నది నుండి సంద్రంగా….(కవిత ) -డి.నాగజ్యోతిశేఖర్.


అతన్నో వాక్యంగా గుండెతీగకు గుచ్చుకున్నాకా…
ఆమె పూల నదై ప్రవహించింది!

కలల పుష్పాల్ని అతని పాదాల వద్ద ఉంచి….
పరిచయ సంతకాన్ని చేరిపేసుకుంది!

నవ్వు గువ్వల్ని అతని కళ్ళ ఆకాశంలో ఎగరేస్తూ….
కలత మబ్బుల్ని గుండె గదిలో బంధించింది!

నిద్ర వెన్నెల్ని అతనిపై చల్లి….
గిన్నెల అమవాసలకి పున్నమి పులుముతూ…..
పొడి రెప్పల మాటున గరుకు కలై మెదిలింది!

అతను పోగేసుకొచ్చిన రూకల వజ్రాల మెరుపుల్లో తడుస్తూ….
తన స్వేద బిందువుల్ని చీర మడతల్లో దాచేసుకొని శూన్యమై నిలిచింది!

అతన్ని నాలుగు పదాలుగా
తన పేగుల పుటల్లో రాసుకొని…
ఇగిరిన రక్తపు సిరాతో
తనకంటూ ఓ అక్షరం లిఖించలేక శిలా కలమై ఘనీభవించింది!

అన్ని ఋతువుల్లోనూ….
శిశిర పరుపుపై బతుకు వసంతాన్ని వాల్చి….
ఆకుపచ్చ గతాల్ని తవ్వుతున్న ఆమెతో…
అతనన్నాడు….
ఈ రోజు నీదని….
నా నీడ నువ్వని!

ఇన్ని రోజులూ ఏడ దాచాడో…
ఒక్కసారిగా ఉత్ప్రేక్ష అలంకార లతలు ఆమె పేరు నిండా అలంకరించేశాడు!

వేల అపురూపపదాల వానలో ఆమెను తడిపి ముద్దచేశాడు!

కాలెండర్ పల్లకిపై దేశ దేశాలూ తిప్పాడు!

తన నిశి రాజ్యంలో ఆమెనో
నక్షత్ర దీపంగా చాటాడు!

ఒక్కసారిగా పురుడోసుకున్న
అద్భుత వర్ణ పువ్వుల గుత్తుల్ని
మోయలేక….
ఆమె అలసిన కొమ్మయి ఆ రాత్రి ఒడిలో ఆదమరిచి నిదురించింది!

తెల్లవారగానే….
ఓ గొప్ప భావ చిత్రాన్ని గీయాలని….
నిన్నటి ఆమె అనుభూతుల్ని
పంచుకోవాలని పరుగెత్తుకెళ్లిన నన్ను వెక్కిరిస్తూ….

అతని చూపుడు వేలు స్పాట్ లైట్ లో ముక్కలైన ఆత్మాభిమానపు పూల రెక్కల్ని
ఎత్తి పారబోస్తూ ఆమె!

అతనో అనృత వాక్యంగా స్పర్శకు వచ్చాకా….
ఆమె మృతసంద్రమై
దుఃఖపు ఉప్పుని ప్రసవించింది….
ప్రసవిస్తూనే ఉంది!

నేనో రంగులు వెలేసిన కాన్వాసై
ఏళ్లుగా వెల వెల బోతూనే ఉన్నా!

                                                                 -డి.నాగజ్యోతిశేఖర్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Vinay kumar
Vinay kumar
9 months ago

చాలా బాగుంది మేడం