పరామర్శ – జనజీవన స్పర్శ-భారతి

గతిశీలమైన సమాజంలో సాంఘిక ఆర్థిక రాజకీయ శాస్త్ర సాంస్కృతిక రంగాలలో అనేక మార్పులు జరుగుతుంటాయి. ఈ మార్పులకు నిలువుటద్దం సాహిత్యం. అందుకే సాహిత్యం కొన్నిసార్లు ఉద్యమాలకు ఊపిరి పోసి కొత్త చరిత్రకు నాంది అవుతుంది. తెలంగాణ ఉద్యమ సాహిత్యం దానికి గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. తెలంగాణ నేల తరాల వెంబడి పీడనను ఎదుర్కొన్నది. సాంస్కృతికోద్యమాలు అందించిన చైతన్యంతో నిరంకుశత్వంపై గెలుపొంది, సగౌరవంగా తల ఎత్తుకుని నిలబడింది. ఈ క్రమంలో ఎన్నో త్యాగాలు, మరెన్నో సామాజిక ఘట్టాలు ఈ ప్రాంతానికి ఊపిరినిచ్చి నిలబెట్టాయి.

అక్షరాస్యత అనేది అడుగంటిన ఆనాటి కాలంలో, సామాన్యునికి అధ్యయనం అందుబాటులో లేని కాలంలో, సాహిత్యమే పునాదిగా కొంత మంది ముందుకు వచ్చి అతి క్లిష్టమైన బాధ్యతను తీసుకున్నారు. విముక్తి కోసం పోరాడుతూనే ఎక్కడా నిరాశ చెందకుండా సాహిత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం ఎంతో గొప్పనైన విషయం. ఆనాటి ఆ కృషి ఫలాలే ఈ ప్రాంత చైతన్యానికి మూలమైనది. తీవ్రమైన నిర్బంధాలలో, అణచివేతకు గురవుతూ నిలబడిన సంస్థల గురించి నేడు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. వాటిని పరిశీలన దృక్పథంతో చూడాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని చేసిన ప్రయత్నంలో భాగమే నక్క హరికృష్ణ ‘పరామర్శ’ వ్యాస సంపుటి.

హరికృష్ణ ‘పరామర్శ’ గ్రంథంలో ఆంధ్ర మహాసభల మూలాల నుంచి సాహిత్య సంస్థల దాకా అనేక విషయాలను వివరించడానికి సంకల్పించారు. ఈ పుస్తకం రచయిత చైతన్యానికి చక్కటి నిదర్శనం. ఇందులో గల పన్నెండు వ్యాసాలలో ప్రతిదీ దేనికదే ప్రత్యేకమైందిగా నిలుస్తుంది. ఈ వ్యాసాలు 1. తెలంగాణ ఉద్యమ క్రమాన్ని 2. సాహిత్య సంస్థలను 3. తొలినాళ్ళ సోయి పత్రికను 4. తెలంగాణ భాషను 5. బాల సాహిత్యాన్ని 6. వర్తమాన కవులను స్పర్శించాయి.

ప్రజలు అనుభవించిన అణచివేతల గురించి మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్భవించిన సాహిత్య సంఘాలు, వాటి గతివిధులు హరికృష్ణ వివరించారు. తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ సాహిత్య సమాఖ్య, సింగిడి తెలంగాణ రచయితల సంఘాల పాత్ర తెలుస్తుంది

దౌర్జన్యం రాజ్యమేలుతుంటే ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఉద్యమాలు అంకురిస్తాయని ‘తెలంగాణ చైతన్య మూలాలు’ వ్యాసం తెలియజేస్తుంది. 20వ శతాబ్దపు తెలంగాణ పరిస్థితులు సమాజ దిశానిర్దేశంలో వచ్చిన మార్పులు ఈ వ్యాసాల ద్వారా తెలుస్తాయి. ప్రజల దీనత్వం, వెనుకబాటుతనం రూపుమాపడానికి విద్య, గ్రంథాలయ స్థాపన, అధ్యయనం అవసరాలను విజ్ఞులు గుర్తించటం , శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటుకు దారి తీసింది. అది ఆంధ్ర మహాసభల నేపథ్యం ఆంధ్ర జన సంఘం ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల సంస్కృతి సమైక్యతకు సమకాలీన పరిస్థితులు అవగాహనకు ఏ విధంగా తోడ్పడిందో మనకు తెలుస్తుంది. అలాగే ఆంధ్ర జన సంఘం నిర్వహించిన నాలుగు సమావేశాలు, అవి తెలంగాణ వాసుల్లో నింపిన స్ఫూర్తిని, గ్రంథ పరిశోధన, స్త్రీలను సభాధ్యక్షులుగా ప్రోత్సహించడం, మాతృభాష ప్రాధాన్యత వంటి చెప్పుకోవాల్సిన విషయాలను రచయిత మనకు చక్కగా విశదపరిచారు. తెలంగాణ పోరాట క్రమంలోని వివిధ దశలను మొదలుకొని 1930 నుంచి 1946 వరకు జరిగిన 14 ఆంధ్ర మహాసభలు వాటితోపాటు 11 నిజాం రాష్ట్రాంధ్ర మహిళా సభల గురించి  తెలియజేస్తూ హైదరాబాద్ విమోచనం వరకు తెలంగాణ పై జరుగుతున్న దమననీతిని ప్రశ్నించి, హక్కుల కోసం ఉద్యమించేలా నింపిన స్ఫూర్తిని తీరును రచయిత వివరించాడు. అలాగే నిజాం నుంచి తెలంగాణ విముక్తి లక్ష్యంగా కృషిచేసిన ఆర్య సమాజం, వివిధ పత్రికలు, సాహిత్య సాంస్కృతికోద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు ఏ విధంగా తోడ్పడ్డాయో మనకు ఈ పుస్తకంలోని వ్యాసం వివరిస్తుంది.

తెలంగాణని ఒప్పందాలతో ఆంధ్ర ప్రాంతంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, నియమాల ఉల్లంఘన, ప్రజలు ఎదుర్కొన్న చిన్నచూపు, పీడనం రచయిత తన వ్యాసాలలో వివరించారు. నిజాం నుంచి విముక్తి వచ్చినా పూర్వపు అవమానాలు తప్పలేదు. అప్పటికే ఉద్యమ అనుభవాలు గల తరం స్థిరపడింది. వారి రచనా పాఠవాలు ఉద్యమానికి ప్రాణం పోశాయి. తెలంగాణ రచయితల వేదిక, సోయి పత్రిక అందించిన చైతన్యం, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి అవి చేసిన కృషిని రచయిత సమర్థవంతంగా విపులీకరించారు.

1934 నుంచి నేటికీ కొనసాగుతున్న ‘సాహితీ మేఖల’ సాహిత్య సంస్థ ఎందరో మహానుభావులను రచన లోకానికి పరిచయం చేసింది. సామాజిక – సాంస్కృతిక చైతన్యం, తెలుగు భాష పట్ల అభిమానం పెంపొందించింది. అనేక గ్రంథాల ప్రచురణ మొదలుకొని దాశరథి అగ్నిధార ను ముద్రించిన సాహితీ మేఖల అసామాన్యమైనదని ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది. అంబటిపూడి వెంకటరత్నం సాహిత్య కృషికి సాహితీ మేఖల ఒక నిదర్శనం. ఈ సంస్థ చేసిన అక్షర సేద్యంపు గొప్పతనాన్ని హరికృష్ణ ఈ పుస్తకంలో వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత సాహిత్యంలో కొంత స్తబ్దత నెలకొనడం, ఆ పరిస్థితులలో మార్పును కోరుతూ ‘రచనల చెరువు సాహిత్య వేదిక’ అంకురించడం ఈ పుస్తకం ద్వారా తెలియపరిచారు.

పరామర్శ లోని ‘తెలంగాణ భాష’ ప్రజల సంస్కృతి వాళ్ళ జీవ భాషలో నిక్షిప్తమై ఉంటుందని, చక్కటి పల్లె నుడికారమయిన ” కిస్తీ, శిబ్బి, సుట్టకుదురు, కుదార్థం, జీకోలే దలుగుట ” మొదలగు పదాలను వివరించడం జరిగింది.

తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు అనేక మంది కవులను రచయితలను కళాకారుల్ని తయారుచేశాయి. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి – ప్యారక శేషాచార్యులు’ తెలంగాణలోని ఒక మేలిరత్నాన్ని చక్కగా ఆవిష్కరించింది. ప్యారక శేషాచార్యుల సాహిత్య ప్రయాణాన్ని, ఆయనపై గల ప్రభావాలను, అవధానాలు, కవిసమ్మేళనాలు, కావ్యాలను, కాకతాళీయంలో కాకిని ప్రతీకగా చేయడం, అలాగే కథలను, వివిధ రచనలను తెలియజేయడం జరిగింది. శేషాచార్యులు వస్తువును విభిన్న రీతులలో దర్శించడం, విషాద రసాన్ని ప్రతిపాదించడం నక్క హరికృష్ణ చక్కగా విపులీకరించారు. ఈయనను పరిశోధనాంశంగా స్వీకరించవచ్చుననే సూచన ఇచ్చారు. బాల సాహితీవేత్త ‘డాక్టర్ భూపాల్’ గురించిన వ్యాసం పుస్తకంలోని మరొకటి. పిల్లల అవసరాలను గుర్తించి వారి ఎదుగుదలకు పాటుపడుతూ, నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో బాలసాహిత్య లోటును గుర్తించి ఆ లోటును భర్తీ చేసిన వారిలో ప్రముఖుడు, కవి, కళాకారుడు, నటుడు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ భూపాల్. బాల సాహిత్యం పట్ల ఆయన కృషి గురించి వివరించి ప్రతి ఒక్కరూ బాల సాహిత్యం కోసం కృషి చేయాలని తెలియజెప్పడం హర్షణీయం.

“పల్లెపూల వాన” కథల సంపుటి గ్రామీణ జీవనానికి నిలువుటద్దం. ఇవి డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్ రచించిన బాల్యం బతుకు కథలు. ఆర్థిక సామాజిక రాజకీయ ముఖ్యంగా మానవీయ కోణాలు బాల్యంపై ఏవిధంగా ప్రభావం చూపుతాయో ఈ కథలు వివరిస్తాయి. పిల్లల ఆత్మను దర్శించిన కథలు ఇవి అని ఈ పుస్తకంలోని వ్యాసం ద్వారా రూఢీ అవుతుంది

కథకుడికి పిల్లలపై గల అనురాగం రచనలలో వ్యక్తమవుతుంది.

పేదరికం నేర్పిన పాఠాలు మాసాయిపేట యాదగిరి రచనలలో స్పష్టమవుతాయి. సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల కోసం, హక్కుల కోసం, ఉద్భవించిన కవిగా నిబద్ధత, సైద్ధాంతిక సూత్రాలను తనలో కలిగి కలాన్ని గళాన్ని ఎక్కుపెట్టిన కవిగా ‘మనది యాది’ వ్యాసంలో మాసాయిపేట యాదగిరిని హరికృష్ణ చిత్రీకరించారు. ‘సబ్బండ నాదం వాగ్గేయకారుడు’ గురించి ఈ పుస్తకం చివరి వ్యాసంలో వ్రాయబడింది. ఆట పాటను, రచనను, కళారూపాన్ని నమ్మి తెలంగాణ ఉద్యమ చైతన్యంతో నేటితరంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల వాడిగా మనకు ఈ వ్యాసం ద్వారా కనిపిస్తాడు.

నక్క హరికృష్ణ అక్షర రూపమిచ్చిన ‘పరామర్శ’ జనజీవన స్పర్శ. ఈ సంపుటిని ‘నన్ను కన్న ఈ నేల తల్లికి’ అని అంకితమిచ్చారు. తెలంగాణ ఆత్మాభిమానాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయడం రచయిత తన కర్తవ్యంగా భావించారు. మొదటి పుస్తకంలోనే ఆంధ్ర జన సంఘం మూలాల నుంచి వివిధ సామాజిక పరిణామాలను ఎరుకపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు అనేక అంశాలను విపులీకరించారు. వాటిలో చాలా అంశాలను పరిశోధనకు స్వీకరించవచ్చు. అలాగే పరిశోధకులకు కావలసిన సమాచారం ఈ వ్యాసాల నుంచి పొందవచ్చు. నక్క హరికృష్ణ రచించిన ఈ పుస్తకం ఒక దీపకళిక వంటిది. సాహిత్యాన్ని వివిధ రకాలుగా వివరణ చేసిన వారెందరో ఉన్నప్పటికీ సాహిత్య సంస్థల ద్వారా జరిగిన కృషిని గ్రంథస్తం చేయడంలో ఈయన తీసుకున్న చొరవ పేర్కొనదగినది. ఇది ప్రయోగశీలురకు ఇది ఒక మార్గ నిర్దేశం చేసే పుస్తకం.

-భారతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.