గజల్-11 -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు వందనాలు.
పైకి ఎంత సంతోషంగా కనిపించాలని ప్రయత్నించినా
కళ్ళలోని కన్నీటి సుడిగుండాలు లోకులకు
కనిపించిపోతూ ఉంటాయి. దుఃఖాన్ని దాచుకోవడం
ఎంత కష్టమో తెలియాలంటే అది అనుభవించాలి.
గుండెలోని వేదన గుండెను మెలిపెడుతుంటే , కళ్ళలో శోకం
నదులై పొంగిపోతుంటే , ప్రేయసిని చూపే కల ఒక్కటి కూడా
కనులను పలకరించకపోతుంటే, ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.
విరహానికి వెన్నెల తోడైతే అగ్నిలో ఆజ్యం పోసినట్లే కదా.
వియోగం వెంటాడి వేటాడుతుంటే ఆ మనసుకి తగిలే గాయాల గురించి
చెప్పాలంటే మాటలు చాలవు కదా. ఇలాంటి భావాలను పొందుపరిచిన
గజల్ మీముందు ఉంచుతున్నాను.

గుండెలోన పెరుగుతున్నకలతనెలా ఆపగలను
కనులలోన పొంగుతున్న నదులనెలా ఆపగలను

నిదురనాపలేని రాత్రి ఈనాటికి వచ్చినది
నిన్నెపుడూ చూపించని కలలనెలా ఆపగలను

విరహానికి తోడునిలిచి నన్ను గేలిచేస్తున్నది
వెన్నెలలో రేగుతున్న జ్వాలనెలా ఆపగలను

వసంతాన్ని ఒలికించే నీస్వరమే మౌనించెను
చావుపిట్ట పాడుతున్న పాటనెలా ఆపగలను

మనసుకైన గాయాలను చూపలేను ‘నెలరాజా’
వియోగాలు మొదలెట్టిన వేటనెలా ఆపగలను

–ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.