పరిమళాసోమేశ్వర్ కథల్లో మధ్యతరగతి ఉద్యోగినుల మనోవిశ్లేషణ(సాహిత్య వ్యాసం )– శీలా సుభద్రాదేవి

అరవయ్యో దశకం తెలుగు సమాజంలో అప్పుడప్పుడే విద్యావంతులై, ఉద్యోగాల బాట పడుతున్న స్త్రీలు తెలుగు సాహిత్యం వైపు కూడా ఆకర్షితులై శరత్ సాహిత్యం, చలం, శ్రీపాద వంటి వారి రచనలకూ ప్రభావితులై చదువరులుగానే కాక రచయిత్రులుగా కూడా రూపొందుతూన్న కాలం. అప్పట్లో ఎక్కువగా రచయిత్రులు అందరూ నవలారచనలవైపే మొగ్గుచూపేవారు. ఉన్నతవిద్య అభ్యసించి కళాశాలలో రసాయనశాస్త్ర ఉపన్యాసకురాలిగా పనిచేస్తోన్న పరిమళాసోమేశ్వర్ నవలలతోపాటూ కథానికారచనపట్ల కూడా మక్కువ చూపించారు.

1965లో యువ పత్రికలో ‘మిస్. సుధారాణి’ కథతో కథారచన మొదలుపెట్టారు. 1965 నుండి 1975 వరకూ ప్రచురితమైన వారి నలభై రెండు కథల్ని నవచేతన వారు సంపుటిగా వెలువరించారు.
స్వాతంత్ర్యానంతర రచయిత్రులలో ఎక్కువమంది ఉద్యోగినులు కాకపోవటం వలన, గృహిణులుగా వారికి అనుభవమున్న, పరిశీలించిన కుటుంబసంబంధ కథలకే పరిమితమయ్యారు. ఆ కారణంవల్లనే కావచ్చు. అప్పటి (ఇప్పటికీ) కథావిమర్శకుల దృష్టిలో వంటింటి కథలుగానే నిర్ణయించేసుకుని, వారి రచనలని సాహిత్యవిమర్శలో దూరం పెట్టేసారు.

కానీ పరిమళాసోమేశ్వర్ విద్యాధికురాలు కావటం, అందునా రసాయన శాస్త్రోపన్యాసకురాలు కావటం వలన చాలా కథల్లోని నేపథ్యం కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, అధ్యాపకులు, రసాయనశాస్త్రం, లాబరేటరీ పరిశోధనలూ మొదలైన ప్రసక్తులతో కూడి ఉంటుంది. పూర్తిగా కళాశాల, రసాయనశాస్త్ర నేపథ్యంలో ‘యువతరం గళమెత్తితే’ అనే నవల కూడా పరిమళాసోమేశ్వర్ రాసారు. మొదటి కథే కాకుండా మరెన్నో కథల్ని కూడా కళాశాలల్లో జరిగే అనేకానేక సంఘటనల సమాహారంగా రాయటం గమనిస్తే, వీరు తన వృత్తిని ఎంతగానో ప్రేమిస్తారనే భావన కలుగుతుంది. అంతేకాకుండా పద్మశ్రీ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పరమేశం, ఆంతర్యం అడుగున, ఉమెన్సు కాలేజి వంటి కథల్లో చదివిన చదువుకూ, జీవన విధానంలోని ప్రవృత్తికీ గల వైరుధ్యాల్ని పాత్రల మనోవిశ్లేషణ ద్వారా వ్యక్తీకరించారు రచయిత్రి.

1967లో వచ్చిన ‘పంజరం’, ‘తప్పెవ్వరిది’ వంటి కథల్లో కులమతాంతర వివాహానికి చెందిన కథలు. ఉల్లి వాసన తగలని కుటుంబంలోని కళ్యాణి తన అన్న స్నేహితుడైన జార్జిని ప్రేమించి వివాహం చేసుకోవాలనుకోవటం వలన సాంప్రదాయాలకూ, సంస్కృతికీ విలువనిచ్చే తండ్రిని ధిక్కరిస్తూ వాదించటం, ఆమెకు తల్లి పరోక్ష మద్దతుతో, ప్రధానంగా కథ నడుస్తుంది. మతాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన జాతిభ్రష్టత కలిగేటట్లయితే ఆ జాతి సంస్కృతి ఉంటేనేం, పోతేనేం’ అనే కళ్యాణి ధిక్కారంలోగానీ, ‘కొన్ని శతాబ్దాలుగా అణగదొక్కబడిన జాతి మేల్కొందంటే ఆశ్చర్యం లేదు’ అనే తల్లి సీతాదేవి మాటలుగానీ రచయిత్రికి గల అభ్యుదయభావాల్ని ప్రస్ఫుటింపచేస్తాయి. ఎందుకంటే అప్పటికి సాహిత్యంలో అస్థిత్వవాదాలు వేళ్ళూనలేదు. అటువంటి పరిస్థితిలో పరిమళాసోమేశ్వర్ ఈ విధంగా దళితవాద స్పృహతో రాయటం ఆ వాదాలకి వేరు మొక్కగా భావించాలి.

‘తాను ముక్కూ మొఖం తెలియని ఆడవాళ్ళతో తిరగగాలేనిది తన భార్య మాత్రం పరపురుషుడి నీడ కూడా సోకకుండా ఉండాలని కోరుకోవటం అన్యాయం. మగవాడికోనీతి, ఆడదానికోనీతి’ ఈ సమాజంలో ఉండటాన్ని ప్రశ్నించిన కథ ‘తప్పెవ్వరిది’. యువతీయువకుల మధ్యగానీ, వివాహానంతరం స్త్రీ పురుషుల మధ్యగానీ గల స్నేహసంబంధాలు నమ్మకం పునాదిమీదే ఉండాలనీ, పరస్పరాభిమానాలతో ఉన్నప్పుడే పెళ్ళికి ముందైనా, తర్వాతైనా ఘర్షణలకు తావులేని జీవితం గడపగలరనేది చాలా కథల్లో సంఘటనాత్మకంగాగానీ, సంభాషణాత్మకంగాగానీ, సందర్భోచితంగాగానీ వ్యక్తీకరించుతారు రచయిత్రి. దీనివలన రచయిత్రికి దాంపత్య సంబంధాలలో ఉండాల్సిన దృఢమైన దృక్పథాన్ని కథల రూపంలో అక్షరీకరించారనిపిస్తుంది.

హైదరాబాద్ లోని విహార స్థలాలన్నింటినీ పరిచయం చేస్తూ నడిచిన ‘గైడ్’ కథలో స్త్రీ సౌందర్యం పురుషుడికి విలాసవస్తువుగానే కనిపించే దుస్థితిని గైడ్ అయిన ఎలీజా పాత్రతో ప్రకటించారు. మరొక విశేషం హైదరాబాద్ లోనూ, పరిసర ప్రాంతాలలోను ఉద్యోగరీత్యా తిరగటం వలన చాలా కథల్లో హైదరాబాద్ లోని దారులూ, చౌరస్తాలూ నాంపల్లి రైల్వేస్టేషన్ మీదుగా అనేక ప్రాంతాల్ని కథతో పాటూ చుట్టి రావచ్చు.

భిన్నమతాలకు చెందిన మిత్రులు పొట్టచేత పట్టుకొని నగరానికి చేరి రిక్షావాలాలుగా బతుకు వెళ్ళబుచ్చుతుంటారు. రెండు మతాల్నీ సమాదరించుకుంటూ రోజూ కలిసి గుడుంబా తాగి కబుర్లు చెప్పుకుంటూ ఇళ్ళు చేరేవారు. ఒకరోజు తాగిన మైకంలో బచ్చాలాడి పెచ్చుమీరిన స్వార్థంతో మస్తాన్ మిత్రుడు నారయ్యని చంపేస్తాడు. మస్తానుకు ఉరిశిక్ష పడుతుంది. ఈ సంఘటనలో రాజకీయతంత్రం ప్రవేశించి మతకలహాలుగా రూపుదిద్దుకునే విధానాన్ని కళ్ళకు కట్టేలా దృశ్యమానం చేస్తారు ‘అన్నదమ్ములు’ కథలో రచయిత్రి. కథనంలోనూ, పాత్రల మనోభావ చిత్రణలోనూ చక్కటి ప్రతిభను చూపించారు.

‘రచయిత్రి భర్త’, ‘కవి పత్ని’ కథలలో రచయిత్రి భర్తకి గానీ, కవి భార్యకు గానీ నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని హైలైటు చేస్తూ రాసిన కథలు. ఉద్యోగరీత్యా ఎదుర్కొన్నవీ, పరిశీలించినవి అనేకానేక సంఘటనలను క్రోడీకరించి, తాను మూల్యాంకనం చేసుకొంటూ, విద్యార్థుల దృక్కోణం నుండీ, లెక్చరర్ల దృష్టికోణం నుండే కాక అధికారులవైపు నుండీ విద్యాసంస్థలలో జరిగే అనేక విషయాలను అక్షరబద్ధం చేస్తూ చాలా కథలు రాసారు పరిమళాసోమేశ్వర్.

కులవివక్ష విద్యాసంస్థలలో ఎలా రాజ్యమేలుతుందో తెలిపే కథ ‘ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు’. ఉద్యోగాల వేటలోనూ, ఉద్యోగం వచ్చిన తర్వాతా ‘ఇన్ఫ్లుయెన్సు’ ద్వారా చూపించే అహంభావాల్నీ కథల రూపంలో చిత్రించటంలో రచయిత్రికి అనుభవాలే కానక్కర్లేదు. ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే స్వభావం ఉన్నవారెవ్వరైనా అర్థం చేసుకోగలరు. ‘సైన్సు కాంగ్రెస్’లలో జరిగే అవకతవకలూ, ఔత్సాహికులకు అవకాశం ఇవ్వకుండా, సెమినార్లలో పత్ర సమర్పణ వల్ల వచ్చే ప్రయోజనాల కోసం మూసపద్ధతిలో జరుగుతున్న విధానాన్ని అద్దంలో చూపినట్లుగా కథనీకరించారు రచయిత్రి. మొత్తం మీద సింహభాగం కథలు విశ్వవిద్యాలయాలూ, ప్రొఫెసర్లూ, విద్యార్థుల నేపథ్యంలోనే జరగటం విశేషం.

అరవయ్యో దశకంలో వచ్చిన కథల్లో కొంతమంది రచయితలకు కథ చెప్పేటప్పుడు ఒక్కొక్కపాత్ర తన కథను తన భావాల్ని తనవైపు నుంచి చెప్పే పద్ధతినే పాటించారు. అదే విధానంలో పరిమళాసోమేశ్వర్ రాసిన ‘సిల్వర్ జూబ్లీ’కథలో వివాహ రజతోత్సవం జరుపుకోబోతున్న భార్యాభర్తలు ఇద్దరూ వారి వారి ఆంతరంగిక విశ్లేషణలను విడివిడిగా చెప్పారు. అదేవిధంగా ‘అపార్థం’ కథలో కమల తన స్నేహితురాలు విమల ఇంటికి వెళ్ళటం దగ్గర నుండి కమల, విమల, విమల భర్త విశ్వం మనోభావాల్ని ఎవరికి వారుగా చెప్పినట్లు కథనీకరించారు.

ఈ కథల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కథ ‘ఉరి’. ఈ కథాంశంతో ఇంతవరకూ మరే రచయిత (త్రి) రాసినట్లుగా లేదు. తాపీమేస్త్రీ పని చేసే రంగయ్యకు సెంట్రల్ జైలులో తలారి ఉద్యోగం వస్తుంది. ఒక నిండు ప్రాణాన్ని చేతులారా తీసే ఆ పనిలో చేరటానికి రంగయ్య వెనుకాడతాడు. ‘సాధారణంగా ఈ రోజుల్లో ఉరిశిక్షలు జరగవు. పేరుకే ఆ ఉద్యోగం’ అని జైలులో పనిచేసే చప్రాసీలు చెప్తే ఒప్పుకుంటాడు కానీ అనుకోకుండా ఒక ఖైదీకి ఉరిశిక్ష పడుతుంది. దానిని అమలు చేసే బాధ్యత రంగయ్యపై పడుతుంది. ఆ ఖైదీ విప్లవ నాయకుడు సత్యం. అతని మాటలు, వ్యక్తిత్వం, నిర్భయత్వం గమనించిన రంగయ్యకు ఆ వ్యక్తి హత్యలు చేసాడంటే అపనమ్మకం, ఆశ్చర్యం కలిగిస్తాయి. పేదల్ని దోపిడీ చేసే పెట్టుబడిదారులైన ధనవంతుల్ని మాత్రమే సత్యం హత్య చేసేడని తెలుసుకుంటాడు. సత్యాన్ని ఉరితీసే సమయంలో రంగయ్య ఎంతో ఉద్విగ్నతకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్తాడు. ఆ స్థితిలో దుర్భరమైన ఆలోచనలు, కలలతో కొట్టుమిట్టాడి చేష్టలు దక్కి స్థాణువులా పడిపోతాడు రంగయ్య. కథ ప్రారంభం నుండి చివరివరకూ పాఠకుడిని కూడా ఉద్విగ్నతకు లోను చేసేలా కథాంశంగానీ, రచనావిధానంగానీ ఒక కొత్త పంథాలో నడుస్తుంది. 1971లో ప్రచురితమైన ఈ కథ అప్పుడప్పుడే విరసం ఏర్పాటుతో సాహిత్యంలోకి వచ్చిన ఒక కొత్త వరవడికి రచయిత్రిలో కలిగించిన సంఘర్షణ నుండి వెలువడిన కథ ఇది.

పుణ్యం కోసం పశువులకు రొట్టెలు పెట్టే ధర్మదాతలు, ఆకలితో అలమటించే పసివాళ్ళని చీదరించుకోవటమైనా (రొట్టె కోసం), చిన్నతనంలోనే సౌభాగ్యానికీ, మమతలకూ దూరమైన రంగమ్మ తన కొడుకు భార్యాలోలుడుగా కనిపించితే తట్టుకోలేక కొడుకు దూరమౌతున్నాడని తల్లడిల్లడమైనా (మమతలెరుగని మగువ), తన దాంపత్యాన్ని రంగుల కలగా సహోద్యోగుల దగ్గర వర్ణించి వాళ్ళలో అసూయ రగిల్చి తన మనసులోని భగ్నతను చల్లార్చుకొన్న నారాయణరావు మనోగతమైనా (లవ్ మేరేజి) కథాంశాన్ని నేర్పుగా చివరివరకూ రక్తి కట్టిస్తూ నడపటం చూస్తే రచయిత్రికి గల నైపుణ్యం స్పష్టమౌతుంది.

బంగ్లాదేశ్ సాధనలో జరిగిన యుద్ధ పరిణామాల నేపథ్యంలో దాంపత్య జీవితాల్ని కోల్పోయి అభాగినులైన శరణార్థ యువతుల దుర్భర జీవితాల్ని చిత్రించటంలో ‘నేను చేసిన నేరం ఏమిటి?’ కథను ఒక సజీవ చలన చిత్రంగా రూపొందించి పాఠకుల గుండెల్ని చెమ్మగిల్లజేసారు రచయిత్రి.
రచయిత(త్రు)లను పాత్రలుగా తీసుకొని పరిమళాసోమేశ్వర్ చాలాకథలే రాశారు. వాటిల్లో రచయిత(త్రు)లు, కవులు, పబ్లిషర్లూ, పత్రికాధిపతులు మీదే కాక సాహిత్యతీరుతెన్నుల మీదా నిష్కర్షగా, నిర్భయంగా తన అభిప్రాయాలు ప్రకటించారు. ఒక కథలో పురస్కార ఎంపిక చేసే జడ్జిగా ఉండమని కాన్ఫిడెన్షియల్ ఉత్తరం అందుకున్న రచయిత్రికి ఆ తర్వాత బహుమతి ఆశించిన వాళ్ళంతా అనేకమంది ఫోనులోనూ, ప్రత్యక్షంగానూ తనను సంప్రదించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ సందర్భంలో సాహిత్యసృజనకీ, వ్యక్తిత్వానికీ గల అంతరాన్ని కథలో స్పష్టీకరించారు. రచయితల ప్రతిభాసంపత్తిని అమ్ముకొని డబ్బు చేసుకొని అంతస్తులు లేపుకుంటున్న ప్రచురణకర్తల్నీ, పత్రికల్నీ తూర్పారబట్టారు. అనేక కథల్లో రచయిత(త్రు)ల స్వభావాలూ, జీవన విధానాలూ, నిజాయితీలేనితనాల మీద తన స్పందనని కథలరూపంలో తెలియజేసారు రచయిత్రి.
1965-75 మధ్య లోనే కథలు ఎక్కువగా రాయటం వలన ఆనాటి సమాజంలో మహిళలు ఉన్నత విద్యాభ్యాసం పట్లా, ఆర్థిక స్వావలంబన పట్లా, వివాహ వ్యవస్థ పట్లా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినవారే. బహుశా అందువలనే కావచ్చు పరిమళాసోమేశ్వర్ కథలలో స్త్రీ పాత్రలన్నీ ఉన్నతవిద్య అభ్యసించిన వాళ్ళూ, ఉద్యోగినులు అంతేకాక అవివాహితులు, స్త్రీ పురుషుల సంబంధాలపైన, స్నేహాలపైన, కుటుంబ జీవితాలపైన, దాంపత్య జీవితాల పట్లా విస్పష్టమైన ఆలోచన, నిర్ణయాత్మక సంకల్పం ఉన్నవారే. తమ జీవితాలను ఎలా మలచుకోవాలో, ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలిసిన సమాజం పట్లా మానవ సంబంధాల పట్లా బాధ్యత కలిగిన స్త్రీ పాత్రలతో కూడిన కథలు యివి.

అందుకే ‘పరిమళాసోమేశ్వర్ చేతిలో కథ చాలా చక్కగా మలచబడుతుంది’ అని నాయని కృష్ణకుమారి ప్రశంసించారు.‘స్త్రీ పురుషులు సంప్రదాయ చట్రం నుంచి బయటపడి, మానవీయ భావజాలం పుణికిపుచ్చుకుని, ఆధునికీకరణ చెందే మార్గంలో నడవటాన్ని వ్యక్తీకరించేవి పరిమళా సోమేశ్వర్ కథలు’’ అంటారు కొలకలూరి ఇనాక్ గారు.

‘నవలలు రాసినప్పుడు కన్నా కథ రాసినప్పుడే ఎక్కువ తృప్తి కలుగుతుంది’ అని చెప్పే పరిమళాసోమేశ్వర్ తన కథలు మూసపోసినట్లుగా కాకుండా వైవిధ్యంగా ఉండాలని చూస్తానంటారు.
అందువలననే అరవయ్యో దశకంలో సమాజంలో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన కథలే అయినా, దిగువ మధ్య తరగతికి చెందిన కథలు అయినా సామాజిక వాస్తవికతకూ, మానవ మనోవిశ్లేషణకూ, స్త్రీ పురుష స్వభావ పరిశీలనకూ ప్రాధాన్యమిచ్చి ఒక సునిశితమైన లోచూపుతో, తీవ్రమైన ఆలోచన్లతో జాగ్రత్తగా కథను నడిపించారు రచయిత్రి. అనవసర వర్ణనల జోలికి పోకుండా కథని సంక్లిష్టతవైపు మళ్ళించకుండా స్పష్టతతో సూటిగా పాఠకులకు అవగాహన కల్పించే కథల్ని రాశారు పరిమళాసోమేశ్వర్.

– శీలా సుభద్రాదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

2 Responses to పరిమళాసోమేశ్వర్ కథల్లో మధ్యతరగతి ఉద్యోగినుల మనోవిశ్లేషణ(సాహిత్య వ్యాసం )– శీలా సుభద్రాదేవి

  1. పరిమళా సోమేశ్వర్ కథలను వెంటనే చదవాలనిపించేలా ..పరిచయం చేశారు ..అస్తిత్వ వాదాలకు వేరు మొక్కలాంటిది ఆమె సాహిత్యం అని ఒక్క మాటలో ఆ సాహిత్యాన్ని సమీక్షించారు సుభద్ర గారూ .. ఈ కథా సంపుటిని సేకరించి చదవాలి . మీ పరిచయానికి ధన్యవాదాలు. విహంగ కి అభినందనలు.

    • శీలా సుభద్రా దేవి says:

      ధన్యవాదాలు వనజ తాతినేని గారూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)