దక్షిణాసియాలో స్త్రీ విముక్తి ఉద్యమ మార్గ దర్శి –బేగం రోకెయ(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్


రోక్యువ ఖటూన్ పేరు తో బేగం రోకెయ1880లో బెంగాల్ లోని రంగాపూర్ జిల్లా పైరాబంద్ గ్రామం లో జన్మించింది .మొగలాయి సామ్రాజ్యకాలం లో ఆమె పూర్వీకులు సైన్యం ,న్యాయ శాఖలలో పని చేశారు .తండ్రి జహీరుద్దీన్ మహమ్మద్ అబూ ఆలీ హైదర్ సబేర్ పెద్ద జమీందార్ ,బహు భాషా కోవిదుడు .ఆయనకు రహ్మతున్నీసా అనే నాలుగవ భార్యకు జన్మించింది రోకెయ .ఇద్దరు సోదరులు .ముగ్గురు సోదరీమణులు ఆమెకు .పెద్దన్న ఇబ్రహీం సబేర్,పెద్దక్క కరీమున్నీసా ఖానం చౌదురాణి ల ప్రభావం ఆమె పై బాగా ఉన్నది .కరీమున్నీసా తనకుటుంబం వారు చదివే అరబ్బీ ,పర్షియన్ భాషా మాధ్యమ౦ లో కాకుండా బెంగాలీ మీడియం లో విద్య నేర్వాలని భావించింది .అన్న రోకెయకు ఇంగ్లిష్ ,బెంగాలీ ని నేర్పాడు .అక్కకు 14ఏటనే పెళ్లి జరిగి కవయిత్రిగా ఎదిగింది .ఆమె కొడుకు లిద్దరూ బ్రిటిష్ ప్రభుత్వం లో మంత్రి పదవులలో రాణించారు .

రోకెయ కు 18 వ ఏట, 38 ఏళ్ళ ఉర్దూ మాట్లాడే భాగల్పూర్ డిప్యూటీ మేజిస్ట్రేట్ ఖాన్ బహదూర్ సఖావత్ హుసేన్ తో పెళ్లి జరిగి౦ది .హుసేన్ ఇంగ్లాండ్ లో అగ్రికల్చరల్ డిగ్రీ పొంది ,ఇంగ్లాండ్ రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ సభ్యుడయ్యాడు .మొదటి భార్య చనిపోయాక ఈమెను వివాహం చేసుకొన్నాడు .ఆమె బెంగాలి, ఇంగ్లీష్ లను నేర్వటానికి,రాయటానికి భర్త బాగా ప్రోత్సహించాడు . ఆ ప్రోత్సాహంతోనే బెంగాలీ భాషలో రచనలు చేయటం ప్రారంభించింది .1902లో ‘’పిపాస ‘’(దాహం )అనే మొదటి బెంగాలీ వ్యాసం రాసి నాంది పలికింది .1905లో ‘’మతిచూర్’’ ,1908లో ‘’సుల్తానాస్ డ్రీం ‘’అనే రెండు పుస్తకాలు రాసి 1909 లో భర్త మరణానికి ముందే ప్రచురించింది .సుల్తానాస్ డ్రీం లో మగవారిపై ఆడవారి ఆధిపత్యం చూపించింది .సైంటిఫిక్ ఫిక్షన్ రచన లో కూడా ప్రతిభ చూపించి అందరికి ఉపయోగ పడే ‘’సోలార్ వోవెన్స్’’,ఫ్లైయింగ్ కార్’’,’’క్లౌడ్ కండెన్సర్స్’’లు రాసింది .అవి అప్పుడు సెటైర్ రచనలనిపించాయి కాని ఇప్పుడు నిజమయ్యాయికదా .ప్రముఖ పత్రికలైన సవోగట్,మహమ్మదీ ,నబప్రభ ,మహిళ,భారత్ మహిళ,అల్-ఏసియన్,నౌరోజ్,మహెనవో,భంగియా ముసల్మాన్ సాహిత్య పత్రిక ,ది ముసల్మాన్ ,ఇండియన్ లేడీస్ మాగజైన్ మొదలైన వాటిలో విరివిగా రాసేది .

భర్త మరణించిన అయిదు నెలలతర్వాత ‘’సఖావాత్ మెమోరియల్ గర్ల్స్ హైస్కూల్’’ ఉర్దూ ఎక్కువగా మాట్లాడే భాగల్పూర్ లో 5 గురు విద్యార్ధినులతో స్థాపించి౦చి సంఘ సేవలో దిగింది . ..ఆస్తి విషయంగా భర్త వైపు కుటుంబం తో వచ్చిన తగాదాల మూలం గా స్కూల్ ను తనకిష్టమైన బెంగాలీ మాట్లడే కలకత్తాకు 1911 లో మార్చి,ఇంటింటికీ తిరిగి తమ ఆడపిల్లలను తన స్కూల్ లో చేర్చమని కోరి ,ఒప్పించి, చేర్పించింది .ఎన్నో ఒడిదుడుకులు ,అడ్డంకులు అభ్యంతరాలు ఎదురైనా ,మొక్కవోని ధైర్యంతో 24 సంవత్సరాలు అంటే మరణించే దాకా అత్యద్భుతంగా గర్ల్స్ స్కూల్ నిర్వహించి బాలికల విద్యా వ్యాప్తికి తోడ్పడింది .1916లో ముస్లిం మహిళ ల విద్య ,ఉద్యోగం, హక్కుల పోరాటం కోసం ‘’అంజుమన్ ఎ-ఖవాటీన్ ఎ-ఇస్లాం ‘’(ఇస్లాం ముస్లిం మహిళ సంఘం )స్థాపించి ,ముస్లిం మహిళల విద్య ,స్థాయి మొదలైన వాటిపై చర్చలు ,సమావేశాలు జరిపించింది .బహు భార్యాత్వం, మహిళలను పరదా వెనకే ఉంచి స్వేచ్చనివ్వక పోవటం వలన మహిళలకు విద్య ,హక్కులు ,సమానత్వం లభించటం కష్టంగా ఉన్నందున వాటిని వ్యతిరేకించి ముందుకు కదలాలని పిలుపు నిచ్చింది .ఇస్లాం మతం లో ఉన్న మహిళా హక్కులను పురుషులు, మతపెద్దలు హరిస్తున్నారని ,వారికేవీ దక్కకుండా చేస్తూ పురుషాధిక్యాన్ని అమానుషంగా చూపిస్తూ ,అణగ ద్రొక్కు తున్నారని తన సంస్థ తరఫున ముస్లిం మహిళా విమోచన కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపింది .1926లో కలకత్తా నగరం లో మొట్ట మొదటి సారిగా ‘’బెంగాలీ మహిళా విద్యా సమావేశ౦ ‘’ఏర్పరచి , అధ్యక్షత వహించి మహిళా విద్యా వ్యాప్తి, హక్కులకోసం బెంగాలీ మహిళలందర్నీ మొదటి సారిగా నడుం బిగించేందుకు సిద్ధం చేసింది .

కధలు ,కవిత్వం ,వ్యాసం ,నవల ,వ్యంగ్యం మొదలైన అనేక ప్రక్రియలలో రోకెయ రచనలుచేసింది .సృజన, ఆలోచన నిర్భీకత ,అన్యాయాన్ని ఎదిరించటం ,ప్రవాహశీల రచనా శైలి ,తర్కం, మేధావితనం,ముందు చూపు ,మహిళా విమోచనం, అభి వృద్ధి ఆమె రచనలలో ప్రత్యేకతలు .1903 నుంచి ‘’నబనూర్ ‘’పత్రికకు’’ఆర్.ఎస్..హోస్సేన్ ‘’మారుపేరుతో రాసింది .ఎక్కడ ఏది రాసినా ముస్లిం మహిళలను అన్యాయాన్ని ఎదిరించమని ,తమ హక్కులను మనుగడను ప్రశ్నించే వాటిని ధిక్కరించమని,అడ్డు గోడలను బ్రద్దలు చేయమని ప్ర బోధించింది .

పిపాసా ,మటిచూర్ ,సొర జగత్ ,డెలీసియా హత్య ,జ్ఞాన్ ఫల్,నారీ సృష్టి ,నర్స్ నెల్లీ ,ముక్తిఫల్ ,సుల్తాన్స్ డ్రీం ,పద్మరాగ్ ,అబరోధ్ భాసిని ,బొలి గర్తో,నారీర్ అధికార్ , గాడ్ గివ్స్ ,మాన్ రాబ్స్ (దేవుడిస్తే ,మనిషి దోస్తాడు)ఎడ్యుకేషన్ ఐడియల్స్ ఫర్ ది మోడరన్ ఇండియన్ గర్ల్ మొదలైనవి రోకెయ రాసింది .

‘’ఇండియన్ వుమెన్స్ కాన్ఫరెన్స్ ‘’కు అధ్యక్షత వహించి సంతృప్తిగా నిర్వహించిన కొద్దికాలానికే , 1932డిసెంబర్ 9 న 52ఏళ్ళకే దక్షిణ ఆసియా మహిళా విముక్తి ఉద్యమమార్గ దర్శి , నాయకురాలు, విద్యా వేత్త,విద్యా సేవా ధురీణ , విదుషీమణి బేగం రోకెయ మరణించింది .సోదేపూర్ లో అంత్యక్రియలు జరిపారు .’’పయనీర్ ఫెమినిస్ట్ బెంగాల్ ‘’గా ఆమె కీర్తి శిఖరాయమానం .బంగ్లా దేశ్ లో ఆమె పేరిట జాతీయ అవార్డ్ అందిస్తున్నారు .ప్రతి ఏడాది డిసెంబర్ 9న ఆమె జ్ఞాపకార్ధం ‘’బేగం రోకెయ డే’’ నిర్వహిస్తూ మహిళాభ్యుదయానికి ఆమె చేసిన సేవలు స్మరిస్తున్నారు . ఆ రోజునే బంగ్లా దేశ్ ప్రభుత్వం స్త్రీల అభి వృద్ధిలో విశేష కృషి చేసిన మహిళలకు ’’ బేగం రోకెయ పతకం ‘’ అంద జేస్తోంది .రోకెయమెమోరియల్ సెంటర్ ,యూని వర్సిటి ,ఢాకాయూని వర్సిటిలో’’ రోకెయ హాల్ ‘’మొదలైన స్మృతి చిహ్నాలుఏర్పరచారు .2004 లో బిబిసి నిర్వహించిన ‘’గ్రేటెస్ట్ బెంగాల్ ఆఫ్ ఆల్ టైం ‘’ పోల్ లో రోకెయ 6 వ స్థానం సాధించింది .

పురుషులతో సమానంగా హేతు బద్ధ జీవులనందర్నీ చూడాలని ,విద్య లేకపోవటమే మహిళల వెనుకబాటు తనానికి కారణమని ,మహిళాభ్యుదయానికి స్త్రీ అక్షరాస్యతే కేంద్రం అని ఆమె ఎలుగెత్తి చాటింది .’’మహిళ తల ఎత్తినప్పుడల్లా మతం ,పవిత్ర గ్రంథం అనే ఆయుధాలతో ఆమె తలపై బాదుతున్నారు . దైవ వాక్యాలని ,మత నిబంధనలనీ మగాళ్ళే ప్రచారం చేస్తూ మహిళలను అంధకారం లోకి నెట్టేస్తున్నారు .అవన్నీ మనుషులు ,అంటే పురుషులు రాసినవే .పురుష మత పెద్దలు చెప్పే దానికీ స్త్రీ మత పెద్దలు చెప్పేదానికి సహస్ర తేడా ఉంటుంది .మతం అనే తాడుతో మహిళలను గట్టిగా బిగించి మగాళ్ళు ఆడవారికి ఊపిరాడకుండా చేస్తున్నారు .దీనినుంచి స్త్రీ జాతి విముక్తి చెందితేనే, ఆమె అభ్యుదయం సాధ్యం ‘’అని 1904లో నిర్భయంగా ,బహిరంగం గా చెప్పిన ధీర వనిత బేగం రోకెయ అమర్ రహే .

-గబ్బిట దుర్గాప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

వ్యాసాలుPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
దీపికా
దీపికా
7 months ago

ప్రపంచ లోని గొప్ప మహిళా మూర్తులను మాకు పరిచయం చేస్తున్నారు…ధన్యవాదాలు