మహిళా వివాహ చట్టాల కోసం ఉద్యమించిన ఇండో నేషియా లాయర్ –సోయెవాండో సోయెరాస్నో నాని-గబ్బిట దుర్గా ప్రసాద్

ఇండోనేషియా దేశ మహిళల ఓటుహక్కు మహిళా వివాహ వయస్సు పెంచటం కోసం మహోద్యమం నడిపిన వనిత సోయెవాండో సోయెరాస్నో నాని సోమెరాంగ్ లో 1918లో జన్మించి ,జకార్తాలో లా చదివి ,డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ లో ఉద్యోగం లో చేరింది .లాయర్ అవటం తో అనేక మహిళా సేవా సంస్థలలో ఆమె సభ్యురాలైంది .వీరందరితోకలిసి 1952లో క్రొత్త వివాహ చట్ట రూపకల్పనకు, అందులో ముఖ్యంగా బాలికల వివాహ వయస్సు పెంచటానికి ఒక కమీషన్ ఏర్పాటు చేసుకొన్నారు . .వీటిపై అందరికి అవగాహన కలిగించటానికి నాని, 1954లో ‘’ది లీగల్ అండ్ సోషల్ స్టేటస్ ఫర్ వుమెన్ ‘’పుస్తకం రాసి ప్రచురించింది .ఇండోనేషియాలో మహిళల స్థానం కోసం రాయబడిన మొట్ట మొదటి పుస్తకం గా ఈ పుస్తకం రికార్డ్ కెక్కింది .బహు భార్యత్వం ను సమర్ధిస్తూ అంతకు ముందు కొద్దికాలం క్రితమే ప్రభుత్వం తేవాలనుకొన్న కొత్త వివాహ చట్టం పై తీవ్రంగా విరుచుకుపడి,స్త్రీలను చైతన్యవంతం చేయటం ప్రారంబించింది .అనేక పోరాటాల ఫలితంగా ప్రభుత్వం చట్టం చేసినా అమలు లోకి రావటానికి చాలాకాలం పట్టి 1974 లో అమలైంది .దీన దీని ప్రకారం బాలికల వివాహ వయస్సు 16 సంవత్సరాలుగా ,బాలుర వివాహ వయస్సు 19 సంవత్సరాలుగా నిర్ణయించారు .ఇదంతా నాని కృషి ఫలితమే .

1955లో మనిలా లో’’ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ యూని వర్సిటి వుమెన్ ‘’సమావేశం జరిగింది .ఈ సమావేశం లో నాని ఇండోనేషియా దేశపు అబ్జర్వర్ గా విధులు నిర్వహించింది .ఆమె శ్రమ, అంకితభావం, సేవా నిరతి అందరి దృష్టి ని ఆకర్షించాయి .దీని ఫలితంగా రెండేళ్ళ తర్వాత ‘’ పౌర బాధ్యతలు ,ప్రజాసేవలో ఆసియా మహిళల భాగస్వామ్యం’’అనే అంశాలపై బాంకాక్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ సెమినార్ లో ఇండోనేషియా ప్రతినిధిగా పాల్గొన్నది .సెమినార్ లో ఇండో నేషియా మహిళలపై ఒక పరిశోధన పత్రం రాసి సమర్పించింది .1958లో శ్రీలంక లోని కొలంబో లో జరిగిన ‘’ఏషియన్ ,ఆఫ్రికన్ వుమెన్స్ కాన్ఫరెన్స్ ‘’లో పాల్గొని ఇతర ప్రతి నిధితులతో కలసి ముక్త కంఠంతో వివాహ చట్టం పూర్తి అమలు కోసం పట్టు బట్టింది. .

1959లో సోయెవాండో నాని స్వీడిష్ స్కాలర్షిప్ గెలుచుకొని శతాబ్దాలపాటు అణగారి పోయిన ఇండోనేషియా మహిళల జీవితాలలో మార్పులపై పరిశోధన చేసింది .మహిళా సమస్యలపై అనేక మహిళా జర్నల్స్ లో చాలా వ్యాసాలు రాసి అ౦దరి దృష్టికి తెచ్చింది .వీటి సాధనకోసం ‘’ప్లాన్నేడ్ పేరెంట్ హుడ్ అసోసియేషన్ ‘’1957లో స్థాపించి, వైస్ ప్రెసిడెంట్ గా సేవలందించింది .దీనితోపాటు 1955నుండి ‘’ఇండోనేషియన్ యూని వర్సిటి వుమెన్ అసోసియేషన్ ‘’బాధ్యతలనూ స్వీకరించి సమర్ధంగా నడిపింది .

ఇంతటి మహిళోద్యమ నాయకురాలి జీవితం గురించి ఒక్క పుట్టిన రోజు తప్ప మిగతా వివరాలేవీ దొరకక పోవటం విడ్డూరమే.ఆమె రాసిన ‘’ది ఇండోనేషియన్ మారేజ్ లా అండ్ ఇట్స్ ఇంప్లి మెంటింగ్ రెగ్యులేషన్స్ ‘’పుస్తకం లో చాలా విషయాలు చర్చించింది .వధూవరుల వివాహ వయసు ,భార్యాభర్తల హక్కులు ,బాధ్యతలు ,వైవాహిక ఆస్తి ,విడాకులు ,న్యాయస్థాన నిర్ణయాలు ,వివాహ చట్టం అమలు తీరు ,వివాహ రిజిస్ట్రేషన్ ,వివాహ సర్టిఫికేట్ ,శిక్షా నిబంధనలు మొదలైన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించి ఇండోనేషియామహిళలకు మంచి అవగాహన కలిపించి మహోపకారం చేసింది నాని .ఆమె శతజయంతి కూడా జరిగి పోయింది .కాని గూగుల్ లో ఆదేశం వారు ఆమె గురించి ఏమీ రాయకపోవటం క్షమించరాని విషయం .

                                                                                                                                                                           –                                                                                                                            -గబ్బిట దుర్గా ప్రసాద్

వ్యాసాలుPermalink

Comments are closed.