తస్మాత్…!!(కవిత )-సుధామురళి

కొన్నాళ్ళక్రితమేమో

అక్కడెక్కడో అని బిక్కుల్ తిరిగావు

మొన్నేమో

దేశంలో ఎక్కడోలే అని బిందాస్ వున్నావు

నిన్నేమో

నీ ఊరికొచ్చింది కానీ

నీ ఇంటికి రాదని

హుషారుగా చుట్టేశావు

కానీ అది భస్మాసుర హస్తమని

నీతో పాటు నీ వాళ్ళనూ

బూడిద చేస్తుందని మరచావు

వచ్చింది ఏ సునామీనో అని

ఒక్కదెబ్బకు ఊడ్చి

మరలా ప్రశాంతతను ఇస్తుందని

తప్పులో కాలేశావు

ఆ ఉపద్రవం

ఏ భూకంపమో అని

బీటలిచ్చిన భూమి

నీకాళ్ళ కింద లేదని

కాళ్ళు బయటపెట్టావు

ఏ అగ్ని పర్వత విస్ఫోటనమో

ఏ శత్రు దేశాల అణుయుద్ధమో

అనుకుంటూ

రక్షణ కవచంలో ఉన్నానని

మురిసిపోయావు

వచ్చింది అణువంత కూడా లేని జీవి

చేస్తున్నది కంటికి కనిపించని యుద్ధం

ఎదురొడ్డేందుకు నీ దగ్గర ఆయుధాలు లేవు

జాగ్రత్తే నీ బలం

తట్టుకునేందుకు నీ దగ్గర పది ప్రాణాలు లేవు

ఉన్న ప్రాణమే పదిలం

ఇప్పుడు నీకు నువ్వే సైన్యం

ఇప్పుడు నీ ఇల్లే నీకు రక్షణ కవచం

కాలు బయటపెట్టక

అలసత్వానికి తావివ్వక

ఇసుమంతైనా వినాశనాన్ని స్వాగతించక

తరుము…

నువ్విప్పుడు పెద్ద తురుమువి కాదు

కరోనా చేత చిక్కిన అల్పప్రాణివి

నువ్వు పోతే

తనివితీరా పట్టుకుని ఏడ్చే దిక్కూ ఉండదు

కాలి బూడిదయ్యాక కూడా నిను గంగలో

కలిపే చేయీ కానరాదు…

తస్మాత్ జాగ్రత్త….

-సుధామురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

One Response to తస్మాత్…!!(కవిత )-సుధామురళి

  1. Vinay kumar says:

    బాగా రాసారు మేడం