పాతిక ఏళ్ళక్రితం
గగనపు అంచులను తాకే
పెద్ద అల వచ్చి
ఊపిరి అందకుండా
ఉక్కిరి బిక్కిరి చేసినట్టుగా,
ఊహించకుండా వచ్చిన
ఉప్పెనలా,
చడీ చప్పుడూ లేకుండా
ఊవ్వెత్తున లేచిపడిన
అగ్నిగోళంలా,
నా జీవితాన్ని అల్లకల్లోలం
చేస్తూ ప్రవేశించింది
“భీస్ట్ నొప్పి,’
పదునైన కత్తి అతివేగంగా
నా శరీరం పొరల్లోనుండి
దూసుకుంటూ వీపులోనుండి,
పై కడుపులోకి దిగి
మెలిపెట్టి తిప్పేస్తున్నట్టుగా,
అతిభయంకరమైన నొప్పి
తట్టుకోలేక, దిక్కుతోచక
కన్నీరు నయాగరా జలపాతాలై
ఏ ఆనకట్టలు ఆపలేనంతగా
కారిపోతుంటే,
ఈ “భీస్ట్ నొప్పి”నుండి విముక్తి
ఆ క్షణమే కావాలి
లేదా ప్రాణం పోవాలి
మరో క్షణం కూడా భరించలేని
ముళ్ళకంపలా
చిక్కుముళ్ళుపడిపోతూ
చుట్టుకుపోతుంటే
ఇలాంటి నొప్పి అన్నదే
వుంటుందని తెలియని షాక్ లో
నుండి కోలుకోక మునుపే
నర్స్ ఇచ్చిన ’లో డోసేజ’ ఇంజెక్షన్
పని చేయక
మళ్ళీ ’హై డోసేజ్’
ఇంజెక్షన్ మత్తులోకి
జారుకోవడానికి చాలా సమయం
పట్టింది.
శతసహస్ర పరీక్షలు,
శస్త్రచికిత్సల పై శస్త్రచికిత్సలు
నెలలు నెలలు ఆసుపత్రులలో
ఒంటరిగా వుండి,
కొన్నేళ్ళు ట్రీట్మెంట్లు తీసుకున్నా
కూడా”బీస్ట్” నొప్పిని నేటి ఆధునిక
వైధ్యులు,
క్రానిక్ అయిన నొప్పిని
తగ్గించలేకపోయారు.
ఆహారం తాకితే నొప్పి
అందుకని ఒక “ఫ్హీడింగ్ ట్యూబ్”
పెట్టి దాని ద్వారానే నీకు
న్యూట్రీషన్ అన్నారు.
ప్రాణం పోకుండా కాపాడగలరు
కానీ ఒకోసారి సమస్యని పూర్తిగా
తగ్గించలేరు.
బాధ పడ్తూనే డాక్టర్లు
నేనీ నొప్పిని జీవితాంతం
అనుభవించాలని,
మందులతో కంట్రోల్ చేసుకుంటూ
నీ వారి కోసం బ్రతికే వుండాలనే
చావు కబురు చల్లగా చెప్పినట్టు
చెప్పారు.
వారిపై ఆవేశం వచ్చినా వారు
శతవిధాల ’నొప్పి’ని నా జీవితం నుండి
తరిమేయడానికి వారు పడ్డ శ్రమని
చూసినదాన్ని కాబట్టి
ఏమీ అనలేక,
మందులకు కూడా లొంగని
“భీస్ట్” తో సహజీవనం చేస్తూ
నొప్పి రాక్షసయితే నేను
బ్రహ్మరాక్షసినయి పోరాడుతూ
ముందుకు సాగుతున్నాను!
(రకరకాల క్రానిక్ నొప్ఫులతో బాధ పడ్తూ పట్టువదలకుండా
జీవితంలో తమ భాధ్యతలను నిర్వర్తించుకుంటూ ముందుకి
సాగుతున్న నా సోదర సోదరీమణులకు ప్రేమతో….)
-కనక దుర్గ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~“