గడ్డి పరకలు(అరణ్యం -7)-దేవనపల్లి వీణావాణి

          యే రోజుకారోజే కొత్తది.ఇంకా చూస్తే  ప్రతి నిమిషమూ కొత్తదే , కనురెప్ప మూసి తెరిచే లోగా ఒక క్షణం గడిచి పోయి మరో క్షణం మొదలవుతుంది. సమయాన్ని విభజించుకోవడం మనకు తెలిసి పోయింది కనుక ఒక చట్రం వేసుకొని పనులు చేయడం అలవాటైపోయింది. ఎక్కడైనా తేడా వస్తే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయడమూ, రెట్టింపు పని భారం మోయడమూ  తప్పవు కదా.  నిన్నంతా జీపు మరమ్మత్తు పని పడి అడవికి వచ్చిన పని పూర్తి కాకుండానే వెనక్కి వెళ్లి పోయాం. జీపు సిద్దం  అయ్యేసరికి రాత్రయ్యింది. కొంత ఆలస్యంగానైనా ఈ వారంలో నిర్ణయించుకున్న పనులన్ని సమయానికి పూర్తిచేయాలని అనుకున్న కారణం చేత మళ్ళీ అడవికి వెళ్లే పనే ఉంది . ఇవ్వాళ  మేడపల్లి వన్యప్రాణి బీటు సందర్శన అంటే అక్కడి అక్రమ నరుకుళ్ళపైన ఇంకా ఇతర అటవీ పనుల మీద పర్యవేక్షణ. ఎప్పట్లాగానే అనుకున్న సమయానికే మా బృందం అంత కూడా సిద్దమైపోయి బయలుదేరాం.  మా జీపులో ఎప్పుడూ ఒక నీళ్ళ కాన్ ఉంటుంది . దాని నిండా నీళ్ళు నింపుకునే బయలుదేరతాం . మధ్యలో ఎక్కడా నీళ్ళు దొరికే పరిస్థితి ఉండదు. నీటి వనరులు లేక కాదు వాటిని వాడుకునే స్థితిలో లేక పోవడం..ఒకవేళ వాడినా తట్టుకునే శక్తి శరీరానికీ లేదేమో. ఇంకా  భోజనం బదులుగా అరటి పళ్ళు కొన్ని బిస్కట్లు తీసుకువెళ్తున్నాం.ఎలాగైనా  ఈ రోజు వచ్చినపని పూర్తి చేసుకోవాలి  ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు బీటు పర్యవేక్షణ పనులు పూర్తి చేసే వీలు లేదు. ప్రభుత్వం సెప్టెంబర్ 6 వ తీదీ నుంచి మొదలుకొని వచ్చెనెల అంటే అక్టోబర్ 6వ తీదీ వరకు ముప్పై రోజుల ప్రణాళికను ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పన్నెండు వేలకు పైగా ఉన్న గ్రామ పంచాయితీలన్నీ వాటి వాటి పరిధిలో పచ్చదనం , పరిశుబ్రత ప్రధానాంశాలుగా స్థానిక సమస్యలను పరిష్కరించవలసి ఉంది. అటవీ అధికారులకు కూడా కొన్ని కొన్ని మండలాలను కేటాయించినందున పచ్చదనం పెంపోదించేందుకు నిర్దేశించిన అంశాలలో సలహాలు సూచనలు ఇవ్వవలసి ఉన్నది. మా బృందానికి కూడా ఈ బాధ్యతలు ఉండడం  చేత  ఈ మాసంలో మాకు ఈ ఒక్క రోజే మిగిలింది.

నిన్న పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని   డ్రైవర్ జీపును శ్రద్దగా నడుపుతున్నాడు. పల్లె దారులకిరువైపులా నాట్లు వేస్తూనో కలుపు తీస్తూనో  వ్యవసాయ పనులు జరుగుతున్నాయి.  వాతావరణం నెమ్మదిగా కదులుతున్న నదిలా ఉంది. మేమూ నిమ్మలంగానే వెళ్తున్నాం. జోరుగా కురిసిన వానలకు చిన్న చిన్న కుంటలు , పెద్ద మడుగులు నిండిపోయాయి. చిన్న చిన్న ఊర్లు అంటే ఇక్కడ లంబాడా ఆవాసాలు  ఎక్కువ కనుక తండాలు అని అనడం సరియైనది అనుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఆ ఊర్ల పేర్లు కూడా  తండాలే.  జీపు మెల్లిగా అడవి దారి పడుతోంది. ఇంతకుముందు  దారులకిరువైపుల చెట్లు నాటే కార్యక్రమం అన్ని ఊర్లలో జరగలేదు. ఈ సారి మాత్రం ప్రభుత్వ చర్యల వల్ల గ్రామాలకు చెందిన అంటే రెవిన్యూ ప్రాంతాలలో రహదారులకిరువైపుల మొక్కలు నాటి ,సంరక్షించే బాధ్యతను గ్రామ పంచాయితీలకు ఇవ్వడం జరిగింది. అది కూడా చట్టబద్దంగా అప్పగించడం గ్రామాల వనీకరణలో ఒక గొప్ప సంస్కరణ . ఇంతకుముందు ఉన్న గ్రామ పంచాయితీ చట్టంలో కొన్ని సవరణలు చేసి ఈ ప్రతిపాదనను విజయవంతంగా అమలు చేస్తున్నారు. అది కూడా ఈ యేడు  మొదలవడంతో ప్రతి గ్రామ సరిహద్దు ప్రాంతాలన్నీ కొత్త కొత్త మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఇప్పటికే  నాటబడి చక్కగా కంచె కూడా కట్టారు.

ఇప్పటివరకు  చెట్లు నాటడం, నాటిన చెట్లను సంరక్షించడం వంటి బాధ్యతలు అటవీ శాఖ మాత్రమే చూసేది, అటవీ శాఖలోని  మానవ వనరులు రాష్ట్ర వనాభివృద్ది అవసరాలకు సరిపోయవి కావు, కానీ కొత్త పంచాయితీరాజ్  చట్టం – 2018   ఈ లోటును భర్తీ చేస్తూ స్థానిక సంస్థలను పర్యావరణ పరిరక్షణలో భాగం చేయడం ద్వారా త్వరితగతిన పర్యావరణ లక్ష్యాలను చేరుకోనే అవకాశం లభించనున్నది. రెండు వందల తొంభై ఏడు సెక్షన్లు ఉన్న ఈ కొత్త చట్టంలో అనేక చోట్ల ప్లాంటేషన్లను గురించి, నర్సరీల అభివృద్ది గురించి, రహదారుల వనీకరణ గురించి పేర్కొన్నారు . అంతే కాకుండా నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడం తప్పని సరి చేసి , చేరుకోనట్లయితే క్రమశిక్షణా చర్యలను కూడా సూచించారు.అందువల్ల ఈ చట్టం వనాభివ్రుద్ధి దృష్ట్యా విప్లవత్మకమైనదని అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ప్రతి గ్రామ పంచాయితీ  స్థాయిలో  సర్పంచ్ బాధ్యతలలో ప్రకారం  ప్లాంటేషన్ చేపట్టడం , గ్రామంలో పచ్చదనాన్ని పెంచడం [సెక్షన్ 32  సబ్ సెక్షన్ (1) (f) ] ఒకటి.ఇకనుంచి  గ్రామసభలో అటవీ శాఖకు చెందిన వన సేవకుడు(బీటు అధికారి ) కూడా [సెక్షన్ 6 (13),ఇదే చట్టం ఏడవ షెడ్యూల్లో పేర్కొనట్లుగా, ఇంకా సెక్షన్ 127(1) ప్రకారం] తప్పనిసరిగా పాల్గొనవలసి ఉంటుంది. గ్రామసభలో కూడా తప్పనిసరిగా వివిధ కార్యక్రమాల ద్వారా నిర్వహించబడే  ప్లాంటేషన్ల సంరక్షణ , వృక్షాల సంరక్షణ చర్యలు [సెక్షన్ 6(8)(c) ] , సామాజిక ఆస్తులు , ఉద్యానవనాల నిర్వహణ చర్యలు [సెక్షన్ 6(8)(f)ప్రకారం ] తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు గ్రామం లోని చిన్న స్థాయి అటవీ  ఫలసాయం మీద గ్రామసభనే యజమాని[ సెక్షన్ 260(10(b)].

సామజిక వనాల అభివృద్ధి కోసం జిల్లా పరిషత్ స్థాయిలో ఒక స్థాయి సంఘం [సెక్షన్ 183 (iii) ] గ్రామ పంచాయితీ  స్థాయి సంఘం [సెక్షన్  49(1)(c) ] ఏర్పాటు చేయడం వ్యవస్థాగతమైన  అంశాలు అయితే  వ్యక్తిగతంగా గ్రామ కార్యదర్శికి కూడా  చట్టపరమైన లక్ష్యాలను  అప్పగించారు. ఇందుకొరకు గ్రామ కార్యదర్శి వనాలను పెంచే చర్యలు చేపట్టడం, అందునా ప్రత్యేకంగా  గ్రామ పరిధిలో ఉన్న సామాజిక క్షేత్రాలలో పండ్ల మొక్కలను పెంచడం [సెక్షన్ 43 (6) (i)] ,  ప్రతీ ఇంటికి ఆరు మొక్కలకు తగ్గకుండా పిలకలను అందిచడం , ఒకవేళ మొక్కలు తీసుకున్న కుటుంబ యజమాని వాటిని దుర్వినియోగం చేసినట్లయితే గ్రామపంచాయితీ విధించిన  జరిమానా మొత్తం వసూలు చేయడం  [సెక్షన్ 43(6)(ii)], గ్రామ అంతర్గత రహదారులలో పచ్చదనం పెంపొందించడం, ఖాళీ ప్రదేశాలలో వనీకరణ [సెక్షన్ 43(6)(iii)] అన్నింటికన్నా ముఖ్యంగా చేపట్టిన వనీకరణ కార్యక్రమాలలో  ఎనభై ఐదు శాతానికి తగ్గకుండా మొక్కలు బతికేలా సంరక్షణ చర్యలు చేపట్టడం [ సెక్షన్ 43 (6)(iv)]  , గ్రామ అవసరాలకు తగిన విధంగా నర్సరీ పెంచడం [సెక్షన్ 43(6)(v)], ప్రతీ సంవత్సరం కనీసం  నలభై వేల  పిలకలను  ఉత్పత్తి చేసే    గ్రామ స్థాయి  నర్సరీల ను ఎర్పాటు చేయడం కూడా గ్రామ పంచాయితీ విధులలో [సెక్షన్ 52 (2) (B)(ii)]చేర్చారు. ఇటువంటివి ఇంతకు ముందు లేనివీ విప్లవాత్మకమైనవీనూ. అడవుల పెంపకమే కాదు గ్రామ పరిధిలో అనుమతి లేకుండా కొత్త చెట్లను నాటడం[ సెక్షన్ 96(1) ], ఉన్న చెట్లను నరకడం, పండ్లను , కొమ్మలను కోయడం, బెరడు తీయడం [ సెక్షన్ 96(2) ] నేరం . గ్రామ పంచాయితీ అనుమతి  లేని ఇటువంటి పనులకు  రెండు వేల రూపాయలకు  తగ్గకుండా జరిమానా [ సెక్షన్ 289  ] విధించే అధికారమూ ఇవ్వబడింది. ఇంకా  ఇలా గ్రామా పంచాయితీ నిర్ణయించిన జరిమానా విషయంలో యే  కోర్టూ జోక్యం చేసుకోలేదు కూడా .

గ్రామ పంచాయితీలలో కొత్తగా చేరిన అటవీ సంభంద  కార్యకలాపాలలో  గ్రామ స్థాయి అధికారులకు సాంకేతిక నైపుణ్యంలో సలహాలకోసం ముప్పై రోజుల ప్రణాళికలో అటవీ అధికారులను ఆయా గ్రామాలకు అనుసంధానం చేయడం జరిగింది, అందులో భాగంగా మేమూ మాకు కేటాయించిన గ్రామాలను సందర్శించి ఉపయుక్తమైన బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంది. కనుక మేమూ కాసేపు వీటి గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మళ్ళీ వచ్చే నెల దాకా మా పనులకు  కొంత అనివార్య విరామం. 

తండాల మధ్య నుంచి వెళ్ళే దారుల్లో  చెట్లు కొన్ని చిన్నవీ, పెద్దవీ. ఇలాటి దారి కనపడినప్పుడు ఆ దారి కొత్తగా ఏర్పడిన దారి అని గుర్తించవచ్చు. ఎప్పటి నుంచో ఉన్న దారులైతే దారికి ఇరువైపులా ఒక మోస్తరు పెద్ద వయసు చెట్లు ఉంటాయి. అలా కాకుండా అస్తవ్యస్తంగా ఉన్న చెట్లవరుస,చిన్న దారువు ఉన్న చెట్లు  ఆ దారి  కొత్తగా ఏర్పడిన దారి అని  చెప్పకనే చెప్తుంది. అడవులు నరికి వ్యవసాయ క్షేత్రాలూ ,గ్రామాలూ వెలసే చోట ఇలా కొత్త దారులు పుడుతుంటాయి. ఒక్కొక్క చోట    దారికి యేదో ఒక వైపు కొంచం లోపలికి ఓ మోస్తరు  పెద్ద చెట్లు ఉన్నచోట జాజు రంగు పూసిన  గద్దెలు కట్టి ఉన్నాయి. వరంగల్ ప్రాంతంలో ఈ కాలంలో చక్కగా అలంకరించిన ఇటువంటి గద్దెలు కనిపిస్తాయి. మంచి ఆరోగ్యంగా ఉన్న చెట్టు వద్ద గద్దెలా కట్టి దానిపై ఏడు రాళ్ళు పాతి ఉన్న  చెట్లు రెండు మూడు చోట్ల కనిపించాయి. ఇదివరకు ఇలాటివి చాలా సార్లు కనిపించాయి . పోయిన నెలలో అంటే ఆగస్టు నెలలో పాకాల బీటుకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాటి చెట్లే చూసినప్పుడు అది సిత్లా భవాని అని  మా డ్రైవర్  భద్రు చెప్పాడు. అప్పుడు వెంటనే వివరాలు అడిగే సమయం లేకపోవడంతో ఆ విషయం మతిలో లేదు. ఇవ్వాళ మళ్ళీ  మేడపల్లి వైపు వెళ్తుంటే ఈ సిత్లా భవానిని  కొలుచుకున్న  గద్దెలు కనిపించాయి.వేరు వేరు సందర్భాలలో  మా బృంద సభ్యులను ఈ విషయం గురించి అడిగాను . మనం కూడా  చాలా విషయాలు యథాలాపంగా  గడిపేస్తుంటాం గానీ లోతుల్లోకి వెళ్లడం చాలా సులభంగా చేసే పని కాదనుకుంటాను. అయితే వారు  పూర్తి సమాచారం ఇవ్వలేకపోయారు .  ముగ్గురూ మూడు రకాలుగా చెప్పారు. అందరూ చెప్పిన   విషయం ఏమిటంటే సిత్లా భవాని, లంబాడ ప్రజల పశువులను రోగాల బారి నుడి రక్షించే దేవత, ఏడుగురు అక్క చెల్లెళ్ళలో చివరిది, ప్రతీ యేడు సిత్లా భవాని పండుగ చేయడం వారి ఆచారం అని.

సిత్లా భవాని ఆషాడమాసంలో అమావాస్య తర్వాత  వచ్చే మొదటి మంగళవారం నాడు చేసే ఊరు పండగ . అప్పుడు తండా వాసులంతా  ముందుగా నిర్ణయించుకున్నట్లుగా అడవిలో ఒక వేప చెట్టు కింద గానీ రావి చెట్టు కింద  గానీ  లేదా ఇంకా పెద్దగా పెరిగిన ఎటువంటి చెట్టు కిందనైనా ఒక గద్దె  కట్టి దానిమీద ఒక మోస్తరు పరిమాణంలో ఉన్న  ఏడు  రాళ్ళను  పాతుతారు. ఇందులో   మధ్యలో ఉన్న రాయి  పెద్దగాను క్రమంగా చిన్నగా ఉండే లాగా పాతుతారు. గద్దెకు , రాళ్ళకు కూడా జాజు రంగు వేస్తారు.ఎటువంటి రాళ్ళను ఇమ్డుకోఅర్కు ఎంపిక చేత్సరన్న విషయంలో పెద్ద పట్టింపు లేదు. ఇతర యే అలంకారాలు ఉండవు. అక్కడ ఉంచిన ఏడురాళ్ళూ  ఏడుగురు అమ్మవార్లకి ప్రతీకలు. లంబాడాల  ఆచారం ప్రకారం ఒక సంవత్సరం అంతా కూడా వారికి ఉన్న పశు సంపదను ఇలా ఏర్పాటు చేసుకున్న చెట్టు కింద వెలయించిన  అమ్మవారికి  పూజచేసి ఆ చెట్టు వద్దనుంచి దాటిస్తే ఆ ఏడాది అంతా వాటికి  ఎటువంటి ప్రమాదం రాకుండా ఉంటుంది.   తర్వాత అమ్మవారికి అంటే సిత్లా భవానికి మేకనో , గొర్రెనో అర్పించి  అందరూ కలిసి ఆరగిస్తారు. అడవిలో నివాసం ఉండే మరో గిరిజనులైన  కోయలలో ఇలాంటి ఆచారం ఉండకపోయినా ఇలా ఊరంతా చేసుకునే పండగలో  ఒకే ఇంటి పేరుతో ఉన్న వాళ్లంతా కలిసి చేసుకునే పండగలు ఉంటాయట. ఒకే  ఇంటి పేరుతో ఉన్న వాళ్ళు ముందుగ అనుకున్న  రోజుల్లో అడవిలోకి వెళ్లి అక్కడే రెండు మూడు రోజులు ఉండి కలిసి తిని అడవిలోనే ఉండి పండగ  చేసుకుని వస్తారట .

ఈరోజు కూడా సిత్లా భవాని గురించిన విశేషాలు చెప్పమని మా వాళ్ళని అడిగాను. ఇదివరలో ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు మాటల్లో లంబాడాల ఇష్టమైన వంట  సొలాయ్ ప్రస్తావన వచ్చింది. నూనె  ఏ మాత్రం లేకుండా వండే వంటకం అది. లంబాడాలు  మాంసాహారులు. అయితే పశువులను మాత్రం తినరు. అడవిలో దొరికే జంతువులను తినడం వారికి అలవాటే. సాధారణంగా మేకలు , గొర్రెలు తింటారు.  సొలాయ్ కోసం మేకనో గొర్రెనో కోసినప్పుడు ఒక గిన్నెలో రక్తం పడతారు దానికి వెంటనే ఉప్పు ,చింతపండు కలుపుతారు. దాని వల్ల రక్తం గడ్డకట్టదు. ఆ తర్వాత మాంసాన్ని మంచి నీటిలో ఉడికించి  చింతపండు కలిపిన రక్తాన్ని కలుపుతారు. దీనిలో ఎటువంటి నూనె కలపకపోయినా మాంసంలో ఉండే కొవ్వుతో నూనె ఊరుతుంది. సొలాయ్ గురించి విన్నప్పుడు  లంబాడాల  జీవనశైలి అత్యంత సామాన్యమైంది అయితే ప్రత్యేకమైనదని అనిపించింది .

ఇంకా సిత్లా భవాని చరిత్ర గురించి వచ్చిన సందర్బం ఈసారి వదులుకోలేదు నేను. మా బృంద సభ్యడు లాల్ సింగ్  తెలుసుకుని చెప్పినదాని ప్రకారం పూర్వం సూర్యవంశం ,చంద్రవంశం అనే రెండు వంశాల లంబాడాలు ఉండేవారట. అన్నదమ్ములు ఇద్దరూ కూడా పశువుల కాపరులు గానే ఉండే వాళ్ళు. లంబాడాల సంప్రదాయ జీవన విధానంలో లాగానే ఇద్దరు అన్నదమ్ములు  పశువులను తోలుకుని అడవులకు వెళతారు. వెళ్ళిన చోట గడ్డి అయిపోగానే మరో చోటికి తరలి వెళతారు.  ఇలా ఒక చోట నుండి మరొక చోటికి వెళ్లేటప్పుడు వారివారి పశువులకు వింతవింత రోగాలు వచ్చి చచ్చిపోతే వారికి తరచుగా నష్టం కలుగుతుంది. అలా పశువులు చనిపోకుండా ఉండడానికి  పరిష్కారం కోసం ఎవరో చెప్పగా ఎరుకల నాంచారి వద్దకు వెళతారు. ఆమెను  పరిష్కారం అడుగుతారు. ఎరుకల నాంచారి  వారికి  అడవిలో ఒక  చోట ఒక గుంత తీసి దానిలో ఎవరినైనా  నిండు గర్భిణిని పూడ్చి పెట్టి పశువులను దాటిస్తే  ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్తుంది. అన్నదమ్ములిద్దరూ ఎరుకల నాంచారి చెప్పిన ప్రకారం వెతుకుతారు.  వారికి ఆమె చెప్పిన లక్షణాలు ఉన్న స్త్రీ దొరకదు. అన్నదమ్ములిద్దరూ  వారి భాషలో ఎవరో ఎందుకు ఎరుకల నంచారే ఉంది కదా అని మాట్లాడుకుని అన్ని  ఏర్పాట్లు  చేసుకుని ఆమెనే పాతి వేస్తారు.  అయితే ఇదంతా చంద్రుని ప్రణాళిక. సూర్యునికి తెలియదు. ఇందుకు కోపించిన  నాంచారి , చంద్ర వంశం వాళ్ళు నశిస్తారని శపిస్తుందట. ఆ విదంగా చంద్రవంశం వాళ్ళు నశించి సూర్యవంశం వాళ్ళు మిగిలారట. ఇప్పుడు ఉన్న  లంబాడాలు సూర్య వంశస్థులె  అని చెప్పాడు.

నేను ఇంతకుముందు  భంగ్యా భుక్యా రాసిన  నిజాం పాలనలో లంబాడాలు (Subjugated Nomads ; The Lambadas under the Rule of the Nizams  అన్న గ్రంధానికి సంక్షిప్త తెలుగు  అనువాదం) అన్న పుస్తకం చదివాను. లంబాడాలు ఎక్కడివారో వారి ప్రస్థానమేమిటో తెలిపిన పరిశోధన గ్రంధం అది. భారతదేశంలో ప్రజలు రాజరిక పాలనా క్రమంనుంచి వలసవాద క్రమానికి నెట్టివేయబడినప్పుడు  అనివార్యంగా పశుపోషకులుగా మారిన బిడారు వర్తకులు లంబాడాలు. సామాజిక  జీవనం  ఒక ప్రస్థానం నుంచి మరో స్థాయికి మారుతున్న క్రమంలో జీవిక కూడా మార్పు చెందడం లంబాడాలను గొప్ప పశుప్రేమికులను చేసింది. అంతకుమించి అడవికి దగ్గర చేసింది. పశుపోశాకులుగా మారి  స్వేచ్చా సమాజాలుగా  అడవితో సాన్నిహిత్యం కలిగిన వీరు, అటవీ యాజమాన్యం మారినప్పుడల్లా కుదుపులకు లోనయ్యారు. పశు సంరక్షణలో అద్వితీయమైన మెళకువలు తెలిసిన లంబాడాలు ఆధునిక పశుపోషణ శాస్త్రానికి ఆద్యులు. వారి నుంచి సేకరించిన విషయాలతోనే పశు పోషణ శాస్త్రం రూపొందించబడిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో అంతో ఇంతో పశుపోషణ జరుగుతున్నది అంటే  అది లంబాడాల వల్లనే. నాతో పాటు పనిచేసిన మరొక అధికారి లంబాడాలలో  కట్నం అంటే పశువులేనని తన వివాహనికి వారి మామగారు వంద పశువులని ఇచ్చాడనీ చెప్పాడు. ఇంకా  భంగ్యా భుక్యా తన పుస్తకంలో కూడా  అనేక అంశాలను ప్రస్తావించాడు. కానీ సిత్లా భవాని అని కాకుండా “ శీత్ ల” ఉత్సవాన్ని జులై ఆగష్టు మాసాలలో నిర్ణీత రోజుల జరుపుకుంటారని , లంబాడా తెగ నాయకుడు , నాయక్    సప్త మాతృదేవతలు తోల్జా ,కంకాళీ, హింగ్లా ,మంత్రాల్, ధోలాంగర్,అంబ, మారెమ్మ ప్రతి రూపాలుగా  ఏడు విగ్రహాలను ప్రతిష్టిస్తారానీ వీరికి లుకిడియా అనే సోదరుడు ఉంటాడనీ సప్త మాత్రుకల స్థానానికి ౩౦ అడుగుల దూరంలో అతనిని  కూడా ప్రతిష్టిస్తారని ( పేజి నం  127 ) రాశాడు . ఇప్పుడు చూస్తున్నది  అదే కదా అన్న స్పృహ నాకు ఈ విషయాన్ని మరింత తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించింది. బహుశా ఉత్సవం  పేరు పలకడంలో ఉన్న తేడా వల్ల నాకు తొందరగా అర్థం కాలేదేమో. అయితే ఆయన సప్త మాతృకలు లేదా సాతీ భవాని గురించిన  ప్రస్థావన చేస్తూ ధరావత్ ఖమ్డా అనే అతని ఉన్న ఏడుగురు ఆడపిల్లలు పశువులను తోలుకొని అడవికి వెళ్ళినప్పుడు పాము కాటుకు గురై మరణించి వారి ఇష్టదైవమైన భవానిలో  ఐక్యమై పశువుల రక్షణకై దేవతఃలుగా మారతారు(పేజీ నం. ౩౦)అని రాసారు. వీరు చల్లగా చూసినింత కాలం తమ పశువులకు ఏమీ కాదని లంబాడాల విశ్వాసం.  ఈ ఆరాదన పద్ధతి అంతా కూడా తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతలకు చేసినట్లే ఉంటుంది.  పుస్తకంలో రాసిన దానికీ లాల్ సింగ్ చెప్పిన విషయానికీ భేదం   ఉన్నా మౌఖిక సంప్రదాయంగా సంరక్షించబడిన ఆచార వ్యవహారాల్లో ఇటువంటి  వైరుధ్యం సాధారణమే. ఏది ఏమైనా   నాకు కొన్ని కొత్త  విషయలు తెలిసాయి, తెలిసినవి రూడీ అయ్యాయి. ఈలోగా జీపు   బీటు ప్రాంతానికి చేరుకున్నది.

బీటుకు వెళ్ళే దారిలో కుడి వైపున  గొల్లపల్లి చెరువు, మొండి గుట్టల అంచు , వాలుకు కొంత దూరంలో  మనుబోతుల మడుగు ,మడుగులో ఎర్రని  నీళ్ళు బహుశా నిన్న మొన్న వర్షాలకు గుట్ట మీద నుంచి కొట్టుకువచ్చిన మట్టి ఇంకా పేరుకోలేదనుకుంటా , మడుగు దగ్గర పచ్చటి గడ్డి. లేత మబ్బులు  ఓహ్.. ఎంత సుందరమైన  దృశ్యం ..! యే  చిత్రకారుడు దొరకబుచ్చుకోని అందం నా కామెరాలో ఒదిగిపోతున్నది.  మనుబోతుల గడ్డ అని ఇక్కడికి కొంచం దూరంలో ఇంకో ప్రాంతం ఉంది … మనుబోతుల గడ్డ ఇప్పుడు ఒక  ఊరు. అక్కడ ఒకప్పుడు మనుబోతులు విస్తారంగా ఉండేవట. ఇదేమో  మనుబోతుల మడుగు ఇంతకు ముందు కాలంలో  ఇక్కడికి  మనుబోతులు వచ్చేవట ,దాహం తీర్చుకుని సేదతీరే ఈ మడుగు ఇంకా పెద్దగా ఉండేదట. ఇప్పడు చిన్న మడుగులాగే ఉన్నది. మనుబోతు అంటే ఒక పెద్ద పరిమాణంలో ఉండే దుప్పి (Blue Bull or  Nilgai : Boselaphus tragocamelus). ఒకప్పుడు వాటి సంఖ్య ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండి  నీళ్ళు  తాగడానికి వచ్చేవట. ఒక మనుబోతులే కాదు ఇంకా ఇతర శాఖాహార జంతువులు ముఖ్యంగా దుప్పులు, కుందేళ్ళు, జింకలు, అడవి దున్నలు ఉండేవని ఈ బీటులోని గడ్డి చూస్తేనే  అర్థమవుతుంది.

బీటు భూభాగం గుట్ట పాదం,  అది దాటితే  గుట్ట ఎక్కాలి , మరీ పెద్ద గుట్ట ఏమీ కాదు. మా సామన్లు ఒక GPS (Global Positioning System) , బీట్లో అక్రమ నరుకుళ్ళను నమోదు చేసే రిజిస్టర్, ఒక బ్రష్ , ఒక ఎరుపు రంగు పెయింటు డబ్బా, కొడవలి లాంటి ఒక వస్తువు ( ఇది అడవిలోకి వెళ్ళినప్పుడు అడ్డుగా ఉన్నపోదాలను  తప్పించడానికి ), ఒక టైలర్ టేపు, నీళ్ళ సీసాలను తీసుకొని బయలు దేరాము. ఇక్కడ మరీ ఎక్కువ  చెట్లు లేవు. గుట్టపైన చెట్లు ఉన్నాయి. అవి కూడా మరీ పెద్దవి కాదు. ఇలా బీటుకి వెళ్ళినప్పుడు  ఎక్కడైతే  చెట్టు నరకబడి ఉంటుందో దాని మొట్టు చుట్టుకొలత  టైలర్ టేపుతో కొలిచి రిజిస్టర్లో నమోదు చేస్తారు. మొట్టు మీద పెయింటు తో  నరకబడిన సంఖ్య రాస్తారు. నరకబడిన చెట్టు జాతిని బట్టి  దాని విలువను అంచనా కట్టి ఆ బీటు అధికారి జీతంలో నుంచి కోత విధిస్తారని ఇంతకు ముందే ప్రస్తావించాను. అటవీ సంపద ఒక బహిరంగ ప్రజా ఆస్తి, దాన్ని నరికిన  విచక్షణ లేని వ్యక్తుల స్వలాభం , బీటు అధికారి నెల జీతానికి గంటు పెడుతుంది. ఒక్కోసారి మూకుమ్మడిగా ప్రజలు స్థలం కోసం రాత్రికి రాత్రి మొత్తం అడవిని నరికేస్తారు. అప్పుడు ఇటువంటి నష్టం దశలవారీగా పై అధికారుల వరకు పడుతుంది. యే కంచే కట్టలేని ఇంత సంపదను కాపాడుకోవాలంటే  ప్రజలకు , అధికారులకు సమాన బాధ్యత ఉందని గుర్తించనంత కాలం అటవీ అధికారులకు ఇటువంటి నెల జీతపు కోతలు   తప్పవేమో. ఇప్పుడు  మరీ పెద్దవీ విలువైనవీ అయిన వృక్షాలు లేవు అంటే వాణిజ్య పరంగా విలువైనవి కాదు అని . కేవలం గుంజల పరిమాణంలో ఉన్న చెట్లు అనేకంగా ఉండి అక్కడక్కడ కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి. కావలసింత ఎండ తగిలేలా ఉన్న కారణం చేత గడ్డి చిక్కగా మొలిచింది.

          అందరం కలిసి లోపలికి వెళ్తున్న కొద్దీ అందాజాగా  ప్రతి  పదిపదిహేను ఎకరాల విస్తీర్ణానికి  ఒక కొత్త గడ్డి జాతి ఉంది !   వెళ్తున్న చోటంతా గడ్డే. ఇంకొక ఆశ్చర్యకరమైన  విషయం ఏమిటంటే ఇక్కడ పార్థీనియం కానీ , మహావీర గానీ లేవు..! అయితే  ఇక్కడ గడ్డి జాతులే బలమైన  వృక్ష సమూహాలు కావచ్చు లేదా    కొత్తగా అడవి నరికిన చోట కూడా  ఇలా జరగవచ్చు. స్వచ్చమైన గడ్డి భూమి.  అంటే ఈ గడ్డి జాతులన్నీ ఈ ప్రాంతపు అసలు సిసలు వారసులన్నమాట. ఇది ఇలాగె కొనసాగితే బాగుండు. ఇలాటి ప్రాంతం ఒకటి చూస్తానని అనుకోలేదు. ఒక పరిశోధక విద్యార్థికి  ఏమైనా కొత్త  విశేషాలు లభిస్తే ఎంత ఉత్సుకతతో ఉంటాడో  నాకు అలాగే అనిపించింది. ఇటువంటి చోట ఉన్న సహజ జాతులను డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. చిన్న చిన్న పువ్వులున్న  నాలుగైదు రకాల మొక్కలను  నేను కొత్తగా చూస్తున్నాను. నేల సారవంతంగా ఉండడమే  కాకుండా   మెత్తగా ఉన్నటువంటి చోట  అక్కడక్కడా బొరియలలాంటి గుంటలు ఒక దానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ప్రతి బొరియకు  బొరియకు  ఆరేడు అడుగుల  దూరంతో కాలు వేస్తే దిగబడి పోతాము అనేటంత మెత్తగా ఉండి ఒక దానికి ఒకటి నేలలో లోపల  చాలా చాలా దూరం వరకు వ్యాపించి  ఉన్నట్టుంది. బాగా వర్షం వచ్చినప్పుడు నీటిని ఎక్కడికక్కడ భూములలోపలి పొరల్లోకి ఇంకేలాగా ఉన్న సహజ  ఏర్పాటు కావచ్చు, గుట్ట పై నించి వర్షాలకు తరలి వచ్చిన మట్టి స్తరాలుగా పేరుకునే క్రమమూ కావచ్చు. అటువంటప్పుడు నేల పై పొరలలో నీటిశాతం ఎక్కువగా ఉండి పచ్చిక జాతులను సంరక్షిస్తుంటుంది.

          మొండి గుట్ట అంచుకు  చేరే వరకు ఉన్న మెత్తటి మట్టి, గుట్ట ఎక్కుతున్నప్పుడు లేదు. గుట్ట భాగం అంతా మొనదేలిన రాళ్ళతో  ఉంది. ఇక్కడ గడ్డి కాకుండా  చిన్న చిన్న మొక్కలు  ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు గుట్ట మీద సరైన పచ్చదనం లేకపోతే వర్షపునీటి వేగానికి పై పొర కొట్టుకుపోయి రాళ్ళు తేలుతుంది. గుట్టల మీద యే చెట్లూ లేకపోతే కనీసం గడ్డి అయినా సరే ఉండాలి. అప్పుడే  అది నేల కోత పడకుండా ఆపుతుంది .  గుట్ట మీద ఉన్న ప్రాంతంలో చిన్న చిన్న మొక్కలు విస్తారంగా వచ్చాయి.   చిన్న మొక్కలు తప్ప కొంత  దూరం వరకు చెట్లు లేవు. ఈ ప్రాంతం అంతా కూడా ఆక్రమణ దారులు అడవి నరికివేయడం వల్ల ఇలా బయలు ప్రాంతం అయింది. ప్రస్తుతం అటవీ భూమి స్వాదీనం చేసుకున్నప్పటికీ నరికి వేయబడిన చెట్లను  మాత్రం తిరిగి బతికించలేము కదా! మళ్ళీ అంతటి అడవి ఏర్పడాలంటే చాలా కాలం పడుతుంది.   గుట్ట పైపైకి వెళ్లేటప్పటికి  ఉన్న చిన్న చిన్న మొక్కలమీద  రెండు మూడు పక్షి గూళ్ళు కన్పించాయి.  అవి బలమైన చెట్లు కావు. అయినా  మరో దారి లేక పక్షులు  గూళ్ళు పెట్టుకున్నట్టున్నాయి. ఈ కాలం పక్షులు గుడ్లు పెట్టే కాలం , ఈ కాలంలో  ఎక్కడ చూసినా గడ్డిపరకలు ఏరుకొని గూళ్ళు కట్టుకున్న , కట్టుకుంటున్న  పక్షులే కనబడుతున్నాయి. ఈరోజు చూసిన పక్షి  గుడ్లు చిన్నగా  తెలుపు రంగులో ఉన్నాయి. గూడు ఆకుల దొన్నె , చిన్న పరకలతో కట్టుకున్నది. పక్షి గుడ్లను గూళ్ళను ఫోటోలు తీయకూడదు , గుడ్లకు ఏ చిన్నపాటి కాంతి  కిరణం తగిలినా వాటి పెరుగుదలలో తేడా వస్తుందట. కిరణ కాంతికి పక్షి గుడ్లు  అంత సున్నితమైనవన్నమాట . అందుకే  నేను పక్షి  గుడ్లను  ఫోటోలు తీయను. అప్పటికే ఆ తల్లిపక్షి అనుకుంటాను అటూ ఇటూ తిరుగుతున్నది. చూసి యధాతదంగా కొమ్మలను సరిచేసి వెళ్లిపోయాం.

       మధ్యాహ్నం అయింది. అక్కడే ఉన్న మట్టి గడ్డ మీద కూర్చోని ,కూడా తెచ్చుకున్న నీళ్ళు , అరటిపళ్ళు తినడానికి ఉపక్రమించాము. డ్రాగన్ ఫ్లైస్ , సీతాకోకలు , చిన్న చిన్న పురుగులు సందడిగా తిరుగుతూ మహానగర ట్రాఫ్ఫిక్ను తలపిస్తున్నాయి. మరో వైపు  చీమల బారు . దూరంగా ఉన్న ఒకే ఒక చెట్టు మీద  సందు లేకుండా పక్షి గూళ్ళు . బహుశా అది పొలం అనుకుంటాను. పక్షుల శబ్దం ఇక్కడికి వినిపిస్తున్నది.  గడ్డి ఉన్న చోట కలియదిరుగుతున్న పక్షులు ఒక్కో పరకను మోసుకు పోతున్నాయి , కొన్ని మాములుగా వెళ్తున్నాయి , ఇలా వెళ్ళేవి ఆహారం కోసం వచ్చి ఉంటాయి. అరటిపండు ఒలుచుకొని తిని తొక్కలని  ఒక చోట పెడుతున్నాను . బిస్కట్స్ కవర్ మాత్రం నా బాగులోనే వేసుకున్నాను. మా వాళ్ళు కొంత దూరంలో కూర్చొని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ తింటున్నారు.  మౌనంగా గాడమైన ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకున్నాను. ఎండ లేదు . పైన నీలాకాశం , కింద పసరికల తివాచీలు ,చల్లని , బరువైన గాలి ఒక పక్క ఒరిగితే బాగుండునని అనిపించింది. ఆ అవకాశం లేదు కనుక కొద్దిగా వెనుకకు  వాలి రెండు చేతుల్ని మోకాళ్ళ మీద ఉంచి చూస్తుండిపోయాను. 

బరువైన గాలికి గడ్డిపరకలు బద్దకంగా కదులుతున్నాయి.ఇవి సహజంగా పెరిగిన గడ్డి మొక్కలు. చిక్కగా ఉండడం వల్ల వాటి తలలు గాలి వాటుకు తెరలు తెరలుగా కదులుతున్నాయి.  ఏపుగా పెరిగిన  వరిపొలాల మీద గాలి వీచిప్పుడు  ఆ వరి కొనలు ఒక లయతో కదులుతుంటాయి. ఇంగ్లీషులో అలా కదిలే లయను పెరిస్టాటిక్ కదలికలు అంటారు. జంతు శాస్త్రం చదువుకున్నప్పుడు పారమీసియం అన్న ఒక చిన్న నీటి జీవి పైన ఉన్న కేశల్లాంటి నిర్మాణాలు కూడా ఇలాగే కదులుతుంటాయని చెప్పారు. ఇలాటి  కదలికలే మనుషుల పెద్దపేగులోనూ  ఉంటాయి.   పక్షులు పెద్ద పెద్ద ఆకుల్ని, వదిలేసి నిట్ట నిలువుగా ఉన్నపలుచని గడ్డి పరకల్ని  గూడు కోసం ఎంచుకుంటున్నాయి. అట్లా ఎంచుకోవడం వెనుక యే ప్రత్యక్ష శిక్షణ లేని వాటికి ప్రకృతే వాటి మెదడులో ఒక పురా విజ్ఞానాన్ని పేర్చిన విషయం స్పష్టమవుతుంది.  ఒక్కో పక్షి జాతికి ఒక్కో గడ్డి జాతి , వాటి ఎంపికలో ఎంత  ఖచ్చితమైన  శాస్త్ర్రీయత ఉన్నదో నాకు గడ్డి పత్ర నిర్మాణంలో  సిలికా ఉంటుందని తెలుసుకునే వరకు అర్థం కాలేదు. ఈ సిలికా ఉన్న కణజాలమే ఎండిన  గడ్డి పరకల  గట్టి దనానికి  కారణం. పిడికెడు పిట్ట ఇది కనిపెట్టేసింది. గడ్డి పరకలతో  అల్లిక వేస్తే తన గూడుకు మరింత బలం అని అల్లడం నేర్చుకుంది. ఈ విషయమే వేమన పద్యమొకటి  రాస్తూ ఐకమత్యమే మహా బలమని చెప్పడానికి ఉపమానంగా తీసుకున్నాడు. “ఐకమత్య మొక్క టావశ్యకం  బెప్డు ,దాని బలిమి నెంతయైన గూడు , గడ్డి వెంటబెట్టి కట్టరా యేనుంగ , విశ్వదాభిరామ  వినుర వేమ!” అని   ఎలాగైతే  అల్లిన గడ్డి పరకలు బలమైన ఏనుగునైనా కట్టివేయగలవో ఐకమత్యంగా ఉంటె అంత బలమనీ రాశాడు . ఇలాటి గడ్డి జాతుల నుంచే ఆదిమ మానవుడు గుప్పెడు గింజలు సేకరించుకోవడం నేర్చుకున్నాడు. అటు తర్వాత సాగు చేయడం నేర్చున్నాడు. ఇది అంత సులువైన విషయం అని అనుకోను. ఈనాడు ఈ మాత్రం గడ్డి జాతులు ఉంటే ఆదిమ మానవుని కాలంలో ఇంకా ఎన్నో జాతులు ఉండే అవకాశం ఉంది. అందులోనుంచి తనకు కావలసిన  ఆహారాన్ని తెలుసుకోవడం కోసం , పండించడం నేర్చుకోవడం కోసం ఎంత తపన  పడ్డాడో గానీ అది   నిప్పును ఉపయోగించుకోవడానికీ  , చక్రాన్ని  కనిపెట్టడానికి  మధ్య ఒక గొప్ప సంఘర్షణ అయ్యి ఉంటుంది . ఎలా కనిపెట్టాడో తన ఆకలి తీర్చే శక్తి  గడ్డి పొదలలో దాగి ఉందని ,  యే పక్షులకు ఏకలవ్య శిష్యుడయ్యాడో, యే ఎలుకల కలుగులలోకి తొంగి చూసాడో , యే చీమల గుమ్ములకోసం దేవులాడాడో ఏదైతేనేం  అదే నాగరికతకు ఆరంభం అయింది. మన పూర్వీకుల మేదో సంపత్తికి  దివిటీలు పట్టుకున్నది ఈ చిన్న చిన్న జీవులే…ఈనాటి  మానవ జాతి ప్రస్థానం మొత్తం గడ్డి మీదే ఆధారపడి  ఉన్నది. తినే అన్నమూ ,  గూడు కప్పుకున్న ఆకులు ,అల్లుకున్న చాపలు , తొలినాటి కలప వెదురు అన్నీ గడ్డి జాతులే. ఈనాడు  భూమి మీద అత్యధికంగా సాగులో ఉన్నది గడ్డి జాతులే. ఇక ముందు కూడా అవే ఉంటాయ్.

ఆవరణ వ్యవస్థలో గడ్డి భూములదీ ఒక ప్రత్యేకమైన స్థానం ,  పరిణామక్రమంలో అత్యంత ఆధునిక వర్గం గడ్డి జాతులే. తొందరగా జీవితకాలాన్ని ముగించి ఎక్కువ మొత్తంలో వ్యాపించే లక్షణం కలిగి ఉండడం వీటిని ఆధునిక జీవులుగా ఉంచింది. ఆంగ్లంలో ఇటువంటి జీవిత చక్రాన్ని కలిగి ఉండే జాతులను ఎఫిమేరల్స్ (Ephemerals)  అంటారు. ఇంకా సుళువుగా అర్థం చేసుకోవాలంటే ఒక రుతువులో జీవిత కాలాన్ని పూర్తి చేసుగలవీ అని చెప్పుకోవచ్చు.అందుకే  వసంత,   వర్ష , హేమంత, గ్రీష్మ రుతువులలో  వచ్చే  గడ్డి వేటికి అవే  ప్రత్యేకమైనవి. పర్యావరణపరంగా వర్ష రుతువుకు ఎక్కువ ప్రాధాన్యత, ఆ కాలంతో ముడి పడిన పశు పక్ష్యాదుల  జీవనం వల్ల వచ్చింది. ఒక్క సారి ఊహించండి ఏదైనా పశువు ఏప్రిల్ ,మే మాసంలో లేదా మరో రుతువులోనో   తన సంతతిని అభివృద్ధి చేసుకుంటే దానిని ఆహారపు కొరత  ఎంత ఇబ్బంది పెడుతుందో. పక్షులు కూడా అంతే , ఎక్కువ పక్షులు వర్షాకాలానికే లంకె వేసుకున్నాయి. అప్పుడైతే పచ్చని ఆకులు వాటి మీద సమృద్ధిగా దొరికే పురుగులు ఇలా ఒకటి మరొకదానితో   ఆహారం కొరకు ఆధారపడి ఉండడం  ప్రకృతిని సంతుల్యతను పరిరక్షించే ఒక సాధనం.

గడ్డి అంటే మోకాలు ఎత్తువరకు పెరిగే గడ్డి, మన ఎత్తు పెరిగే తుంగ మనకు బాగా తెలుసు కదా, నేను ఇంతకుముందు వెళ్ళిన అసోం రాష్ట్రంలోని  కజిరంగా జాతీయ పార్కులో ఏనుగు గడ్డి ( ఎలిఫంట్ గ్రాస్ Arundo donax ; హస్తి దర్భ అందామా)  దాదాపు పది మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది . అందులో ఏనుగు కూడా కుందేలు పిల్లలాగా కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేల గడ్డిజాతులు గుర్తిస్తే దాదాపు మనదేశంలో పదమూడు వందల వరకు గుర్తించారు. గడ్డి జాతులు  చాలా వైవిధ్యం కూడా ప్రదర్శిస్తాయి. ఇప్పుడు నేను చూస్తున్న చోటలో ఉన్న గడ్డి ఆ జాబితాలో ఉన్నదో ,లేదో ఒకవేళ లేకపోతే  ఎప్పటికైనా ఆ జాబితాకు ఎక్కుతుందో లేక ఎక్కకముందే అంతరించి పోతుందో ..ఏమో మారుతున్న విద్య , ఆర్ధిక ప్రయోజనాలు , అభవృద్ధి  పెనుగులాటల మధ్య వెనుకబడిన విజ్ఞాన అన్వేషణ ఇటువంటి సహజ సంపదను గుర్తించక ముందే  విశ్వంలో కలిసిపోనుందో. ఒక్కసారి మానవుల లక్ష్యాల జాబితాలో  వీటి అన్వేషణను కూడా తప్పనిసరి చేస్తే బాగుండును.

ప్రపంచ వ్యాప్తంగా మానవ నాగరికతలను ప్రభావితం చేసిన గడ్డి మన దేశంలో కూడా చెప్పుకోదగిన చరిత్రనే నమోదు చేసింది. నాగరిక సమాజపు తొలి వృత్తి, పశుపోషణకు ఆలంబన గడ్డే . రాజులూ రాజ్యాలూ వాటి సామ్రాజ్యపు విలువ పరోక్షంగా  గడ్డి భూముల మీదనే ఆధారపడ్డాయి.  ఋగ్వేదపు కాలం నాటి ప్రధాన వృత్తి  పశుపోషణనే. తొలినాటి మానవ సమాజాల వ్యాప్తి గడ్డి భూములను వెతుక్కుంటూనే  జరిగింది. ఆశ్చర్యకరంగా భారతీయ పురా మౌఖిక గ్రంధాలైన వేదాలలో దర్బ అనే పిలువబడిన గడ్డిని నిర్దేశించిన  క్రతువులలో వాడబడడం. యజ్ఞ యగాదులలోనే  ధ్యానం కొరకు దర్బ గడ్డి చాపాలను వినియోగించడం మనకు  తెలుసు . ధ్యానం చేసేటప్పుడు ఉత్పన్నమైన శక్తి , కాళ్ళ ద్వారా , పాదాల ద్వారా నేలకు చేరకుండా గడ్డి చాప అడ్డగిస్తుందని చెబుతారు. దర్భని శాస్త్రీయంగా  Desmostachya bipinnata అని పిలుస్తున్నప్పటికి

మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి. మన సంస్కృతిలో ధర్భను  వినియోగించడం వెనుక ఉన్న శాత్రీయతను  సహేతుకంగా పరిశీలించడం కొరకు Centre for Nanotechnology  and advanced Biomaterials ( CeNTAB ) and Centre for Advanced Research in Indian System of Medicine ( CARISM ) of Sastra University , Thanjavur కు చెందిన   డా. మీరా , డా. బృందా  ల అధ్వర్యంలో ప్రయోగాలు చేసారు.   వారి బృందం  దర్బ గడ్డి ఎందుకు పవిత్రమైందిగా  భావించారో పరిశోధన చేసింది. ఆవు పాలతో  చేసిన పెరుగును లెమన్ గ్రాస్, బెర్ముడా గ్రాస్  , వెదరు వంటి  వివిధ రకాల గడ్డిని ఉపయోగించి పరిశీలించినప్పుడు దర్భ గడ్డిని ఉంచిన చోట వెలువడిన వికిరణాల  (రేడియేషన్) వలన సూక్ష్మ జీవుల పెరుగుదల తక్కున ఉన్నట్ట్టు , మిగిలిన గడ్డి జాతుల ఉన్న చోట సూక్ష్మ జీవుల పెరుగుదల ఎక్కువ ఉన్నట్టు గుర్తించారు , ఒక  సహజ ఆహార నిలవ కారకంగా  (Natural Food Preservative) దర్బ గడ్డిని ఉపయోగించునే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ఆహారవలయపు శక్తి సంచయనంలో ప్రథమ స్థానం గడ్డి జాతులదే. సూర్యని వికిరణ శక్తిని వినియోగించుకొని అత్యధికంగా కర్బనాన్ని  చక్కరలు (గ్లుకోజ్)  అనబడే రసాయన బంధాలలో నిలచేయగల సామర్థ్యం గడ్డిదే. పెరుగుతున్న కర్బన ఉద్గారాలను అదుపు చేయడానికి  అత్యధిక గడ్డి జాతులు చతుర్వలయ కర్బన సంశ్లేశితాలు ( C4 Carbon Cycle )  కావడం  సగటు పర్యావరణ ప్రేమికుడికి ఆశ కలిగించేదే . ఈ మధ్యే అటవీ శాఖ గడ్డి భూముల పెంపకం చేపట్టింది. ఇందుకు కొన్ని జాతులను ఎంపిక చేసి ఎక్కడైతే  వన్యప్రాణుల ఆవాసం ఉన్నదో ఆయా చోట్ల ఆ ప్రాణులకు కావల్సిన గడ్డి జాతులను పెంచే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. తద్వారా  తినే జంతువుకు తినబడే జంతువుకు మధ్య ఉండవలసిన   నిష్పత్తి  ( Predator and Prey Ratio ) సమస్థితిలో ఉండి  మొత్తం ఆవరణ వ్యవస్థ  ఆరోగ్యకరంగా మనగలుగుతుంది.

             సమయం రెండున్నర గంటలు దాటుతుండగా మళ్ళీ పనిలో పడ్డాం. బీటు అంతా తిరిగి  తిరిగి కాళ్ళు నొప్పి పుట్టాయి. సాయంత్రానికి  ముందే మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఎక్కడో దూరంగా వాన కురుస్తున్నట్టుంది. చల్లని గాలి  ఒంటిని తాకడం ఒక ఉపశమనం . అటువంటప్పుడు  పని ముందుకు వెళ్ళేలా ఉండదు. మరీ చీకటిగా కాకముందే అక్కడి నుంచి వెళ్ళిపోవడం శ్రేయస్కరం అనిపించి  బయలుదేరడానికి సిద్దమయ్యాం. వెంట తెచ్చుకున్నవన్నీ సర్దుకొని ఇంటిదారి పట్టాము. మా పరిధిలో ఉన్న ప్రాంతాలలో గస్తీ కాచే పని కూడా అవుతుందని వస్తూ వస్తూ దారి మార్చి వెళ్తున్నాం. గుండెంగ ఊరి దాకా వెళ్ళాం. అక్కడ ఒకచోట దాదాపు  ఊరి అంచున ఉన్న ఇళ్ళ మధ్య  వెదురు బొంగుకు కట్టి  త్రికోణ ఆకారంలో ఉన్న తెల్లని కుచ్చుల అంచుకుట్టిన జెండాలు పెద్ద ప్రాకారంలో ఉన్న ప్రాంగణానికి రెండు వైపులా పూల గుత్తిలా నాటబడి ఉన్నాయి. జెండాలు పసుపు రండువీ , తెలుపు ,అకుపచ్చవి. అది సిమెంటు నిర్మాణమే. వివరాలు తెలుసుకోవాలని కిందకి దిగి ఆరా తీస్తే అది  లచ్చమాక్క( లక్ష్మి ..?) మందిరమని, ఆ మందిరం అక్కడికి నలభై  సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిందనీ ప్రతి సంవత్సరం ఉగాది తెల్లవారి అక్కడ జాతర జరుగుతుందనీ చెప్పాడు అక్కడ ఉన్న అతను. ఇంతలో ఆ మందిర పూజారి వచ్చాడు.నాకు వివరాలు చెప్పిన అతను పూజారి కొడుకు. త్రికోణాకారపు జెండాలు కట్టడం వాళ్ళ ఆచారమనీ కోరికలు ఉన్న వాళ్ళు అలా జెండాలు కడతారనీ చెప్పాడు. అతను కూడా లంబాడ భాషే మాట్లాడుతున్నాడు యాభై ఏళ్ళ క్రితం ఇక్కడికి వలసవచ్చానని చెప్పాడు. గుడిలో దీపం నిరంతరం వెలిగేలా చూస్తానని చెప్పాడు.  అతని ఆహార్యం తెలంగాణ పల్లెవాసిని తలపించినా చేతికి ఉన్న వెండి కడియం మాత్రం విలక్షణంగా ఉంది. పట్టీలా ఉండి దాని మీద మంచి  చెక్కణపు పని ఉంది .ఇంతకు మునుపు అటువంటి ముంజేతి అలంకారం నేను చూడలేదు. ఆయన అనుమతితో ఆ కడియం ఫోటో తీసుకున్నాను.  పసుపు , నారింజ , ఆకుపచ్చ రంగులలో ఉన్న జెండాల మీద ఉన్న నెలవంక, సూర్యుని గుర్తులు , సూర్య చంద్రులని చెప్పాడు. సిత్లా భవానికి, లక్మాదేవికి  ఏమైనా సంబంధం ఉందేమో భవిష్యత్తులో తెలుస్తుందో లేదో కానీ అంతరించిపోయే ఒక సాంస్కృతిక వారసున్ని కలుసున్నానని అర్థమై అతని చాయచిత్రాన్ని అపురూపంగా మా బృందంతో పాటూ తీసుకొని జీపెక్కేసాను. ముసురుకుంటున్న చీకటిలో  జీపు వెలుతురు దారి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నది…

-దేవనపల్లి  వీణావాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Comments are closed.