లాగా కాల్లకి సుట్టుకుని లొంగెట్టుకు పడేసేలా

ఆడెలుగుబంటిలా

అమాంతం మీద పడి రక్కేసేలా

జడల బర్రెలా దూకుడుగా

వచ్చేత్తనాదంటే లచ్చమ్మా

కూసింత జాగత్త బిడ్డా

మన గూడెపోల్ల కాడికెల్లి

కాసింత కబురందసేయమ్మా

గుడిసెలో దూలనికి ఎలాడదీసిన గుడ్డూయాల్లో

బొబ్బోపెట్టిన పసికందుని

కూసింత పదిలంగా సూసుకోమని సెప్పమ్మా సిట్టెమ్మా

మందులూ మాకులూ మనకేడా దొరకవే బిడ్డా

ఆ పట్టపోల్లకే సూదిమందు దొరక్క

పిట్టల్లా రాలిపోతన్నారంటే

గంజి నీళ్లు తాగి బతికేవోల్లం

మన గతేటిగాను

ఆ సర్కారోల్ల వల్లే కాటలేదంటే

ఎర్రి మొహందానా

కసంత ఎడంగా ఉంటా ఉంటే

ఆ తెగులు మాయమౌతాదంటే పిచ్చిదానా

ఆకులు అలమలు ఎరుకుతినే మనోల్లని

ఆ బెమ్మరాచ్చసి ఆవురించిదంటే

మన జాతే మాయమైపోతాదంటే

బద్రంబిడ్డా

కొండసిలవలా నోరు తెర్సుకుని

ప్రపంచికమంతా కరోనా తన కోరల్లో బంధించి కబలించడానికి వచ్చేత్తoదంతా

మన గిరిపోల్లందరినీ

ఎచ్చరించమ్మా లచ్చమ్మా

మన గూడేలని ఒదిలిలెట్టి బైటకి రావొద్దనీ…

                   

                                                                                                      -వెంకట్ కె

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~

కవితలుPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Vinay kumar
Vinay kumar
9 months ago

సర్ చాలా బాగా రాసారు.